Monday 4 July 2016

కవిత్వము

కవిత్వము 


అద్భుతమైన వ్యాసం. నిజమే కవితకు అనర్హమైనది ఏదీలేదు. ఐతే అందరూ మాత్రం కవులు కాలేరు. ఎదో పదాలు వ్రాసేసి అడ్డదిడ్డంగా విరిచేసి, పదాలగారడి చెయ్యటం కవిత్వం కాదు. నాదృష్టిలో కవిత్వం అంటే చదివినవారికి కవిహృదయం అర్ధం కావాలి. తను ఏమి చెప్పదలచుకున్నాడో అది స్పష్టంగా చెప్పగలగాలి. మనసుని ఉర్రూతలూగించ గలగాలి, ఉత్తేజపరచగలగాలి, ఆలోచింపచేయగలగాలి, భావోద్రేకాలని వెలికితేగలగాలి. అప్పుడే అది నిజమైన కవిత్వం అనిపించుకుంటుంది. అసలైన కవిత్వం అనిపించుకుంతుంది. ఆనాటి మన ప్రాచీన మహాకవులు ఇదే ధోరణిలో తమ కవితావ్యాసంగం చేసి మహాకావ్యాలను సృష్టించారు. నవతరంకవులలో ఎంతోమంది ఇదే స్పూర్తితొ ఎన్నో రచనలు సాగించారు. కానీ నేడు కొంతమంది కవితల పేరుతో చేతికివచ్చినది వ్రాసి కవులుగా వెలుగుతున్న సంగతి తెలిసినదే. అటువంటివారికి ఈ వ్యాసం ఒక కనువిప్పు. ఈసందర్భంలో నాకు ఒక విషయం గుర్తు వస్తున్నది. ఆనాటికాలం నుండి కుకవులు ఉండేవారని కావ్యాలలోనే తెలుస్తుంది. అదేవిధంగా ఈనాటి కాలంలో శ్రీవేటూరి సుందరరామమూర్తిగారు (వీరు శ్రీవేటూరిప్రభాకరశాస్త్రిగారి మేనల్లుడు)ఒక టి.వి. లోమాట్లాడుతూ "ఆరేసుకోబోయి" వంటిపాటలు పొట్టకూటికోసం వ్రాయవలసి వచ్చిందని ఎంతో సిగ్గుపడుతు చెప్పారు. ఎంతో గొప్ప మహాపండితుడిని మన సినిమా ప్రపంచం సినీగీత రచయితగా మార్చేసింది. పరిస్థితుల ప్రభావం అనండి, ఇంకేమైన అనండి ఇది మారుతున్న మన అభిరుచులకు అద్దం పడుతోంది. 

Sharing the interesting article by SrI. Cheruku Ramamohanrao garu.

కవిత్వం 

'కాదేదీ కవిత కనర్హం' అని అభ్యుదయ కవిత్వమున అగ్రగణ్యుడైన మహా కవి శ్రీశ్రీ ఏ ఆలోచనతో ఏ ముహూర్తమున అన్నారో కానీ నేడు ఆ మాట అక్షర సత్యము. వారు ఆమాట అనకుండా వుండియుంటే నాలాంటివారు పలువిధములైన ఉత్త,చెత్త,లోత్త కవితలు ప్రచురించే ధైర్యము చేసియుండేవారు కాదేమో. వారు ఏ కవితా వస్తువునైనా రసమయము చేసి రసనపై రాసలీల జరిపించగల దిట్ట. నా లాంటి వారికి ఆయనతో సామ్యమెట్ట. వారి కవితలలో కథావస్తువు క్రొత్తదైనా అందులో పరిశీలన,రసము,శయ్య, భావము, అలంకారము, అనుప్రాసము, పాండితీ ధిషణ అడుగడుగునా అణువణువునా కనిపించుతుంది. మరి నాలాంటి వారిలోనో? వారికన్నా ఒక అడుగు ముందుకు వేసిన 'దేవరకొండ బాల గంగాధర తిలక్, గారి కవితలు వచన కవితలేయైనా రసపుష్టి కలిగినవని పండితులు పదేపదే చెబుతూ వుంటారు. మరి నాలాంటి వారిలో అది ఎక్కడ. 

నన్నయ, తిక్కన ఆదిగా గల కవులందరూ వాల్మీకి,వ్యాస,కాళిదాసాది మహా కవులకు మ్రొక్కక తమ రచనలు ప్రారంభిచలేదు. వారి తదుపరి వచ్చిన తెలుగు కవులు అటు సంస్కృత కవులను ఇటు నన్నయాది కవులను మనసారా తలంచక తమ కవిత్వ మహత్వ పటుత్వ సంపదలను మనకు పంచి పెట్టలేదు. మరి నాలాంటి వారికో అవి తలచే అర్హత కూడా మృగ్యమే! మరియా అనర్ఘ సంపద ఏమికావలె? చెదపురుగుల కాహారమేనా ! ఒకానొక కాలములో కవిత్వము వ్రాయుటకు భయముగా వుండేది, గురువుల ఎదుట సిగరెట్టూ అంటించనట్లు . మరినేడో గురువు శిష్యుడు కలిసే కానిస్తున్నారు. శ్రీనాథుడు ఒక సందర్భములో అంటాడు :

బూడిద బుంగలై యొడలు పోడిమి తగ్గి మొగంబు తెల్లనై
వాడల వాడాలన్ దిరిగి వారును వీరును చొచ్చొచో యనన్
గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో 
'గాడిద'నీవునున్ కావివి కావుకదా యనుమాన మయ్యెడిన్ 

అని అనగలిగినాడు. మరి వాక్స్వాతంత్ర్యము , భావ స్వాతంత్ర్యము ,వ్యక్తీ స్వాతంత్ర్యము కలిగిని మనలను నేడు అనగలడా!
అల్లసాని పెద్దన యంతటి వాడిని
'ఉమ్మెతక్కయ తిని సెపితో
క్రమమెరుగక ఎర్రి పుచ్చ కయ డిని సెపితో
ఎమి తిని సెపితో కపితము
అమవస నిసి యనుచు నువ్వు అలసని పెదనా

యని ధిక్కరించినాడు తెనాలి రామకృష్ణుడు. మరి నేడో?

ఇదే తెనాలి రామకృష్ణుడు ప్రెగ్గడ నరసరాయలన్న కవి, పెద్దలైన 'పెద్దన' లాంటి వారిని నిరసించితే 'భావ్య మెరుంగక పెద్దలైన వారల నిరసింతువాప్రగడరాణ్ణరసా విరసా తుసా భుసా' చూచినారా నవ్వులాట వేరు గౌరవ మర్యాదలు వేరు. ఇప్పటి కవితలలో ఇంతటి నిర్దుష్ఠత కనగలమా! ఏ దిగంబర కవులలోనో నగ్న కవులలోనో విప్లవ కవులలోను కనగలమంటే, వారి కవితలనేమాత్రము మనము గుర్తుంచుకో గలిగినాము. వేటూరి, సీతారామ శాస్త్రి లాంటి సినిమా కవుల గీత రచనలలోని పదములు అన్నీ తెలియక పోయినా వింటూ ఎంతనో అనందించుతాము.
ఇది ,భాష గొప్పదనము అన్న పుష్పమునకు, వారి భావము, పదముల కూర్పు, అన్న రంగు సువాసన కూర్చినట్లైనది కదా! పింగళి నాగేంద్రరావు గారు సినిమాలకు మాటలు పాటలు వ్రాసే కాలములోఎన్నోతెలుగు పదాలు తేర మీదికి తెచ్చినారు . అందులో 'హల' అన్న పదము ఒకటి. జగదేకవీరుని కథలోని 'జలకాలాటలలో'అన్న పాటలో 'ఏమి హాయిలే హల' అన్న ప్రయోగము ఆపాటను ఎంత ప్రసిద్ధి చెంద జేసిందో
ఆతరము వారికెవరికైనా ఇప్పటికీ మరచి పోలేని విషయమే. అది కవిత్వమంటే.

మాకు ముందు తరములోని పెద్దలు వాడుక భాష పేరుతో పర్వత శిఖరాగ్రమున వుండే భాషకు పతన మార్గము చూపించి చరిత్రలో మార్పుకు మార్గదర్శకులుగా, భాషను అప్రతిష్ఠ పాలు చేసినా, తమ ప్రతిష్ఠను పదిలం చేసుకొన్నారు. భాష మీద పట్టులేకుండా కవితలలో భావ ప్రకటన సాద్యమా.కవిత తమలపాకు లాంటిది. దానికి తడి తగులుతూ ఉంటేనే తన పచ్చదనమును కోలుపోక తాంబూలమునకు రాసిక్యత చేకూర్చుతుంది. చెమ్మ లేకుంటే అప్పుడు కూడా అది తమలపాకే అవుతుంది కానీ తాంబూలానికి పంకి రాదు. నాకు ఇక్కడ ఒక జానపదుల సామెత గుర్తుకొస్తూవుంది. అది ఏమిటంటే 'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా-రుచిపచి లేని కూర చట్టి నిండా.' నాలాంటివారి కవితలకు ఈ సామెత సరిగా సరిపోతుందేమో! ఒక రవివర్మ చిత్తరువు మనవద్ద వుంటే దానిని పదిలంగా ఒక చట్రము లో బింగించితే ఆ చిత్రమునకే కాక దానిని తగిలించిన గోడకు గోడ కలిగిన ఇంటికి కూడా అందమొస్తుంది. ఇది నిజమా కాదా అన్నది ఒక్కసారి మనము మనసుపెట్టి యోచించితే మనకే అవగతమౌతుంది.ఇంకొక ముఖ్యమైన విషయము తన 'మాళవికాగ్నిమిత్రము' అన్న నాటకములో ఈ మాట చెబుతాడు :
'పురాణమిత్యేవ నసాదు సర్వం నచాపికావ్యం నవమిత్య వాదం' దాని అర్థము 'పాత రోతా కాదు కొత్త చెత్త కాదు.' ఎంత గొప్ప మాటో చూడండి . పాత రచనలలో తలలోనికి దూరనివి కొత్త రచనలలో తలపులకే రానివి కోకొల్లలు. వీనిని 'అజగళస్థనము లంటారు.' మేక గొంతుక్రింద చన్నులనుండి పాలు రావు కదా. అంటే వుండీ వుపయోగములేనివి అని అర్థము.

వాల్మీకి కవి వ్యాసుడు కవి కాళీదాసు కవి అంతకు మించిన విశేషణముల నేవీ వారు తగిలించుకోలేదు.మరి నేడో 'సరస కవి' 'విప్లవకవి' 'భావకవి' 'ప్రేమ కవి' 'దిగంబర కవి' ఇవికాక అనేకానేకములైన బిరుదములు. అసలు 
'కవి యను నామంబు నీరుకాకికి లేదే' అని ఒక కవి కుండను బద్దలు కొట్టినాడు. వాల్మీకి మహర్షిని వారి తరువాతి
కవులు ఎన్నివిధములుగా పొగిడినారో గమనించండి. 

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం 
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కొకిలం 

రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ' రామ' యని కూయు చున్నది .

వాల్మీకి ముని సింహస్య కవితా వన చారిణా
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతిం 

కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' యని గర్జించుతూ వుంటే విన్నవారు కైవల్యమును గాంచక ఎట్లుండగలరు. 

యాపిబన్ రామ చరితామృత సాగరం 
ఆరుతస్తం మునిం వందే ప్రాచేతాస మకల్మషం 

రామ చరితామృత సాగరాన్ని సంతృప్తి అన్న మాటను ఆపేక్షించక ఆసాంతము త్రాగుచుండే మహనీయుడు కల్మషము అన్న పుట్టలోనుండి నిష్కల్మషుడైన వ్యక్తీ ప్రాచేతసుడు. ప్రచేతసుడంటే వరుణుడు. వరుణుని దయా వర్షముచే పునీతుడైనాడు కావున ఆయన ప్రాచేతసుడైనాడు. 

వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని 
పునాతు భువనం పుణ్యా రామాయణ మహానది 

వాల్మీకి యన్న పర్వతము పై జనియించి రామ సాగరము లో చేరు ఈ నదీ ప్రవాహము తాను ప్రవహించే ప్రాంతము నంతా పుణ్యభూమిని చేయుచున్నది.
ఒక మహనీయుని గొప్పతనమును ఎన్నివిధముల పొగడవచ్చునో గమనించండి. ఇందులో ఎవరి స్వార్థము స్వలాభాములు లేవు.
ఇక వేదవ్యాసులవారు. తాను వ్రాసిన మహా భారతమునుగూర్చి ఒకే ఒక్క ముక్కతో దాని గొప్పదనాన్ని మనకు తెలియ జేసినాడు. 'యది హస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్కచిత్' ఇందులో వుండేది వేరే ఏభాషలోని 
ఏ గ్రంథముము లోనైనా వుండవచ్చునుగానీ ఇందులోలేనిది ఎక్కడా వుండదు. ఇంచుమించు 125 ప్రముఖ పాత్రలు కలిగి అనేకానేకములైన ఆఖ్యాన ఉపాఖ్యానములు కలిగిన ఈ ఇతిహాసకావ్యము హోమర్ వ్రాసినట్లు చెప్పబడే ఈలియాడ్, ఒడెస్సిల కన్నా నిడివి లో 10 రెట్లు పెద్దదని తెలియు చున్నది.ఇది సాధారణమానవులకు సాధ్యమా!
వేదాలు విభజించి పురాణాలు ప్రచురించిన విష్ణ్వంశ సంభూతుడు. 

ఇక కాళీ దాసును గూర్చి యొక్క మాట :

పురాకవిత్వా గణనప్రసంగే అధిష్టికాదిష్టిత కాళిదాసా
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ 

కాళిదాసు మొదలు పురాతన కవులలో పేరెన్నిక గన్న వారిని చిటికెన వ్రేలితో ఎన్న ప్రారంభించగా తరువాత ఎంచుటకు ఎవరూ దొరకలేదు. అందుకే ఆ వ్రేలికి 'అనామిక' మనే పేరు సార్థకమైనది. మరి ఇది నిజమే కదా!
ఇది నిజమైతే వారి పేరు మసకబారకుండా ఉంచవలసిన బాధ్యత మనపైన లేదా!

అసలింకొక చిన్న విషయము. పండిత ప్రపంచములో నాచన సోమనాథుని తిక్కనకు పోల్చదగినవాడని చెబుతూ వుంటారు.ఆయన వ్రాసిన ఉత్తర హరివంశములోని 'నరకాసుర వధ' ఘట్టములోని అనేక పద్యముల భావము పోకడ 'పోతన' వంటి గొప్ప కవియే పూర్తిగా అనుకరించినాడు లేక అనుసరించినాడు. ఆయన గొప్పదనము పాఠకులకు తెలియజేయ ఈ క్రింది పద్యమును భావ సహితముగా ప్రకటించున్నాను:

ఇది శ్రీ కృష్ణుడు శివుని స్థుతించే పద్యము. ఇక్కడ శివుడు పారిజాత'వృక్షము' తో పోల్పబడినాడు.

కుజము కుంజరముచే కూలునో కూలదో 
కూలు,కుంజరమునీ కుజము గూల్చె 
మాను పేరేటిచే మడుగునో మడుగదో
మడుగు,పేరేటినీ మాను మడచె
గాలునో యొకనిచే గాలదో సాలంబు 
గాలు, నీ సాలంబు గాల్చే నొకని 
దునియునో పరశు చే దునియదో వృక్షంబు 
తునియు, నీ వృక్షంబు తునిమె బరశు

ననుచు దమలోన చర్చించు నమరవరుల 
కభిమతార్థ పదార్థమై యందవచ్చు 
పారిజాతమ్ము నా మ్రోల పండియుండ
నందగంటిని కోర్కుల నందగంటి 

పద్యము చదివినవెంతనే కవి హృదయము మనకు బోధ పడదు. వాక్య నిర్మాణము లోనూ భావ ప్రకటనలోనూ అంటే చెప్పేతీరు లోనూ వైవిధ్యమే ఇందుకు కారణం . దీనిని పండితులు 'వక్రత' లేక 'వక్రగతి'అంటారని విన్నాను. చెట్టును ఏనుగు కూల్చుతుంది కానీ ఇక్కడ చెట్టు (పారిజాత వృక్షము తో పోల్పబ్డిన శివుడు) ఏనుగును, గజాసురుని, కూల్చింది.చెట్టు పెద్ద ఏరు వల్ల వంగిపోతుంది . ఇక్కడచెట్టు, శివుని శరీరము, గంగను వంచింది. చెట్టును ఎవరైనా కాల్చితే కాలి పోతుంది . ఇక్కడ చెట్టు, కాల్చేవానినే అంటే మన్మధునే కాల్చివేసింది.చెట్టు గోడ్డలిచే నరక బడుతుంది. ఇక్కడ చెట్టు, అంటే శివుడు గొడ్డలినే (దక్షయజ్ఞము లో శివుడు విష్ణువు యొక్క పరుశువును ద్రుంచుతాడు)ద్రుంచుతాడు.అటువంటి, దేవతలకిష్టమౌ పారిజాత వృక్షాన్ని అందుకొని తన కోర్కెను తీర్చుకొంటున్నాడు కృష్ణుడు. సోమనాథుని వేదసాస్త్రపురాణేతిహాస ప్రతిభ ,కవితాచమత్కృతి, వక్రగతిన పద్యము చెప్పిన తీరు గమనించండి. నాడు కవిత్వమంత నిర్దుష్టంగా వుండేది.

ఒకమాట ఆధునిక కవితానర్ఘ రత్నాలను గూర్చి కాస్త చెప్పుకొందాము. ఇందు పద్య సాంప్రదాయమును గూర్చి నేను వ్రాయబోవుట లేదు. గడియారం, విశ్వనాథ,రాయప్రోలు, జాషువ,కరుణశ్రీ ఇలా వ్రాస్తూ పొతే చాలా పెద్ద పట్టిక తయారౌతుంది.నేను ఇందు మాత్రా ఛందస్సు నుపయోగించి సనాతనత్వమును విడువని రెండు కవితలు, అదునాతనము తో కూడి మాత్రా ఛందస్సు తో రమ్యముగా వ్రాసిన ఒక కవితా శకలము, 1971లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఒక ఆధునిక కవిత ఉటంకించుచున్నాను.

మొదటిది పుట్టపర్తి నారాయణాచార్లు వారు వ్రాసిన 'శివ తాండవము' లోనిది. 
తమ్ములై,ఘటితమోదమ్ములై,సుకృత రూ
పమ్ములై,శాస్త్ర భాగ్యమ్ములై,నవకోర
కమ్ములై ,వికచ పుష్పమ్ములై ,తుమ్మెదల,
తమ్ములై,భావ మంద్రమ్ములై,హావపు
ల్లమ్ములై,నూత్న రత్నమ్ములై,వెల్గు హా 
సమ్ములై, కన్గొనల సోమ్ములై,విశ్రాంతి 
దమ్ములై, రక్త కిసలమ్ములై,రక్తి చి
హ్నమ్ములైన్తంద్ర గమనమ్ములై,గెడగూడి
కులుకు నీలపు గండ్ల తళుకు జూపులు బూయ 
ఘలుఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ 
ఆదేనమ్మా శివుడు పాదేనమ్మా భవుడు 
ఇందులో మనకు ఒకవేళ ప్రతి పదమూ అర్థము కాకున్నా ఆ పద సౌందర్యము మనలను ఆసాంతము చదివించుటేగాక శివతాండవము కనులకు కనిపింపజేస్తుంది.

రెండవది వెంకట పార్వతీశ్వర కవులు వ్రాసిన 'ఏకాంత సేవ' లోనిది :

పుష్పనికుంజ ప్రభూత హాసంబు
సౌరభాపూర్ణ ప్రసన్న హాసంబు 
మందాకినీ మృదు మధుర హాసంబు 
రాకానిశాకర రమ్య హాసంబు 
తారకాకోరక తరళ హాసంబు 
విద్యుల్లతా ప్రభా విమల హాసంబు 
మద్ర మోహన మూర్తి మందహాసమున
అద్భుతంముగా లీనమైనట్టులుండ...

చూడండి ఎన్ని విధములైన హాసమ్ములో! చదువుతూ వుంటే మనసుకు ఎంత హాయో !

ఇక మూడవది శ్రీ శ్రీ గారి 'మహా ప్రస్థానం' లోని 'జ్వాలా తోరణము' లోనిది:

జాతి జాతి నిర్ఘాత పాత సం
ఘాత హేతువై , కాలకేతువై 
అదె సంవర్తపు తుఫాను మేఘం 
తొలి గర్జించిన తూర్య విరావం 

ప్రదీప్త కీలా ప్రవాళ మాలా
ప్రపంచవేలా ప్రసారములలో 
మిహిర వాజితతి ముఖవ ధనుర్ద్యుతి 
పుడమికి నేడే పుట్టిన రోజట 

ఆ కవిత సాగిన తీరు చూడండి. మరి ఇందులో కఠిన పదములు లేవా! అట్లని చదువ నారంభించితే వదలబుద్ధవుతుందా! అది శ్రీశ్రీ గారి గొప్పదనము, చలం గారు శ్రీశ్రీ గారిని గూర్చి ఒకమాట చెప్పినారు. "కృష్ణ శాస్త్రి తన బాధ లోకానికి పంచితే, శ్రీ శ్రీ లోకంలోని బాధనంతా తాను తీసుకొంటాడు." ఎంతటి గోప్పమాటో చూడండి. 

ఇక దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు వ్రాసిన 'అమృతం కురిసిన రాత్రి'నుండి 'మన సంస్కృతి' యన్న ఒక ఖండికలోని కొన్ని పాదములు:

మాధుర్యం,సౌందర్యం,కవితా 
మాధ్వీక చషకంలోరంగరించి పంచిపెట్టిన 
ప్రాచేతస కాళిదాస కవిసంరాట్టులనీ,
వ్యూహా వ్యుహోత్కర భేద నచణ
ఉపనిషదర్థ మహోదధి నిహిత మహిత రత్న రాసుల్నీ 
పోగొట్టుకొనే బుద్ధి హీనుడెవరు?

ఇందులో కఠిన పదాలు లేవా? భావము ఎంత గంభీరమైనదో చూడండి.వారిది సాధారణమైన కవిత కాదు. 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవితా సంకలనం. వారి కవితలు వారి మాటల్లోనే"నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు." వారు అంతటి గొప్పవారు కాబట్టే అభ్యుదయ కవిత్వాన్ని కూడా అద్భుత రీతిలో అందంగా ఆకర్షణీయంగా చెప్పవచ్చునని ఢంకా
బజాయించి చెప్పినారు. 

ఈ నాలుగు కవితలూ పరిశీలించితే కవిత్వానికి భాషాప్రాముఖ్యత ఎంత అవసరమో అర్థమగుట లేదా!కవితా వస్తు ఏదైనా కావచ్చు. భావ స్పష్టత, భాషాధిష్టత ఎంత అవసరమో మనకు అవగతమౌతుంది. అందానికి అంతోఇంతో ఎంతోకొంత అలంకారమూ అవసరమే. అవసరము మీరితే అసహ్యమే మరి. 

కావున పై విషయాలను మనసు పెట్టి చదివి కవితా సేద్యము ఆరంభించుతాము. ఇంకొక అతి ముఖ్యమైన విషయమేమిటంటే వీరెవరు 'ప్రేమ,విరహ,నిర్వేద' కవితలతో ప్రశస్థిపొందలేదు. చివరిగా శ్రీశ్రీ గారు కరుణశ్రీ గారితో ఏమన్నారో మీకు వినిపించి విరమించుతాను. 

'వాగ్దానం' అన్న సినిమా లో ' సీతా కళ్యాణ సత్కథ' అన్న'హరి కథ' శ్రీశ్రీ గారు వ్రాసినారు. అందులో 'ఫెళ్ళు మనెవిల్లు ఘంటలు ఘల్లుమనియె' అన్న పద్యము తో ఆ హరికథ ముగుస్తుంది.అది కరుణశ్రీ గారు వ్రాసినది. ఒకసారి శ్రీశ్రీ కరుణశ్రీ గార్లు ఒకే వేదిక నలంకరించడం జరిగింది. అప్పుడు కరుణశ్రీ గారు " ఏమోయ్ నాపద్యము కాపీ చేసినావు నీ హరికథలో "అన్నారట.అది ఇంకా నీదెందుకౌతుంది. 'ప్రతి' బయటికొచ్చిన తరువాత వ్రాసిన వానిగా దానిపై నీకెంత హక్కో పాతకునిగా నాకూ అంతే హక్కన్నారట. అంటే మంచి కవితకు ఎంతటి విలువ వుంటుందో మనము గమనించ వలెను. 

  • పెద్దలు శ్రీ చెరుకు రామమోహన్రావు గారు రాసిన ఈ టపా ముఖ్య ఉద్దేశ్యం కవితకు కాదేది అనర్హం అన్న శ్రీ శ్రీ గారి మాటలు నేటి మనలో చాలా మందిమి మన మాటలనే కవితలు గా భావిస్తూ అదే ఆధునిక కవిత్వం అన్న భ్రమలో ఉంటున్నాము... కవితకు భావం ఎంత ముఖ్యమో వస్తువు,వచనం, శిల్పం, శైలి, భాష ఇలా ఎన్నో కలిస్తేనే కాని కవితగా పూర్తీ రూపాన్ని సంతరించుకోదు...ఆది కవి నన్నయ్య రాసినా.. అష్టదిగ్గజాలు అమూల్య ఆశు కవితలను, రస రమ్య పద్యాలను అందించినా , శ్రీనాధుని శృంగార చేమంతులను చూసినా...వాటిలో సొంపైన సొగసుల తెలుగు దాగి ఉంటుంది...అందమైన భావాలను మనకు అందిస్తూ ... ఇక వచన కవిత్వంలో కూడా ఇలానే తిలక్ గారి కవితలు...శ్రీ శ్రీ గారివి...అన్నమ్మయ్య, రామదాసు పద కవితల కీర్తనలు ఇలా ఎన్ని చూసినా వాటిలో చక్కని హృద్యమైన భావాలు మనకు కనిపిస్తాయి....కవితలను కవితగా రాయండి....మాటలను కవిత అనకండి.....ఇది పెద్దల సహృదయ మనవి అందరికి ..
    రామమోహన్రావు గారు.....ఈ మీ మనసులోని మాటలు ఈనాటి కవిత్వంగురించి చదివాక మా తప్పులు సవరించుకోవడానికి ప్రయత్నిస్తాము...మీ సుదీర్ఘ వివరణకు మా మనఃపూర్వక వందనాలు
    1
    • Like
    • Reply
    • See Translation
    • 7y
  • మంచి పరిచయం
    1
    • Like
    • Reply
    • 7y
  • Venkateswara Rao
     pls read d above article n comment.
    1
    • Like
    • Reply
    • See Translation
    • 7y
  • బాబాయ్ నేటి కవితల పరిస్థితిని చక్కగా ఉదాహరణలతో విశ్లేషించారు. 'కవితలు' రాస్తున్నాము అనుకుని, వాడుక మాటలనే అక్షరాల్లో పెడుతున్నారు. దానికి ౩౦ లైక్ లు, ఇరవై కంమెంట్లు. ఎందుకంటే, చదివేవారికి కూడా అవి కవితలో, కావో తెలుసుకునే స్థాయి ఉండదు. నానీలు, బఠానీలు, చువ్వలు, రవ్వలు... ఏక వాక్య కవితలు... బాబోయ్ ఎన్ని రకాలో. క్షుద్ర కవితలు, అందులో మాంసాలు, రక్తాలు, భీబత్స కవితలు, విఫల ప్రేమ కవితలు, పడకగది మన కళ్ళ ముందు పెట్టే ప్రేమ పొంగే కవితలు... చెప్పినా వీరికి అర్ధం కాదు. ఎందుకంటే, ఇరవై మందికి నచ్చింది అంటే, వారి దృష్టిలో, వారు కవి క్రిందే లెక్క. పుస్తకం 'అచ్చోసి ' వదిలేస్తారు. దొరికిన వాల్లకల్లా కవితలు వినిపిస్తారు. కవితలో ఒక వాక్యం చాంతాడంత పొడుగు... మరొకటి చెవి తాడంత కురచ. వాక్యాల పదాల అమరికలో, కొత్త పదాలకోసం ప్రయత్నించక, వాడిన పదాలే వాడుతుంటారు. మరి పద సంపద ఎలా పెరుగుతుంది? అలా దొరికిన వాటితో సంతోషించి సర్దుకునే అల్ప సంతోషులకు మీ పోస్ట్ చెంప దెబ్బ లాంటిది. 
    Ramesh Kumar
     గారు... ఇప్పటికైనా మీకు మా బాధ అర్ధం అయ్యిందని అనుకుంటున్నాను. 'ఏదో ఒకటి రాసేస్తే కవిత కాదు...' అన్నది సారాంశం. నమస్కారం.
    3
    • Like
    • Reply
    • See Translation
    • 7y
  • ఆర్యులు.. చక్కగా చెప్పారు. ఇప్పటి కవితలలో ఎంత వెదకినా కనబడడం లేదు. పదాల కలయికే కవిత్వమైతే మరి కవితకు భావమెందుకు? చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా చెప్పగలగడమే కవి నైపుణ్యత. పెద్దవారు చెప్పినట్టు ఆనాటి కవులు శ్రమించి మలచిన గ్రంధరాజాలే నేటికిని అనుసరణీయాలైనవి. ఈ మాటలు ఎవ్వరిని విమర్శించడానికో లేక కించపరచడానికో వాడడం లేదు. ఒక చిన్న ఉదా.. ఒక కవితలో పదప్రయోగం ఈ విధంగా వాడారు "మదిలో కోరికలు ఎదలో ఉన్నవి" మది, యద ఒక్కటే అని తెలియని స్థితిలో మన కవితలు వస్తున్నాయి.
    మనసును కదలించగల శక్తి, మనిషిని ఆలోచించ జేయు శక్తి ఒక్క కవితకే ఉన్నాయన్న్ది నాకు తెలిసిన సత్యం...
    ఈ క్రమంలో నా అనుభవాన్ని పంచుకుంటాను.. మొన్నటిరోజున నేనొక కవిత చదివాను. బాగుందనిపించి ఆ కవి (యిత్రి)ని ప్రశంసిస్తూ, కొన్ని పదాలకు అర్థం మరియు అక్కడ వాడడానికి కారణం అడిగాను. పదాలు బాగున్నాయని వాడాను... నాకు కూడా అర్థం తెలియదు అని సమాధానం వచ్చింది...
    చివరిగా ఉత్సాహవంతులైన కవిమిత్రులకు, యువకవులకు ఒక చిన్న మనవి... కవిత వ్రాయవలెనన్న సంకల్పానికి నా జోహార్లు... కాని వ్రాసింది ఒక్క సారి చదువుకోండి. తప్పులను సరిదిద్దగల పెద్దల సహకారం తీసుకోండి. మంచి కవితలను అందించండి...
    1
    • Like
    • Reply
    • See Translation
    • 7y
  • Cancel
  • అద్భుతమైన వ్యాసం. నిజమే కవితకు అనర్హమైనది ఏదీలేదు. ఐతే అందరూ మాత్రం కవులు కాలేరు. ఎదో పదాలు వ్రాసేసి అడ్డదిడ్డంగా విరిచేసి, పదాలగారడి చెయ్యటం కవిత్వం కాదు. నాదృష్టిలో కవిత్వం అంటే చదివినవారికి కవిహృదయం అర్ధం కావాలి. తను ఏమి చెప్పదలచుకున్నాడో అది స్పష్టంగా చెప్పగలగాలి. మనసుని ఉర్రూతలూగించ గలగాలి, ఉత్తేజపరచగలగాలి, ఆలోచింపచేయగలగాలి, భావోద్రేకాలని వెలికితేగలగాలి. అప్పుడే అది నిజమైన కవిత్వం అనిపించుకుంటుంది. అసలైన కవిత్వం అనిపించుకుంతుంది. ఆనాటి మన ప్రాచీన మహాకవులు ఇదే ధోరణిలో తమ కవితావ్యాసంగం చేసి మహాకావ్యాలను సృష్టించారు. నవతరంకవులలో ఎంతోమంది ఇదే స్పూర్తితొ ఎన్నో రచనలు సాగించారు. కానీ నేడు కొంతమంది కవితల పేరుతో చేతికివచ్చినది వ్రాసి కవులుగా వెలుగుతున్న సంగతి తెలిసినదే. అటువంటివారికి ఈ వ్యాసం ఒక కనువిప్పు. ఈసందర్భంలో నాకు ఒక విషయం గుర్తు వస్తున్నది. ఆనాటికాలం నుండి కుకవులు ఉండేవారని కావ్యాలలోనే తెలుస్తుంది. అదేవిధంగా ఈనాటి కాలంలో శ్రీవేటూరి సుందరరామమూర్తిగారు (వీరు శ్రీవేటూరిప్రభాకరశాస్త్రిగారి మేనల్లుడు)ఒక టి.వి. లోమాట్లాడుతూ "ఆరేసుకోబోయి" వంటిపాటలు పొట్టకూటికోసం వ్రాయవలసి వచ్చిందని ఎంతో సిగ్గుపడుతు చెప్పారు. ఎంతో గొప్ప మహాపండితుడిని మన సినిమా ప్రపంచం సినీగీత రచయితగా మార్చేసింది. పరిస్థితుల ప్రభావం అనండి, ఇంకేమైన అనండి ఇది మారుతున్న మన అభిరుచులకు అద్దం పడుతోంది.
    3
    • Like
    • Reply
    • See Translation
    • 7y
  • చాలా చక్కని స్పందన సుబ్రహ్మణ్యం గారూ. నా తపన అర్థము చేసుకోగలిగి చక్కని సందేశాన్ని అందించినారు.
    3
    • Like
    • Reply
    • 7y
  • పెద్దలు రామమోహనరావు గారికి నమస్కారాలు. ఆలశ్యంగా ఈ టపాపై స్పందిస్తున్నందుకు మన్నించగలరు. మీ వ్యాసం అద్భుతంగా ఉంది. మీబోటి పెద్దలు అప్పుడప్పుడు ఇలా దిశానిర్దేశం చేయనిదే నేటి యువతకి, మాబోటి వారికీ మన పూర్వ కవుల విశేషాలు, వారి విజయాలూ బోధపడవు. మీరన్నట్టుగా ఎవడికివాడు తను రాసిన నాల్గు ముక్కలే కవిత్వం అనుకుని పొంగిపోతున్న రోజులివి. పొరబాటు దిద్దబోయిన వారికి అవమానమే ఎదురౌతున్నది కూడా నిజమే. నాకున్న పరిజ్ఞానం బహుతక్కువ అన్నది మీకు తెలియనిదికాదు అయినా రెండుముక్కలు నాకు తోచినవి చెప్పదలుచుకున్నాను. ఈ సృష్టిలో ప్రతి విషయమూ ఒక వలయమే (సైకిల్) ఒక స్వర్ణయుగం నుండి అత్యంత దిగువకి జారి మళ్ళీ స్వర్ణయుగానికి తప్పకుండా వస్తుంది. నాకు తెలిసినంతవరకూ ఇప్పుడు మనమున్నది అత్యంత దిగువ స్థాయి. ఇక్కడనుండి నెమ్మదిగా మళ్ళీ అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. మరో వ్యాసుడు, మరో కాళిదాసు తప్పక పుడతారు. ఒక్క కవిత్వంలోనే కాదు ఏ రంగం తీసుకున్నా మనం ప్రస్తుతం ప్రామాణికంగా కనిష్ట స్థాయిలోనే ఉన్నాము. మాటలాడుకోడానికి కూడా SMSSMS భాష ఉపయోగిస్తున్న రోజులివి. అసలు బోధించే గురువులెక్కడ దొరుకుతున్నారు? ఎవరికివారు మనకెందుకులే అని సర్దుకుపోయే తత్వంలోనే ఉన్నారు. ఎక్కడో ఒకచోట మీలాంటి పెద్దల చొరవతో ఈ పరిస్థితులు మారతాయి, తప్పక మారతాయి. అప్పుడు మళ్ళీ తెలుగు వెలుగై ప్రకాశిస్తుంది. కవిత్వం కదను తొక్కుతుంది.
    2
    • Like
    • Reply
    • See Translation
    • 7y
  • గురువుగారికి నమస్కారం. కవిత్వం అంటే పదాల అమరిక అని అనుకునేవాళ్ళకి మీ వ్యాసం ఒక కనువిప్పు. కవితకు భావం ఒకటే కాక, శిల్పం, శైలి కూడా చాల ముఖ్యం. మనసు ఏదో ఒక భావనలో కోట్టుకుపోతున్నపుడు మెదడు లో జనించే కొన్ని పదాల గుంపును కవిత్వం అనలేము. కాని ఈరోజుల్లో అవి అన్ని లెక్కజెసెవారు ఎక్కడ?వాక్యాలు విరిచి కుప్ప పోసి దానినే కవిత్వం అనే వారు ఎక్కువగా ఉన్నారు ఈరోజుల్లో. ఇంకా నానీలు, హైకులు వచన కవితల కన్నా కొంత వరకు నయం అనిపిస్తుంది పదాలను లెక్కపెట్టి వాడతారు కనుక. చిన్న మాటల్లో పెద్ద భావం ఉంటుంది కనుక. పరిణామ క్రమంలో మన మాతృభాషకు కొంత గడ్డుకాలం వచ్చినా, మీ వంటి పెద్దల మార్గ నిర్దేశం లో మళ్లీ పూర్వ వైభవం వస్తుంది అని నా నమ్మకం.
    2
    • Like
    • Reply
    • 7y
  • ఇంతమంది సహృదయులు, భాషా ప్రియులువుండగా తెలుగుకు తగిలిన తెగులును సమూలముగా నాశనము చేయవచ్చని నమ్మకము కుదిరింది.
    2
    • Like
    • Reply
    • 7y
  • Unfortunately I have very little knowledge in expressing but I enjoy reading your educative n informative articles. Thank you very much for having taken much more pain in developing n posting.
    1
    • Like
    • Reply
    • 7y
  • చరిత్రలో మార్పుకు మార్గదర్శకులుగా, భాషను అప్రతిష్ఠ పాలు చేసినా, తమ ప్రతిష్ఠను పదిలం చేసుకొన్నారు ❤ Well said sir !
    1
    • Like
    • Reply
    • 7y
  • రాకానిశాకర రమ్య హాసంబు
    తారకాకోరక తరళ హాసంబు ..... just like yours in the fb page sir !
    1
    • Like
    • Reply
    • 7y
  • కఠిన పదాలు ... పదాలు become కఠిన, only due to lack of usage 🙂
    2
    • Like
    • Reply
    • 7y
  • అతి ముఖ్యమైన విషయమేమిటంటే వీరెవరు 'ప్రేమ,విరహ,నిర్వేద' కవితలతో ప్రశస్థిపొందలేదు. ❤
    1
    • Like
    • Reply
    • 7y
  • 'ప్రతి' బయటికొచ్చిన తరువాత వ్రాసిన వానిగా దానిపై నీకెంత హక్కో పాతకునిగా నాకూ అంతే హక్కన్నారట. ... so now I have every right on this article 😉 ... just kidding sir. Thank you very much for your beautiful article and sharing with us. Also very kind of you for reminding me, as I am busy with work could not spend time on FB __/\__ After seeing your reminder, could not resist to read. Thank you
    1
    • Like
    • Reply
    • 7y
  • at the outset let me thank you mr. krishnamohan for taking out a little of your invaluable time to read article.with all your cooperation if the trend turns towards good i feel happy that some thing good is done to the society with all the help of people like you.
    • Like
    • Reply
    • 7y
  • M.D. గారూ మీ లాంటివారు చదివి పది మందితో చదివించి వారిలో కొంతైనా చైతన్యమును నింపినారంటే అది మంచి వైపునకు తిరిగే పెను మార్పునకు దారి తీస్తుంది.
    • Like
    • Reply
    • 7y
  • కొన్ని సంవత్సరాల క్రింద ఒక సంస్కృత లెక్చరర్ని అన్నమాచార్య కీర్తన "ఏమొకో, చిగురుటధరమున ..." కు అర్థం అడిగాను. పత్రిక అంటే ఆమె ఉత్తరం అని చెప్పింది - మరి ఉత్తరం వ్రాస్తే స్వామివారి అధరాల మీద అక్కడక్కడ ఎరుపు అవ్వటం ఏమిటి అంటే, అది అంతే అన్నారు ఆవిడ. ఇంకొక ఆవిడ, తనకు తాను కవియిత్రి అని, కళల పట్ల అభిరుచి ఉన్నవ్యక్తిగా చెపుకుంటూ ఒక కృష్ణుని పాట పాడుతూ నా ఖర్మ కొద్దీ దాని అర్థం కూడా చెప్పారు. అది ఏమంటే కృష్ణుడు తల్లి యశొదాను పెద్ద ఏనుగును తెచ్చి తిత్తిలో దూర్చి నెత్తి మీద పెట్టుకొమ్మని అవస్థ పెడుతున్న విషయం - అయితే తిత్తి అంటే పాలపీక అంటుంది ఆవిడ. మరి పాలపీక నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు, క్రిష్నుడిది ఎంత అర్థం పర్థం లేని అమాయకపు అల్లరి అయినా అందులో రసికత లేదు కదా, తిత్తి అంటే చిన్నసంచి/ tote కావచ్చు అంటే ఆమె అభిమానం దెబ్బ తిన్నది.
    ఇక నా మాటకు వస్తే కవిత్వాలపై వ్యాఖ్య వ్రాయటానికి ఎన్నడూ కవిత్వాలను అభ్యసించని నాకు ఏమాత్రం అర్హత లేదు. ఇంత మంది పెద్దలూ, కవితల గురించి తెలిసిన వారి ముందు మాట్లాడటం చిన్న నోట పెద్ద మాట అన్నట్టు. కాక పోతే కవిత్వాలలో భావాన్ని, సున్నితపుతనాన్ని appreciate చెయ్యగల మనసుతో కవిత్వాలు వ్రాయాలన్న ఉత్సుకత, జిజ్ఞ్యాస, అభిరుచి ఉన్న వారికి చెప్పేది ఏమంటే, ఈ కాలంలో పైన చెప్పినట్టు కవిత్వాల గురించి తెలిసిన వాళ్ళు చాలా అరుదు. అందులో ఇప్పటి యువతకు సాహిత్యంలో అవగాహన లేకపోవడం చూసి క్షోభతో, మిడి మిడి జ్ఞ్యానంతో రాసే వట్టి మాటలే కవిత్వం అన్న భ్రాంతిలో ఉంటున్నవారికి మార్గదర్శనం చేయాలన్న తాపత్రయం ఉన్నవారు ఇంకా తక్కువ. రామమోహన్ రావు గారి వంటి పెద్దలు అదృష్టం కొద్ది తటస్థించితే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు కష్టపడి వ్రాస్తున్న పద్యాలే కాని, కవిత్వాలే కాని చదివి, చర్చించటమో, వీలుంటే collaborate నో చెయ్యాలి. అంతే కాక సంస్కృత మహాకవులు, తెలుగు మహాకవుల రచనల అభ్యాసం చేయాలి. భాష, భావం, శైలి .... ఇవన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అదృష టం ఉంటే వాళ్ళ రచనలు అర్థం చేసుకునే ప్రయత్నంలో మనదంటూ ఒక శైలి కూడా ఏర్పడవచ్చు. కవిత్వాలు వ్రాస్తున్నప్పుడు వీలున్నంత వరకు poetry elements లో ఎక్కడ compromise కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఇవన్నిటికీ మించినది ధ్యానం - centered ఉన్నప్పుడే creative juices flow అవుతాయి.
    రామమోహన్ రావు గారు, మీ ఈ ఒక్క వ్యాసంలో నా వంటి వారికి నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. Thank you very much for your efforts and please excuse me for any mistakes on my part.
    • Like
    • Reply
    • See Translation
    • 6y
    • Edited
  • శ్రద్ధతో శ్రమ కోర్చి మీరు కూర్చిన వ్యాసం తెలుగు వారందరూ చదివి అవలోకన చేసుకోవసిన విషయం. ఒక్కొక్క పూర్వపు కవి యొక్క నిపుణత, నాణ్యతలను అప్పటి కాళిదాసు నుండి ఇప్పటి శ్రీ శ్రీ, కరుణశ్రీ గార్ల వరకు చదువుతుంటే, ఎంతెంత జ్ఞాన సంపద గల వారో అనిపిస్తుంది. మనకున్న ఇంత సంపద చదివి అవగాహన చేసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపడదేమో !!.....
    ఇక నేటి NET కవుల సంగతి తీసుకుంటే, ఈ అంతర్జాలంలో ముఖపుస్తకం (Facebook), బ్లాగులు(Blogs), సమూహ చర్చలు (Group Chats) మొదలైనప్పటి నుండి కవులు కోకొల్లలు అయిపోయారు. ఒక వరుస చాంతాడు లాగా ఉంటె ఇంకో వరుస నాలుగు పదాలు కూడా ఉండదు, ఒక వరుస కు ఇంకొక వరుసకు అసలు పొంతన ఉండదు, అన్ని వరుసలు కలసి ఒక భావం ఏర్పడిందా అని మనం వెతుక్కోవాలి. కవితలో నాణ్యత రావాలంటే పద సంపద ఉండాలి, ఒకే వస్తువు యొక్క వివిధ నామాలు తెలిసి ఉండాలి, అలాగే ఒకే పదానికి ఉన్న నానా అర్థాలు కూడా తెలిసి ఉండాలి. అటువంటి పద సంపద ఉన్న అన్నమాచర్య కీర్తనలు కాని, రామదాసు గీతాలు కాని తీసుకుంటే, ఇప్పటి మనకు అన్ని పదాలకు అర్థాలే తెలియవు. అంటే అప్పటికి ఇప్పటికి మనందరి వాడుక పదాలు చాలా తక్కువైపోయినావనే కదా అర్థం !!!
    మీ వంటి వారు తటస్థ పడటం నా వంటి వారి అదృష్టం. ఎందుకంటే తప్పులు చేసినప్పుడు చెపితేనే దిద్దుకోగలం మరి. అందరు నాకెందుకు అని ఊరుకుంటే ఆ తప్పులే చెల్లుబడి అయిపోతుంటాయి. మనందరి ప్రయత్నంతో కొంతమటుకు అయినా మార్పు వస్తే అందరి శ్రమ ఫలించినట్టే కదా !!!

No comments:

Post a Comment