Sunday 20 September 2015

అత్త -- కోడలు (జానపద గేయము)

ఈ జానపద గేయము  నన్ను పెంచిన తల్లి ( మా అమ్మమ్మ ) చెప్పినది. ఒకసారి చదవండి . ఆకాలములో కొట్లాడుకొన్నా వాళ్ళ అన్యోన్యత మనకు అర్థమౌతుంది.
అత్త -- కోడలు
అత్తమ్మ పెత్తనం అమలుజరిగే వేళ
ఆరళ్ల కోడళ్ళు అగచాట్లు బడు వేళ

చుట్టాలు పక్కాలు చూడవచ్చెడు వేళ
కోడల్ని బంపించి కొండ కట్టెలకు

మూడు చిట్ల బియ్యమొండి మునగ కూరొండి
అత్తయును మామయును అందరూ దినిరి

పైటాల కూలీలు పనివాళ్ళు దినిరి
ఏకులొడికే వాళ్ళు ఏడుగురు దినిరి

మాని ముంతల వాలె మనవళ్ళు దినిరి
కోడిపుంజులవాలె కొడుకులూ దినిరి

కుంపటి కుదుళ్ల వాలె కూతుళ్ళు దినిరి
వారి కూతులు కూడ వైనముగ దినిరి

అత్తమ్మ కూతుళ్ళ నతిప్రేమ తోడ
కూరుచోబెట్టుచూ గొంతు సవరించి

మూతి విరుపుల తోడ చేతి సైగలతో
కమ్మలను మరియును కడియాలు దొడిగి

చిలువ పలువలు జేసి చెవికెక్కు వరకు
ఆపైన ఇట్లనె అనుగు కూతురితో

ఆంబోతు కోడలి ఆపసోపాలు
చూడలేనే బిడ్డ, చూడు వంటింట్లో

కూతురా కుమ్మక్క! కూడెంత కద్దు
ఎంత ఉన్నా చాలు ఇక చేయ వద్దు

ఆమె చెప్పగ దొడగె అమ్మతో నిట్లు
మాపటికి తినకద్దు మరిమిగుల కద్దు

చేయనక్కరలేదు చేసింది చాలు
అన్నదే చాలనుచు అత్త కూర్చునెను

మోపు కట్టెల తోడ మొగమంత చెమటతో
అలుపు సోలుపుల కోడ లప్పుడే దిగెను

ఆవురావురటంచు  ఆకలిని గొనుచు
నెత్తి మోపునును దించి నీళ్ళిన్ని తాగి

కొంగుతో తా చెమట కూడా తుడువకనె
కొరకోరల అత్తమ్మ కోడల్ని యడిగె

కోడలా కొమరక్క కూడెంత కద్దే
మాపటికి లేదత్త మరి వండ వలెను

అత్తమ్మ కోపమ్ము అగ్గిమంటయ్యె
అమ్మోరు పూనినట్లడిగె తానంత

ఆరడి కోడలా అతిమాటలొద్దు
పోద్దుగునుకులు నీదు పోరుబడలేను

'వెంటనే కుంపటిని వేరుంచుకొమ్ము'
అన్న అత్తయ్యతో ననే కోడలిట్లు

'వేరుండ నాకేల వెతలు పడనేల
పాలుండ నాకేల  పంచుకొనేల

నాదు పెనిమిటి తోటె నా వూరు పేరు
కట్టుకోన్నోడె నా కనుపాప తీరు

వాని మాటలు వేదం వాక్యాలు నాకు
వాడు లేనిదె బతుకు వలదింక నాకు

వానితోనే జెప్పి వాస్తవము దెలిపి
అడగమందును నిన్నుఅత్తరోఇపుడు '

'నాయమ్మఓయమ్మ నను గన్న తల్లి
నీ ముద్దు కోడల్ని నీవన్నదేమి?'
'నేనేమి యంటిరా నే కన్న కొడుకా!
తలవాకిటన నిల్చి తలదువ్వ వద్దు,

పొరుగుతో మొగసాల పోరసలు వద్దు
ఇంటి సంగతనొద్దు ఇరుగు పోరుగులతో

మాట మాటకు బదులు మాటాడ వద్దు
అనితప్ప వేరేమి అనలేదు నేను

తప్పేమి వుందిరా తనయుడా ఇందు
అమ్మ కాకరకాయ ఆలేమొ చెరుకాయ

దాని మాటలు జోల తల్లేమో గోల
నీవు చిట్టెలుకవు నీభార్య పిల్లి

నీవు కుక్కిన పేను నీ తల్లి నేను'
అని దెప్పుతూ బోయి ఆమె పతిజేరె

ఇంత తగువులాట జరిగినా ఇక్కడ గమనిచ వలసినది ఏమిటంటే ఎవరి భర్త వద్దకు వారు పోవుట తప్పించి వేరు ఆలోచన వారిలో కలుగ లేదు.

ఈ గేయములో :
ఇవి రేనాటి పలుకుబడులు
వాలె = వలె
పైటాల = పగటి వేళ, మధ్యాహ్న సమయము
మాని ముంతలు = పూర్వము విరివిగా చందనము కొయ్యతో పాత్రలను తయారు చేసేవారు. మిగతా చోట్లలో కూడా వుండేది కానీ కొంత తక్కువ. వాటి వాడకము ఆరోగ్యమునకు చాలా మంచిదని ఇండ్లలో వాడేవారు. అసలు వండుతకు స్త్నానమునకు వాడు కట్టెలనుకూడా చట్ల జాతులను బట్టి ఏరిఏరి ,చండ్ర, చందనము,మద్ది మొదలగునవి, వాడే వారు. ఇప్పుడు మనకు వాటి పేర్లు గూడా తెలియదు.
కుంపటి కుదురు = బొగ్గుల పొయ్యి నుండి బూడిద కిందపడకుండా అటు కుంపటి కదలకుండా వుండే విధముగా ఒక ఇనుప లేక పలుచటి రాతి పలక వాడే వారు.

పోద్దుగునుకులు = తెల్లవార్లు
మొగసాల = చావిడి
చెరుకాయ = చెరుకు ఆయె






















Wednesday 9 September 2015

కక్షో కిం తవ -- రామాయణం పుస్తకం

కక్షో కిం తవ -- రామాయణం పుస్తకం 

కవితా రీతికి సమయస్పూర్తికి కాళీదాసు పెట్టింది పేరు. సమ్యస్పూర్తి,సరళమైన హాస్యము సామాన్యుని కూడా మాన్యుని చేస్తుంది. 
మరి కాళీ దాసో ఆయన కాళికి దాసుడా లేకకాళి ఆయనకు దాసియా అన్నది నాలాంటివాని  ఊహలకందని విషయము. ఆయన చాటువుగా భావింపబడే ఈ శ్లోకమును గుర్తుచేసుకొనేముందు దాని పూర్వ కథనమును గమనించుదాము.
బంగాళ దేశములో, ఇంకా ఆ చుట్టుప్రక్క ప్రాంతాలలో బ్రాహ్మలు చేపలు తింటారు. వారిని 'మత్స్య బ్రాహ్మలని ఇప్పటిలాగానే అప్పటికాలములో పిలిచేవారో లేదో నాకు తెలియదు. కానీ మన కాళీదాస కవిపుంగవునికి చేపలు తినే అలవాటున్నదో లేక దేవీ కరుణా కటాక్షవీక్షిత మేధో మేరువైనందువల్ల తానే ఒక సన్నివేశమును సృష్టించి సమస్యను పరిష్కరించినాడో మన  ఊహలకందని విషయము. భోజ కాళీదాసుల అన్యోన్యతకు అద్దముపట్టే ఒకసంఘటన వేరొక పర్యాయము ముచ్చటించుకొందాము.
ఇంత దగ్గరితనమును చూసి వోర్చుకోలేని సాటి కవి పండితులు ఎటుదిరిగీ వారిమధ్యన విభేదాలు సృష్టిచవలెననుకొన్నారు. ఇది గమనించినాడు కాళీదాసు. ఆ తరువాత రోజు నుండి ఈ కవిపండితులలో ఎవరో ఒకరు చూసేవిధంగా మస్త్య విక్రయ సాలల వదా విరివిగా కనిపించి తాను చేపలు తింటాదన్న భ్రమ వారిలో కలిగించినాడు. అది నిజమనుకొన్న వారు ఆ విషయానికి కమ్మలు కడియాలు తొడిగి రాజుకు చేరవేసినారు. 
రాజు కాళీదాసును పరిక్షించేరోజు రానే వచ్చింది. భోజుడు  మస్త్య విక్రయ వీధి గుండా వచ్చే కాళీదాసును గమనించినాడు..చంకలో 
వస్త్రములోచుట్ట బడిన నది చేపయా అన్న విధముగా నీచు నీళ్ళు భూమిపై జారుతూ, పంచె బయటికి చేప తోక 
వచ్చినట్లు కనిపించుతూ వుండుట  గమనించినాడు. కాళీదాసును తనవద్దకు పిలిపించినాడు. భోజుడు స్వతహాగా గొప్ప పండితుడు మరియు కవిఅయినందువల్ల తన సంభాషణ శ్లోకరూపములో మొదలుపెట్టినాడు.
ఈ చాటువు సంవాద రూపములో జరుగుతుంది, అంటే ప్రశ్న ఉత్తర రూపములో!
" కక్షే కిం తవ? పుస్తకం; కిముదకం? కావ్యార్థ సారోదకం; 
గంధః కిం? నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః |
పుచ్ఛః కిం? నను తాళపత్ర లిఖితం; కిం పుస్తకం భో కవే?
రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం ||"

ఆ సంభాషణా సారాంశమిది: 

భోజుడు: (కక్షే కిం తవ?) నీ చంకలోని దేమిటి?
కాళిదాసు: పుస్తకం.
భోజుడు: (కిముదకం?) నీళ్ళేమిటి?
కాళిదాసు: (కావ్యార్థ సారోదకం) : : కావ్యార్థ సారపు ద్రవ, అనగా నీటి, రూపము

భోజుడు: (గంధః కిం?) కంపేమిటి?
కాళిదాసు: (నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః) రామరావణ యుద్ధంలో చచ్చిన పీనుగుల కంపు.
భోజుడు: (పుచ్ఛః కిం?) తోక ఏమిటి?
కాళిదాసు: (నను తాళపత్ర లిఖితం) ఇంకా తోకలు తుంచని వ్రాయబడిన తాళ పత్రములు.
భోజుడు: (కిం పుస్తకం భో కవే?) ఓ కవీ!ఏమిటా  పుస్తకము?

కాళిదాసు: (రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం) ఓ రాజా! ఇది భూసురులు అంటే బ్రాహ్మలు సేవించే అంటే 
భక్తిప్రపత్తులటో గౌరవించే  రామాయణ గ్రంధము.  

క్షణ కాలము అవాక్కయిన  భోజుడు చూపించమంటే కాళిదాసు . నిజంగానే  చేప గా భ్రమింప జేసిన రామాయణ గ్రంథము 
చూపించినాడు. 

అదీ కాళీదాసంటే!




Thursday 3 September 2015

చూర్ణం--తూర్ణం

చూర్ణం--తూర్ణం
ఇది ఒక చాటువు. కాళీదాసు కాలముదా కాదా అన్న తర్కము లేకుండా చది ఆనందించవచ్చు. ఆ కాలములో కార్ష పణాలు వుండియుండ వచ్చు గానీ అణాలు వుండియుండవేమొ అని నా అనుమానము.
ఆ కాలము తాబూల సేవనము తప్పనిసరి. ఎందుకంటే తాంబూలము ఆరోగ్యప్రదము. గుట్క, జరదా, తంబాకు తాంబూలము కాదు సుమా! ఒక రోజు సాయంకాలము బజారులో నడుస్తూవుంటే మహకవి పండితులైన దండి కాళిదాసులకు ఒక తాంబూలము కొట్టులోని బహుశ యజమానురాలేమో, బహు సుందరముగా కనిపించింది. అంతే ఇద్దరూ ఆ కొట్టు వద్దకువేళ్ళినారు.
దండి ఆ అందమైన అమ్మాయిని కాళిదాసుకన్నా ముందు పలుకరించవలెనను ఉద్దేస్యముతో ఆశువుగా ఒక శ్లోకములోని 
మొదటి పాదము ఈ విధముగా చెప్పినాడు.

"తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే"
(ఓ పూర్ణ చంద్రుడిలాంటి ముఖం గల చిన్నదానా! త్వరగా సున్నం ఇప్పించు అని, ఇందొలో మనము గమనించితే మూడు 'ణా లు వస్తాయి. పలుకునపుడు మనము 'ణ" ను 'అణా గా పలుకుతాము.).
వెంటనే కాళిదాసు
"పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత కీర్ణ లోచనే"
(చెవుల వరకు వ్యాపించిన విశాలు నేత్రాలు గల దానా! బంగారు వన్నెగల తమలపాకులు కూడా ఇప్పించు,
అని అన్నాడు. ఇందులో 5 'ణా' లు వస్తాయి ) 
ఆమె ముందుగా కాళిదాసుకు తమలపాకులు సున్నము ఇచ్చి తరువాత దండికి సున్నమిచ్చింది . ఆకాలములో సంస్కృతము రానివారు చమత్కారము లేనివారు పగటి పూట కనిపించరు. అంటే రాత్రి పూట ఎటూ కనిపించరుగదా అని నా వుద్దేశ్యము. , తర్వాత దండికి సున్నం ఇచ్చిందట.
"ముందుగా నేనడిగితే ఆయనకు  ముందు ఇచ్చినావెందుకు "
అని అడిఅడిగినాడు దండి ఆవేశముగా
దానికి ఆమె
"మీరిద్దరూ మహాకవులు, చమత్కారులు. మీలో ఎవరు గొప్పో చెప్పే స్థాయి నాకు లేదు.
ముందు మీరు 3 "ణ" లు వచ్చేలా మొదటి పాదము చెప్పినారు .
కానీ ఆయన చెప్పిన రెండవ పాదములో 5 'ణా లు వున్నాయి. ఎంతయినా వ్యాపారినిగదా! లాభసాటి బెఋఆనికే పెద్దపీట వేసినాను. "అని చమత్కరించింది  ఆ అమ్మాయి.
మా కాలములో అణాలు బేడలు పావులాలు  వుండేవి. 
ఇక్కడ అర్థము చేసుకోవలసినది కవుల చమత్కారముకాదు వారి చమత్కారాన్ని అర్థము చేసుకొని తిరిగీ ఆ అమ్మాయి పెద్దలకు నొప్పి కలగకుండా చమత్కరించడము. అందుకే పెద్దలు 'చెప్పుట కంటే స్పందించుట చాలా ముఖ్య"'మన్నారు.