Sunday 4 February 2018

కాళీదాసు కవన ప్రతిభ

కాళీదాసు కవన ప్రతిభ
ఆయన ప్రతిభ ఏమిటో ఈ క్రింది లంకెలో చదువగలరు.
లంకె, Link: https://cherukuramamohan.blogspot.com/2018/02/blog-post.html
కాళిదాసు ఒక కవితామేరువు. అందుకే విద్వాంసులు ఈ విధముగా అంటారు:
పురాకవీనాం గణన ప్రసంగే
కనిష్ఠికాధిష్టిత కాళిదాసా:
అద్ద్యాపి తత్తుల్య కవేరభావేత్
అనామికా సార్థవతీ భభూవ
ప్రాచీన కవులలో గొప్పవారెవరా అని ఒక పెద్ద పండితుడు  వేళ్ళు లెక్కబెట్టుట , చిటికెన వేలితో మొదలుపెడుతూ  “కాళిదాసు” అన్నారట. తరువాత వ్రేలిని లేపి పేరు చెప్పబోగా కాళిదాసుతో సమానుడైన మరోకవి ఎవరూ తోచక ఆపివేసినాడట. ఆ విధముగా ఆ వ్రేలికి ‘అనామికమ'న్న పేరు సార్థకమయిందట. ఇందులోని చమత్కారము ఏమిటంటే సంస్కృతములో చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలికి  ‘అనామికము’ అన్న పేరు మాత్రమె ఉంది. అనామికము అంటే పెరులేనిది అన్నది తాత్పర్యము.
కానీ తెలుగులో ఆ వ్రేలిని ఎంతో గౌరవించి మనము  ఉంగరపు వ్రేలు అంటాము.
ఇప్పుడు పెరులేనిది అన్న మాటకు ఉంగరపు వ్రేలు అన్నది సమన్వయము చేద్దాము. కాళిదాసు తరువాత అంతటి గొప్ప కవి లేదన్నాము కదా! ఒకవేళ ఉంటె, అతనే, ముద్రిక అనగా ఉంగరము ధరించగల యోగ్యుడు. అది జరగని పని కాబట్టి ఆ వ్రేలు 'అనామకము' గానే మిగిలిపోయింది సంస్కృతములో!
ఆయన ప్రతిభను గూర్చి ఈ క్రింది లంకెలో చదువగలరు.
లంకె, Link:
https://cherukuramamohan.blogspot.com/2018/02/blog-post.html
మొదటిసారి కాళిదాసు భోజరాజు ఆస్థానం లో ప్రవేశించినప్పుడు రాజు కొలువులో లేడు. మిగతా కవి,పండితులు కూర్చుని వున్నారు.
కాళిదాసు రాజసభలోకి ప్రవేశించినాడు. ధగధగ లాడే మణి కుండలాలు ధరించి,తళతళ మెరిసే దివ్య వస్త్రాల తో రాజపుత్రుడిలా వున్నాడు. కస్తూరి సువాసనలు విరజిమ్ముతూ,పూలమాలలు ఆభరణాలు గా ధరించి,మూర్తీభవించిన కవిత్వం లాగ,శృంగార రసప్రవాహం లాగ,దివినుండి భువి దిగి వచ్చిన దేవేంద్రుడిలా వున్నాడు.
సభికులందరూ ఆయన తేజస్సు చూచి అచ్చెరువొంది ఆయనెవరో తెలియకుండానే లేచి నిలబడి అభివాదం చేసినారు. ఆయన ప్రతి నమస్కారం చేసి ఆసీనుడైనాడు. అంతలో భోజరాజు వచ్చినాడు. వస్తూనే కొత్త వ్యక్తిని చూసి తమ పేరేమిటి కవీశ్వరా?అని అడిగాడు. కాళిదాసు ఆయన చేతిని తన చేతి లోకి తీసుకొని ఆయన అరచేతిలో 'కాళిదాసు' అని వ్రాశాడు. అది చదివి రాజు ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. కవీంద్రా సాయం సమయమవుతూంది కదా! సంధ్యా వర్ణన వినిపించండి అన్నాడు. కాళిదాసు నాలుగు చక్కటి ఉపమలతో ఓ చక్కటి శ్లోకం చెప్పినాడు.
వ్యసనిన ఇవ విద్యా క్షీయతే పంకజశ్రీ:
గుణిన ఇవ విదేశే దైన్య మాయాంతి భ్రుంగా:
కు నృపతి రివలోకం పీడయత్యంధ కారో
ధన మివ కృపణస్య వ్యర్థ తామేతి చక్షు:
తా:--వ్యసనపరుడి విద్యలాగా తామరల కాంతి దిగజారిపొతున్నది.(సాయంకాలం తామరలు ముడుచుకుంటాయి.)తుమ్మెదలు పరదేశంచేరిన గుణవంతునిలాగా దైన్యాన్ని పొందుతున్నాయి. (చీకటిపడుతుంటే తుమ్మెదలు చెట్ల పైకి చేరుతాయి)చీకటి దుర్మార్గు డయిన రాజులాగా లోకాలను బాధిస్తున్నది.
పిసినారివాడి ధనం లాగా కంటిచూపు నిష్ప్రయోజనమవుతున్నది.(చీకటిలో కళ్ళు కనపడటం లేదు)
ఆ తర్వాత భోజరాజు కీర్తిని ఈ క్రింది శ్లోకాలలో స్తుతించాడు
.
మహారాజ!శ్రీమాన్!జగతి యశ సా తే ధవళితే
పయః పారావారం పరమపురుషోయం మృగయతే
కపర్దీ కైలాసం, కరివర మభౌమం కులిశ భ్రుత్
కళా నాథం రాహు: కమలభవనో కంస మధునా
తా:--శ్రీమాన్ రాజా! ఈ జగత్తంతా నీ కీర్తి చేత తెల్లనై పోగా నారాయణుడు తన పాలసముద్రం ఎక్కడ ఉందా? అని వెతుక్కుంటున్నాడు.
శివుడు వెండి కొండ అయిన తన కైలాసం ఎక్కడా?అని వెతుకుతున్నాడు.
వజ్రాయుదు డైన ఇంద్రుడు తన తెల్లనైన ఐరావతం కోసం వెతుకు తున్నాడు.
రాహువు కళా నాథుడైన చంద్రుడినీ,బ్రహ్మ తన వాహనమైన హంసనూ వెతుకుతున్నారు. పాలసముద్రమో,ఐరావతము,చంద్రుడూ, హంసా తెల్లనివి కాబట్టి విశ్వమంతా వ్యాపించిన నీ కీర్తి తెలుపులో కలిసి పోయి కనపడటం లేదు
మరో చమత్కారమైన శ్లోకం చెప్పినాడు కాళిదాసు.
నీర క్షీరే గృహీత్వా నిఖిల ఖగపతీ ర్యాతి నాళీకజన్మా
తక్రం,ధృత్వాతు సర్వా నటతి జలనిధీంశ్చక్ర పాణి ర్ముకుందః
సర్వానుత్తుంగ శైలాన్ దహతి పశుపతి: ఫాల నేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తి కాంతా త్రిజగతి నృపతే!భోజరాజ క్షితీంద్ర!
తా:--నాళీక జన్మా=తామరపూవులో పుట్టిన బ్రహ్మ, నీరేక్షీరే గృహీత్వా=పాలూ నీళ్ళు కలిపి తెసుకొని
నిఖిల ఖగపతీ: యాతి=అన్ని పక్షుల దగ్గరకూ వెళుతున్నాడు.ఏ పక్షి నీటినీ పాలను వేరుచేయగలదో అదే తన వాహన మైన హంస అని గుర్తించేందుకు. చక్రపాణి అయిన నారాయణుడు తక్రం ధృత్వా= మజ్జిగ
తీసుకొని అన్ని సముద్రాలలో వేస్తున్నాడు.ఏ సముద్రం లో తోడుకొని పెరుగు అయితే అదే తన పాలసముద్రము అని గుర్తు పట్టడానికి పశుపతి:ఫాల నేత్రేణ పశ్యన్=శివుడు తన మూడో కంటి తో అగ్నిని సృష్టించి అన్ని కొండలనూ చూస్తున్నాడు. ఏ కొండ కరిగితే అదే తన కైలాసం అని గుర్తించేందుకు నీ కీర్తి మూడు జగాలకూ వ్యాపించి వాటిని తెల్లరంగు తో కప్పేసింది అందుకే త్రిమూర్తులు తమ నివాసాలను కనుగొన లేక వెతుకుతున్నారు.
అంతకంటే చమత్కారంగా ఈ శ్లోకం చెప్పినాడు.
విద్వద్రాజ శిఖామణీ!తులయితుం ధాతా త్వదీయం యశః
కైలాసం చ నిరీక్ష్య తత్ర లఘుతాం నిక్షిప్తవాన్ పూర్తయే
ఉక్షాణం,తదుపర్యుపమా సహచరం,తన్మూర్ద్ని గంగా జలం
తస్యాగ్రే ఫణి పుంగవం,తదుపరి స్ఫారం సుధా దీధితీం
ఓ!విద్వథ్రాజ శిఖామణీ! ఆ బ్రహ్మదేవుడు కైలాస పర్వతాన్ని నీ కీర్తితో సమానం చేసేందుకు ఆ వెండికొండ మీద తెల్లని నందీశ్వరుడిని (ఉక్షాణం =ఎద్దును)దాని పైన తెల్లని ఉమాపతి యైన శివుడినీ (ఉమా సహచరం) ఆయన శిరస్సు మీద గంగా నదినీ,దానిమీదతెల్లని సర్పరాజునూ,దాని మీద స్వచ్చమైన వెన్నెలరేడు నూ వుంచినాడు.
ఇంతకంటే చమత్కారంగా మరో శ్లోకం చెప్పాడు.యిది ప్రశ్నోత్తర మాలికా రూపంగా వుంది.
స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి?'సురమునే భూతలే కామధేనో:
వత్స స్యానేతు కామః -- త్రుణచయం!'ఆధునా,ముగ్ధ దుగ్ధం న తస్యా?
శ్రుత్వా శ్రీ భోజరాజ ప్రచురవితరణం వ్రీడ శుష్క స్తనీ సా
వ్యర్థో హాయ్ స్యాత్ ప్రయాసః తదపి తదరిభి: చర్వితం సర్వము ర్వ్యాం
తా:--స్వర్గ లోకం లో కామదేనువును చూసుకునే పసుల కాపరికీ నారడుడికీ మధ్య సంభాషణ
నారదుడు :-ఓ! గోపాలకా స్వర్గం నుంచి ఎక్కడికి వెళుతున్నావు?
గోపాలకుడు:-సురమునీ మా కామధేనువు దూడ కోసం గడ్డిమోపు తెచ్చేందుకు భూలోకానికి వెళుతున్నాను.
నారదుడు:-ఓరి అమాయకుడా! యిప్పుడు కామధేనువు దగ్గర పాలు లేవా?
గోపాలుడు:-శ్రీ భోజరాజు గారి మహత్తరమైన వితరణ గురించి విని సిగ్గుపడిన కామధేనువు ఎండి పోయి శుష్కస్తని అయిపొయింది.
నారదుడు:--అయితే నీ గడ్డి తెచ్చే ప్రయాసకూడా వ్యర్థమే కాబోతున్నది. భూమి మీద భోజరాజు పరాక్రమము వల్ల ఆయన శత్రువు లందరూ గడ్డి కరిచారు.(తిన్నారు)కాబట్టి నీకు ఆ గడ్డికూడా దొరకదా అని భంగ్యంతరంగా చెప్పాడు. .
ఇన్ని ఉపమానాలతో వున్న అద్భుత మైన శ్లోకాలు విని భోజరాజు ఆశ్చర్యముతో చూస్తూ ఉండిపోయాడు.

తర్వాత తేరుకొని కాళిదాసును కౌగలించుకొని సత్కారాలతో ముంచెత్తినాడు.
స్వస్తి.