Wednesday 20 May 2015

SOMA -- సోమ

SOMA -- సోమ


The Bible was originally written in Greek the language of the intellectuals of the time. At the last supper, when Jesus picks up the bread he describes his body with one particular word:
“And as they were eating, Jesus took bread; and when he had given thanks, he broke it and gave it to his disciples, saying, “Take, eat; this is my body (sōma | σῶμα).” – Matthew 26:26
That’s right, the word used in the original Greek for the body of Jesus is Soma. The Greek word Soma is of “undetermined” origin and refers to the body of a plant, isha (mystical/physical) (esha,esa,esus, Jesus), as well as a heavenly body viz. moon. 
With all of these points of similarity we can state conclusively that the central religious ritual of Christianity is patterned on Vedic cosmology. This is authentically proved by  E. Pococke in his work 'India In Greece'. It is also now evident to doubt that when they have borrowed the primary word 'Jesus' itself from Sanskrit, is it true that there existed any historic Jesus.
బైబిలు మొదట గ్రీకుభాషలో వ్రాయబడినది. నాడది పండిత భాష. క్రీస్తు 'అంత్య నిశాశనము' (Last Supper)రొట్టెముక్కను గైకొని, తన అనుచరులకు,  దానిని తన తనువుతో పోలుస్తూ ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించుతాడు:
"
వారు ఆవిధముగాభుజించు సమయమున,జీసస్ కృతజ్ఞతా పూర్వకముగా,ఒక రొట్టెను ముక్కలు చేసి వారికి అందజేస్తూ 'మీకోసగిన ఈ రొట్టెముక్కలు తినండి;ఇది నా తనువు( సోమ, sōma | σῶμα). -- మ్యాత్యూ 26:26
ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే , గ్రీకు భాషలో క్రీస్తు శరీరానికి 'సోమ' అన్న శబ్దాన్ని వాడినారు, కానీ దాని వ్యుత్పత్తి వారికి తెలియదు.'సోమ' శబ్దము సంస్కృత జన్యమని, దానికి శివుడు(ఈశుడు, ఈశ, ఈస, ,ఈసస్,జీసస్ ) అన్న రూపాంతరము ఏర్పడినదన్నది వారి ఊహకు అందని విషయము.
దీనిని బట్టి మనకు అర్థమౌతున్నది ఏమిటంటే. వాళ్ళు, వారి మతగ్రంధములో వాడిన మౌలిక పదాలకు మూలము సంస్కృతము. మరి ఈశ నుండి జీసస్ అన్న పదము రూపాంతరము చెందినప్పుడు అసలు వ్యక్తీ పుట్టలేదేమో , పదము మాత్రము వాడుకొన్నారేమో అన్న ఆలోచనను రేకెత్తించక మానదు. అసలు గ్రీకు భాషకు  మూలము సంస్కృతమే అని పోకాక్ పండితుడు INDIA IN GREECE అన్న గ్రంధములో సోపపత్తికముగా నిరూపించినారు.

నేను వ్రాసిన SOMA -- సోమ అన్న శీర్షిక పై Sat Sangamu వారు వెలిబుచ్చిన అభిప్రాయానికి 

అనుబంధముగా నాలుగు మాటలు వ్రాయవలసి వచ్చి 

వ్రాస్తున్నాను.



Sat Sangamu మీకు అవకాశం తీరిక వున్నట్లయితే internet లో సంస్కృతంలో ముద్రితమైన bible దొరుకుతుంది, 


అసలది అది చూస్తే ఇంకా నేను చెప్పేదేముంది. మీరు ఇక్కడ వ్రాసిన దృక్పథమే అణువణువునా కనిపిస్తుంది. 

Butవ్యక్తి పుట్టలేదు అన్న మీ భావానికి నాకు ఏకీభవించ బుద్ధి కావటం లేదు కానీ, ఎంతైనా శకపురుషుడైనవారిని 


కాదనుట ఎట్లు? జ్ఞానులను దైవ సమానులుగా చూసే అలవాటు ప్రపంచ వ్యాప్తముగా వున్నది. రమణ మహర్షి జ్ఞాని 

కానీ భగవాన్‌ శ్రీ రమణులు అంటారు.షిరిడీ సాయి మహా జ్ఞాని, సద్గురువు కానీ ఆయన్ని దేవుడిగా చేసేసి విగ్రహాలు 

అభిషేకాలు etc చేసేస్తున్నారు.వీరు దైవానికి భిన్నులా అంటే, "ఆ పరమతత్వానికి అభిన్నులం కాదు" అని 

అనుభవపూర్వకంగా చెప్పారు కనుకనే వీరు జ్ఞానులు అయ్యారు. 

సంస్కారముతో కూడిన మీ సందేహానికి  నాకు చేతనైన రీతిలో సమాధానమిస్తున్నాను. దీనిని వాదములోనికి 

పరివర్తన చేయవద్దు.


The texts were mainly written in Biblical Hebrew, with some portions (notably in Daniel and 

Ezra) in Biblical Aramaic. Biblical Hebrew, sometimes called Classical Hebrew, is an 

archaic form of the Hebrew language. The very first translation of the Hebrew Bible was 

into Greek. (Biblical languages - Wikipedia)

 During the thousand years of its composition, almost the entire Old Testament was written in Hebrew. But a few chapters in the prophecies of Ezra and Daniel and one verse in Jeremiah were written in a language called Aramaic. This language became very popular in the ancient world and actually displaced many other languages. 
 The New Testament authors wrote in Greek. They did not, however, use really high-class or classical Greek, but a very common and everyday type of Greek. For many years some scholars ridiculed the Greek of the New Testament because many of its words were strange to those who read the writings of the great Greek classical authors such as Plato and Aristotle. But later many records were uncovered of ordinary people, and amazingly there were the same common terms used in everyday speech! The ridicule dried up accordingly. 
We now have His revelation in our own language and in 2300 other languages, too. Today we have the very Bible that comes to us from the three languages used in the original. Truly we can say, "God speaks my language, too!" (biblica.com)

కాబట్టి ఆ 2300 భాషలలో సంస్కృతము ఒకటి. కాబట్టి బైబిలును సంస్కృతములో చదువనవసరము లేదు. సంస్కృతములో పండితులమని చెప్పుకొన్న మాక్సు ముల్లరు గారు తన బంధువులకు గురువులకు ఏమి వ్రాసినాడో దయతో చదివేది. ఇక్కడ మనకు తెలియవచ్చేది ఏమిటంటే బైబిలును ఒకరు వ్రాయలేదు.మొదట కూడా ఒకే భాషలో వ్రాయబడలేదు.  అటువంటి పుస్తకమును వివిధ భాషల లోకి తర్జుమా చేసినవారు స్వకపోల కల్పనలు చేర్చకుండా వ్రాయరు. పరమాత్మ స్వరూపముగా చెప్పబడే క్రీస్తు పుట్టుకకు చారిత్రిక ఆధారములు నేటికినీ దొరుకలేదు. గ్రెగోరియన్ కేలెండరులో జరిగిన మార్పుచే ఆయన పుట్టుక డిసెంబర్ 25 కాదు అన్నది నిర్దారితమగుచున్నది.

ఇక రమణుల వారిని సాయిబాబాను గూర్చి మీరు ప్రస్తాపించినారు. 'అహం బ్రహ్మస్మి' అన్న వేదవాక్కుకు ప్రతినిధి యైనవాడే తానూ దేవుడని చెప్పుకొంటాడు. ఆ విధముగా అటు రమణులు గానీ ఇటు సాయిబాబా గానీ తాము దేవుళ్ళమని చెప్పుకోలేదు. మానవాతీత మహిమలను ప్రత్యక్షముగా చూసిన పామరజనులు తమకు తోచిన రీతిలో వారిని పూజించుచున్నారు. అట్లు చెప్పుకొన్నది 'శ్రీ కృష్ణ పరమాత్మ' మాత్రమె! 

నారాయణ  సమారంభం 
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య  పర్యంతాం 
వందేగురుపరంపరాం 
వీరంతా క్రీస్తుకు ముందువారే ! వీరి ఉపదేశ సారాంశము కూడా 'మోక్షం  కావాలనే కోరిక  బలంగా ఉంటె, భౌతికవిషయసుఖాలను  విషంగా భావించి, వాటికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. సంతోషం, దయ, సహనం, రుజుత్వం, శాంతి,  దాంతి  అనే ఉత్తమ గుణాలను అమృతంగా భావించి , ఆప్యాయంగా స్వీకరించి , ఆచరించడానికి పూనుకోవాలి.'
వేరెవరైనా కూడా ఇంతకన్నా వేరుగా చెప్పరు. తానింత కావలసిన సంపదనుంచుకొని పోరుగింటికి ఎవరూ పోయి యాచించరు. 
ఇక వ్యక్తి పుట్టుకను గూర్చి ఒక్క మాట , నన్ను తప్పుగా తలవ వద్దు, 'నేను పరిశీలించినంతవరకు క్రీస్తు జన్మకు ఆధారములు కనిపించలేదు.' అట్లని 'ఆయన పుట్టనేలేదని' నేను ప్రతిపాదించనూ లేదు . మీరు ఆ విషయముపై ఏదయినా ఆధారము దొరికితే ఆస్య గ్రంధిలో (Face Book) లో ప్రచురించేది. నా తప్పు సవరించుకొంటాను. 

'లోకాఃసమస్తాస్సుఖినోభవంతు'అన్నమాటఅనునిత్యము తలచే ఈ అత్యంత ప్రాచీనమైన వైదిక సాంప్రదాయముఅందరికీ అవలంబనీయము. క్రీస్తు పుట్టుకకు పూర్వమే అధర్వణవేదాంతర్గతమైన 'మహోపనిషత్తు' ఈ విధముగా కనబడుతుంది. అందులో ఇవ్వబడిన ఈ  శ్లోకం చదవండి.  

ఉదారః పేశలాచారః సర్వాచారానువృత్తిమా
నన్తఃసఙ్గ-పరిత్యాగీ బహిః సంభార వా నివ

అయం బన్ధురయం నేతి గణనా లఘుచేతసాం
ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం***

భావాభావ వినిర్ముక్తం జరామరణవర్జితం
ప్రశాన్త కలనారభ్యం నీరాగం పదమాశ్రయ

ఏషా బ్రామ్హీ స్థితిః స్వచ్ఛా నిష్కామా విగతామయా
ఆదాయ విహరన్నేవం సంకటేషు న ముహ్యతి
(మహోపనిషత్తు 6.70-73)

 ఇదే విషయాన్ని  ’హితోపదేశం’, ’విక్రమచరితం’  ’పంచతంత్రం’, ’చాణక్యనీతి’ అన్నగ్రంధాలలో కూడా చెప్పబడినది.  
ఇటువంటి విషయములను ఆకళింపు చేసుకొంటే ఈ దేశము కన్న మహనీయులను గూర్చి, ఈ దేశపు సనాతనత్వమును గూర్చి, సాంప్రదాయమును గూర్చి, అది ఇది ఎలా సర్వస్వమును గూర్చీ తెలుసుకోవచ్చు.
మన దేశములో జరిగిన మతాంతరీకరణలు, స్త్రీలను చెరచి, పురుషులను, శిశువులను చంపి మారణ హోమములు జరిపి మతమార్పిడులు చేసినారు. ప్రపంచము లోని ఏ దేశము కూడా 1000 సంవత్సరములు విదేశీయులతో పరిపాలింపబడి తన ఉనికిని కాపాడుకొన్నది లేదు. ఆ గౌరవము భారత దేశమునకే దక్కినది. ఈ దేశములోని ఏ వ్యక్తి, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే ఉత్తర దక్షినములలోని ఈ భారతావనిలో జన్మించిన వాని DNA ఒకటిగానే ఉంటుంది అన్నది ఇపుడు నిరూపింపబడిన సత్యము. సత్వ సాధన సత్య శోధన చేసి సాధించిన ప్రతివ్యక్తి బ్రాహ్మణుడే! ఇందులో అందరిదీ ఒకే ధర్మమే! 

స్వస్తి.






























Saturday 16 May 2015

కవిసార్వ భౌముడు - శ్రీనాధుడు

కవిసార్వ భౌముడు - శ్రీనాధుడు ( బ్రహ్మశ్రీ వేదమూర్తులు చొప్పకట్ల సత్యనారాయణ గారు )
2

మ:మహిమున్ వాగనుశాసనుండు సృజియింపన్ గుండలీద్రుండు త

న్మహనీయస్థితి మూలమైనిలువ శ్రీనాధుండు బ్రోవన్ మహా

మహులై సోముడు భాస్కరుడు వెలయింపన్ సొంపువాటిల్లు నీ

బహుళాంధ్రోక్తి మయ ప్రపంచమున తత్ప్రా గల్భ్య మూహించెదన్ !

అవతారిక- వసుచరిత్రము; రామరాజ భూషణుడు;
ప్రబంధకవులలో ప్రముఖుడైన రామరాజ భూషణుడు శ్రీనాధుని ఆంధ్రవాఙ్మయ పోషకుడైన విష్ణుమూర్తియని

యభివర్ణించినాడు. నిజమే! కవిత్రయానంతరం తనరచనలతో ఆంధ్రవాఙ్మయాన్ని పరి పుష్ఠి యొనరించి మరింత

వేగముగాముదుకు నడిపించినాడనుట యదార్ధమే!
ఇంతకు శ్రీనాధు డెవడు? ఏప్రాంతమువాడు?వివరములెవ్వి? యను ప్రశ్నలు రాకమానవు.

కావున ముందుగా ఆసమాచారమును సమీక్షింతము. గ్రంధాధారములను బట్టి యతడు పాకనాటి నియోగి

బ్రాహ్మణుడని తెలియు చున్నది. శ్రీనాధకవి తన రచన భీమేశ్వర పురాణమును బెండపూడి అన్నయ మంత్రికి

అంకితమొనరంచెను. గ్రంధావతారికలో కృతిపతి "పాకనాటింటివాడవు బాంధవుడవు" అని కవిని ప్రస్తుతి

చేయుటచేతను, శ్రీనాధుడు తన తాతగారినిపరిచయము చేయుచు -_

చ:కనక క్ష్మాధర ధీరు వారిధితటీ క్రాల్పట్టణాధీశ్వరున్

ఘనునిన్ బద్మపురాణ సంగ్రహకళా చాతుర్యధీ ధుర్యునిన్

వినమత్ కాకతి సార్వభౌము, కవితా విద్యాధరున్ గొల్తు మా

యనుగుందాత! ప్రదాత! శ్రీ కమల నాభామాత్య చూడామణిన్! - అంటూప్రస్తుతి చేయుటచే

నిమ్మహాకవి పాకనాటినియోగియనుట నిశ్చయము. తాతకమలనాభుడు కనుక మనుమని పేరు

శ్రీనాధుడైనది. నాటిసాంప్రదాయమదియేకదా! మారన- లక్ష్మమలు తలిదండ్రులని వినికిడి.(పరిశీలింపవలసియున్నది)

ఇతనికి భాగవత కర్తయగు బమ్మెర పోతనతో బావ- బావమరదుల సంబంధము;

ఆహా! ఎంతవిచిత్రము? ఎక్కడిపాకనాడు? ఎక్కడి నిజాముప్రాంతము? ఇట్టి దూర సంబంధములు నాడు

అరుదు. అస్తు! దానితో మనకిప్పుడు పనిలేదు. ముందుముందు అవసరపడినపుడు చూచికొందము.

శ్రీనాధుడు పుట్టుకవి. చిన్నటనే కావ్యములల్లిన మేధావి యని కాశీఖండము లోని యీ

పద్యము సాక్ష్య మొసగు చున్నది.

సీ: చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు

రచియించితిని మరత్తరాట్చరిత్ర;

నూనూగు మీసాల నూత్న యవ్వనమున

శాలివాహన సప్తశతి నొడివితి;

సంతరించతి నిండు యవ్వనంబున యందు

హర్ష నైషధ గ్రంధ మాంధ్ర భాష;

ప్రౌఢ నిర్భరవయః పరిపాకమున

గొనియాడితిని భీమనాయకునిమహిమ;

గీ: ప్రాయమింతకుమిగులగ్రైవాలకుండ ,కాశికాఖండమను మహాగ్రంధమేను

దెనుగు జేసెద; కర్ణాట దేశకటక , పద్మ వన హేళి శ్రీనాధభట్ట సుకవి;
(తక్కినది రేపు చూడగలరు )

కవి సార్వ భౌముడు శ్రీనాధుడు-ధారావాహికం (చొప్పకట్ల సత్యనారాయణ గారు )
3వభాగం
గీ: ప్రౌఢి బరికింప సంస్కృత భాష యండ్రు;

పలుకు నుడికారమున కాంధ్ర భాష యండ్రు;

ఎవ్వరేమైన నండ్రు గాకేమి గొరత?

నాకవిత్వంబు నిజము కర్ణాట భాష!

కాశీఖండము-అవతారిక :

నిన్న మనం చివరలో సీసం చెప్పుకున్నాం. అందులోచివర "కర్ణాటదేశకటక పద్మవన హేళి శ్రీనాధ భట్ట సుకవి"

పద్యంచివరలో ఉంది. ఈరెండుప్రయోగాలేకాక, విజయనగరానికి వెళ్ళిన సందర్భంలో శ్రీనాధుడు" తల్లీ! కన్నడ రాజ్య

లక్ష్మి! దయలేదా? నేనుశ్రీనాధుడన్!- అనే మూడు ప్రయోగాలు చేశాడు. వాటినిచూసి కొందరు శ్రీనాధుడు కన్నడు డే

నని యభిప్రాయపడినారు .కానీ యదార్ధంపరిశీలిస్తే ఇతడు పాకనాటి నియోగి బాహ్మణుడే!

పూర్వం ప్రతి దేశంలోనూ పండిత పరిషత్తులుండేవి. వాటికి వినయంగా నమస్కరిచటం. కవులకుమర్యాద. "సత్సభాంతర సరసీ

వనంబుల ముదం బొనరం గొనియాడి వేడుకన్" అని నన్నయ కూడా భారతావతారికలో వ్రాయటం గమనార్హం;

ఆసాంప్రదాయమునే శ్రీనాధుడనుసరించి నాడు. ఇక కన్నడరాజ్య లక్ష్మిని తల్లీయని సంబోధించుట ఆతిధ్య దేశాన్ని గౌరవించటం 

తప్ప మరొకటికాదు. అసలు కర్ణాటక శబ్దానికి (శ్రీనాధప్రయోగం) అర్ధంవేరు. దాన్ని దేశ పరంగా గాక, కవిత్వ పరంగా ఆలోచించాలి. " 
కర్ణే అటతీతి కర్ణాటః-(చెవులలోమారుమ్రోగేభాష కర్ణాటకము) అనిఅర్ధం చెప్పుకుంటే"కర్ణాటక సంగీతంలాగ" చెవులకు 

వినసొంపయినది.

అనే అర్ధం వస్తుంది. అదే శ్రీనాధుని కర్ణాట పద ప్రయోగంలోనిభావం; ఈవిధంగా సమన్వయపరచి అతడు కన్నడ దేశానికి

చెదినవాడు కాదు మనవాడేనని నిర్ధారించారు; హమ్మయ్య! బ్రతికి పోయాం! కవిసార్వ భౌముడు మనవాడే!
ఇఁతటితో నీప్రసక్తినాపి అతని గ్రంధాలను ముందుగా పరిచయం చేసికొని ముందుకు సాగుదాం; అసలురుచిఅతని చాటుపద్యాల

దగ్గరవుంది.దానికి మరికొంత వేచియుండక తప్పదు.నేటికింతటితో స్వస్తి!

కవిసార్వభౌముడు శ్రీనాధుడు
(ధారావాహిక- 4వ భాగము)

మ: హరచూడా హరిణాంక వక్రతయు ,కాలాంతః స్ఫురచ్చండికా

పరుషోద్గాఢ పయోధధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్,

సరసత్వంబును,, సంభవించె ననగా,సతత్కావ్యముల్ దిక్కులన్

చిరకాలంబు నటించుచుండు, కవిరాజీ గేహరంగంబులన్!

శ్రీనాధ కవి:
భావం:- శివుని తలపై ఉండే చంద్రవంకలాగ వక్రత, మరోవంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన

చండికాపయోధరాల కాఠిన్యం, సరసత్వము, కలిసి ఉంటేనే అది చిరకాలం నిలచియుండే కవిత్వం

అవుతుందని శ్రీనాధకవి అభిప్రాయం ;

ఈపద్యం ప్రసక్తి ఎందుకంటే, హరచూడా హరిణాంకవక్రత- అంటేవంకరగాచెప్పటం శ్రీనాధుని

కవితా గుణం .అదే వక్రోక్తి అనేఅలంకారం అదిగో అదే కర్ణాటక శబ్ద ప్రయోగం దగ్గర వచ్చింది. పండితులు తలలు పట్టుకునేలాగ

చేసింది. దీనికి మరో సాక్ష్యం చూపించి ముందుకు కదులుతాను.
శా:- అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా

భిక్షాదానము సేయరా! సుకవిరాడ్బృందారక శ్రేణికిన్;

దక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ,

వక్షోజద్వయ కుంభి కుంభ ములపై వాసించు తద్వాసనల్;

భావం:- ఓ సాంపరాయా! తెలుంగు దేశాధీశా! దేవతలుగా సంభావింప బడే మావంటి కవీశ్వరులకు కస్తూరిని దానం చేసికో!

దానిసువాసనలు దక్షారామ సమీపంలోని చళుక్య భీమవరము నందు నివసించే గంధర్వ- అప్సరో

భామలను బోలిన భోగపు కాంతల వక్షోజములపై పరిమళింపగలవు;

నాకు కస్తూరి కావాలయ్యా! దానంచెయ్యమని అడగవచ్చుగదా? అలాఅడగడు. మీకుదానమిస్తే మాకువచ్చే ప్రయోజనం

ఏమిటనుకున్నావ్? దానిసువాసనలు ఆభోగపు కాంతల వక్షోవీధులందు ఘుమాయిస్తుంది.

దాంతో వారివద్దకువచ్చే విటసముదాయంలో నాకు, నీకు, నీకస్తూరీ ద్రవ్యానికీ ఉచితంగా అనంతమైన ఖ్యాతి లభించదూ? అని

శ్రీనాధులవారి వ్యాఖ్యానం . చూశారా మాటలో ,కవితలో ఎంవంకరో! చాలానర్మగర్భం గా వ్యవహారాలునడుపగలడు. అంత

చమత్కారి. అదే " హరచూడా హరిణాంక వక్రత!"

సాంపరాయడెవరో ముందు ముందు తెలుసుకుందాం; రేపుశ్రీనాధుని గ్రంధ ములను పరిచయము గావించుకొని ముందుకు

సాగుదాం. నేటికి స్వస్తి!

కవి సార్వభౌముడు- శ్రీ నాధుడు
ధారావాహిక 5వ భాగము

శా: జోటీ ! భారతి! యార్భటి న్మెరయుమీ ! చోద్యంబుగా నేడు గ

ర్ణాటాధీశ్వరుఁ బ్రౌఢదేవనృపతిన్ , నాసీర ధాటీచమూ

కోటీ ఘోటక ధట్టికా ఖుర పుటీ కుట్టాక సంఘట్టన

స్ఫోటీ ధూత ధరా రజ శ్చుళుకి తాంభోధిన్ బ్రశంసించెదన్;

శ్రీనాధుని చాటువు ప్రౌఢ దేవరాయల ప్రశంస!

మిత్రులారా! హరచూడా హరిణాంక వక్రత - పద్యంలోని వక్రతను నిన్న చెప్పు కున్నాం. రెండవ కవితాగుణం ఆరభటీ వర్ణనాగుణం

ఈపద్యంలో కనిపిస్తుంది . అమ్మా! సరస్వతీ ఆరభటిలో నామదిలో మెరసి పో

ఇప్పటి సందర్భానికి అదినాకు సహాయపడగలదు. సరిహద్దులను దాటి శతృ సైన్యాలమీద ప్రౌఢదేవరాయల అసంఖ్యాక

సైనికపరివారం గుర్రాలపై పరుగిడుతుంటే ఆయశ్వముల డెక్కల తాకిడికి యెగసిన భూధూళి సముద్ర పర్యంతం పరివ్యాప్తమై

ఆసముద్రమంతా బురదగా చేస్తోంది: అంటాడు. హేతూత్పేక్ష- అతిశయోక్తులతో వర్ణనను ఆరభటిలో

నిర్వహించి తనకవితాగుణాలలో రెండవ దానిని మనకు పరిచయం చేశాడు ఇంకమూడవగుణం సరసత్వం. దాన్ని

రేపుచెప్పుకుందాం; ప్రస్తుతం మనం అతని రచనలను పరిచయం చేసికుందాము;

శ్రీ నాధుని రచనలు

చిన్నారి పొన్నారి నాడే రచనల నారంభించిన శ్రీనాధుడు జీవనసంధ్యాకాలం వరకు రచనలు చేస్తూనే ఉన్నాడు.మొత్తము మీద

ఇతని రచనలుగా పేరొందినవి 13గ్రంధములు.

1 మరుత్తరాట్చరిత్రము : (అలభ్యము)

2 శాలివాహనసప్త శతి (అలభ్యము)

3 శృంగారనైషధము:

4 భీమేశ్వర పురాణము:

5 ధనుంజయ విజయము (అలభ్యము)

6 కాశీఖండము:

7 హరవిలాసము.

8 శివరాత్రి మాహాత్మ్యము.

9 పండితారాధ్య చరిత్రము.

10 నంద నందన చరిత్రము (అలభ్యము)

11 మానసోల్లాసము. (అలభ్యము)

12 పలనాటి వీర చరిత్రము .

13 క్రీడాభిరామము

ఇందు పండితారాధ్య చరిత్రము, పలనాటివీరచరిత్రము లు ద్విపద కావ్యములు తక్కినవి, చంపూ కావ్యములు

(పద్యములు గద్యములు కలసినకావ్యములు చంపూ కావ్యముల నబడును)ఈమిగిలిన వానిలోగూడ కేవలము నాలుగు

కావ్యములు మాత్రమే బహుళప్రచారములో నున్నవి శృంగారనైషధము, భీమేశ్వర పురాణము, కాశీఖండము,

హరవిలాసములు మాత్రము బహు పండితాదరణమునకు నోచుకొని విస్తృత ప్రచారములో నున్నవి.

వీనిలో నేదిముందు యేదివెనుక , ఆకావ్య ప్రశస్తి యెట్టిది ? అనువిషయములను పరిశీలించుటకు

ముందు శ్రీ నాధుని జీవన ప్రస్థానమును , రాజకీయ నేపధ్యమును, పరిశీలించవలసి యున్నది . కావున మిత్రులారా!రేపటినుండి

యాతనిజీవన విశేష ములతో బాటు అతని చాటుపద్యముల పసందైన విందును గూడ మీకందించుచు ముందుకు సాగుతాను.

నేటికి స్వస్తి!

కవిసార్వభౌముడు శ్రీనాధుడు - ధారావాహిక 6వ భాగం

చం: అరుణ గభస్తి బింబ ముదయాద్రి పయిం బొడతేర గిన్నెలో
పెరుగును, వంటకంబు, వడ పిందియలున్ గుడువంగ బెట్టు ని
ర్భర కరుణాధురీణయగు; ప్రాణము ,ప్రాణము; తల్లియన్నదే!
హరహర! యెవ్వరింక కడుపారసిబెట్టెద రీప్సితాన్నమున్;

శివరాత్రి మాహాత్మ్యము- సుకుమారుని కధ లోనిది;

భావం: సూర్యుడు పొడుపు కొండమీద కనిపించగానే వెడిగిన్నెలో పెరుగు అన్నం కలిపి ఆవపిందెలు నంజుడు గానిచ్చి
కడుపారాభోజనం పెట్టేది మాయమ్మ; తల్లంటే యెవరు? బిడ్డ ప్రాణానికి ప్రాణం !అటువంటి తల్లిని మించిన
వారెవరు? ఈలోకంలో. హరహరా! ఇంక నాకు కడుపు నిండా తిండెవరు పెడతారు? అని వాపోతున్నాడు
సుకుమారుడు. ఇతడు తెనాలివారి నిగమ శర్మకు అన్నవంటివాడు. తండ్రి వేదవేదాంగ వేది. తల్లి గారాబం
వలన దుష్ట సావాసంచేసి చెడిపోయినాడు.చివరకు దొంగగామారి అడవులలో బడినాడు. ఆకలి యతనిని
నిలువనీయుటలేదు. అప్పుడు వానికి తల్లి గుర్తువచ్చింది . అదీ ఈపద్యం! ఇందులో మాతృవాత్సల్యం ,
బిడ్డపై తల్లికుండే మమకారం వగైరాలు శ్రీనాధుడు చాలాచక్కగా కరుణ రసార్ద్రంగా వర్ణించాడు. ఇదీ
అతని సర,సత్వ (రసోచిత రచనము) రచన. ఇంకో సరసాలతో కూడిన రచనకూడా ఉంది అది
ముందు ముందు మనకు అతని చాటువులలో ప్రస్ఫుటం అవుతుంది. ఇంతటి తో శ్రీనాధుని లోని
వక్రత, కాఠిన్యత, సరసత్వ, రచన లనే మూడింటినీ పరిశీలించటం అయింది. ఇంకయతని జీవనప్రస్థానం
గురించి సంక్షేపంగా పరిశీలన చేయడానికి ఉపక్రమిద్దాం;

శ్రీనాధుని జీవన ప్రస్థానము
ప్రతి మానవుని జీవితము సరళ రేఖకాదు. కాబోదు. ఏవోనిమ్నోన్నతములు ఉండక తప్పదు.శ్రీనాధునకు గూడయిందు 
మినహాయంపులేదు. జీవనారంభమున మహాభోగి యైనను చరమకాలమునకు
కష్టజీవిగా కడతేరక తప్పలేదు. తొలుతభోగి చివరకు విరాగి. ఇదీ యాతని జీవన గమనము. ఇది అనాదిగా కానవచ్చు
మానవ జీవన పరిణామము; అసలు విషయానికి వద్దాం'

పాకనాటి నియోగి బ్రాహ్మణుడైన శ్రీనాధుడు, సకలవిద్యాపారంగతుడై చక్కని రాజాశ్రయమునకై
ప్రయత్నములు మొదలిడినాడు నాడు రెడ్జిరాజ్యము అరివీరులకు దుర్నిరీక్ష్యమై, సుసంపన్నమైయుండెను .తొలుతవీరిరాజధాని 
అద్దంకి ప్రోలయవేమారెడ్డి పాలకుడు. అనంతరము తమ్ముడు అనవేమారెడ్డి పాలకుడయ్యెను.
అతని కాలములోనే రాజధాని కొండవీటికి మార్చబడినది . అనవేమునితర్వాత కుమారుడు కొమరగిరి 
రెడ్డిపాలనమారంభమయ్యెను. దుర్బలుడు వ్యసనశీలుడును అగుటచే త్వరలోనే రాజపదవిని గోల్పోయెను. పెదకోమటివేమారెడ్డి 
పాలకుడయ్యెను. కోమటిపెదవేముడు రాజగుటకు చక్రము ద్రిప్పినది కాటయవేమారెడ్డి.ఇతడుకోమటివేముని బావమరది. 
మహాపరాక్రమశాలి .పెదకోమటి వేముని మరదలు అనితల్లిని
అల్లాడ వీరభద్రారెడ్డి పరిణయమాడెను. ఇతడు కాటయవేముని తమ్ముడు. రాజమహేద్రవర పాలకుడు. ఈరెండురెడ్డిరాజ్యాలకు 
కాటయవేముడే పరోక్షంగా ప్రభువు. అతని మంత్రి మామిడి సింగనామాత్యుడు; అదిగో
ఆమంత్రి గారి సహకారము శ్రీనాధునకు లభించింది. సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతుడు, ప్రాకృత,, 
సౌరసేనీ,ఇత్యాదిభాషలతోపరిచయంకలవాడు, తర్క,వ్యాకరణ,అలంకార,జ్యోతిష, శకున,న్యాయశాస్త్ర ప్రవీణుడు., స్ఫురద్రూపి, 
చతురసంభాషణాశీలియు, ఆశుకవియు నైన శ్రీనాధుని కొండవీటి విద్యాధికార పదవి వరించినది. తదాదిగానతని జీవితము 
మూజుపూవులు ఆరుకాయలుగావిస్తరించినది .ఇతనివెనుక నిత రాజకీయ నేపధ్యముగలదు. అందుచేతనే ఇంత విస్తరించి 
చెప్పవలసి వచ్చినది.

రెడ్డిరాజులకాలముననుసరించి ఇతని కాలనిర్ణయము జరిగినదిక్రీ:శ:1365_1470లనడుమనీతడు జీవించి యుంజనోపునని 
చరిత్రకారుల యూహ! ఇంతకుమించి చెప్పునవకాశము మనకు లేదు. నాటి కవులకు చారిత్రిక స్పృహ లేకపోవుటచే తగిన 
యాధారములు లేక పోవుట వలన
నాటి కృతిపతులను వారికాలములను సమకాలీన శాసనాధారములను ఊతగొని చరిత్రకారులు సుమారుగా కాలమును 
నిర్ణయించినారు.

నేటికింతటితో స్వస్తి. రేపుతక్కిన విషయాలు .శుభంభూయాత్!

కవిసార్వభౌముడు శ్రీనాధుడు !
(ధారావాహిక-7డవ భాగము)
సీ: పర రాజ్య పర దుర్గ పర వైభవ శ్రీల
గొన గొని విడనాడు కొండవీడు;

పరిపంధి రాజన్య బలముల బంధించు
కొమరు మించిన జోడు కొండవీడు;

ముగురు రాజులకును మోహంబు పుట్టించు
గురుతైన యురిత్రాడు కొండవీడు;

చటుల విక్రమ కళా సాహసంబొనరించు
కుటిలాత్ములకు గాడు కొండవీడు;

తే: జవన ఘోటక సామంత సరస వీర

భట సటా నేక హాటక ప్రకట గంధ

సింధు రారవ యోహన శ్రీల దనరు

కూర్మి నమరావతికి జోడు కొండ వీడు!

భావం: శతృరాజ్యవైభవమును, శతృదుర్గములను, గెలిచి తనలో నిలుపు కునేది కొండవీడు: శతృసైన్యాలనుబంధించే 
చెరసాలవంటిది కొండవీడు;బహమనీ, గోల్కండ,విజయనగర, రాజులకు మోహాన్ని కలిగించేదికొండవీడు; భయంకరమైన 
యుధ్ధంచేసే సాహసులకు, కులబుధ్ధిగలవారికి స్మశానం తోసమానం ఈ కొండవీడు.పారసీక అశ్వములకు,సామంతరాజుల 
సముదాయానికి,వీరభటసందోహానికి, మదగజముల ఘీంకార ధ్వనులకు నిలయమై యుధ్ధవిద్యావైభవములతో అలరారు మహా 
పట్టణం కొండవీడు; ఇది దేవేంద్ర రాజ ధానికి దీటైనదనికవి శ్రీనాధుని వర్ణనము . ఇదీ రెడ్డి రాజుల రాజధాని కొండవీటి వైభవము!

విద్యాధికారిగా- శ్రీనాధుడు

కొండవీట విద్యాధికారిగా శ్రీనాధుడు కొడవీటిలో అసంఖ్యాక కార్యములను నిర్వహించేవాడు 1రాజశాసనరచనము. 
రాజులనిత్యవ్యవహారములోని అనేక విషయములను గురించిన రాజాఙ్యాపత్రములరచనముచేయుట. శాసనాంతములందు" 
విద్యాధికారీ శ్రీనాధో వీరశ్రీ వేమ భూపతేః" అనియతనిముద్ర అన్ని శాసనము లందు వ్రాయ బడు చుండెడిది. 2రాజకీయమైన 
సలహాలు 3 కవితావినోదము4 పర రజులకడకు రాయబారములు చేయుట.5ప్రఖ్యాతివహించిన పండితులను పరీక్షించి వారికి 
ప్రభు సత్కారములను జరిపించుట; మొన్నగు ననేక కార్యక్రమములను నిర్వ హించేవాడు. రెడ్డిరాజులు సంస్కృతాంధ్రములలో 
మంచిృపండితులు, కవులు; వారిలో కొందరు కాళిదాసాదుల కావ్యములకు గూడ వ్యాఖ్యాన గ్రంధములను రచించిరట!అటుయుధ్ధ 
రంగమునందును, ఇటుసాహిత్య రంగమందును వారు సవ్య సాచులై యలరారినారు;వారిగ్రంధముల పరిష్కరణము 
గూడవిద్యాధికారి బాధ్యతలోనొకటి.
ఇన్నిగురుతరమైన బాధ్యతల మధ్యనున్నను శ్రీనాధుడు తన కవితా వ్యాసంగమును నిరాటంకముగా నిర్వహింపసాగినాడు. పెద 
కోమటి వేమారెడ్డికి మామిడి సింగనా మాత్యుడు మహామంత్రి! ఆతని సహకారమే శ్రీనాధుని అందలమెక్కించినది. త త్కృతజ్ఙతా 
బధ్ధుడయినకవి సంస్కృతమున శ్రీహర్షుడు రచించిన "విద్వ దౌషధముగా ప్రఖ్యాతి గాంచిన నైషధ గ్రంధమును అతని కంకితముగా 
నాంధ్రీకరించుటకు పూనుకొనినాడు. దుర్ఘటమైన కావ్యానువాదమును నిపుణముగా నిర్వహించు చున్నాడు . 
సునాయాసముగాఅనువాదము పూర్తియైనది! సమనోహరమైన యామహాకావ్యమును సప్రస్రయముగా మామిడి సింగనకు 
అంకితమిచ్చి కృతకృత్యు డైనాడు. దీనితో ప్రభువునకు, అమాత్యునకు మిగుల చేరువయైనాడు. రాజపరివారములతో గూడ 
పరిచయము లేర్పడినవి, అవి ఇంకంతలై శ్రీనాధుని రాజమహేంద్రము వైపు నడిపించినవి;

నేటి కింతటితో నాపుజేతము. చారిత్రికాంశము లంతగా చవులు బుట్టింపవు.రసవదఘట్టముముందున్నది : రేపు తరువాయి 
భాగము.

కవిసార్వ భౌముడు- శ్రీనాధుడు
ధారావాహిక 8వ- భాగము శ్రీనాధుని రాజకీయ నేపధ్యము
నాటిరెడ్డి రాజ్యమునకు వెన్నెముక కాటయ వేముడు. మహాపరాక్రమ వంతుడు. అరివీర భయంకరుడు. సర్వ సేనా ధ్యక్షుడయిన 
అతని నేతృత్వములో రెడ్డిరాజ్యము శతృరాజుల దండయాత్రలకు సుదూరమై సుభిక్షమై యుండెడిది.

సీ: దండ యాత్రా ఘోష తమ్మట ధ్వనులచే
గంతులు వేయించె ఁగప్పకొండ;
కితవ కాలాభీల కీలానలము చేత
నేలపొంగడగించె బాలకొండ;
అరజాధట్ట హయ ధట్టములచేత
మట్టి దూర్పెత్తించె బొట్టునూరు;
భూరి ప్రతాపాగ్ని ఁబుటములు బెట్టించె
విదవేషులను గళా(కాళ)వెండిపురము;

తే:గీ: అనగ నుతికెక్కి తౌర! కేళాదిరాయ!
అరుల పండువ మండువా యవన హరణ!
బళియ ధూళియ మాళువ బందికార!
విజయ రఘురామ! అల్లాడ విభుని వేమ!

ఈపద్యమును బట్టి యతడెంతటి వీరాగ్రేసరుడో అవగతము కాగలదు. ఆవీరుని నీడలోనే కొండవీడు, రాజమహేంద్రవర, రాజ్యములు 
రెండును విస్తరించినవి. పేరునకు ప్రభువు లున్నను పెత్త్తన మంతయు కాటయవేమునిదే!

కాటయవేముడు తనచాతుర్యముతో తమ్ముడు అల్లాడ వీరభద్రారెడ్డికి అనితల్లితో వివాహమును జరిపించెను. ఆమె కోమటి 
పెదవేముని భార్యకు చెల్లెలు. అరణముగా రాజమహేంద్రవరమునకు తమ్మని రాజుగానొనరింప జేసెను. అధిరారమంతయు హస్త 
గతమై కాటయ యధేఛ్ఛగా నుండెను. పెదకోమచి వేముడు గాని, వీరభద్రారెడ్డి గాని పేరుకు ప్రభువులు. వారు అధికారమును 
చెలాయించిన దాఖలాలు పూజ్యము.

శ్రీనాధుడా బహు చతురుడు నుతులతో కాటయ నాకట్టు కొనెను.ఈపద్యమును పరిశీలింపుడు. దుర్గమమైన శ్లేషలతో గూడి 
పండితప్రవరులకుగూడ నర్ధము చెప్పుటకు అసాధ్యమై కాటయ వేముని పరాక్రమము వలెదుస్సాధ్యమై యెట్లున్నదో?

ఉ: వీర రసాతిరేక! రణవిశ్రుత! వేమనరేంద్ర! నీయశం
బారభమాన తారకర హార సమానము నీ భుజామహం
బారభమాన తారకరహార సమానము నీ పరాక్రమం
బారభమాన తారకరహార సమానము చిత్రమారయన్;

రాజమహేంద్రి నేలు వేముని పొగడ్త యిది.ఇందులో "ఆరభమాన తారకరహార సమానము"-అనేపద్య భాగము,మూడుపాదములలో 
నున్నది. వీనికి విశేష్యములుగా యశము, భుజామహము,పరాక్రమము, లు చెప్పబడినవి. పండితులెందరో కష్టపడి 
ఏకాక్షరనిఘంటువుల సాయము వలన అర్ధమును రాబట్టినారు. ముందుగా దీనినిఏపాదానికాపాదమే వేరువేరుగా పదఛ్ఛేదము 
చేసికోవాలి. అప్పుడు అర్ధం అవగతమూతుంది.
2పా:కీర్తిని సూచించునపుడు: అర-పాదరసం; భ- నక్షత్రం; మానతారకర- సాటిలేని వెండివడగళ్ళు; హార-ముత్యాలహారము వలె 
ప్రకాశించు చున్నదని యర్ధము.
3పా: భుజబలాన్ని ప్రశంసచేయునపుడు, అర-అంగారకుడు; భ-అగ్ని; మాన-పగడం; తారకర- మేరుపర్వతం; హార-బంగారము; 
వీటితో పోల్చదగినది యని యర్ధమ
4పా; ఆరభమా ఆనత అర కర హా రస మానము అనిుదవి భాగము గావంచినచో ,ఎంగొప్పవారైనా నీముదు వంగి కానుకలు 
అందించవలసినదే! నీశతృవులందరూ నీముందు హాహాకారములను చేయుచు కరుణరస ప్రయోగముఖులై నిలచి 
యుండవలసినదే! అను నర్ధము పొసగును.

ఇట్టివింత పద్యములతో వేముని మెప్పించుచు పండిత నికషోపలమై వర్తించు శ్రీనాధుని కాటయవేముడు అందలముల 
నెక్కించినాడు. అతనితోబాటుగా శ్రీనాధుని మకాము రాజమహేంద్ర వరమునకు మారెను. నేటికింతవరకు చాలును. రాజమహేంద్రి 
విశేషములను రేపు విందముగాక! సెలవు. శుభంభూయాత్!

(రేపు తరువాయి భాగము )

కవిసార్వ భౌముడు- శ్రీనాధుడు ; ధారావాహిక
( 9 వ.భాగం- రాజమహేంద్రిలో శ్రీనాధుడు)

శా: ధాటీ ఘోటక రత్న ఘట్టన మిళద్రా ఘిష్ట కళ్యాణ ఘం
టా టంకార విలుంఠ లుంఠిత మహోన్మత్తాహిత క్షోణి భృ
త్కోటీ రాంకిత కుంభినీధర సము త్కూ టాటవీ ఝూట క
ర్ణాటాంధ్రాధిప! సాంపరాయని తెలుంగా!నీకు బ్ర హ్మాయువౌ!

భావము; రత్నములవంటి శ్రేష్ఠ మగునీయధ్ధాశ్వముల డెక్కల సవ్వడి తోడై వానిమెడలో మ్రోగు విజయ లక్ష్మీ ప్రదమైన గంటలకు 
తోడయి మ్రోగు విటినారి మ్రోతల తోడనే తెగిపడుతున్న మదించిన శతృరాజుల శిరస్సుల యందలికిరీటములతో
నలంకరింప బడుచున్న భూమికిప్రభువా!కర్ణాటకరాజకూటమిని చెదర గొట్టినవాడా! సాంపరాయా! నీకు బ్రహ్మాయు వగుగాక! 
అనిభావము. సాంపరాయని అశ్వముల డెక్కల చప్పుళ్ళకు మెడలోని గంటానాదములకు వింటినారి మ్రోతలను 
విన్నంతమాత్రముననే శతృవులు నేలకు ఒరుగు చున్నారట! విజయనగరరాజులు, బహమనీలు కూటమిగా నేర్పడి రెడ్డిరాజులపై 
దండయాత్రలకు దలపడ వివిధోపాయములచే వారికూటమిని భంగమొనరించు యుధ్ధతంత్ర ప్రవీణుడట! సాంపరాయలవారు. 
వారినిగూడ నుతులచే లోబరచు కొన్నాడు. కస్తూరికాది సుగంధ ద్రవ్యముల నతని వలనపొంది వెలకాంతల కొసంగి తన శృంగార 
తపనను దీర్చుకొనెడివాడు

అల్లాడ వీరభద్రారెడ్ఢికి ప్రధానామాత్యుడు బెండపూడి అన్నయ మంత్రి. అతడును పాకనాటి నియోగిబ్రాహ్మణుడే! చతురుడైన 
శ్రీనాధుడు పాతచుట్టరికములను వెదకిజెప్పి యతనిని లోబరచు కొనినాడు .ఈరీతిగా అధికార కేంద్రములనదగిన కాటయవేముని, 
ప్రభువైన వీరభద్రారెడ్డిని, మహామంత్రి అన్నయామాత్యుని ,రాజకీయముగా వారితో సత్సంబంధములుగల సాంపరాయని 
యాకట్టుకొని తన ప్రాభవమునకు బహు చక్కని మార్గములను నిర్మించు కొనినాడు.

చుట్టుప్రక్కల నున్న పెద్దాపురము, చాళుక్య భీమవరము, దక్షారామము, తాపేశ్వరము, వంటి భోగపుకాంతలకు ప్రసిధ్ధినొందిన 
ప్రాంతములలో నిరాటంకముగా తనయైహిక తృష్ణను దీర్చు కొనుచుండెను. కవితావ్యాపారమును గూడానిరాటికముగా 
నడపించుచుండెను. రాజకీయకార్యములను చక్కగా చక్కదిద్దుచుండెను.
శాసనరచనమొనరించు చుండెను . మహారాణి అనితల్లి " కలువ చేరు" బహుశః అది కలువ చెఱువు గానోపును. అక్కడనామెచే 
వెలయింప బడిన దాన శాసనమునకు లేఖకుడు శ్రీనాధుడే!

ఇంత తోతనివి నొందక మంత్రి అన్నయామాత్యునకు అంకితముగా భీమేశ్వర పురాణమను నామాంతరముగల భీమఖండము 
నాంధ్రీకరించుటకు బూనుకొనెను. 6ఆశ్వాసముల పరిమితిగల ఈచంపూ గ్రంధమున దక్షారామ మున వెలసిన భీమేశ్వర స్వామి 
దివ్య చరిత్రమును పొందుపరచెను. ఇందు వ్యాస ముని సశిష్యముగ కాశిని విడచివచ్చుట, పరమేశ్వరి శాప వృత్తాంతము, అగస్త్య 
లోపాముద్రలు గూడ దక్షారామమున నివాస ముడుటకు వచ్చిన తీరు, వానికారణములు, చక్కనిశైలితో నావిష్కరింప బడినవి. 
ఇంతేగాక పరిసర ప్రాంతములందు గల దివ్యతీర్ధరాజముల వర్ణనయు నీగ్రంధమున మనోహరముగా వివరింప బడినవి. 
శ్రీనాధరచనల లోనిదియొక ప్రౌఢ ప్రబంధమనుట యదార్ధము. నిర్వరామముగా గ్రంధరచనసాగినది. గ్రంధము పూర్తి యైనది.

సకల పండిత సమక్షమున నిండు సభలో రాజసమక్షమున నాడంబరముగా నాగ్రంధమును శ్రీనాధుడు బెండపూడి 
అన్నయామాత్యునకు అంకితమొసంగి కృత కృత్యుడైనాడు. రాణ్మహేంద్రవరమున నాడు కవికి మహాసన్మానము జరిగినది. 
శ్రీనాధుని కీర్తి చంద్రికలు ఆకాశనమున కెగ బ్రాకినవి.

శివపూజా ధురంధరుడగు శ్రీనాధుడు రాజమంద్రమునకు సమీపమునగల గోదావరి నదిలోని కొండపై వెలసి యున్న వీరభద్ర 
స్వామిని దర్శించినాడు. అచటి శైవ మఠమున నివసించు "ఘోడెరాయ" బిరుదాంకితుడైన శైవ గురువుును దర్శించెను. అతడు 
రాజగురువు. ఆమహనీయుని నామధేయముగూడ వీరభద్ర స్వామియే! శ్రీనాధుడాతనినుండి పాంచరాత్రాగమ సహితముగా 
వీరశైవమును పొందినాడు. శైవము1పాశుపతము2 కాలాముఖము3 వీరభద్రము అని మూడువిధములు. అందువీరభద్రము 
సామాన్యులకు అందుబాటులో నుండును.
విభూతి రుద్రాక్ష ధారణము లింగ ధారణము ప్రభాత సంగవ మధ్యాహ్న సాయంత్ర అర్ధరాత్రి పూజలనుపేర 5వేళలలో
నీశ్వరపూజలు-ఇదీ శైవ పాంచ రాత్రాగమ పూజావిధానము. రాజు,మంత్రి, ప్రజలు, అందరూ శైవులే !నాటి రెడ్జి రాజుల పాలనలో 
సర్వం శివమయం జగత్!

చారిత్రి కాంశములు విస్తారముగా విని యలసట నొందినారేమో ?నేటికింత తోనాపుదము. రేపు తరువాతి యంశమును 

ముచ్చటించు కొందము గాక! సెలవు.

(ధారావాహిక-రేపు తరువాయి భాగము )


 10 వ: భాగము )
శా: ఈక్షోణిన్ నిను బోలు సత్కవులు లేరీ నేటి కాలంబు నన్
దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ,
వక్షోజ ద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్య భావంబు న
ధ్యక్షించున్ గవిసార్వ భౌమ! భవదీయ ప్రౌఢ సాహిత్యముల్;
కాశీఖండము- కృతిపతి ప్రశంస
భావం: ఓ కవిసార్వభౌమా! ఈలోకంలో నేడు నీవంటి సత్కవులు లేరు. దాక్షారామ చళుక్య భీమవరము లోని గంధర్వాప్సరో కాంతల వక్షోజములయందు పూయబడు కస్తూరీ చందన చర్చల యందలి సుగంధ వైభవములను నీకవిత నధ్యక్షించను; అనగా చక్కని కీర్తి పరిమళములతోను భావ పరీమళములతోను యొప్పారుచుండునని యభిప్రాయము. ఇంతకు దీనీని బట్టి శ్రీనాధుని కవిత్వము పౌఢ కవిత్వము. ఆప్రౌఢత సిధ్ధించుటు కారణమిది;
సీ: వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండలీలల నొక్కమాటు;
భాషింతు నన్నయ భట్టు మార్గంబున
నుభయ వాక్పౌఢి నొక్కొక్క మాటు;
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము
రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు;
పరిఢ వింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు;
తే: నైషధాది మహా ప్రబంధములు పెక్కు
చెప్పి నాడవు మాకు నాశ్రితుడ వనఘ!
యిపుడు జెప్ప దొడంగిన యీప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర.
కాశీఖండము-అవతారిక
శ్రీనాధుని ప్రౌఢ కవిత్వమునకు మూలము కవిత్రయాను సరణము. గంభీరముగా నడుగునపుడు వేములవాడ భీమనను, సంస్కృ తాంధ్ర భాషాప్రయోగములందు నన్నయను, రస పోషణకు తిక్కన ను, సూక్తి వైచిత్రికి యెర్రనను, అనుకరించినాడు. కాదుకాదు వారి కవితా పధ్ధతులను అనుసరించినాడు. పరోక్షముగా కవిత్రయాను కరణమే నన్నితటి వాని నొనరించినట్లు శ్రీనాధుడే ధృవీకరించెను. ఇట్లు ఒక విలక్షణ మైన ప్రౌఢ కవితా శైలికి శ్రీనాధుడే శ్రీకారము జుట్టినాడు .ఈచక్కనిశైలి ఆగామి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనది . పెద్దనాది కవితల్లజు లెందరో తమ గ్రంధము లందు యితని శైలికి పట్టము గట్టినారు. అల్లసాని వారైతే ఈశైలిని పుణికి పుచ్చుకున్నారు. అందుకే మనుచరిత్రము నందలి పద్యములు శ్రీనాధశైలీ సుగంధముతో పరిమళించు చుండును .
ఇంత గొప్పవిద్వత్కవి వేశ్యాలంపటుడగుట విచిత్రము. నాటిపరిస్ధితులట్టివి .నిజమారసినచో 1ధనము2రూపము3యవ్వనము4అధికారము5విద్యాధిక్యము- లను నీయైదింటిలో నేయొక్కటి యధికముగానున్నను నది చాలును మానవ పతనమునకు యివి యన్నియు నొకచోట చేరినచో నిక చెప్పవలసిన పనిలేదు. శ్రీనాధునియందు యివి యన్నియు గలవు. శ్రీనాధునిరూపము అపురూపము
ఆరడుగుల ఆజానుబాహు విగ్రహము. పసి నిమ్మపండు వంటి పచ్చని శరీరఛ్ఛాయ. విశాల ఫాల భాగము. గోష్పాదమంత శిఖ దానికి ముచ్చలముడి. నుదుట విభూతిరేఖలు. భృకుటిలో యెర్రని కుంకుమ బొట్టువెడదయురము. కంఠమున రుద్రాక్షమాల,తారహారములు, కటిభాగమున చీనాంబరము, వలెవాటుగా శాలువా, కర్ణములకు మకర కుండలములు, చేతులకు కంకణములు, పాదమునకు బంగరు జలతారుతో చిత్రితమైన పాదరక్షలుచేతస్వర్ణమయ దండము. స్ధూలముగానిది యతని యాకారము మాటలలో చతురత సునిసిత హాస్యము.నడకలలో గాంభీర్యము.రారాజులనైన శాసింపగలయా బ్రాహ్మణ వర్చస్సు,వచస్సు. లు శాధుని మహోన్నతు నొనరించినవి. అంతవానిని కామినులు వలచి వలపించి నారనుట యద్భుతవిషమా? ఇక శ్రీనాధుడా కాంతలకు మానస సూనస సూనసాయకుడు,. కావునృనే యతని శృంగారము నిరాటంకముగా చెల్లుబాటయినది.
ఇకనితటితో నీనాటి యీ ప్ర స్ధానమునకు యవధి కల్పింతము. రేపు తక్కిన భాగము

11 వ: భాగము )

సీ: ధరియింప నేర్చిరి దర్భవెట్టిన వ్రేళ్ళ
లీల మాణిక్యాంగుళీయ కములు;
కల్పింప నేర్చిరి గంగ మట్టియ మీద
కస్తూరికా పుండ్రకంబు నొసల;
సవరింప నేర్చరి జన్నిదంబుల మ్రోల
దార హారములు ముత్యాల సరులు;
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
కమ్మని గ్రొత్త చెంగల్వ విరులు;
గీ: ధామముల వెండి పైడియు దడబడంగ
బ్రాహ్మణోత్తము లగ్రహారముల యందు
వేమ భూపాలు నను జన్ము వీరభద్రు
ధాత్రి వాలింప గౌతమీ తటములందు;
కాశీఖండము- అవతారిక-ప
ఆహా! ఏమాఅగ్ర హారముల వైభవము! అల్లాడ వీరభద్రా రెడ్డి పాలనమున బ్రాహ్మణాగ్ర హారములన్నియు సుసంపన్నములయినవి. పాడిపంటలతో దేశము సుభిక్షమై యలరారినది. ప్రజలు వెండి బంగారములతో తులతూగుచుండిరి. దేశమంతయు దేవాలయములకు లలిత కళలకు నిలయ మైనది. భోగకాంతల లోగిళ్ళలో వెన్నెల దివ్వెలు వెలిగినవి. పర రాజుల దండయాత్రలకు సుదూరమగుట ప్రభువులు, అధికారులు భోగపరాయణు లైనారు . ఇటువంటి సుఖ మయృసమయ మున విజయ నగర రాజులు పరిసర రాజ్యములకు పండితవివాద సభలలో పాల్గొనుటకు ఆహ్వానముల నంపిరి. ఆపత్రములందు పండిత పరీక్షాధికారిగా " అరుణ గిరి సనాధ! కవిసార్వ భౌమ! గౌడ డింఢిమ భట్టారకుని" పేర్కొనినారు.
సభాముఖముగ నాపత్రగత విషయములు విన్నంతనే శ్రీనాధుని కొడలు మండినవి కటము లదరినవి కోపావేశమున కన్నులెర్రవారినవి .ఔరా! ఏమీగౌడ పండితుని విద్యాహంకారము! ఏమాతని గర్వము. లోకము విశాలమైనది తనకన్న మించిన పండితుడు ఉండకపోవునా? కవిసార్వభౌముడట! పండిత పరీక్షాధికారియట! ప్రాణము లేని యుధ్ధోపయోగి కంచుఢక్క యాతని కీర్తికి ప్రతీకయా! సాటిపండితుల కెంతయవమానము? చూతునుగాక యాతని పస .ఎటులైనను ఆగౌడ పండితు నోడించి, యాతని కంచు ఢక్కని పగుల గొట్టించి, యాతని కవిసార్వ భౌమ బిరుదమును అందుకొనకున్న నేను శ్రీనాధుడనే! అరుణగిరి నాధ! అస్తు! శీఘ్రమేవ తవ గర్వభంగ సిధ్ధిరస్తు! అని మనంబున కృతనిశ్చయుైడైనాడు.
వ విడిది గృహంబునకేగెనేగాని మనస్సునకు నిలుకడ లేకపోయెను, నిద్దుర కరవాయెను. భీమఖండము వింధ్య గర్వ భంగ సందర్భమున మేరు పర్వత ఖ్యాతివిని . వింధ్య పర్వతరాజు పడినపాట్లు గుర్తుకు వచ్చెను.ఆపద్యమును చిత్తగించండి;
ఉ: కంటికి నిద్రవచ్చునె, సుఖంబగునే రతి కేళి, జిహ్వకున్
వంటక మిందునే, యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవు డొకండు తనంతటి వాడు గల్గినన్;
కాశీఖండము - ప్రధమ- ఆశ్వా-108 పద్యం;
శత్రువును జయించు నందాక కంటికి నిద్ర రాదట! రతికేళియు సుఖప్రదము కాదట! నోటికి తిండి పోదట!తక్కినవైభము లెన్నియున్నను మనస్సు కెక్కవట! అభిమానవంతునకు తనకంటె మిన్నయైన శత్రువు కన్న మించిన కష్టము లేదట! తుదకు తనవర్ణన తనకే యెదురు వచ్చినట్లయినది . కొన్నిరోజులాబాధ ననుభవించుచు, సకల శాస్త్రములను మధించి మంచి ప్రావీణ్యమును గడించి . వేమారెడ్జి యనుమతినొంది. వీరభద్రారెడ్డిని మైత్రీపూర్వకముగా సెలవుకోరి ముందుగా కొండవీటికి ప్రయాణ ప్రస్థానము నారంభించెను.
నేటికి నింతవరకు నిల్వరింతముగాక! రేపు తక్కిన విషయములను ముచ్చటించు
కొందుముగాక! సెలవు

12 వ భాగము )

సీ: కలశాబ్ధి కన్యకా కర పల్లవ ద్వయీ
సంవాహన క్రియా సముచితంబు;
నిఖిల వేదాంత వాఙ్నిధి వధూ ధమ్మిల్ల
బహుళ పుష్పామోద భాసితంబు;
ప్రణత నానా సుపర్వ కిరీట సంఘాత
రత్నాంశు రాజి నీరాజితంబు;
సనకాది సన్మునీశ్వర మనో మందిరా
భ్యంతర రత్న దీపాంకురంబు;
గీ: పతగ కేతను శ్రీపాద పంకజంబు
కారణంబుగ జన్మించె భూరి మహిమ
గంగ సైదోడు రిపుకోటి గళము త్రాడు
నాలుగవ జాతి సమధికోన్నత విభూతి!
ఈపద్యము శ్రీనాధమహాకవి వర్ణనా వైభమునకు పతాక! ఆగామి ప్రబంధ కవుల కిది యొజ్జ బంతి యైనది,.ఇందు ఇమ్మహాకవి తన కాశ్రయ మొసంగిన రెడ్జిరాజుల కుల వైభవమును వర్ణించుటవిషయము. రెడ్డిరాజులు నాలుగవ జాతికి జెందినవారు. విష్ణు పాదమునుండి వారికులము ఉత్పన్న మయినది . అందువలన విష్ణు పాదమహిమను సహేతుకముగా నీపద్యమున వివరింప బడుచున్నది.
భావము:- సముద్రుని కుమార్తె యగు శ్రీలక్ష్మి యొక్క చిగురు టాకులవంటి హస్తములచే సంవాహనము చేయ బడు చుండెడివి. ( కలుములరాణి శ్రీదేవి సేవలకు నోచికున్న వని భావము.) సకలవేదాంత స్వరూపిణి యగు మాతృసరస్వతి నిత్యము సిరసు వంచి నమస్కరించు నపుడామె సిగలోని పూలసోకుచేత పరిమళ భరితమగుచున్నవి.(సరస్వతి బ్రహ్మకు భార్య శ్రీహరికి కోడలు ) ప్రతి దనము నరుదెంచి నమస్కరించు దేవతల సిరోలంకారములగు కరీటముల లోని రత్న కాంతులతో నీరాజన మందునవి. సనకాది మునుల మనోమందిరము లందు రత్న దీపములై ప్రకాశించునట్టివి. అటువంటి పతగకేతనుని(శ్రీహరి) పాదకమలమునుండి, గంగకు తోడబుట్టినదియై, శతృవుల మెడలకు ఉరిత్రాడై, సమధిక వైభవముతో నుదయించినది.
విష్ణు పాదమహిమ నింతగా వర్ణించిన కవులు లేరు. కవికి గల యవసర మట్టిది. పోషకులాయె! వారి నామాత్రము వర్ణించుటలో దోషములేదుగదా! పైగా మహా పరాక్రమ వంతులు. వర్ణాశ్రమ ధర్మ సంరక్షకులు. శివభక్తిపరాయణులు. కవి పండిత పోషకులు. చరిత్రలో రెడ్డిరాజుల పరిపాలనా కాలము ఒక మహాధ్యాయము నకు నోచు కొన్నది. అగుగాక! మనమితటితో నీప్రసంగ మునకు స్వస్తి బలికి ప్రస్తుత విషము ననుసరింతము.
రాజమహేంద్రమున ఘనమగు వీడ్కోలు పొంది కతిపయ ప్రయాణములను సాగించుచు, కొండవీటికి జేరుటకు ఉపక్రమించెను. అప్పటికే శ్రీనాధకవి కులపతిగా ప్రసిధ్ధి నొందెను. కులపతియనగా, అనేకమంది విద్యార్ధులకు నివాసము, భోజన వసతి కల్పించుచు విద్యను బోధింతువారు కులపతుతులు. అప్పటికే యతనకడ విద్యాభ్యాసము నొనరించు విద్యార్ధులసంఖ్య యతిమాత్రముగానుండెను. వ్యాకరణము,సాహిత్యము, ఛందస్సు, జ్యోతషము, తర్కము, అలంకార శాస్త్రాదులను బోధించు చండెడివాడు. అట్టి శిష్యగణము. రాజపరివారము, వండి వడ్డించు వారు వాహనములు పటకుటీర పరికరములు, ఇట్లొకచిన్న పట్టణమే కదలి వచ్చు చున్నట్లు చూపరకు గనుపట్టు చుండెను . ఉదయము కొంతదూరము ప్రయాణము. మధ్యాహ్నమున విశ్రాంతి భోజనాదులు తదుపరి కొంతవరకు ప్రయాణము రేయి యగుసరికి మరోచోటమజలీ ఇదీవారి యాత్రాటోపము.
మనము పాకనాటినుండి, రాజమహేంద్రి వరకు శ్రీనాధునితో పయనించితిమి. ఇంవరకు అతని సంసారమును గురించి యతడొక్క మాటయైనను జెప్పలేదు. గ్రంధము లందా దాఖలాలు లేవు. చరిత్రకారులకు యిదియొక శేష ప్రశ్నగా మిగిలి పోయినది. హరవిలాసమున మాత్రము తాత గారిని, తలిదండ్రు లయిన మారనామాత్య భీమాంబికల పేర్లు మాత్రము వెల్లడించినాడు. మరి పోతనతో సంబంధము ఎట్లు పొసగును? చిలవలు పలవలుగా వారియిరువురి సంబంధమును గురించిన కధలల్లినారే! అవియన్నియు పొసగని విషయములేకదా! పుట్టని బిడ్డకు పేరు బెట్టుటయేకదా!
ఇంతటితో నేచికీ ప్రసంగము నాపుదము. రేపు శ్రీనాధని కొండవీటికి జేర్చి తక్కిన విషయములు ముచ్చటించు కొందము. నేచికింక సెలవు.

13 వ భాగము 

సీ: సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య
భాషా పరిజ్ఙాన పాటవంబు;
పన్నగపతి సార్వభౌమ భాసిత మహా
భాష్యవిద్యా సమ భ్యాస ఫలము;
అక్షపాద కణాద పక్షిలో దీరిత
న్యాయ కళా కౌశ లాతిశయము;
శ్రుతి పురా ణాగమ స్మృతి సాంఖ్య సిధ్ధాంత
కబళన వ్యుత్పత్తి గారవంబు;
గీ: పూర్వ కవిముఖ్య విరచితాపూర్వ కావ్య
భావరస సుధా చర్వణ ప్రౌఢతయును;
శృంగార నైషధావతారిక లో కృతిపతి మామిడి సింగన శ్రీనాధుని గొనియాడుచు చెప్పిన పద్యమిది. దీనిని బట్టి సంస్కృతము, ప్రాకృతము, శౌరసేనీ ఇత్యాది భాషాపాటవము. పాతంజలి వ్యాకరణ మహాభాష్య ము నభ్యసించిన ఫలము, గౌతమ, కాణాదాది ధర్మ సూత్ర కారుల ధార్మిక విధానములు, వేదములు, పరాశరాది స్మృతుల పిరిచయము, సాంఖ్య శాస్త్ర మును పుక్కట బట్టుట చేత గల్గిన పాండిత్యము. వాల్మీకి వ్యాస భాస కాళిదాస హర్ష
భవభూత్యాది మహాకవుల రచనలను చదువుటవలన గలిగిన కావ్యజ్ఙానము శ్రీనాధునకు అపారముగా గలదని స్పష్ట మగుచున్నది. ఇదిగాక ,
శా: బ్రాహ్మీ దత్త వర ప్రసాదుడ వురు ప్రజ్ఙా విశేషోదయా
జిహ్మ స్వాంతుడ వీశ్వరార్చన కళాశీలుండ వభ్యర్హిత
బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్ధ నిర్ధారిత
బ్రహ్మ జ్ఙాన కళానిధానమవు ; నీభాగ్యంబు సామాన్యమే!
శ్రృంగార నైషధము - అవతారిక;
పైపద్యమును బట్టి యీతడు సరసవతీ వరప్రసాదు డని తేటమగుచున్నది. ఇకనతని పాండిత్యమునకు అడ్డేమికలదు? ప్ర జ్ఙ లో (ప్రతిభ) ఆదిశేషుని తోసమానమట ! ఇంక వాదనలో నతనిని మించువాడెవడు? యీశ్వరార్చన కళాశీలత్వము వలన పరమేశ్వర కృపాపాత్రుడు. తిరుగేమున్నది? 18 పురాణములతో కూలంకషమైన పరిచయము బ్రహ్మ జ్ఙానత్వమును నమకూర్చినది. ఈరీతిగా భౌతిక ఆది భౌతిక విద్యలలో కుత్తుక బంటి పాంజిత్యముగల యితనినెదిరించి నిలుచుట యసాధ్యము. కావున శ్రీనాధుని ధైర్యమునకు ఇవియన్నియు కారణములైనవి.
కతిపయ ప్రయాణముల మహాకవి కొండవీటికి చేరినాడు. వేమారెడ్డి మహోత్సాహముతో సపరివారుడై యెదురేగి తనవిద్యాధికారికి అపూర్వ మైన స్వాగత సత్కారములను జరిపించినాడు. శ్రీనాధుడును వేముని సాదర సత్కారమునకు సంతోషించినాడు. కొంతకాలము రాజకార్యములను చక్కదిద్ది మరికొంతకాలము తనవిద్యలకు పదును బెట్టుకొని శ్రీనాధుడు విజిగీషుడై విద్యానగర ప్రయాణమునకై సన్నాహములను చేయసాగెను. వేమారెడ్డికి తనపూన్కి నెరిగించి విద్యయానగరమునకేగి గౌడ డింఢిమ భట్టారకునితో పండిత వివాదమున దలపడుటకు , అనుమతిని గోరినాడు.
వేమారెడ్డికి పట్టరాని యానందమాయెను. నేటికి గదా విద్యానగర ప్రభువులకు తమరాజ్యమునందలి పండితుల పాండిత్య ప్రకర్ష ను ప్రకటించు నవకాశము చిక్కినదిగదా యనిమనంబున పొంగిపోయెను. శ్రీనాధుని సత్తువ యతడెరుంగునుగదా? తప్పక నతడు విజయుడై తమరాజ్య గౌరవము నినుమడింప జేయునని నమ్మినాడు. శ్రీనాధుని ప్రయాణమునకు వలసిన యానసౌకర్య ములను సమకూర్ప నాదేశంచెను. ప్రయాణ మార్గము కూడ నిర్దేసింప బడినది.వలసిన మార్గసూచికలు(మ్యాపులు) తయారుగావింపబడెను. ఒకానొక శభముహూర్తమున రాచపరివారము రాజగు వేమారెడ్డియు విజయ నినాదములతో సాదరమైన వీడ్కోలుపలుక శ్రీ నాధ మహాకవి సముచిత పరివారముతో విజయనగర మార్గాను సారియైనాడు.
నేటికీవిషయము నిమతటితో నాపుదము. రేపు మార్గ మధ్యమున తనచాటు పద్యమలవాన చే పాఠకులనెట్లు మురిపించి మై మరపించునో పరిశీలింతము గాక! సెలవు! శుభంభూయాత్!

14 వ: భాగము )

సీ : చక్కని నీ ముఖ చంద్ర బింబమునకు
కల్యాణ మస్తు ! బంగారు బొమ్మ!
నిద్దంపు నీ చెక్కు టద్దంపు రేకకు
నైశ్వర్య మస్తు! నిద్దంపు దీవి!
మీటిన బగులు నీ మెఱుఁగు బాలిండ్లకు
సౌభాగ్యమస్తు! భద్రేభ యాన!
వలపులు గులుకు నీ వాలుగన్నులకు న
త్యధిక భోగోస్తు! పద్మాయతాక్షి!
గీ : మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును
వైభవోన్నతిరస్తు! లావణ్య సీమ !
వన్నె చిన్నెలు గల్గు నీ మన్న నలకు
శాశ్వత స్థితి రస్తు! యోషాలలామ!
శ్రీ నాధుని చాటువు
శ్రీనాధ మహాకవి ప్రస్థానము సాగుచున్నది. రక్షణకుగాను వెంటనంటిన సైనికులు అశ్వ ములమీదను, శిష్యగణము ,ఆశ్రిత పరివారమంతయు శకటముల యందును మరికొందరు పాద చారులై యనుసరింపగా , శ్రీనాధ కవి చంద్రుడు స్వర్ణ పల్యంకిక నధిరోహించి బోయీలు ఓంకార నాదములతో దిగంతములను మారు మ్రోగించుచుండగా ప్రయా ణమును సాగించు చుడెను.
మధ్యేమార్గమున శ్రీనాధునకు ఒక చక్కని సుందరాంగి కన్నుల లోబడెను. తత్ఫలితమే పైసీస పద్యము. శ్రీనాధునిది విచిత్రమైన సునిశితమైన పరిశీలనా శీలము. అతని కన్నులలో బడిన దానిని విడువడు. అదియొక ప్రదేశముగావచ్చును, స్త్రీ పురుషులు గావచ్చును , రాైనను పేదయైననూ నతని దొక్కటే దృష్టి. సుందరమా ! అది యంగాంగ వర్ణనమే! కురూపమా! అదియునంతే! ఆవర్ణనమువెనుక నొకహేళనము, ఒకవిధమైన రోత, వర్ణనా సందర్భమున నతనికి సభ్యతా సభ్యతలు పట్టవు. ఆస్వరూపము కన్నుల గట్టవలసినదే! అప్పటి వరకు తనివి నొందడు.
ఇప్పట్టున పాఠరులకొక మనవి . శ్రీనాధుని కవితా ప్రవాహము గంగా ప్రవాహము వంటిది. గంగా ప్రవాహంలో అక్కడక్కడ చెత్త చెదారము లుండవచ్చును . అవి యా గంగాప్రవాహ పవిత్రతను అడ్డుకొన జాలవుగదా?
అట్ల శ్రీనాధుని పద్యముల లోని విచ్చలవిడి శృంగార మతని భోగేఛ్ఛకు సూచక మగునే గాని యతని కవితా మహాధారకు, భావనాచాతుర్యమునకు యేమాత్రము ఆటంకము కాజాలదని నామనవి; శృంగారపు పాలు మించిన తావుల లోని పద్యములను విజుచుటగాని, లేదా భావమును పాఠకుల యూహకు వదలుటగాని యొనరించుచు , నేనీతని ప్రస్థానమును నిర్వ హింపగలనని సవినయము గా మనవి చేయుచు ముందుకు సాగు చున్నాను.
శ్రీనాధుని ప్రయాణము మతివేగముగా సాగుచున్నది. మనమిప్పుడు గుంటూరి సీమకు చివరనున్న పలనాటిని సమీపించితిమి. ఇంతవరకు నాగరిక వేషభాషలతో మురిపించిన గుటూరిసీమ ఈప్రాంతమునకు చేరుసరికి అతివికృతముగా కన్పించెను.(పాఠకులు15వ శతాబ్దము నాటి పలనాటి నేపథ్యమును మనస్సులో నుంచు కొనవలెను ఇప్పటి పలనాటికి అప్పటి పలనాటికి పోలికలేదు) వర్షాభావమున నెండినచేలు. నల్లమలకు చేరువనుండుటచే కట్టు బొట్టులకు తిండి తిప్పలకు చాల వ్యత్యాసము గలిగి యనాగరిక వాతావరణమునకు చేరువయై చూపరులకు వెగటు కల్గించుచుండెను.
గీ:చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటినీళ్ళు నాప రాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లె నాటి సీమ పల్లె టూళ్ళు;
పరమ సుకుమారుడు మహా భోగియు నగు శ్రీనాధుని కచటి దృశ్యము లన్నియు విషప్రాయములయ్యెను. దారిబత్తెమునకై తాము దెచ్చుకున్న ఆహారపదార్థము లన్నియు నిండుకున్నవి . ఇకస్థానికముగా వస్తువులను కొనుగోలుచేసికొని పొట్టనిపుకొనవలసియుండెను. కానీ ఆపల్లెలలో నంగడులేలేవు. శ్రీనాధునకు ఒజలుమండెను.
ఉ: అంగడి యూరలేదు; వరి యన్నములేదు; శుచిత్వ మేమి లే
దంగనలింపులేరు; ప్రియమైన వనంబులు లేవు; నీటికై
భంగ పడంగఁబాల్పడు కృపాపరు లెవ్వరు లేరు; దాత లె
న్నంగను సున్న! గాన పలనాటికి మాటికి బోవనేటికిన్;
అంటూ ఆప్రాతం పైన తన నిరసన చాలాతీవ్రంగా ప్రకటించినాడు.
నేటితో నీప్రసంగమును నిల్వరింతము. ముందు ముందు మరిన్ని వింతలు వినోదాలు. ఇకదారి పొడుగునా పద్యాల జల్లులే! పాఠకులు సావధానులై యుందురుగాక! సెలవు !

15 వ - భాగము 

కం:- రసికుడు పోవడు పలనా
డెసగంగా రంభ యైన యేకులె వడకున్;
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుం డైన జొన్న కూడే గుడుచున్;
నిన్నటి చివరి పద్యమున అంగడి యూరలేదు అంటూ శ్రీనాధ కవీంద్రుడు పలనాటి పల్లెలయందలి లోపములను యెలుగెత్తి సాటెను. జనుల జీవనోన్నతికి వాణిజ్య కేంద్రములు సూచికలు . అవిలేనిచోటులు రాణింపవు.
మనకవియా నిరంతర భోగపరాయణుడు. పగలు తిండితిప్పలకు లోటుండరాదు. రేయికి పడక సౌఖ్యము సరేసరి. ఈరెండును నిచట లభీంచునట్లు లేదు వెలయిచ్చి కొందమన్నను అంగడులులేవు. వరియన్నమా పూజ్యము. " ముఖ్యమైన విషయము అంగన లింపులేరు. అయ్యో! ఎంతకష్టము వచ్చిపడినది? వీటికి తోడు త్రిసవణ స్నానాదులాచరించుచు త్రికాల సంధ్య నుపాసించు శ్రీనాధునకు స్నానపానములకు వలసిన నీరేకరవయ్యెను. " నీటికైభంగపడంగ తోడ్పడెడు వారలు కూజలేరని వాపోయినాడు .ఇకయిట్టి పలనాటికి మాటి మాటి కేలరావలెను? అని మనస్సులో కసిదీర విసిగికొనినాడు.
వెంటనే తన యభిప్రాయమును నిర్మొగమాటముగా వచిచినాడు. రసికుడెవ్వడీ పలనాటికిరానేరాడు. రంభ లాంటిఅందగత్తెయైనా యిక్కడ యేకులు వడుకుతూ కూరిచోవలసినదే! మహారాజైనను మడి దున్నవలసినదే! మన్మధుడయినను జొన్నకూడే దినవలెను. వేరు మార్గము శూన్యము.
ఇట్లు అన్నోదకములకై వెంపర లాడుచు మనకవి యచ్చటి పురోహితునింటికి బోయెను. అచటి యశౌచవాతాపరణము ను జూచి యతనికి వికారము బుట్టినది. ఎంతరోత! ఛీ ఛీ యిదియు నొకబ్రతుకా? యని నిర్వేదము జనించెను. అయినను అతని పరిశీలనా చక్షువులకు కొన్ని రోత కలిగించు దృశ్యములు చిక్కనే చిక్కినవి;
ఉ:- దోసెడు కొంపలో పశుల ద్రొక్కిడి మంచము దూడరేణమున్ ,
పాసిన వంకంబు పసి బాలుర శౌచము విస్తరాకులున్
మాసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు బోడికుండలున్
రాసెడు కట్టెలున్ దలప రాదు పురోహితు నింటి కృత్యముల్;
ఇవి యచట యతని కనుల బడ్డ యపూర్వ విష యములు. వెంటనే నిరసించుచు ఆశువు శ్రీనాధుని నోట దూసుకొని వచ్చినది. వడిసెల లోనిరాయికివలె ఆశువునక వేగమధికమే! వచ్చినపద్యము నొడిసి పట్టినారు శిష్యులు. వారిపనియే అది.పద్యమును విచారింతము! ఏమిపరిశీలనా సామర్ధ్యము !
పురోహితునియిల్లు దోసెడున్నదట! అదీ నుడికారవైభవము. ఆయున్న చిన్నయిల్లు వారుండుటకే సరిపోదు. అట్టిదానిలో గోదానాదుల వలన లభించిన పశువులను గట్టుచున్నారట! అవి అక్కడనే మలమూత్రాదులను విసర్జించుటచే భరింపరాని దుర్గంధము. ఆప్రక్కనే నులక మంచము దానికి లేగలు బంధింప బడినవి వాటిమలమూత్రాదులచే నిల్లు వెగటు బుట్టించు చున్నది. ఒకప్రక్క వంటగది తెఱచిన మూతగల గిన్నెలు వానియందు నిన్నటి వంటకము పాసిపోయి కంపుకొట్టు చుండెను. వారింటి పసిబాలురు నియంత్రణ లేమి నిల్లంతయు మూత్ర సేచన మొనరించుచన్నారట! విస్తరాకులు యిల్లంతా చిదరగాపడియున్నవి. మాసిన వస్త్రాదుులు యిల్లంతాపరచుకున్నాయి. (వెనుకటి తరమువారు భర్త గతించాక తలకు ముండనము చేయించు కునేవారు నెలకు రెండుమారులు ఆకార్యృక్రమము బ్రాహ్మణగృహములందు పరిపాటి) ఇక్కగ క్షురకుడు అందుబాటులోలేకపోవుటచే
ఆవిశ్వస్తల తలలు మాసియున్నాయట! కాళీగాఉన్నపాత్రలు. పొయిలోవాడి మండించి మిగిలిన భాగములను ఆర్పి వానినింట నుంచు కొన్నారట! ఎంత నిశిత పరిశీలనము! ఇవీ పలనాటి పురోహితుని ఇంటిలో కనిపించిన యపూర్వ దృశ్యములు. ఛీ తలపరాదు పురోహితు నింటి కృత్యముల్!
ఇకచేసెడిదేమి? నీటికై వెదకి వేసారి పరమేశ్వరునే తూర్పార బట్టుటకు దెగబడినాడు.
కం:- సిరి గల వాడికి జెల్లును
దరుణుల బదియారువేలు దగ బెండ్లాడన్;
తిరిపెమున కిద్ద రాండ్రా?
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్!
ఇందు లౌకిక అలౌకిక ములగు రెండర్ధములను కవి యిమిడించినాడు. 1 ధనవంతుడు యెందరినైను బెండ్లి యాడవచ్చును. పోషణకు లోపముడదుగనుక, బిచ్చగానికి యిద్దరున్నను పోషించుట కష్టమేయగుట లౌకికము.2ఓపరమేశా! హరి సిరి గలవాడు( లక్ష్మీనివాసుడు) కావున నాతడు పదియారు వేల భామలను పెండ్లి యాడినను దోసమనిపించదు. మరి నీవో అట్లుగాదే? బిచ్చగాడవుగదా! నీకేలనయ్యా యిద్దరు భార్యలు.పార్వతి యొక్కతె చాలులెమ్ము; గంగను మాకువిడువుము; అంటాడు. గంగమ్మని శివుడు విడిచాడో లేదో తెలియదు గాని పద్యం మాత్రం చాటువుగా మిగిలి పోయింది; శ్రీనాధుడు అక్షర తపస్వి! ఈతీరుగా అక్షరుడై చరిత్రలో మిగిలిపోయినాడు. నేటి కింతటితో నీప్ర సంగమును నిలువ రింతము. రేపు తక్కినది. సెలవు!

16 వ భాగము )

కం:- జొన్నకలి జొన్నయంబలి
జొన్నన్నము జొన్నపిసరు జొన్నలు దక్కన్
సన్నన్నము సున్న సుమీ!
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరికిన్;
నాటి పలనాటి జీవన మెంత దుర్భరము! ఆహారమునకు జొన్నలు తప్ప నితరములు శూన్యము. వారికి సన్నన్నము గగన కుసుమమే! జొన్నకలి, జొన్నయంబలి , జొన్నపిసరు , ఇవీ జొన్నలతో తయారించు భోజనాదికములు.
జొన్నన్ములోకి శాకము విచిత్రమైనది . " బచ్చలియాకులో చింత చిగురు కలిపి గరిట జారుగా శాకమును తయారు చేసి కొనెడివారు. ఆయుడుకు బచ్చలి శాకముతో కలగలిపి జొన్నన్నమును మెసగ వలయును. ఇంతకు దప్ప వేరుమార్గము లేదు.
పరమ సుకుమారుడగు శ్రీనాధునకు ఆయాహారము సంకటముగామారినది. చేయునదిలేక తనకా స్థితి కల్పించిన దైవతములపై విరుచుకు పడినాడు.
కం:- గరళము మ్రింగితి నంచును
పుర హర! గర్వంప బోకు, పో పో పో, నీ
బిరుదింక గానవచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు దినుమీ!
పరమేశా! గరళముమ్రింగి నానని గర్వ పడెదవేల? ఈపలనాటికి విచ్చేసి యొక్కమారీ యుడుకు బచ్చలి శాకముతో కూడిన జొన్నన్నమును మెసవుము. నీగర్వము ఖర్వము గాకున్న చూతుము! అని శంకరునకు సవాలు విసరు చున్నాడు. అంతటిటితోవిడువక స్థితి కారుడగు విష్ణు మూర్తికి గూడ చురక వేయుచున్నాడు.
ఉ: ఫుల్ల సరోజనేత్ర! యల పూతన చన్నుల చేదు త్రావి; నా
నల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన యొక్కముద్ద దిగ మ్రింగుమ? నీపస గాననయ్యెడిన్!
స్వామీ! శ్రీహరీ! కృష్ణావతారమున విషస్తనియగు పూతన పాలుద్రాగినాను, దవాగ్నిని గూడ గుటుక్కు మనిపించినాను. నాకెవరుసరి యని విర్రవీగకుము? చింత తిగురు తో కలిపి యుడికించిన ఈయుడుకు బచ్చలి శాకముతో జొన్నన్నము నొక్క ముద్ద మ్రింగుము నీఘనత బయట పడును . అని వెక్కిరించు చున్నాడు. మహాకవులు నిరంకుశులుగదా! వారెట్లు మాటాడినను నిలదీయువారెవ్వరు?
పలనాట తిండికి కరవైన శ్రీనాధున కొకనాడు రామయమంత్రి యింట నాతిధ్యము లభించినది.
ఉ: గ్రామము చేతనుండి పరికల్పిత ధాన్యము నింటనుండి, శ్రీ
రామ కటాక్ష వీక్షణ పరంపరచేఁగడతేఱె, గాక, మా
రామయమంత్రి భోజన పరాక్రమ మేమని చెప్పవచ్చు? నా
స్వామియెఱుంగు? తత్కబళ చాతురి తాళఫల ప్రమాణముల్!
కుత్తుక బంటిగా వారింట భుజించియు నొక వ్యంగ్యపు బాణమును ప్రయోగించినాడు. అబ్బ! యేం తిడిరా బాబూ రామయ మంత్రిగారిది! వారుతినే అన్నం ముద్దలు తాటి పళ్ళ సైజువి కదరా! అని హేళనగా పలుకు తున్నాడు,. ఇందులో రవంతహాస్యమును జోడించినాడు.
తిండి తిప్ప లెట్లున్నను నతనికిగల సౌందర్య దిదృక్ష యాపరానిది. యాయనాగరిక వ్యవహారమునగూడ నాతనికి వలసిన దృశ్యములు కనులబడక పోలేదు.
ఉ: గుబ్బలగుమ్మ,లేఁజిగురుఁగొమ్మ, సువర్ణపు గీలుబొమ్మ,బల్
గబ్బి మిటారి చూపులది ,,కాపుది, దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంట గట్టితివి? పెద్దవు నిన్ననరాదు గాని, దా
నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాస మేటికిన్?
చివరకా యడవిలో నొక కాపు భార్య యగుపించినది. దానియందము కవిగారికి నచ్చినది. కానీ యది తనకు దక్కు మార్గమెట్లు? దానిమొగుడు పెద్దపులిలా కాపలాకాస్తున్నాడు. కోపంవచ్చింది. సృష్టికార్యాన్ని నిర్వహించే బ్రహ్మను నిందించు చున్నాడు. " ఏమయ్యా ! బ్రహ్మయ్యా! ఈమగనాలికి (భర్తతోకాపురం చేసే భార్య) ఇంతఅందం ఇచ్చావెందుకయ్యా! దానికో పెద్దపులినంటగట్టావు. ఇదేంపని? నీవుచేసినది నచ్చలేదు. అసలు దీనికింత అందమెందుకయ్యా! అంటూమొత్తుకున్నాడు. అందనిద్రాక్షపుల్లన గదా!
నేడు ఇంతటి తో నీ ప్రసంగమును నిల్వరింతము. రేపు తక్కిన విషయములను సమీక్షించు కుందాము సెలవు


17 వ: భాగము 
ఉ: వీరులు దివ్యలింగములు; విష్ణువు చెన్నుడు ; కల్లిపోతురా
జారయ కాలభైరవుడు; నంకమ శక్తియ; యన్నపూర్ణయున్;
గేరెడి గంగ ధార మడుగే మణికర్ణికగా, ఁజెలంగు ; నీ
కారెమ పూడి పట్టణము " కాశిగదా ! పలనాటి వారికిన్;"

మన మిప్పుడు మాచర్ల, గురజాల లను దాటి నాగులేటి నుత్తరించి కారెమపూడి పట్టణమునకు జేరు కొన్నారము. శ్రీనాధుని ప్రస్థానము నిరాటంకముగా సాగుచున్నది. పలనాటిలో కారెమ పూడి వీరులకు కార్య క్షేత్రము. పలనాటి యుధ్ధమునకు రంగస్ధలమిదియే! భారత కధను దలపించు దాయాదుల యుధ్ధము యిక్కడే జరిగెను. ఆరణరంగమున మరణించిన వీరులందరు నేడు పూజాభాజనులైృపలనాటివారి కిల వేల్పు లయినారు. అదియే యీపద్యము వివరించు చున్నది .
అట వెలసినవీరులందరూ దివ్య లిగములట! చెన్నకేశవ స్వామి విష్ణు మూర్తియట! కల్లిపోతురాజు కాలభైరవుడట! అంకమ( గ్రామదేవత)యే శక్తి స్వరూపిణియౌ యన్నపూర్ణమ్మయట! నేరెడి గంగమడుగు మణికర్ణికా ఘట్టమట! ఈరీతిగా పలనాటివారి కందరకు ఈకారెమ పూడి అపర కాశీ పచ్టణ మైనదట!
ప్రస్థానము ముందుకు సాగుతున్నది పల్లకీలో నున్న శ్రీనాధకవీంద్రునకు యతని ఎక్సరే కన్నులను దాటిపోవు దృశయములే లేకుండెను. అయినది, పల్లకీ ఆగినది. ఒక చక్కని దృశయమాయన కన్నుల బడినది.
ఉ: పువ్వులు కొప్పునం దురిమి , ముందుగ గౌనసియాడుచుండగా,
జెవ్వున జంగసాచి, యొకచేతను రోకలిఁబూని, యొయ్యనన్
నవ్వు మొగంబుతోడ ఁదన నందనుఁబాడుచు, "నాధుఁజూచుచున్"'
'సువ్వియ సవ్వి సువ్వి యంచు' నొకసుందరి బియ్యముఁ దంచె ముంగిటన్;
చూచిన దృశ్యము చిన్నదే గాని శ్రీనాధుని మనోనేత్రము ఆమెనవ్వులు, ఆదంపుడు విధానము, ఆసాభిప్రాయములైన చూపులకు గల విశేష భావమును కనిపెట్టినది. ప్రాకృతుడై శృంగారమన నేమో యెఱుకలేని మగనికి యామె చక్కని సందేశ మందించు చున్నదట! శృంగారకేళిలో నిట్లు ప్రవర్తింప వలెనని రోకటి పోటుతో సూచించు చున్నదట! ఆకాపు వానికాసందేశము అందినదో లేదోగానీ మన కవికి ఆహా యనిపించినది. ల్లెలలోగూడ నింత తెలివిగల భామ లుందురాయని యాశ్చర్యమున మునింగినాడు. పల్లకీ ముందుకు సాగు చున్నది .మరల నాగినది, ఈసారి అమ్మలక్కల మాటలు ఆమాటలవెనుకగల గారడీ యతని చెవుల బడెను.
చం: సరసుడుగాడొ?జాణ!; రతిసంపదలేదొ? సమృధ్ధి; రూపమో?
మరుని జయించు; మోహ? మసమానమె; ఇన్నియు గల్గి జారవై
తిరిగెద వేల బాల? యతిధీరవు, ప్రౌఢవు నీవెరుంగవే?
నెర గృహమేధియన్బలుకు నీచముదోచె గొఱంతదే సుమీ!
ఆపల్లెలో నిరుగమ్మ పొరుగమ్మను మాటల లో దించి విషయమును రాబట్టు చున్నది ." ఏవమ్మా! మీయాయన సరసుడు గాడా? కాకేమి జాణయే! రతిసంపదలేదా? అబ్బో! చాలాయెక్కువ; అందముతక్కువా? నవమన్మధుడు; నీపై ప్రేమ లేదా? చాలాయెక్కువ; మరెందుకే నీవు ఊరిమీద పడతావు? అదేనమ్మా మాఆయనకు అసలువిషయంతక్కువ (పుంస్త్వం తక్కువ- నపుంసకుడు) అందుకే నేను ఊరినాశ్రయించటం; ధీరవు, ప్రౌఢవు నీకిది తెలిక పోవటం విచిత్రమే! అంటూ అడుగ వచ్చిన యామెబుగ్గలు నొక్కి పంపినది; ఎంత యాశ్చర్య సంధాయక మీసంఘటనము! ఆయువతీ లలామ యందచందములకు తెలితేటలకు శ్రీనాధు డిట్లు ఆశీర్వచనములను పలుకు చున్నాడు.
సీ : శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు మహా
భూర్యబ్దములు సితాంభోజ నయన!
వరకాంతిరస్తు! తావక నఖముఖముల
కాచంద్ర తారకం బబ్జ వదన!
మహిమాస్తు! నీ కటి మధ్యంబులకు మన్ను
మిన్ను గలన్నాళ్ళు మించు బోడి!
విజయోస్తు! నీ గాన వీక్షల కానీల
కంఠ హరి స్ధాయిగా లతాంగి!
గీ: కుశలమస్తు! లస ఛ్ఛాతకుంభ కుంభ
జంభ భిత్కుంభి కుంభాభి జృంభ మాణ
భూరి భవదీయ వక్షోజములకు మేరు
మంథరము లుండు పర్యంత మిందువదన!
నీపాదాలకు,ముంగురులకు, నీమేఘసదృశమైన వేనలికి శ్రీరస్తు! నీనఖ ముఖములకు ఆచంద్ప తారార్కముగా చక్కని కాంతి కల్గుగాక! మిన్ను మన్ను లున్నంతకాలము నీపిరుదులకు నడుమునకు మహిమాభివృధ్ధియగుగాక!
ఆసర్వేశ్వర, హరుల సాక్షిగా సంగీతమునుపాడు నీకన్నులకు విజయ మగుగాక!
వెండి కుండలను బోలి దేవేంద్రుని వాహన మైన ఐరావతము కుంభస్థలములసదృశముగా విస్తరించు నీవక్షోజ సంపదకు కుశలమగుగాక! యనిగొప్పగా యాశీర్వాదము నొసంగినాడు. అతడు మెచ్చిన నంబర మెక్కించును. మెచ్చకున్న నిచ్చవచ్చిన రీతిని తిరస్క రించును. శ్రీనాధుని నైజమే యంత! పల్లకీ కడువేగముగా ముందుకు సాగపతున్నది.
మన మింతటితో నీప్రసంగమును నిల్వరింతము రేపు తక్కిన విషయములను ముచ్చటించు కొందముగాక! నేటికి సెలవు.


18 వ భా గ ము 
సీ: సొగసు కీల్జడ దాన సోగ కన్నులదాన
వజ్రాల వంటి పల్వరుస దాన!
బంగారు జిగిదాన! బరువు గుబ్బల దాన!
నయమైన యొయ్యారి నడక దాన!
తోరంపుఁగటి దాన! తొడల నిగ్గుల దాన!
పిడికిట నడగు నెన్నడుము దాన!
తళుకుఁ జెక్కుల దాన! బెళకు ముక్కర దాన!
సింగాణి కనుబొమ చెలువు దాన!
గీ: మేలిమి పసిండి రవ కడియాలు దాన!
మించిపోనేల? రత్నాల మించు దాన!
తిరిగి చూడవె? ముత్యాల సరుల దాన!
చేరి మాటాడు చెంగావి చీర దాన!
పలనాడెంత యనాగిరికముగా నున్నను యచట గూడ సౌందర్యమునకు ప్రతి బింబము లనదగిన కొందరు కాంతామణులు లేకపోలేదు. అదిగో నట్టి వనితా లలామ కనులబడినది. అంతే టక్కున పల్లకీ నిలచి పోయినది. శ్ర నాధుడామెను తనివితీర వర్ణించినాడు చూచితిరిగదా ఆవర్ణనము; అంత యద్భుతముగా నింకెవరైన వర్ణింప గలరా? ఒక్క శ్రీ నాధునికే అది సుసాధ్యము. పల్లకీ యల్లన ముందుకు సాగుచున్నది. మరికొంత తడవు ప్రయాణము సాగినది. మరలనంతరాయము! అహో! శ్రీనాధా! నీకనుల లో నిపుడెవరు పడినారయ్యా!
చ: పసగల ముద్దు మోవి, బిగివట్రువ గుబ్బలు , మందహాసమున్ ,
నొసట విభూతి రేఖయునుఁ బునుంగున తావి, మిటారి చూపులన్,
రసికులు మేలు! మేలు! బళిరా! యనిమెచ్చగ ,నూరివీధిలో,
బసిఁడి సలాకవంటి యొక బల్జె వధూటిని గంటి వేడుకన్;
అదీసంగతి! అంగాంగ సౌష్ఠవము గల బంగరు సలాక వంటి బలిజె వధూటి కనుల బడినది. ప్రయాెణము నిలచినది . కుల గేత్రములతోగాని, సాంఘిక మర్యాదలతోగాని యతనికి నిమిత్తము లేదు. లభయమయ్యెనా అనుభవింపవలె, లేదావాచవిగా పొగడవలె, తప్పదు అది తనకు దెలసిన మార్గము. పోనిండు యతనిమార్గ మతనిది. మనకేల యభ్యంతరము? మరల పల్లకీ ముందుకు సాగినది. నల్లమల అటవీ ప్రాంతమును చేరుటచే బోయీలు వేగము నినుమ డింప జేసిరి. అల్లదిగో కృష్ణాతీరము చల్లని గాలులు ఉల్లమును పల్లవింప జేయుచుండెను. ప్రయాణపు బడలిక సడలినది శ్రీనాధకవి యానందతుందిల మనస్కుడయ్యెను. పరివారమంతయు కృష్ణ నుత్తరించుటకు తారణ సాధనముల నరయ సాగిరి . కవియు సుస్నాతుడయి , సాంధ్యకృత్యాదులను నిర్వర్తించెను. పరివార సహితుడై యానసాధనముల సాయమున కృష్ణానదిని దాటి యావలి తీరమునకు జేరుకొనెను.
నేటితో మనమీ ప్రసంగమును నిల్వరింతము. రేపు తక్కిన విషయములను పరిశీలింతుము గాక! నేటికి సెలవు

19 వ భాగము 
సీ: తారకా మందార తారాచలంబుల
తో రాయు నెవ్వాని చారు కీర్తి,
భావ సంభవ భద్ర దేవేంద్ర సూనుల
మరపించు నెవ్వాని మహిత కీర్తి.
జీమూత వాహన శిబి సూర్య తనయుల
ధట్టించు నెవ్వాని దాన కీర్తి,
భార్గవ గార్గ్య గీష్పతి మతి ప్రౌఢిమ
నిరసించు నెవ్వాని నిశిత బుధ్ధి,,
గీ: అతఁడు రిపు రాజ రాజ్య సప్తాంగ హరణ
కరణ పరిణత యుక్త ప్రకాశమానుఁ
డతులితాచారవిజిత గంగాత్మజుండు,
మర్త్య మాత్రుండె? వల్లభా మాత్య వరుఁడు!
భావం:- తారకలను, మందారమనే కల్ప వృక్ష మును, వెండికొండను, ఎవనికీర్తి మరపించునో! మన్మధుడు, ప్రద్యుమ్నుడు, జయంతుడు, మొన్నగువారి సుందరాకారుల నెవరి రూపము మరపింప జేయునో? జీమూతవాహనుడు , శిబి, కర్ణాదుల దానగుణము నెవ్వని కీర్తి తిరస్కరించునో! శుక్ర, గార్గ్య, బృహస్పతుల మేధాశక్తి నెవరి నిశిత బుధ్ధి నిరసించునో! వైరి రాజుల సప్తాంగ హరణ విద్యలో నెవడు ఆరితేరిన మొనగాడో! సాటిలేని సదాచార పరాయణమున నెవడు భీష్ము ని ఉపమించునో ! అతడె వల్లభామాత్యుడు! అతడు మానవ మాత్రుడా? కాదు. దేవ తుల్యుఁడని కవి యభిప్రాయము.
శ్రీ నాధుడిప్పుడు కృష్ణాతీరము నుండి సపరివారుడై ఓరుగల్లు వయిపు ప్రయాణమను సాగించు చున్నాడు. ఓరుగల్లు కాకతి రాజధాని. ప్రతాపరుద్రుని పాలనము. ఆకాకతి సామ్రాజ్య రాజ భాండారమునకు అధిపతి వల్లభామాత్యుఁడు. శ్రీనాధుని ప్రాణ స్నేహితుడు. వినుకొండ వారి స్వగ్రామము. మోపూరున కధిపతి. సర్వ రాజ్య రక్షాదక్షుడు. శ్రీనాధునకు అన్నివిధముల తగినవాడు. శృంగార రసైకజీవి. భోగపరాయణుఁడు. స్వయముగా కవి కవిజన పోషకుడు. అట్టి తన మిత్రుని సహకారమున నెటులైనను విజయనగర రాజులకడ పరపతిని సంపాదింప వలెనను ప్రయత్నమున వల్లభరాయుని కలుసు కొనుటకు శ్రీనాధుడు ఓరుగంటికి పయనమైనాడు.
వల్లభరాయని తండ్రి, తాతలు విజయ నగర ప్రభువులకడ భండాగార రక్షకులై కర్ణాటక రాజుల య భిమానమునకు పాత్రులయినారు. కావున వల్లభుని సిఫారసు తో డిండిముని ఎదిరించు కార్యక్రమము నిర్విఘ్నముగా నిర్వ హింపవలెనని శ్రీనాధునితలంపు. మనమిప్పుడు ఓరుగల్లునకు బహుసమిపమునకు వచ్చియున్నారము. ప్రయాణమునకు కొంత విశ్రాంతి నొసగి, తన రాకను మిత్రున కెరిగింప వర్తాహరుని ఓరుగంటికి పంపెను.
మిత్రుని రాకకు పరమానంద భరితుడై వల్లభామాత్యుడు కొండవీటి విద్యాధికారి యగు శ్రీనాధునకు అతని పరివారమునకు ఘనమైన స్వాగతృసత్కారములకు యేర్పాట్లు గావించెను. వేదోక్త ప్రకారము పూర్ణకుంభ స్వాగతము పచరించి నగరవీధులలో నతడు వచ్చమార్గము నంతయు తోరణ సందోహములతో నలంకరింప జేసెను. మార్గమంతయు సుగంధభరితమగు పూలను బరపించెను. మిత్రునకు యతని పరివారమునకు సర్వోపచారములను సల్పుటకై లక్ష్మణ వఝ్ఝలయింట విడిది యేర్పాటు గావించెను.
నాటియోరుగల్లులో నావఝ్ఝలవారి యిల్లు పూటకూటిల్లు గాజగత్రసిధ్ధము. నేటి5స్టార్ హోటళ్ళ కేమాత్రము తీసిపోదు.
ఉ: రప్పుర భోగి వంటకము, కమ్మని గోధుమ పిండివంటయున్
గుప్పెడు పంచదారయును, క్రొత్తగ గాచిన యాలనే, ర్పెస
ర్పప్పును, కొమ్ముటనంటి పండ్లును, నాలుగునైదునంజులున్,
లప్పల తోడ గ్రొంబెరుగు, లక్మణ వఝ్ఝల యింట రూకకున్!
ఆహా! ఎంత చక్కని భోజనము! భోజనమునకేగాదు సకల సౌకర్యములకు భాజనమైనది వఝ్ఝలయిల్లు. వలసిన వారికి మదిర మగువలకును కొదవలేదు. వచ్చిన వారు రాజ బంధువులాయె వారడిగినదే తడవుఅన్నియు నరనిముసమున నందుబాటులో నుండుచున్నవి. శ్రీనాధుడు కోరుకొన్నదియు నిదియే ! వల్లభుని దయతో నతని భుభుక్షలు(ఆకలి) రెండును తీరినవి. పరమోల్లాస భాసురు డైనాడు. పరమానంద ము గల్గినది; మిత్రునకు ప్రతి కృతిగా నేదేని నిరుప మానమైన కానుక నొసగ వలెనని సంకల్పించు కొన్నాడు;
నేటికింతటితో నిల్వరింతము రేపు క్రీడాభిరామ కృతి నిర్మాణమునకు కడంగుటనుబరిశీలింతము. శ్రీనాధ- వల్లభామాత్యుల అభిరుచులు, వానిపర్యవసానములను చెవులారవిని, మనసారచదువుకొని ముందుకు బోవుదము; నేటికి సెలవు

ధారావాహిక 20 వ భాగము 

సీ: సత్య వ్రతాచార సత్కీర్తి గరిమల
చంద్రు తోడను హరిశ్చంద్రు తోడ,
నభిమాన విస్ఫూర్తి నైశ్వర్య మహిమల
రారాజుతోడ రైరాజు తోడ.
సౌభాగ్య వైభవ జ్ఙాన సంపన్నత
మారుతోడ సనత్కు మారుతోడ,
లాలిత్య నిరుపమ శ్లాఘా విభూతుల
భద్రు తోడను రామ భద్రు తోడ,
గీ: బాటి యనదగు ధారుణీపాల సభల
వీర హరిహర రాయ పృధ్వీ కళత్ర
రత్న భాండార సాధికార ప్రగల్భు
మల్లికార్జున త్రిపు రారి మంత్రి వరుని;
సూత్రధార వచనం- క్రీడాభిరామం;
వల్లభరాయని తండ్రి త్రిపురారి మల్లి కార్జనుడు. అతనిప్రశంస ఈ పద్యము. ముందుగా సంక్షేపముగా దీని భావమును పరిశీలింతము. తిపురారి మంత్రి, సత్యవ్రతాచారమునందు హరిశ్చంద్రుని, సత్కీర్తి యందు చంద్రుని యుపమించును. అభిమానమందు రారాజును(సుయోధనుని) ఐశ్వర్య మహిమల రైరాజుని (రైయనగా ధనము రైరాజు కుబేరుడు) ఉపమిచును. సౌభాగ్యమున సౌందర్యమున మన్మధుని, జ్ఙాన సంపన్నతయందు సనత్కుమారుని యుపమించును. సాటిలేనితనమున భద్రుతోను, ప్రశంసకు రామ భద్రుని తోను ఉపమించును. హరిహర రాయల రత్న భాండారమునకు అతడుతిరుగులేని యధికారి.
ఇంతకు నీత్రిపురారి తోమనకు నియేమి? యనిమీరు అడగ వచ్చును. అతడు వల్లభామాత్యుని తండ్రి విజయనగరమున రత్న భాండారమునకధికారి విజయనగర ప్రభువుల దర్శ నము గోరువారికి యితని యవసరము మెండు. వల్లభుని సిఫారసు తో విజయనగరమున త్రిపురారిని గలసి యతనిప్రాపుతో రాయల దర్శనమును పొంది యాపై డిండిముని పీచమడచ వలెనుగదా!
వల్లభామాత్యుడు సరస కవి మహాభోగి శ్రీనాధునకు తగిన జోడీ " స్నేహం సమ శీల స్ధితి యుతులకు సమ గుణవంతుల మధ్యనే ఏర్ప డుట సహజము. సహజ కవియైన సఖునకు చెలిమి కానుకగా నొక చక్కని గ్రంధమును యాతనిపేరనే వెలయింప వలెనను తలంపు శ్రీనాధునియందు బలపడెను. రాజకీయ కార్యముల హడావిడిలో జీవనమును గడపు వల్లభునకు గ్రంధ రచనకు తీరికయెక్కడిది ? లేకున్నృనతడేమి తక్కువ వాడా?
క: హాటక గర్భ వధూటీ
వీటీ కర్పూర శకల విసృమర సౌర
భ్యాటోప చాటు కవితా
పాటవ మరు దవని వల్లభన్నకు జెల్లున్;
వాగ్దేవత! యాచదువుల తల్లి నములు కర్పూర తాంబూలపు సువాసన లతని చాటు పద్యములలో గుబాళించునట! ఆహాయెంత చక్కని యుపమానము? ఇంతకు నీచాటు కవిత యననేమో తెలిసికొందము. లోకములో చాటుకవిత, చాటు పద్యములు ప్రచారమున నున్నవి . యిందు " చాటు" పదమును కొందరు దంత్యముగాను, మరికొందరు తాలవ్యముగాను నుచ్చరించు చున్నారు దీనికి అర్ధములు మూడు యేర్ప డినవి. 1ప్రియమైన, ఇష్టమైన, అని సామాన్యార్ధము,.2చాటు దండోరావేయు; సామాజిక సమస్య లను చాటి చెప్పునది యని
అపుడిందలిచకారము దంత్య మగును. 3 చాటు దాపరికము గాచదువ దగిన యను నర్ధమొకటి యిటీవల ప్రచారము లోనికి వచ్చినది. వల్లభుని క్రీడాభిరామము యీమూడవ కోవలోకి జేర్ప వలసిన గ్రంధము.యేలనన నీలిచిత్రముల కేమాత్రము తీసిపోని పద్య రాజము లెన్నియో నీగ్రంధమున బహుధా చోటుచేసికోన్నవి.
సీ; మకర ధవజుని కొంప యొక చెంప గనిపింప
చీర గట్టినదయా చిగురు బోడి;
ఉభయ పక్షములందు నురు దీర్ఘతరములౌ
నెరులు పెంచినదయా నీల వేణి;
పసుపు వాసన గ్రమ్ము పైటచేలములెస్స
ముసుగు బెట్చినదయా ముద్దు గుమ్మ;
పూర్ణచంద్రుని బోలు పొసఁగు సిందూరంపు
బొట్టువెట్టినదయా పొలతి నుదుట;
గీ: నెమ్మె మీరంగ నిత్తడి సొమ్ము లలర,
నోరచూపుల గుల్కు సింగార మొల్క,
కల్కి యేతెంచె మరుని రాచిల్క యనగ
వలపులకు భేటి యొక వడ్డెకుల వధూటి!
శా: పంచారించిన నీ పయోధరము లాస్ఫాలింతునో, లేత
బొమ్మంచున్ కెంజిగురాకు మోవి ణిసి ధాత్వర్ధం బనుష్ఠింతునో,
'పంచాస్త్రోపనిషత్స్వరూప పరమ బ్రహ్మ స్వరూపంబు, నీ
కాంచీదామ పదంబు ముచ్టుదునొ? యోకర్ణాట తాటంకినీ!
వినరాని మాటల ను కఠిన పదముల జొప్పించి యర్ధముల తెఱచాటు గావించి చెప్పినను వానిలోని యశ్లీలత దొలగిపోదుగదా! ఇప్పటి నాగరికతలో గూడ నిట్టిమార్పులు గానవచ్చు చున్నను, మనసంస్కారమంతయు కొంతవరకు దానిని అడ్డుకొను చున్నది .భవతునామ! నిది శ్రీనాధుని జీవన ప్రస్థానమున నొక భాగమగుటచే నింత తడవు ముచ్చటింప వలసి వచ్చినది. నేటికింతటితో విశ్రమింతము. రేపు తక్కిన విషయములు; ప్ర్థావించు కొందము సెలవు.