Wednesday 12 April 2023

దానము గొప్పదనము

 

దానము గొప్పదనము

https://cherukuramamohan.blogspot.com/2023/04/blog-post.html

శతేషు జాయతే శూరాః సహస్రేషు చ పణ్డితఃl

వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వాll - వ్యాసస్మృతి

నూటికి ఒక శూరుడు, వెయ్యికి ఒక పండితుడు, పదివేలకు ఒక వక్త కలుగుతారు కానీ దాత 

మాత్రము దొరుకుతాడని చెప్పనలవి కాదు.

శూరుడు మనకు అందరిలో కనిపించడు. అసలు శూరత్వము అంటే యుద్ధాలలో పాల్గొనడము 

కాదు. తలపెట్టిన కార్యమును సమర్థవంతముగా  నిర్వహించడము శూరత్వము. అందుకే 'కార్య 

శూరుడు' అన్న పలుకుబడి ప్రాచుర్యమునకు వచ్చినది. ఈ కార్యశూరత కలిగిన వాడు ఒక 

నిస్సహాయునికి చేయూతనిస్తే సమాజమే శ్రేయోదాయకమౌతుంది. అటువంటి శూరులు 

పూర్వము నూటికి ఒకరు వుండేవారు. ఇప్పుడు వీరత్వము,ధీరత్వము, శూరత్వము అన్నీ 

స్వార్థములో మాత్రమె నిండి యుంటాయి . ఈ కాలము ఒకరికోరకు పాటుపడేవాడు దొరుకుట 

సముద్రములో మంచినీరు వెదుకడమే నేమో? 

ఇక పాండిత్యము విషయానికి వస్తే  ఎదో కళాశాలలకు పోవడమో స్నాతక పట్టాలను 

పుచ్చుకోవడము మాత్రము కాదు. పాండిత్యమునకు జిజ్ఞాస అవసరము. కోరిక వుంటేనే కదా 

తీర్చుకోవలెనను తపన వుండేది. పూర్వము అటువంటి వారు వెయ్యికి ఒక్కరు వుండేవారట. 

అటువంటి వారి వద్ద నేర్చుకోవలేననే తహ తహ కూడా నాటి జనులలో వుండేది. మరి నేడో 

అందరూ పండితులే , ఆమాటకొస్తే ఏమీ తెలియని నేను కూడా పండితుడనే!

ఇక వక్తృత్వమును గూర్చి! 'ప్రియ వక్తృ త్వం' 'వాక్ భూషణం ' 'వచః ప్రసంగం' అని ఎన్నో 

విధాలుగామాట యొక్క మహిమను గూర్చి తెలిపినారు నాటి మహనీయులు. పూర్వము అట్టి వక్తలు 

పది వేలకు  ఒకరు వుండే వారట. అప్పుడు చెప్పేవారు తక్కువ వినేవారు ఎక్కువ. మరి నేడో 

అందరూ చెప్పేవారే! ఇక వినేవారేరీ. మన రాజకీయనాయకు మాట్లాడితే ఎదుట నిలిచినవాడు 

తడిసి ముద్ద యగుట తప్పించి వేరే ప్రయోజనమేమీ ఉండదు. అది గాలికి నిలిచే ఊక అంటే  

గాలికి ఊక  నిలువదు గదా !     

ఇక దానగుణము. లక్షల సంవత్సరముల కాలములో దాతలుగా మన మనసున చెరగని 

ముద్ర వేసిన వారు చాలా కొద్ది మంది. వారిలో శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి, 

రంతిదేవుడు, దాన కర్ణుడు  మొదలగు వారు వాశి కెక్కిన వారు. అందుకే దాత ఎన్ని 

కోట్లలోనైనా దొరుకుతాడో దొరకడో చెప్పుట కష్టము అన్నారు ఆకాలము లోనే. మరినేడో 

వంద రూపాయలు ఇచ్చినవాడుకూడా తనపేరు వార్తా పత్రికలో ప్రముఖంగా 

కనిపించాలనుకొంటాడు. మరి ఈ విషయము ఎన్నికలకు ఇచ్చే చందాలకు వర్తించదు 

ఎందుకనో?  ఒకచేత ఇచ్చిన దానము ఇంకొక చేతికి తెలియకూడదన్నది పెద్దల మాట.    

ఈ కాలములో వాగ్దానము కూడా దానముక్రిందనే జమ. దానమును గూర్చి 

మాట్లాడుకొంటూ కర్ణుని గూర్చి తెలుపకపోవుట సమంజసముకాదు.ఈ ఉదంతము చదువండి.        

కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దుననే కర్ణుని భవనానికి వెళ్ళినాడట.

అప్పుడు కర్ణుడు అభ్యంగ స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె రాచుకుంటున్నాడు. 

కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది. కృష్ణుడు 

మాటలాడుతూ అటుఇటు చూస్తే ఆ రత్నాలు పొదిగిన గిన్నె కనిపించింది. కర్ణా ఆ గిన్నె చాలా 

బాగున్నది ఇస్తావా? అని అడిగినాడు. వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ 

గిన్నెను ఆలస్యము చేయకుండా ఇచ్చివేసినాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో 

యిస్తున్నావు? కుడిచేతితో కదా ఇవ్వవలసినది అన్నాడు. అందుకు కర్ణుడు

క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో: l

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి: ll

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో 

తెలియదు. లక్ష్మి చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం 

లో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుండి ఆ చేతికి పోయే లోపలే ఏ 

మార్పయినా కలుగవచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని తత్ క్షణమే చెయ్యవలెనను ఆర్యోక్తి 

ననుసరించి ఈవిధముగా చేసినాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు 

సంతోషించి ఏదైనా వరము కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తథా l

దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ ll

కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతే కాదు, 

నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు 

నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించమని కోరినాడు.

దానము విషయము లో సదా సాత్వికమే ప్రధానము. చెయ్యాలనే సంకల్పం కలుగ గానే 

ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా 

తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. దానం చేసి నేను చేసినానని డప్పు 

కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే సివేయవలసింద‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు కదా! పెద్దలు. మనము కర్ణుడి లాగా వ్యవహరించ 

లేకపోయినా మన శక్త్యానుసారము గ్రహీత యొక్క పాత్రత తెలుసుకొని  దానము చేయుట 

అలవరుచుకొనవలెను. ఇక్కడ దాగివున్న కర్ణుని గొప్పదనము మరొకటి గమనించవచ్చును. 

కృష్ణుడు కోరుకొమ్మన్నాడు కదా అని దురాశతో ఏదయినా కోరియుండవచ్చును. కానీ 


ఔచిత్యమునెరిగి కోరినాడు ఘనుడగు కర్ణుడు.


స్వస్తి.