Monday 4 July 2016

భోజరాజు - దొంగలు

ఒకనాడు భోజరాజు రాత్రి వేళలో నగరం లో తిరుగుతుంటే,ఒకచోట యిద్దరు దొంగలు కనిపించారు.
వారిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే భోజరాజు చెట్టు చాటునుండి వింటున్నాడు. 
మొదటివాడు రెండవవానిని, మిత్రమా!దొంగలించిన ఇంత డబ్బుతో మనము సైనికులకు పట్టుబదతామేమోనని నాకు   భయంగా వుంది..వాళ్ళు పట్టుకోక ముందే మనం దోచుకున్నసోమ్ము పంచుకొని వెళ్ళిపోవడం మంచిది.అన్నాడు . రెండవ వాడు వల్లె యని ఆ విధముగా పంచుకొన్న పిదప   మొదటివానితో " నీ వంతుకు వచ్చిన సొమ్ముతో నీవేమి చేస్తావు?"అందుకు మొదటివాడు  యిదంతా ఎవరైనా యోగ్యుడైన పేదవాడికి దానం చేస్తాను.అతను యింకేవ్వరినీ యాచించ వలిసిన పని లేకుండా చేస్తాను" అన్నాడు. 
"దొంగసొమ్ము దానం చేస్తే నీకు పుణ్యం ఎలా వస్తుంది" అన్నాడు రెండవ వాడు.
 ఇది మన వృత్తి.తాత ముత్తాతల  కాలమునుండి వస్తున్నది. కాబట్టి నేను దీనిని పాపపు సొమ్ము అని తలచుట లేదు. పై పెచ్చు మనము దొంగలించినది ధనవంతుడైన ఒక లోభియింటినుండి? కాబట్టి నేను చేయుపనిలో ఎటువంటి దోషము చూచుట లేదు." అని యంటూ 
మూర్ఖో నహి దదాత్యర్థం నరో దారిద్ర్య శంకయా 
ప్రాజ్ఞస్తు వితర త్యర్థం నరో దారిద్ర్య శంకయా 
దానం చేస్తే దరిద్రుడ నవుతానేమో నన్న భయంతో మూర్ఖుడు దానం చెయ్యడు. దానం చెయ్యకపోతే ముందు జన్మకు దరిద్రుడ నవుతా నన్న భయం తో బుద్ధిమంతుడు దానం చేస్తాడు. కాబట్టి నేను సంపాదించిన ఈ ధనముతో ఒక దరిద్రుని ధనవంతుని చేస్తాను.
యింతకీ నీవేమి చెయ్యాలని అనుకుంటున్నావు? అన్నాడు మొదటివాడు రెండవ వానిని . దానికి వాడు ఈ విధముగా తెలిపినాడు.
"మొన్న మా ఇంటికి వచ్చిన ఒక సన్యాసి ఇకనైనా దొంగపనులు మానుకొని కాశీవాసం చేస్తే చాలా పుణ్యమని మా నాన్నకు ఉపదేశించినాడు.
చిన్నప్పటి నుంచీ దొంగతనాలు చేస్తూ కూడగట్టుకున్న పాపమంతా కాశీ వాసం చేసి 
పోగొట్టుకోవాలని మా నాన్నఆలోచన.ఇప్పుడాయన దొంగతనాలు మానేసి వైరాగ్య మార్గంలో నడవాలనుకుంటున్నాడు. కావున ఆయన కాశీ యాత్రకోసమే ఈ డబ్బంతా.
వారాణసీ పురీ వాస వాసనా వాసితాత్మనా 
కిం శునా సమతాం యాతి వరాకః పాక శాసనః 
కాశీ వాస పుణ్యం చేత పుణ్యాత్మ అయిన కుక్కతో ఇంద్రుడ యితే మాత్రం సమాన మవుతాడా? 
ఆ కుక్క పుణ్య ఫలం ఇంద్రుడి కంటే అధికం అని పెద్దలు అంటారు కదా అందువల్ల ఆయన అభిమతమును నేరవేర్పదలచుకోన్నాను. అంతే కాకుండా 

మరణం మంగళం యత్ర విభూతిశ్చ విభూషణం 
కౌపీనం యత్ర కౌశేయం సా కాశీ కేన మీయతే 

ఎక్కడయితే మరణమే మంగళ ప్రదమో,బూడిదే ఆభరణమో,గోచిపాతే పట్టు పుట్టమో ఆ కాశీ తో దేనినీ పోల్చా వీలులేదు. కాబట్టి నేను దొంగలించిన ధనమును ఆ విధముగా సద్వినియోగము చేస్తానని అన్నాడు.
వారిరువురి సంభాషణ విని రాజు చాలా ఆనందిం చినాడు.కర్మగతి యెంత విచిత్రమని తలచి  దొంగ లిద్దరి  మంచి బుద్ధి ని మనసున తలంచి  తరువాతిరోజు ఉదయం తన సైనికులతో వారిరువురినీ సభకు రప్పించి వారి వృత్తిని సద్గునములను సభకు చాటి , ఉచిత రీతిని సత్కరించి ఇకపై దొంగతనములు మాని , దీన జన సేవలో చరితార్తులను కమ్మని చెబుతూ వారిని పంపినాడు.

No comments:

Post a Comment