Wednesday 30 November 2016

హిందీ సినిమా ధృవతార మీనాకుమారి

హిందీ సినిమా ధృవతార మీనాకుమారి
మీనాకుమారి జీవిత చరిత్ర వినోద్ మెహతా గారు రచించినారు. అందునుండి నాకు జ్ఞాపకమున్న కొన్ని విషయయాలను తెలియ చేద్దామనుకున్నాను. 'ఎంతటి వారు ఏమైపోతారు బలహీనతలకు లొంగిపోతే ' అన్న వాస్తవానికి ఈమె జీవితము చక్కని ఉదాహరణ. ఈమె లోని నిర్వేదమునకు మూలము, వెనుక సుందరీ ఠాకూర్. ఈమె రవీంద్ర నాథ ఠాకూర్ గారి స్వంత తమ్ముని కుమార్తె. ఒక క్రైస్తవుని వివాహమాడి  క్రిష్టియన్ మతము పుచ్చుకొని తన ఇల్లు వాకిలి ఆస్తి వంశమును కూడా వదలుకొని వచ్చింది బాల్యములోనే. కానీ ఆ పసితనముననే విధవరాలు అగుటచే  ప్యారేలాల్ శంకర్ మీరూతి అన్న ఉర్దూ విలేఖరిని పునర్వివాహమాడింది. ఆమెకు కలిగిన ఇద్దరు కుమార్తెలలో ప్రభావతి ఒకరు. ఈ ప్రభావతియే మొదటి సారిగా అలిబక్స్ అన్న ఒక చిన్న తరహా నటుడు, కవి, హార్మోనియం వాదకుని  రెండవ పెళ్ళాముగా, ముస్లిం మతము తీసుకొని స్థిరపడింది. ఆమె కామిని అన్న రంగస్థల నామముతో నాట్యము చేసేది, జీవనాధారము కొరకు. వారిరువురికీ కలిగిన సంతానమే మీనాకుమారి. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మెహజబీన్ బానొ. అసలు ఆమెను పోషించలేక ఆమె తండ్రి ఆమెను ఒక ముస్లిం అనాధ శరణాలయములో వదిలివేసినాడు. కొడుకు పుట్టవలెనన్న ఆయన బలమైన కోరికకు విరుద్ధముగా అమ్మాయి పుట్టుట కూడా కారణము. ఆమెకు ఒక అక్క ఒక చెల్లెలు ఉండేవారు. అమ్మాయిని వదలిన వెంటనే కాస్త దూరము పోయిన పిదప అతనిలో ఎందుకో మానవత్వము జాగృతమై తిరిగీ వెళ్ళే సమయమునకు, ఎదో పాత చాప పై పడుకొని ఉండినదేమో  ఆమె శరీరమంతా చీమలతో నిండిపోయి వుండినది. వెనుకకు తీసుకు పోనయితే తీసుకు పోయినాడు కానీ పూట గడుచుట మాత్రము కష్టముగానే వుండినది. ఆమె బాధా తప్త హృదయ కుహరము నుండి వెలువడిన ఈ మాట గమనించండి.
  I never had a collection of bright colored marbles like other children -Meena Kumari.
 అలిబక్స్ తాను సంపాదించలేనని నిర్ధారించుకొని, భార్య నాట్యము చూసే వారలు లేక పోగా, ఎదో తంటాలు పడి మీనా కుమారిని 'బేబీ మీన' అన్న పేరుతో బాలనటిగా 1939 లో విజయ భట్ గారి చిత్రము లో నటింప జేసినారు. అప్పటి నుండి ఆమెయే తన కుటుంబమునకు అన్న దాత. ఆమె పాఠశాలలో ఎక్కువ కాలము నిలువలేదు. ఆమె ఆత్మగతము ఒకసారి వినండి.   Little Mahjabeen is said to have said, "I do not want to work in movies, I want to go to school, and learn like other children. సంపాదన విధి వ్రాత అయితే చదువెట్లు వస్తుంది. ఆమె చదువు పై కలిగిన మక్కువ తో Sets కు పుస్తకములను తీసుకొనిపోయి చదువుకునేది. ఆమెను ఆ రోజులలో 'READING MEHZABIN' అని పిలిచేవారట. బేబీ మీనా గా తన వృత్తి ప్రారంభించి వయసు రాగానే 'మీనా కుమారి అయిపోయింది. 34 సంవత్సరముల కమాల్ ఆమ్రోహి కి చేరువై 19 ఏండ్ల వయసులో ఆమె రహస్యముగా ఆతనిని నిఖా చేసుకొంది. అప్పటికే ఆతనికి పెళ్ళయి ముగ్గురు పిల్లలు. తండ్రికి తెలియకుండా వివాహము చేసుకొన్నందువల్ల, అలీ బక్స్ ఆమెను ఇంటినుండి గెంటివేసినాడు. అమ్మే భర్త అమ్రోహీ ని చేరింది.  అమ్రోహీ ని వదిలిన పిదప కూడా తండ్రిగారింటికి పోలేదు.
అంతకు మునుపు కొన్ని పేరుగాంచిన సినిమాలలో నాయకిగా వేసినా ‘బైజు బావరా’ ఆమెకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. దీని నిర్మాత విజయ భట్ అయినా సంభాషణలు జియా సర్హది, పాటలు షకీల్ బదాయూని, శాస్త్రీయ సమ్మిళిత బాణీలను సమకూర్చిన సంగీత కర్త నౌషాద్. నాయకుడగు భరత్ భూషణ్ కు పాడినది మహమ్మద్ రఫీ. కథ బైజు అనబడు బైజనాథ్ మిశ్రది. 15,16 శతాబ్దములకు చెందిన మొఘలాయి సామ్రాజ్యము నాటి వాడు. రాజా మాన్ సింగ్ ఆస్థాన విద్వాంసునిగా ఉండినాడు. ఈ సినిమా నాయిక యగు మీనాకుమారికి ఉత్తమ నాయకి AWARD ను ఆర్జించి పెట్టింది. నౌషాద్ ఉత్తమ సంగీత దర్శకుడు. ఆ కాలములో హిందీ సినీ మహాలోకములో హిందూ ముస్లిముల అన్యోన్యానుబంధమే గాకుండా సాహితీ సంస్కృతుల అవగాహన కూడా అంత గొప్పగా వుండేది.
ఏమయితేనేమి ఆమ్రోహీతో ఆమె అనుబంధము  10 సంవత్సరములకు మించలేక పోయింది. అనుమానము, ఆధిక్యత కారణాలుగా ఆమ్రోహీని ఆమె విడిచిపెట్టవలసి వచ్చింది. ఆతరువాత, రెండు తప్ప, అరకొర సంబంధాలు ఏర్పడినా అవి అనుబంధాలుగా మారలేదు. ఆరెండింటిలో ఒకటి ధర్మేంద్రతో. ఆతని సినిమా భవితవ్యానికి పునాది ఆమె శిక్షణ మరియు పలుకుబడి. అందుకు ప్రతిగా ఆయన కృతజ్ఞత మన కంటికి కనిపించదు. రెండవ వ్యక్తి గుల్జార్. అనుబంధము శారీరికమైనదని చెప్పలేము.  ఆమె చివరి సినిమా పాకీజా పూర్తియగుటకు 14 సంవత్సరములు పట్టింది. అంటే అమ్రోహీ అనుబంధముతో మొదలయిన ఆ సినిమా, ఇరువురూ విడిపోయిన పిదప 3,4 సంవత్సరములకు గాని పూర్తికాలేదు. అయినా తమ మధ్యనున్న  మనస్పర్థలకు తావివ్వక ఆ సినిమా పూర్తి చేసింది. ఆమె అనుబంధము సినిమాతో అటువంటిది. చివరి రోజులలో ఆరోగ్యము పూర్తిగా చెడిపోయినా పట్టుదలతో సినిమా పూర్తి చేసింది. కానీ దాని విజయాన్ని చూడలేక పోయింది. సినిమా విడుదలయిన కొన్ని వారాలకే ఆమె మరణించింది.   జీవిత వైఫల్యము ఆమెను త్రాగుడుకు బానిసను చేసింది. ఒక అనాథగా చివరకు ఆమె liver cirrhosis తో  1972 లో మరణించింది.
భారత దేశ ప్రఖ్యాత నటీమణులలో సావిత్రి, మీనాకుమారి, సుచిత్ర సేన్ అనర్ఘ రత్నములు. సత్యజిత్ రే గారు మీనాకుమారిని  "undoubtedly an actress of the highest calibre." అని ప్రశంసించినారు. అసలు ఒకనాటి హాలివుడ్ అసమాన నటి ‘మార్లిన్ మన్రో’ మరియు ఆమె భర్త ‘ఆర్థర్ మిల్లర్’ కు మీనాకుమారి మరియు ఆమె భర్త కమాల్ ఆమ్రోహీకి చాలా పోలికలు వున్నాయని చెబుతారు సినిమా పండితులు. విషాదభరితమౌ ఆమె జీవిత
కథ దివిన పిదప నా మనసు ఈ నాలుగు మాటలు చెప్పింది.

కొండ మీది రాయి కోరి, కోరి దొరలి
సాటి రాళ్ళ చేత సంతతమ్ము
దెబ్బ తినుచుతినుచు దిగి తాను భువి పైకి
మురికి గుంట చేరి మునిగిపోయె!


 ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఈమె గొప్ప నటీమణియే కాదు, గొప్ప గాయకి మరియు కవయిత్రి. ఖయ్యాం ( కభీ-కభీ సినిమా సంగీతకర్త) స్వరపరచిన  ఈ కవయిత్రి వ్రాసి పాడిన ఘజల్ మరియు ఆ ఘజల్ కు నాకు చేతనైన రీతిలో మాతృకకు అన్యాయము చేయకుండా చేసిన అనువాదముతో ఈ వ్యాసమును ముగిస్తూ వున్నాను. హిందీ లిపి ఎక్కువమంది చదువలేరేమో నన్న సంశయముతో ఆంగ్లములో ఆ ఘజల్ ను మీ ముందుంచుచున్నాను.



Chaand tanhaa hai aasmaan tanhaa.
Dil milaa hai kahaan kahaan tanhaa.
Bujh gaii aas chhup gayaa taaraa.
Tharatharaataa rahaa dhuaan tanhaa.
Zindagii kyaa isii ko kahate hain.
Jism tanhaa hai aur jaan tanhaa.
Hamasafar koii gar mile bhii kahiin.
Dono chalate rahe tanhaa tanhaa.
Jalatii bujhatii sii raushanii ke pare
Simataa simataa saa ek makaan tanhaa.
Raah dekhaa karegaa sadiyon tak.
Chhod jaayenge ye jahaan tanhaa.

[Moon is alone and sky is alone
My heart goes alone on the journey
Day has brought the light but the hope is lost
My existence trembles alone
Is this the life, (dhuaan has a meaning of a boat other than smoke)
Where body and soul walk separately?
Though I found companion during my journey
But we kept walking separately
Far away on other side of that dim light
I see a small, closed and confined heart
It will wait for me for ages
After I walk alone from this world]


చంద్రుడేకాంతము గగనమూ అంతే
చూడగా నా హృది పయనమూ అంతే
తారలే కృంగె నాశయూ మాసె
జలధి మునిగే నావ, దరికి రాదంతే  
దీనినే జీవితమంటారా
దేహి తానొంటరి ఆత్మయూ నంతే
మార్గమున బాటసారెదురైనా
నాకు నేనొంటరి మరియు దానంతే
మినుకు మినుకంచదో నొక దివ్వె
పదిలమై నిల్చెనొంటరి ఇంటిలోనంతే   
యుగాయుగాలెన్నొ గడచినా కూడా
నన్ను చేరదీయుటకై  వేచియుందంతే 

చంద్రుడో యొంటరి గగన మొంటరిగా
మానస మ్మాయెగా నిట నొంటరిగా
                                            ఇంకెగా నాశ గ్రుంకెగా తార
                                            మంచు వణికేనె యిట నొంటరిగా
జీవితమ్మది యిదంచు బిలిచేరో
దేహమో ఒంటరి జీవ మొంటరిగా
                                            దారిలో నొకని నే గాంచినచో
                                             వేరు దారుల వెళ్లెద మొంటరిగా
వెలిగి యారేను కాంతిదీపికలే
మిగిలె నొక గృహ మ్మిక్క డొంటరిగా
                                         పథము వెదకుచుందు యుగయుగాలు

                                       వీడిపోయెద నీ భూమి నొంటరిగా    
By J K Mohan Rao

Saturday 26 November 2016

Myind Media (Media for my India)
మనసు బహు విచిత్రమైనది . ఇది అందరికీ వుంటుంది , అందరిలో వుంటుంది. దాని పరిధి అనంతము. అటువంటి మనసును ముఖ్యముగా ఒక ఆదర్శప్రాయమైన విషయముపై కేంద్రీకరించుట చాలా తక్కువ మందికే సాధ్యము. Cricket లో నూరు పరుగులు సాధించి తాను గొప్ప పేరు సంపాదించవలె ననే తపన గలిగిన వారు వనములో చెట్ల వలె ఎందరో వుంటారు, కానీ తన ఉనికికి ప్రాధాన్యత నివ్వకుండా సుగంధమును లోకానికి పంచే శ్రీచందన వృక్షములా వుండే వారు  ఎక్కడ వుంటారు ఎంత మంది వుంటారు  అన్నది అంత సులభముగా తెలుసుకో గలిగిన విషయము కాదు. అటువంటి మూడు చందన వృక్షములను గూర్చినదే ఈ వివరణ.

మాన్యత మహనీయత కన్నా మానవత గొప్ప అన్న ఒక సదుద్దేశ్యముతో  ధనాపేక్ష కాకుండా జనాపేక్షతో, అమెరికా చేరినా ఆంధ్రము పై మక్కువతో, కలయికకు కారణమును ఏర్పరచుకొని , మనము అన్న భావానికే తమ మనములందు పెద్దపీటవేసి మన మధ్యకు వచ్చిన   మైండ్ మీడియా వ్యవస్థాపకులు మాట మాత్రానికి కూడా అహంకారము ఆభిజాత్యము లేని లంక నాగరాజు గారు మరియు భాను గౌడ గారు, కనక ప్రసాద్ గారు .మంచిని పెంచుటే మానవత , పెంచినది పెంపొందించుటే మా ‘నవత’ అని ఎంచి భారత దేశము పై మక్కువతో  హృదయ పూర్వకముగా   వీరు ఏర్పరచిన సంస్థ పేరు Myind Media అని పెట్టుకున్నారు.
దేశమునకు కోశము, భవితకు యువత, యువతకు ధృడత , ధృడతకు నడత అత్యంత ఆవశ్యకమని నమ్మి అటువంటి యువతలో ఉత్సాహము, ఉద్వేగము ఉత్పన్నము చేయ ఆశ్వాసనము నిస్తూ   Myind Media ను ఆవిర్భవింప జేసినారు.
శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి
అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాంతి వినాయకాః
మంచి చేయ దలచిన వారికి అడుగడుగునా అడ్డంకులే అదే చెడ్డయితే అడ్డంకులు తమకు తామే భయపడి అడ్డు తొలగుతాయి. తెలిసి కూడా శ్రేయస్సు కొరకే పాటు పద తలచినారు మన మాన్యులు. మన దేశములో యువకులు అంటే 35 సంవత్సరముల లోపు వారు 65 శాతము వున్నారు. ఈ యువశక్తి యే కదా దేశ పురోగతికి ఆధారము ,ఆలంబనము అన్న వాస్తవమును ఎరింగి మన దేశ ఔన్నత్యము, మన సంస్కృతి , మన నానా విధ శాస్త్ర పరిజ్ఞానము, మన సంగీత సాహిత్యాది లలిత కళలు, సునిశిత హాస్యము  మొదలగు వివిధములైన అంశములను తమ ఆశయముతో రంగరించి మీ కందించి ఆనందింప జేయు   పరిశుద్ధ చిత్త స్ఫూర్తితో మీ ముందుకు వస్తున్నారు Myind Media అన్న ప్రసార మాధ్యము ద్వారా. వారి నిరంతర కృషికి నింగియే హద్దు. Their main aim is:
To spread the message to the youth that India must be protected, not just for its boundaries, but for its culture, the loss of which will be a loss to the entire humanity. It is the individual′s responsibility to understand the glory of our heritage and practice our culture. Every citizen should realize that his well being is linked to the welfare of his country. It is therefore his duty to lead his life responsibly and pray for the country.

ఏపనికైనా డబ్బే ప్రధానము . ‘ధన మూలం ఇదం జగత్’ అన్నారు కదా పెద్దలు. కానీ లాభము లేని పనులలో పెట్టుబడి ఎవరు పెడతారు అని అనుకునే రోజులలో ముందుకు వచ్చినారు ఈ ముగ్గురు. వారి అచంచల విశ్వాసము తమ ధ్యేయముపైన ఉండుటచే కలిగినదాని లోనే కాసింత తో ముందునకు నడుము బిగించి ముందునకు వచ్చినారు.    . అందుకే
అల్పానా మపి వస్తూనాం సంహతి: కార్యసాధికా                                              
తృణైర్గుణత్వ మాపన్నైర్భధ్యన్తే మత్తదన్తిన:
విడివిడిగా అత్యంత బలహీనమైన గడ్డిపోచలు కలిసినాయంటే గజము నైనా బంధించ గలుగుతాయి అన్న వాస్తవాన్ని ఆకళింపు చేసుకుని ఈ పనిని తలపెట్టినారు .  కార్యము ఎంత  కఠినమైనది అన్నది కాదు ముఖ్యము ఆ పనిని చేయుటకు కలిగిన సంకల్ప బలము, ఆలోచించే బుద్ధి, సునిశితమైన పరిశీలన, అందుబాటులో వుండే వనరులు, అనుకూలించే పరిస్థితులు మరియు అన్నింటికన్నా మించి అండగా నిలిచే భావ సారూప్యత కలిగి  చేతులు కలిపే ఆప్త బృందము. అన్నీ సమకూరితే అలుపు సొలుపు లేకుండా పని చేయవలెననే అనిపిస్తుంది.
రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః
నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.
 రవిర్యార్తేవంత్యం  ప్రతిదినంఉపరస్య  నరభస్యః  
క్రియసిద్ధి సత్వే భవతి మహతం నోపకరణే.    

రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే వున్నాడు/ఉంటాడు. మహనీయులు కేవలము ఆశయము-ఫలితముపై ధ్యాసనుంచుతారు కానీ తమకు కలిగే కంటకాలను గూర్చి కాదు, అన్న విషయాన్ని అక్షరాలా పాటించి ఉన్నతి సాధించిన శ్రేష్ఠులను  ఆదర్శముగా తీసుకుని వీరు అడుగు ముందుకు వేయటం జరిగింది.

వీరు మన భరతభూమి సంస్కృతీ సౌరభమును దశదిశలా వ్యాపించవలెను అన్న   ధ్యేయముతో దానికి తగిన ఉపాంగములతో ఈ Online Radio ను ప్రారంభించినారు.
ఎన్నో ఆవిష్కరణలు చేసి కూడా పేరుకు ప్రాకులాడని మన  ఋషులను గూర్చి, మన వైదిక ధర్మమును గూర్చి, వైదికము నందు అంతర్గతమైన మతముల గూర్చి (Various Schools Of Thoughts), శాస్త్రీయ సంగీతమును గూర్చి, శాస్త్రీయతను సంతరించుకున్న మన సినిమా సంగీతమును గూర్చి, KVరెడ్డి ,BN రెడ్డి, LV ప్రసాద్, కమలాకర కామేశ్వర రావు వంటి దిగ్దంతులైన దర్శకులను గూర్చి, వివిధ రంగములలో విశ్వ విఖ్యాతి గాంచిన తెలుగు తేజములను గూర్చి, భళారే విచిత్రమనిపించే ఎన్నో విడ్డూరాలను గూర్చి , ‘ప్రియమైన మీతో’ అన్న పేరుతో వక్త శ్రోతల లఘు సంభాషణలు, ప్రజలను పేద దారి పట్టించే అమెరికా నాగరికత లోని లొసుగులకు సంబంధించిన వక్తల ముఖాముఖి ప్రసంగములు,  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము పై ‘ Techie Talk’ ఆధునిక శాస్త్ర విజ్ఞానమును గూర్చి ‘Science Talk’ ఆయుర్వేద వైద్య  విధానము ననుసరించి శరీర ఆరోగ్యమునకు తీసుకొనవలసిన సలహాలను గూర్చి, ఇవన్నీ కాకుండా నేటి తెలుగు ప్రపంచములో లబ్ధ ప్రతిష్ఠులైన వారితో ముఖాముఖీ మొదలైన అంశములతోనూ, అందరికీ నవ్వుకొనుటకు అనువైన విధముగా అశ్లీలము లేని హాస్యరస కార్యక్రమములతోనూ, గోపికా మానస చోరుడైన శ్రీ కృష్ణుని ఆదర్శముగా గొని తెలుగు జగతి లోనికి అడుగు పెట్టింది.

ఇది కాకుండా ఇటు శ్రోతలలో అటు ప్రజలలో కూడా సంస్కృతి , కవిత్వము మొదలగు విషయములపై సదవగాహన పెంపొందించుటకు ‘పద్య స్పర్ధలు’ కవిత స్పర్ధలు’ ప్రజల ముందుకు తెచ్చి  వారిలో ఒక నూతన ఉత్తేజమును కలిగించు నిబద్ధత తో సామాజిక రచ్చబండగా చెప్పదగిన ‘ఆనన గ్రంధి’ లేక ‘గ్రంధ ముఖి’(facebook) లో ప్రకటించి , అందులో పద్యములు వ్రాసిన వారిని  అందరినీ ప్రోత్సహించ దలచి ఉచిత రీతిగా బహుమతి ప్రదానము చేయుట జరిగినది. కవితల విషయములో పోటీదారులు ఎక్కువై నందువల్ల  బహుమాన యోగ్యత కలిగిన వానికి బహుమతి ప్రదానము ప్రకటించుట జరిగినది. కవిత వస్తువు ‘ఉగాది’ కాబట్టి పాల్గొను వారి సంఖ్య పరిమితి దాటింది.

ఇవే కాకుండా కృష్ణ పుష్కరములకు  పుష్కర ప్రాశస్త్యము, విశేషించి కృష్ణా పుష్కరముల గొప్పదనమును గూర్చి  తెలుపుతూ ఒక సంచికను వీరు విడుదల చేయబోవుచున్నారు. దానిని ఉచితముగా భక్తులకు అందజేయ వలెననుకొనుట వారి సౌమనస్యత. 

ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటంటే ఉత్తుంగ తరంగములతో దనరారు భారతీయ విజ్ఞాన సాగర విశిష్ఠతను  తెలుగువారికి తెలుగు వారికి తెలియజేయ దలచిన అంతరంగము గలిగిన వారి శ్రీయుతులు చెరుకు రామమోహన్ రావు గారికి ఆ బాధ్యతను ఒప్పజెప్పినారు. 

ఇవికాకుండా సంస్కృతము భారతీయ భాషలకు మాతృకయే కాక సంస్కృతికి , సాహిత్యానికి, విజ్ఞానానికి ఆటపట్టన్నది గ్రహించి, ప్రపంచమంతా విస్తరించియున్న ‘సంస్కృత భారతి’ అన్న సంస్థతో సంప్రదింపులు జరిపి, వారి సౌజన్యముతో మన ‘అదృశ్య వాణి’(Radio) శ్రోతలకు ఆ దేవ వాణి యందు అభినివేశమును కల్పింపవలెనని కంకణము కట్టుకొని యున్నారు. మరియొక ముఖ్యమైన విషయము ఏమిటంటే ‘అవధానము’ అన్నది ఆంధ్రుల ఆస్తి. కొన్ని ఇరుగుపొరుగు భాషల వారు ఈ ప్రక్రియకై ప్రయత్నించి ప్రతిఫలము సాధించలేక పోయినారు. అటువంటి సంపదను ముందు తరాలకు అందించుటకు గాను శ్రీయుతులు మోపిదేవి భాస్కర రావు    గారి సహాయ సహకార సౌజన్యములతో  బాలురకు పరిచయము చేయబోవు చున్నారు .

ఈ విషయములన్నీ ప్రజలలో చొచ్చుకొని పోవుటకు ముందు కావలసినది జనాకర్షణ. అందులోని భాగముగా నేటి పేరుపొందిన గాయకులచే ‘మీ పాట మా నోట’   అన్న శీర్షికతో శ్రోతల సంఖ్యను ఇనుమడింప జేస్తున్నారు.

వైవిధ్య భరితమైన ఇన్ని కార్యక్రమముల పట్టిక చూస్తే వీరిలో ఎంత ఉత్సాహము ఎంత ఉద్వేగము ఎంత పట్టుదల ఉన్నదో తెలియవస్తుంది. మరి ఇన్ని ప్రణాలికల (నిజమునకు ప్రణాళిక అంటే భూమి లోనికి  దింపిన క్రోవి అనగా నాళము, ఆంగ్లములో Pipe or Tube)
కు తగిన తైలము భూమి నుండి వస్తుందా అన్న భయము కలుగుతుంది. అయినా ‘కృషి తో నాస్తి దుర్భిక్షం’ అన్నారు కదా పెద్దలు. నిస్వార్థ సేవకు పరమాత్ముని అండదండలు తప్పక ఉంటాయన్నది ఆర్యవాక్కు.

ఆశయమేమొ గొప్ప యది యాచరణమ్మున గూర్చ నెంచుచున్
పాశము తోడ ఈ పనిని బాయక చేయగ నిర్ణయించుచున్
లేశము కూడ  సందియము లేక మనంబున దేశమాత సం

దేశము గాంచు వీరల సుధీరుల గాచుము వెంకటేశ్వరా! 

రాజు,కనక, భాను, రవీందర్ లను గూర్చి వ్రాయ వలెను...... పద్మిని ని గూర్చి ఒక మాట చెప్పవలెను.స్వకీయమన కారణాల వాళ్ళ వదిలిపెట్టిందని........ 

Monday 21 November 2016

ఇదీ నిజం ఇదే మోదీయిజం

ఇదీ నిజం ఇదే మోదీయిజం
మోదీ దెబ్బకి ఆస్తులు అమ్ముకుంటున్న అంబానీ, అదానీలు.
మోదీ ప్రతాపం సామాన్యుల మీదేనా? మోదీకి అధికారం ఇచ్చింది సామాన్యులని ఇబ్బంది పెట్టడానికా అన్న ప్రశ్న మన మెదడులోని మారుమూలల్లో బయటికి రాలేక దాగుకొని వుంది. కానీ వాస్తవానికి నోట్ల రద్దు నిర్ణయమునకు ముందే,నుంచే
బడాబాబులపై దృష్టిపెట్టినట్లు తెలియవస్తూవుంది ఈ క్రింద తెలిపిన వైనము చూస్తే!. లక్షల కోట్ల అప్పులు తీసుకుని అవి తీర్చకుండా దర్జాగా తిరుగుతున్న వ్యాపారులకు మోదీ ఎనిమిది నెలల క్రితమే హెచ్చరిక పంపినారు. బ్యాంకులకు
కట్టవలసిన 5 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ తో కలిసి మోదీ ఎంతో తీవ్రముగా ఆలోచించినారు. ఆస్తులు అమ్మి అయినా సరే అప్పులు కట్టితీరవలసిందేనని ఫిబ్రవరి 8న నే ఆయన బడాబాబులకు లేక బడాయి బాబులకు అల్టిమేటం ఇవ్వటము జరిగింది అని తెలియవస్తూవుంది. దీనితో అనేక కార్పోరేట్ కంపెనీలు తమ ఆస్తులని అమ్మకానికి పెట్టినట్లు తెలియవస్తూవుంది. నిజానిజాలు నాకు తెలియదు గానీ తెలియవచ్చిన సమాచారము ఈ క్రింది విధముగా వుంది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్
ఈ గ్రూప్, బ్యాంకులకి మొత్తం 1లక్ష 21వేల కోట్లు అప్పు ఉంది. దీన్ని తీర్చడం కోసం రిలయన్స్ తమ 44 వేల టెలికాం టవర్స్ ను 22 వేల కోట్లకు అమ్మకానికి పెట్టింది. దానితో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 8వేల కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఇక తమ మీడియా విభాగాన్ని 2వేల కోట్లకు అమ్మవలెనని నిర్ణయించుకుంది. ఈ విధముగా ఆస్తుల అమ్మకం ద్వారా మొత్తం 60 వేల కోట్లు సమీకరించి, అనిల్ అంబానీ తనకి ఉన్న అప్పుల్లో సగం తీర్చివేయ దలచినారని తెలియవస్తూవుంది. ఈ గ్రూప్ దేశంలో ఉన్న బ్యాంకులకు మొత్తం ఒక లక్ష కోట్ల అప్పుంది. ఈ గ్రూప్ తనకున్న ఆయిల్ రిఫైనరీలలో సగం వాటాను అమ్మి 25వేల కోట్లు, స్టీల్ ప్లాంట్స్ లో 49% వాటాను అమ్మి మరో 25వేల కోట్లు సమీకరించి, బ్యాంకులకి చెల్లించనుంది అని తెలియవస్తూవుంది.
అదానీ గ్రూప్
మోది ఆప్తుడు గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్ బ్యాంకులకు మొత్తం 96 వేల కోట్ల బకాయిలు ఉంది. ఇవి తీర్చడం కోసం విదేశాలలోని బొగ్గు గనులను, రైల్వే ప్రాజెక్టులను అమ్మవలెనని నిర్ణయించుకుంది. తాజాగా మరో 6వేల కోట్ల ఋణం కోసం SBI తో MOU కుదుర్చుకుంది. ఇప్పుడు ప్రభుత్వ పెద్దల సూచనతో SBI ఈ లోన్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలియవస్తూ వుంది.
జేపీ గ్రూప్
మనోజ్ గౌర్ కు చెందిన జేపీ గ్రూప్ బ్యాంకులకు 75 వేల కోట్ల అప్పు ఉంది. ఇది తీర్చడం కోసం తన సిమెంట్ కంపెనీలలో కొంత భాగాన్ని బిర్లా గ్రూపునకు అమ్మి 15 వేల కోట్లు అప్పు తీర్చదలచుచున్నది. దీనికి తోడు, ఇతర ప్రాజెక్టులు అమ్మడం ద్వారా ఇంకొంత డబ్బు సమకూర్చుకుని మొత్తం, 24 వేల కోట్లు అప్పులు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలియవస్తూ వుంది.
GMR గ్రూప్
తెలుగు వాడు, గ్రంథి మల్లికార్జునరావు గారికి చెందిన GMR గ్రూప్ కి మొత్తం 48 వేల కోట్ల అప్పులున్నాయి. ఈ గ్రూప్ తన అప్పులని తీర్చడం కోసం తమ అధీనంలోని రోడ్లు, ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ లలో కొంత వాటాను అమ్మడానికి సిద్ధం
అయింది అని తెలియవస్తూ వుంది.
లాంకో గ్రూప్
లగడపాటి వారి లాంకో గ్రూప్ కి మొత్తం 47 వేల కోట్ల అప్పులు ఉన్నట్లున్నాయి. వీటిని తీర్చడం కోసం రోడ్లు, పవర్ ప్రాజెక్ట్ లతో పాటు ఆస్ట్రేలియాలో కొన్న బొగ్గు గనులలో కూడా వాటా అమ్మి 25 వేల కోట్లు సమీకరించనుంది అన్నది అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తూ వుంది.
GVK గ్రూప్
జి.వి.కృష్ణారెడ్డి గారికి చెందిన ఈ గ్రూప్ కి 33 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇవి తీర్చడం కోసం, వివిధ మార్గాలలో ఆస్తులలో వాటాలని అమ్మి 10 వేల కోట్లు సమీకరించే ప్రయత్నాలలో ఉంది.
ముకేష్ అంబాని
ముకేష్ అంబానీ విషయానికి వస్తే, ఆయన గ్రూప్ కి మొత్తం 1లక్ష 87వేల కోట్లు అప్పులు ఉన్నాయని తెలివస్తూంది. వీటిలో జియో కోసం చేసిన 65 వేల కోట్ల అప్పు కూడా ఉంది. జియో కోసం రిలయన్స్ మొత్తం లక్షా యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ముకేష్ కు చెందిన రిలయన్స్ మాత్రం బ్యాంకులకి వడ్డీ సకాలంలో చెల్లిస్తోంది. ఈ గ్రూప్ వ్యాపారాలు అన్నీ లాభాలలో ఉన్నాయి కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, తన మిత్రుడు కదా అని మోదీ ముకేష్ అంబానీని కూడా వదలలేదు. అక్రమంగా గ్యాస్ తవ్వుకున్నందుకు కేంద్రం, రిలయన్స్ కు 10 వేల కోట్ల ఫైన్ వేసిందని సమాచారము.
ఇక దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని సిగ్గు లేకుండా నడిపిన మన్మోహన్ గారు, వారికి నాయకత్వం వహించిన సోనియా గారి హయాములో కార్పోరేట్ కంపెనీలు పండగ చేసుకున్నాయి అన్న విషయము అందరికీ తెలిసినదే! 2009 మార్చి నాటికి కంపెనీలు చెల్లించాల్సిన అప్పుల్లో 85 వేల కోట్లను కొత్త రుణాలుగా మారిస్తే, ఈ మొత్తం యు.పి.ఏ చివరి ఏడాదికి వచ్చే సరికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల మేర కార్పోరేట్ డెబ్ట్ రి-స్ట్రక్చరింగ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరింది. దేశంలో టాప్ 10 కంపెనీల అప్పులే 5 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 2 లక్షల కోట్లు ఇప్పుడు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పట్టుదలగా ఉన్నాయి.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతి, నల్లధనం, మొండి బకాయిలు, నకిలీ కరెన్సీ ఈ మూడిటి మీద మోది దృష్టి పెట్టి గట్టి చర్యలే తీసుకుంటున్నారు. మోది చెప్పినట్లు 70 ఏళ్లనుంచి పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలి అంటే కాస్త సమయం పడుతుంది. నోట్ల మార్పిడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. పైనుంచి క్రింది దాకా మొత్తాన్ని ప్రక్షాళన చేయడం కోసం మన ప్రధాని మోది చేస్తున్న యజ్ఞం ఇది. అందుకే కాస్త ఈ ఇబ్బందులను వరిద్దాం భరిద్దాం, ప్రభుత్వానికి సహకరిద్దాం ఆపై ఈ కష్టాలను తరిద్దాం.
'అమ్మను Q లో నిలిపినాడు అమ్బానీని నిలుపలేదు' అన్న మాటలో కేవలము అనుప్రాస మాత్రమె వుంది. వాస్తవము లేదు. ఒక సాధారణ ప్రభుత్వ అధికారి తానూ వరుసలో నిలువకుండా తన Office Boy ని నిలుచుటకు పంపుతాడు మరి అంబానీ తనకు అవసరమైనపుడు పంపలేడా!
శుభం భూయాత్

మనసు - Mind

మనసు - Mind
The word ‘man’ comes from the Sanskrit root man, which means mind. If you understand the workings of the mind, you will understand the reality of man. If you understand the inner mechanism of the mind, you will understand the past of man, the present and the future too. Find out the real Truth about the mind and life in general. Actually, under normal course the mind controls the man and hence the behavior of man becomes erotic. If it is going to be otherwise then the man can command demand and even reprimand his mind to act according to him. If everybody realizes the reality in this, then that day will surely bring RAMA RAJYA to the earth.
'మానవ' అన్న శబ్దము 'మనః' శబ్దజన్యము. 'మను' నుండి కూడా పుట్టినది అంటారు. ప్రస్తుతము ఈ విధముగా తీసుకొందాము. ఈ మనస్సు అన్న మాటకు ఆంగ్లములో సమానార్థకము లేదు. ఈ మనోప్రవృత్తిని బట్టి మనిషి యొక్క గుణగణములుగానీ ఆలోచనా విధానము గానీ, సంభాషణా సామర్థ్యము గానీ ఆధారపడి వుంటుంది. ఈ మనసే మన జీవిత గమనమును గమ్యమును నియంత్రించుతుంది. ఆ మనసును మనము నియంత్రించ గలిగితే మనము నిజముగానే మానవులమౌతాము . అట్లు కాకుంటే కేవలము మానవ మాత్రులమే! మనసును అదుపులో నుంచుకొనుట నేను చెప్పినంత సులభము కాదు. అయినా 'కృషితో నాస్తి దుర్భిక్షం' అని 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అని కదా పెద్దలు చెప్పినారు. మరి ఆదిశగా ఏమాత్రము ప్రయత్నిచుచున్నాము అన్నది మనము ఆత్మ విమర్శ చేసుకొనవలసిన విషయము. మనసులో మంచిని నెలకొల్పితే మానవునికి భక్తి, శ్రద్ధ, నీతి, నిజాయితీ, ప్రేమ, అంతఃకరణ అన్నీ వస్తాయి. అప్పుడు ఈ ప్రేమనే విశ్వవ్యాప్తము చేయగలము, మనము ఈ ప్రయత్నమును ఉమ్మడిగా చేస్తే! అప్పుడు రామరాజ్యము తిరిగీ భూమిపై ప్రతిష్ఠింపబడదా!                                                     
చెరుకు రామ మోహన్ రావు - Cheruku Rama Mohan Rao

Monday 14 November 2016

స్నేహమంటే

స్నేహమంటే
అనుబంధాలను ఉంచేది - అనురాగాలను పంచేసేది
ఆత్మీయతతో అలరించేది ఆత్మానందము నందించేది
మరుపు రానిది, మరువ లేనిది- మాసి పోనిది మారబోనిది
తియ్యనైనది , తిరుగులేనిది - నిత్యమైనది, సత్యమైనది
కపటమన్నదే కానరానిది - కలహమన్నదే కలుగలేనిది
మేని అందమును చూడబోనిది - మేలిమి మనసుల కలయికైనది
అపార్ధమన్నది అర్థం కానిది - అనుమానానికి తావివ్వనిది
ఆత్మానందము కలిగించేది - సృష్టిలోనె తా పుట్టు చున్నది
సృష్టి తోడుతే లయమౌచున్నది - తియ్యనైనది కమ్మనైనది
పెరుగుటె కానీ విరిగి పోనిది - ఎంత పంచినా తరిగి పోనిది
ఎగిరి పోనిది ఇగిరి పోనిది - అనురాగానికి అమ్మ వంటిది
అలుపెరుగనిది సొలుపెరుగనిది - అసలు స్నేహమది అన్నది నామది

చెరుకు రామ మోహన్ రావు