Tuesday 31 January 2017

రాభణ

రాభణ
https://cherukuramamohan.blogspot.com/2017/01/blog-post_31.html
ఇది  కాళీదాసు చాటువు అని చెప్పుకొంటారు. ఒక బ్రాహ్మణుడు కడుపు చేత పట్టుకొని భోజరాజు వద్దకు వచ్చి తాను పౌరాణికుడనని చెప్పుకొన్నాడు. అప్పుడు భోజుడు తను వ్రాసిన చంపూ రామాయణమును గూర్చి కాళిదాసాది కవులతో ముచ్చటిస్తున్నాడు. రావణుని గూర్చి చర్చ జరుగుతూ వుండినది. ఆ పండిత సదస్సులో భోజుడు చంద్రుడి లాగా వెలుగుతూ తన ప్రియమైన రోహిణి చెంతనున్నాడా అన్నట్లు కాళీదాసును తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని వున్నాడు. బ్రాహ్మణుడు తనను పరిచయము చేసుకొను ప్రయత్నములో ఆ సదస్సు లో కవి పండిత శ్రేష్ఠులను చూసి జడుసుకొన్నాడు. అంతలో రాజు రావణుని గూర్చి తెలుపమని అడిగితే పండితుడు తత్తరపాటుతో 'రావణ' అని ప్రారంభించుటకు బదులుగా 'రాభణ' అని అన్నాడు. భోజుని ముఖ కవళికలు మారటం కాళీదాసు గమనించినాడు. ఆయన వెంటనే ఆ పౌరాణికుని సమర్థిస్తూ " మహారాజా వారి విద్వత్తును గూర్చి నేను కర్ణాకర్ణిగా ఎన్నోమార్లు విని వున్నాను. ఆయన ఉద్దేశ్యం మనమందరమూ చేసుకోగలమోలేమో అని 'రాభణ' పద ప్రయోగము చేసినాడని చెప్పినాడు.
అంత భోజుడు దాని వివరమడిగితే కాళీదాసు ఇట్లు చెప్పినాడు.
కుంభకర్ణే భకారోస్తి, భకారోస్తి విభీషణే
అగ్రతశ్చ స్వయం రాజా 'రాభణో'నచ 'రావణః'
అని సర్ది చెప్పినాడు. ముగ్దుడైన భోజరాజు అతనిని ఉచిత రీతి సత్కరించి పంపినాడు.
ఇంతకూ కాళీదాసు చెప్పిన శ్లోకమునకు తాత్పర్యమేమిటంటే
రాజా! మొదటి తమ్ముడైన కుం''కర్ణుని పేరులో లో '' వుంది రెండవ వాడిన వి'భీ'షణుడిలో '' వుంది. మరి స్వయంగా రాజు దానికి తోడూ వారికి అగ్రజుడైన వాడు "రా''ణుడు" కాక రావణుడు ఎట్లౌతాడు అని విమర్శచేసి చెప్పినాడు.

అదండీ విషయము.

Wednesday 25 January 2017

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరాఅందుకు వలయు ఉపకరణములు కూడావ్ ముఖ్యము.

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా – 1
https://cherukuramamohan.blogspot.com/2017/01/blog-post_25.html

జాబిల్లి: సవివరంగా ప్రచురించారు. ధన్యవాదాలు... ఒక్క ప్రశ్న.. ఇది నా అజ్ఞానానికి తెలియనిదనానికి తార్కాణం కావచ్చు. ఇంత విజ్ఞానం భావి తరాలకు (అంటే మన పూర్వికుల తరువాతి తరాలకు) ఎందుకు సమగ్రంగా అందించబడలేదు? ఈ విజ్ఞానం మరుగునపడడానికి కారణం ఏమిటి?
నాకు తెలిసినంత వరకు తెలియ జేసే ప్రయత్నము చేస్తాను (రామ మోహన్ రావు జవాబు )
స్వచ్ఛమైన పాలు ఒక పాత్రలో వున్నాయనుకొందాము. ఒకడు ఆ పాలను చూస్తూనే అన్నీ త్రాగేయాలనుకొన్నాడు. అంతలో ఎవరో పిలిస్తే అటు వెళ్లి కాసేపు గడిపినాడు. వచ్చి త్రాగుదామనుకొంటే అంతలో అతని అర్ధాంగి పిలిచి పెరటిలోని కరివేపాకు వెంటనే కోసి ఇవ్వమనింది. ఇచ్చి వచ్చేసరికి కాస్త ఆలస్యమైనది. అంతలో ఇంటికి ఎవరో అతి ముఖ్యమైన అతిథులు వచ్చినారు. వారితో కూర్చొని మాట్లాడకుంటే బాగుండదని కూర్చున్నాడు. ఆటంకాలన్నీ తొలగించుకొని వచ్చి చూస్తే దానిలో ఈగ పడి వుంది. దానిని తీసివేసి కాచమన్నాడు భార్యను. ఆమె కాచితే అవి విరిగి పోయినాయి. ఈగ మాత్రము విమానము వలె ఇంటిలో స్వైరవిహారము చేస్తూ ప్రతి ఖాద్య యోగ్యమగు పదార్ధమును దాని పాత్రను, తాను దిగుటకు అంటే వాలుటకు యోగ్యమగు విమానాశ్రయమును చేసుకొని వుంది.
.....2

కళ్ళు తెరచి కనరా--ఒళ్ళు మరచి వినరా –2

ఇది ఇప్పటి మన తెలుగు పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మా తరము వారి ప్రతీక అని ఉహించుకొంటే, అతను పాలు త్రాగుటకు ఏర్పడిన వివిధ విధములగు ఆలస్యములు వారి జీవితములో ఏర్పడిన అడ్డంకులు అనగా ఉద్యోగమూ, సంపాదన, సంసారము, సంఘ గౌరవము, బంధుమిత్ర సంబంధములు మొదలగు ఎన్నో విషయములుండేవి.  మా తరములో కొన్ని అత్యంత అవసరాలకు సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగము కొరకు చదువుకొన వలసి వచ్చింది. చదువు ముగియగానే ఉద్యోగము. ఉద్యోగము లేకుంటే కుటుంబము గడుచుట కష్టమైపోయేది. ఉద్యోగము పెద్దదైతే పదవీ వ్యామోహము, చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి చదివే తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్ నవలు ఇంకొకప్రక్క , శృంగార సాహిత్యమను పేరుతో అసభ్య అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు వేరొక ప్రక్క, మాసపత్రికలు మరొక ప్రక్క, ప్రొద్దు పుచ్చుటకు సినిమాలు తలకెక్క, ఇక గ్రంథములు చదువుటకు వేసలుబాటేదీ!

ఒక అదృష్టమేమిటిటంటే ఉత్సాహమున్న వారికి చెప్పేవారు మా కాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే వారూ కూడా కను మరుగే.

ఒక వాహనచోదకుడు తాను బండి నడిపినంతకాలమూ ఒకే ధ్యేయమే! తన గమ్యమును ఎటువంటి వడి-దుడుకు లేకుండా తన దృష్టిని మరల్చకుండా సజావుగా పోతూ ఉండుట. ఆ వాహన చోదకునిగా మనల నూహించుకొంటే మన జీయిత గమ్యము వరకూ బండి నడచినంతకాలమూ దృష్టి సంపాదనపైనే! అప్పుడు ఏమీ చేయలేని స్థితి వచ్చినపుడు చేతలుడిగి మూలాన కూర్చుంటాము. అదే మనము ఒక పూలతోటకు మాలి అయితే రోజుకునొక పూల చెట్టువద్ద దాని సౌరభామును ఆస్వాదిన్చుతూ ఆనందముగా గడుపవచ్చును. అందుచేత నేను చెప్పవచ్చేదేమిటంటే డబ్బుగాక ప్రపంచములో భక్తీ జ్ఞానము వైరాగ్యము (సన్యాసము కాదు) కూడా ముఖ్యము. 

.......౩

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా –౩

ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠనమో అవధానమో (అవధానము,కవి సమ్మెళనము సా. 5 గం. లకు మొదలయ్యేది.) కవి సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే వారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా అవధానములను నిర్వహించేవారు వున్నారు. వారికి ధనము, పేరు, పలుకబడి పై మక్కువ ఎక్కువ. వినేవారు మాత్రము తప్పక కొదవయిపోయినారు. ఏతా వాతా ఎవరయినా వచ్చి కూర్చున్నా వారి అర్థమయ్యేది సున్న. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై తాండవమాడుతూవుంది. పిల్లల వద్ద వుండేది ఆయ. వారిలో సంస్కారము మాయ. ఇవి స్పీకింగ్లీష్ వాకింగ్లీష్ ఈటింగ్లీష్ రోజులాయె. దీనికి తోడు పిల్లలకు వెబ్బు లో దొరికే గబ్బు మీద మోజెక్కువాయె. మా కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక వారి పిల్లల కెంతెంత.

ఇది కాక కొందరు మహా పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక నాటి ఆంగ్లేయాధికారుల మెప్పుకై  వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే తెలుగును ప్రభుత్వమును ఒప్పించి పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.

భాష వుంటే గ్రంధాలుంటాయి. గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు వారిగా లేక ఆంధ్రులుగా గుర్తింపు వుంటుంది. లేకుంటే గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే !

మోహము వీడి సంపదల, మొత్తము జీవితమంత డబ్బుకై

దాహము చెందబోక తన దారిన దేహము పోక ముందరే 

ఈహను వీడుచున్ ఇహము ఈ క్షణమే నిను వీడునంచు, దా

సోహము ఆ పరేశుడగు సుందరమూర్తికి యంచు కొల్వరే!  

స్వస్తి.




Monday 23 January 2017

బాలుడైన గోపాలుని పాదాలకు అంకితం భక్తి తత్వ శిఖరాగ్రణి పాదసేవనం


బాలుడైన గోపాలుని  పాదాలకు అంకితం 
భక్తి తత్వ శిఖరాగ్రణి పాదసేవనం

అజర్ బైజాన్ అన్న దేశము ఒకటి ఉన్నదన్న విషయమే కొందరికి తెలిసి ఉండదు. ఒకప్పుడిది USSR కు అనుబంధ దేశముగా ఉండేది. అందులో ‘బకు’ అన్నది ఒక ఊరు. ఆ ఊరికి చెందిన ఆ భక్తురాలు మార్చుకున్న పేరే పాద సేవనం. పాదముల సేవించుట అన్నది ఈ మాట యొక్క అర్థము అన్న విషయము నేను ప్రత్యేకముగా మీకు తెలుప నవసరము లేదు. ఎవరి పాదములు అంటే బాలగోపాలుని పాదములు.
అసలు ఎక్కడో మారు మూల ఉన్న ఆమెకు ఈ భక్తి ఏవిధముగా అబ్బిందబ్బా అనుకొంటున్నారేమో!
ఒకానొక పర్యాయము ఒక కృష్ణ భక్తుడు భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వాములవారు వ్రాసిన భగవద్గీత పుస్తకము ఆమెకు ఇవ్వటము జరిగింది. ఆసాంతము ఆమె దానిని చదివిన పిమ్మట అర్థమైపోయింది అది ఒకసారి చదివి ముగించే పుస్తకము కాదు నిత్య పారాయణము చేయవలసినది అని. ఆమె పిల్లలంతా సంపాదకులై ఎవరి దారిన వారు పోగా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండేది. తన పని ముగిసిన వెంటనే ఆమె భగవద్గీతను పారాయణము చేస్తూ వుండి పోయేది. ఆమె వయసు 74 సంవత్సరములు అప్పటికి. పుస్తకము పై ISCON వారి చిరునామా ఉడుటచే  బకు లోని ఆ గుడిని చేరుకొంది తన జీవితములో మొదటిసారి. అతిథులు కూర్చునే చోట ఆమెను కూడా కూర్చుండజేసి  ఇంకా కొందరు అతిథులను చేరబిలుచుటకు పోయినాడు కార్య కర్త. క్షణము ఆలస్యము లేకుండా తాను భగవద్గీత అధ్యాయాలలో గుర్తులుంచుకొన్న పుటలలోని శ్లోకములను రసవత్తరముగా తనతోబాటూ వున్న భక్త బృందమునకు తనదైన శైలిలో చెప్పుట మొదలుపెట్టినది. ఆశ్చర్యపోయినారు ISCON అంతేవాసులు. ఆమెతో కూర్చొన్నవారు ఆమె వాక్ ఝరి లో ఓలలాడుట  ISCON సదస్యులు గమనించి అచ్చెరువందినారు.
గుడికి వచ్చుట ఆమె నిత్య విధి అయిపోయినది. ఒకరోజు ఆమె అచటి ISCON పెద్దలతో తాను నివసించే తన స్వంత భవనమును అమ్మి ISCON కు ఇచ్చి వేస్తానని చెబుతూ అందుకు ప్రతిగా తన నిత్య నైమిత్తిక అవసరాలకు అనువుగా వుండే విధముగా ఒక్క గదిని తనకు గుడిని ఆనుకొని ఏర్పాటు చేయమని అడిగినది. తర్జన భర్జనల తరువాత ఆమె సరేననడమూ జరిగినది. కాలక్రమేణ ఆమె అచట చేరుటయే కాక అచట తులసి తోటను పెంచింది. వచ్చిన భక్తులకు కృష్ణ తత్వోపదేశములోనే కాలము గడిపేది. రాజకీయములకు ఆమె బహుదూరము. 1974 లో ISCON లో భక్తి వేదాంత స్వామి గురుత్వములో చేరిన రోహిణీ సుత ప్రభు
తన పర్యటన లోని భాగముగా బకు వచ్చినపుడు ఆ మహానీయురాలికి పాద సేవనం  అన్న పేరు పెట్టుట జరిగినది. అది మొదలు ఆమె పేరు అందరూ మరచిపోయినారు. తన కృష్ణ భక్తియే తన లక్ష్యము అన్యము నిర్లక్ష్యమే! చతుర్విధ పురుషార్థములలో అత్యున్నతమైనది మోక్షము. దీనిని ఇంకా అనేక నామములతో పిలుస్తారు. అవి ఏవంటే ముక్తి, విముక్తి, కైవల్యము, నిర్వాణము, వర్గము, నివృత్తి, నిశ్రేయసము, పరమగతి, పరమపదము, అని మనము చెప్పుకోవచ్చు.
ముక్తి త్రయం అనే మూడు పదాలు ఉన్నాయి. అవి : క్రమ ముక్తి, జీవన్ముక్తి, విదేహ ముక్తి. ఇది నాలుగు విధములుగా  కూడా చెప్పబడినది. వానిని ముక్తి చతుష్టయము అని అంటారు. అవి సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము.
మోక్ష మార్గం - కర్తృత్వ భావన లేకుండా కర్మలను చేసి, సర్వ ప్రాణుల పట్ల దయగా వ్యవహరిస్తూ, సాధన చతుష్టయాన్ని అనుసరించే వారు మోక్షాన్ని సాధిస్తారు. అర్చిరాది మార్గాలతో వీరికి పనిలేదు. ఈ మార్గాన్నే విదేహ కైవల్య మార్గమనీ అంటారు. దీనికి ఆలంబనము భక్తి. ఈ భక్తిని తొమ్మిది విధములుగా విభజించినారు. అవి
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
ఈ మహా భక్తురాలు నా ఊహ ప్రకారము అటు సాలోక్య మార్గమును ఇటు సఖ్యము మరియు ఆత్మ నివేదనమును ఆశ్రయించినది. ఒక రోజున ఒక అనార్ద్ర ఘటము (Dry Cell) తో నడిచే ఒక బొమ్మ తేరు (Car) ను తెచ్చి ఆమె అందులో తన బాలకృష్ణుని కూర్చుండ బెట్టుకొని తన శక్తి మేరకు ఆ చుట్టుప్రక్కల త్రిప్పుతూ వుండినది. భక్తులు ఆమెను అడిగితే ఆమె చెప్పిన జవాబు ఏమిటంటే నా కృష్ణుడు పసి బాలుడు. తానూ ఆటలాడుకోవాలంటాడు కదా! కారులో త్రిప్పమని నన్నడిగినాడు. త్రిప్పుతూ వున్నాను. ఆమె కృష్ణుని కోసం మంచము వాల్చి పక్క వేసి యుంచేది. ఆమె చేసే ఏపనీ చూపరులకు కొంత చిత్రముగానే వుండేది.
ఆమె ప్రవర్తన ఎంతసేపూ కృష్ణుడు తన కొడుకో మనుమడూ అయినట్లు ఆయన బాగోగులు తానే చూసుకోనవలసినట్లు తలచేది. ఒకరోజు అక్కడ వుండే తనకు కాస్త ఎక్కువగా పరిచయము వున్న వారితో ఈ విధముగా చెప్పింది. నాకు నా కృష్ణుడు రాత్రి కలలో కనిపించినాడు. నన్ను అహోబళం పొమ్మని నా కృష్ణుడు నన్ను ఆదేశించినాడు. అక్కడ వీర నరసింహుడునిర్జన కీకారణ్యములో వారానికి ఒక రోజు పూజతో వుండిపోతునాడట.ఎక్కడి అహోబళము ఎక్కడి అజర్ బైజాన్. 74 సంవత్సరముల పండు ముసలి ఆమె, చేరవలసినది పులులు సింహాలు పాములు తేళ్ళు విరివిగా వుండే కీకారణ్యము. పరమాత్మ ఆదేశము ముందు వయసు, దూరము, కష్టము, భయము, నిస్సహాయత ఏవీ ఆమెను నిలుపలేక పోయినాయి. ఆమె అనుచరులు నీవు కృష్ణ భక్తురాలివి కదా బృందావనము నిన్ను క్షేమముగా పంపుతాము నీ జీవితాంతము అక్కడనే వుండుఅని ఎంతగానో బుజ్జగించి చెప్పినారు. కృష్ణుడు ఇది చెప్పినాడు కానీ అదెందుకు చెప్పలేదుఅని ఎదురు ప్రశ్న వేసింది. వారు నీవద్ద డబ్బులేక టిక్కట్టుకే యిక్కట్టు పడుతూ ఉన్నావే మరి ఆ అడవిలో నీకు వసతి భోజనము ఏలాగుఅని ఎదురు ప్రశ్న వేసినారు.  మరి ఆమె అన్నది ఆ విషయము నా కృష్ణునికి తెలియదంటారాఅని. వారి నోటికి తాళము పడింది. 
ఎట్టకేలకు ఆమె ప్రయాణమునకు అన్నీ సిద్ధము చేసినారు. హైదరాబాదు లో విమానము దిగగానే అహోబళము పోవుటకు ఏర్పాటు జరిగి పోయినది. ముందు నేరుగా పూజారిగారి ఇంటికి పొమ్మన్నది ఆమె. పరిచయము అయిన పిదప ఆయనే ఆమెను  ఆమెతో వచ్చిన ఒకరిద్దరిని తన వెంట పిలుచుకు పోయినాడు. ఆమెకు ఒక గుడ్డి లేక బుడ్డి దీపము, దీనిని పలుచటి ఇనుపరేకుతో కిరోసిను పోయుటకు వీలుగా చేసి అందులో కిరోసిను పోసి పాత బట్ట పొడవుగా ఒక తాడులా తయారుచేసి దానిని వత్తిగా ఆ చిన్న డబ్బీ లోనికి జొనిపి పైకి కొద్దిగా కనిపించు విధముగా వుంచి దానిని వెలిగించేవారు, ఏర్పాటు చేసి వెళ్ళిపోయినారు. ఆ రోజుకు ఆమె గుడిలోనే, ఉన్న మేరకే తల దాచుకొనింది. తెల్లవారిన పిదప దగ్గర వూర్లలోని జనము వచ్చి ఆమెకు ఎండుటాకులతో  బస ఏర్పాటు చేసినారు.
అంత ముసలావిడ అక్కడ వుండగా లేనిది నేనెందుకు నిత్య పూజనము చేసి నిత్య నైవేద్యము పెట్టకూడదనుకొన్నాడు పూజారి. రాను-రాను భక్తుల రద్దీ పెరిగింది. విషయము అప్పటి ఆంధ్ర రాజధాని హైదరాబాదు వరకు ప్రాకింది. అప్పటి గవర్నరుగారే వచ్చి అక్కడ జరిగిన పురోగతి గాంచి అబ్బురపడి, ఆమె పాదములకు నమస్కరించి ఆ ప్రదేశములో చేయవలసిన మిగతా ఏర్పాట్లు చేయించుటను తన బాధ్యతగా తీసుకొని వెడలిపోయినాడు.
ఒక రోజు ఆమెను పాము కరచింది. ఆమె ఏ మాత్రము భీతి చెందక నారశింహుని వద్దకు పోయి నేను చేయవలసినది ఇంకా ఏమయినా వుంటే భూమిపై నన్ను వుంచు, లేకుంటే నీలో చేర్చుకోఅంది. స్వామికి ఆమె ఇంకా జీవించ వలసినది ఉన్నదీ అని అనిపించిందేమో, ఏ మందు మాకు లేకుండానే ఆమె జీవించి స్వామీ సేవలో జీవితము గడిపింది. ఆమె తన కృష్ణుని ఎన్నడూ మరచినది లేదు. ఉదయాత్పూర్వమే లేచి నిత్య కర్మలను ముగించుకొని తన బాల కృష్ణుని నారశింహుని గుడికి ఆనుకొని యుండే తన పాకలో ఒక Plastic chair లో కూర్చొబెట్టి  తనదయిన రీతిలో కోలుచుతూ వుండేది. ఉదయమే భగద్దర్శనమునకు వచ్చిన భక్తులు ఆమెను సందర్శించి మ్రొక్కి నరశింహుని చూడబోయే వారు. ఆరోజు దైవ దర్శనమునకు మొదటిగా వచ్చిన ఒక స్త్రీ పాదసేవనము తలుపు తెరిచి చూస్తే ఆమె తన బాలకృష్ణుని కౌగలించుకొని స్థాణువులా వుంది యుండినది . ఆ పరమ భక్తురాలిని కదిలించిన పిదప గాని, ఆ స్త్రీ కి అర్థము కాలేదు, ఆమె బాలకృష్ణుని లో లీనమైపోయినదని.
స్వస్తి.


Friday 13 January 2017

దాయం- దానం

దాయం- దానం
దాయం - అంటే ఇవ్వబడినది. దానం అంటే ఇచ్చేది. దానికి సం, ప్ర అనే ఉపసర్గలు చేరిస్తే సంప్రదాయం వస్తుంది. మనకు లభించిన ఉత్కృష్టమైన ఆస్తి. (A legacy, a tradition received as precious ancestral property) సాంప్రదాయం అంటే. కాలానుగుణంగా లేని ప్రతి ఆచారము అనికాదు సాంప్రదాయము యొక్క అర్థము. ఒక్క మాటలో చెప్పవలసి వస్తే వజ్రము సంప్రదాయము, అంతేకానీ అదిపెట్టిన పాత అట్టపెట్టె కాదు.

***********************************************************************************************************************
విమర్శ, ఆక్షేపణ, నింద, ఖండన, సమీక్ష , అనంగీగారం, అభిశంసన, గద్దించు, దూషించు, అసమ్మతి; ఈ పదాల్లో సునిశితమైన అంతరాన్ని గుర్తించడానికి కూడా ఒక స్థాయి కావాలి.

వాతాపి గణపతిం భజే -- ముత్తుస్వామి దీక్షితులవారు


     వాతాపి గణపతిం భజే






కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉన్నది బాదామి. బాదామి గుహాలయములకు ప్రసిద్ధి. 

ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు, 

బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో నిర్మింపబడిన, 6వ శతాబ్దం కాలంనాటివి. పూర్వము వాతాపి 

అనే ప్రాంతము బాదామిగా సుపరిచితము. ఇది కర్ణాటక రాష్ట్రంలో 6వ శతాబ్దం నుండి 8వ 

శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా ఉండేది.

బాదామి క్షేత్రం బీజాపూర్‌ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. ఇక బాదామి  విశిష్ఠత గురించి 

చెప్పవలెనంటే ఇచ్చటి గుహాలయాలు మనదేశములో మాత్రమే కాదు, ప్రపంచంలోనే 

ప్రసిద్ధమయినవి.  ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రసిద్ధ 

పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. 

చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. గణపతి, నటరాజస్వామి

మహిషాసుర మర్దిని, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా 

ఉంటాయి. ఈ వాతాపి గణపతిని గూర్చిన ముత్తుస్వామి దీక్షితులవారి వాతాపి గణపతిం 

భజే అన్న హంసధ్వని రాగము లోని కీర్తన అత్యంత లోకఖ్యాతి గాంచినది.


కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూరులో 

జన్మించినారు. వారి పూర్వులు మన రాజమహేంద్రి ప్రాంతము నుండి వలసపోయి 

ఉండినారని విన్నాను. వీరు కర్నాటక సంగీత త్రిమూర్తులు 1. శ్యామశాస్త్రి, 2. త్యాగరాజు, 3. 

ముత్తుస్వామి దీక్షితులు, ఈ ముగ్గురిలో చివరివారు. పైపెచ్చు శ్యామాశాస్త్రి గారి శిష్యులు. 

మరియొక విడ్డూరమయిన విషయము ఏమిటంటే నేను వ్రాసిన క్రమములో ఈ ముగ్గురికీ 

మధ్యన ఇంచుమించు 10 సంవత్సరముల అంతరము. అలనాటి వాతాపి నుండి గణపతి 

విగ్రహాన్ని పల్లవులు చాళుక్యుల పై సాధించిన విజయానికి ప్రతీకగా తిరువారూరు తరలించి 

అచట ప్రతిష్టించినారని చరిత్ర కథనం. ముత్తుస్వామి గారు షోడశ (పదహారు) గణపతి 

కృతులను వ్రాసినారు. అందులో ఒకటి హంసధ్వని రాగంలో బాణీ కట్టిన "వాతాపి గణపతిం 

భజే". ఈ రాగం యొక్క సృజన కర్త ముత్తుస్వామి గారి తండ్రి గారైన శ్రీ రామస్వామి 

దీక్షితులవారు.  అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ కీర్తనను ఒకసారి చిత్తగించండి.

పల్లవి

వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం

వీత రాగిణం వినత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం

చరణము

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతమ్

మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితమ్

పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండమ్

నిరంతరం నిటల* చంద్ర ఖండం నిజ వామకర విధృతేక్షు దండమ్

కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారమ్

హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబమ్

తాత్పర్యం: కృతి కర్త యైన శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారు ఈ విధముగా అంటున్నారు: నేను 

వాతాపి గణపతిని పూజించుచున్నాను. గజ ముఖుడైన, వరాలను ఇచ్చే గణపతిని 

పూజించుచున్నాను. విషయ వాంఛలకు అతీతమై, యోగులచే కొలువబడి, జగత్కారణమై

అడ్డంకులను తొలగించే గణపతి పాదములను ఈ జగత్తున వ్యాపించి యున్న సమస్త 

భూతములు, ఆత్మలు, జీవాత్మలు సేవించుకొనును, అట్టి గణాధిపతిని సేవించుచున్నాను.

మూలాధార చక్రము నందు స్థిరమై, అందున్న త్రికోణ మధ్య స్థానమందు వసించు 

గణపతీ! నిన్ను మునుపటి అగస్త్యుల వంటి ముని శ్రేష్ఠులు, విష్ణువు మొదలయిన ప్రసిద్ధులైన 

దేవతలు పూజించుచున్నారు. పర, పశ్యతి, మధ్యమ వైఖరి  అను నాలుగు విధములైన 

శబ్దములతో కూడి జనించిన ప్రణవ నాదమైన ఓంకారము వలె నీ వంపు తిరిగిన 

తొండము గోచరిస్తోంది. నీవెల్లప్పుడు ఫాలభాగమున చంద్రకళను ధరించి, నీ ఎడమచేత 

బలమైన చెరకుగడను దాల్చి అగుపిస్తావు. అంతే కాక తల్లియైన పార్వతికి ప్రియ పుత్రుడవైన 

నీవుచేతులలో పద్మము, పాశము, దానిమ్మ పండు ధరించి, భక్తుల పాపాలను తొలగిస్తావు. 

శివుడుషణ్ముఖుడు, మొదలయినవారిచే కొలువబడి హంసధ్వని రాగమును భూషణముగా

అమ్మ అయినపార్వతికి ప్రియ పుత్రునిగా గణపతీ నీవు ఒప్పుచున్నావు.

అట్టి వాతాపి గణపతికి మనము కూడా నమస్కరించుదాము. 

1835 దీపావళి దినమున సంధ్యావందన పూజాదికములను ముగించి తన శిష్యులతో 

'గమకక్రియ' రాగములో 'మీనాక్షి మే ముదం' అన్న కీర్తనను ఆలపించమని చెప్పి, వారా 

విధముగా ఆలపించుచుండగా చరణములోని "మీన లోచనీ పాశమోచనీ'' అన్న పదములు 

పాటలో వచ్చినపుడు రెండు చేతులూ పైకెత్తి 'శివే పాహి' అని అంటూ కైలాస పదం 

చేరుకొన్నారు. 

వారి సమాధిని తమిళనాడు ఎట్టయాపురం ( మహాకవి సుబ్రహ్మణ్య భారతి పుట్టిన వూరు) 

లో చూడవచ్చు. ఇది కోయిల్పట్టి టూటికోరిన్ ల నడుమ వుంది.



స్వస్తి.


i

Wednesday 11 January 2017

సంక్రాంతి శుభాకాంక్షలు

                                  సం                                                              క్రాంతి                                
తల 
సం