Tuesday 28 February 2023

మంచి దారి ఎన్నుకో - మదగజమై నడు

 మంచి దారి ఎన్నుకో - మదగజమై నడు 

https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post_28.html

రంజన లేక కం ధి గొను రాబవ లంతయు మేఘ సృష్టి  కై

పంజరమందు నిల్చియును పల్కును చిల్కలు ముద్దు పల్కులన్

భంజన చెందియున్  తరువు ఇచ్చును మెచ్చగ సాలభంజికల్

కుంజరమౌచు సాగవలె కుంకక జంకక క్లేశమందునన్

కంధి = సముద్రము , రంజన = ఆనందము , రాబవలు = రాత్రింబవళ్ళు

భంజన చెందియున్ = విరచబడి కూడా ,

సాలాభంజికల్ =  స్తంభమునకు చెక్కిన బొమ్మలు , కుంజరము = ఏనుగు.

Monday 27 February 2023

సఖీ ఈ రేయి వెలిసెను

                                                     సఖీ ఈ రేయి వెలిసెను 

https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post_27.html

సఖీ ఈ రేయి వెలిసెను

                                                నీ జాడే తెలియదాయె

                                                 నిశీధే నెలవు మారెనూ

                                                 నీ జాడే తెలియదాయె

 

తరంగాలై నీతలపులు

పదే పదే ఎద తాకెనె

నిరాశా నీరసాలతో

చెమర్చెను నాకన్నులే

జలదమే జార వానగా

నీ జాడే తెలియదాయె

 

మనోనభ సీమయె నీవై

సదా సదా వ్యాపించగ

విహంగాలై ఎగురసాగెలే 

చెలీ నీ తీపి గురుతులు

ప్రళయ మారుతపు తెరలలో

నీ జాడే తెలియదాయె

తమిస్రపథముల పాంథునై

చెలీ నినే జపించితి

విషాదమే మిగిల్చెనే

విధాతయే విరోధియై

అమాసే ఆవరించగా

నీ జాడే తెలియదాయె

సఖీ ఈ రేయి వెలిసెను

నీ జాడే తెలియదాయె

 

 

 

Sunday 26 February 2023

రామ చిలుకా!

 రామచిలుక

https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post_26.html

జీవితాన ఒకరినే ప్రేమించే జీవి నీవు

అందులకే రామచిలుకవైనావు

నీకెవరూ సాటిరారు రామచిలుకా

నీసుగుణము మాకేదీ నిజము పలుక     llజీవితానll

చిలుకపచ్చ నీమేనికి చెదరని అందం

         దొండపండురంగు ముక్కు నీకే సొంతం

         నీఅందం నీచందం అలరించును మాడెందం

నీ రూపం నీ స్నేహం అపురూపం         llజీవితానll 

నీ తళుకు నీ బెళుకు నీదగు కులుకు

ముచ్చటైన నీ పలుకు ముద్దులు చిలుకు

పులుగులవి ఎన్నున్నా పోలవులే అవినీకు

నీఎంగిలి జామరుచులు ఎక్కడ దొరుకు                llజీవితానll

        ఓంకారము నందున అమ్మవు నీవే

శుకయోగికి నాసికము పలుకువు నీవే

అమ్మ కుడిభుజానికి ఆభరణము నీవే

శుకమా నీబాట మాకు కూర్చును సుఖమే      llజీవితానll

Friday 24 February 2023

అందము నిండిన డెందము - హరిణీ తరుణీ

 

అందము నిండిన డెందము

https://cherukuramamohan.blogspot.com/2023/02/blog-post.html

హరియౌ నీ ముఖ బింబము

హరి నుడులై జెలగు బహుళ ఆకర్షకమై

హరి జడయు నడుము జూడగ 

హరి హరి నిను బొగడ తరమె హరిణీ తరుణీ

ముఖ బింబము హరి అంటే చంద్రునితో సమానము. మాటలా ఆకర్షణీయమైన హరి అనగా చిలుక పలుకులు.  హరిని అనగా నాగును బోలిన జడ, హరి అనగా సింహము యొక్క నడుము, ఇన్ని విధముల హరిని కల్గిన నిన్ను హరి హరీ  పొగడ సాధ్యమా లేడి తో సమానమగు యువతీ!

చెరుకు రామ మోహన్ రావు