Saturday 30 September 2017

ఆర్య వైశ్యులు

ఆర్య వైశ్యులు
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా--అమరము(ఆర్యా = శ్రేష్టురాలు , దాక్షాయణీ = దక్షుని కూతురు, గిరిజా = పర్వతరాజు హిమవంతుని కుమార్తె, మేనకాత్మజా = మేనకా దేవి కూతురు, మేనక హిమవంతులు భార్యాభర్తలు.)
ఆర్య లేక ఆర్యాంబ అన్నది అమ్మవారి బహుళ నామావళిలో ఒకటి. విష్ణువర్ధనుని ఏలుబడిలోని పెనుగొండ రాజ్యమునేలిన కుసుమశ్రేష్టి కుమారితగా జన్మించి, వయోదికుడగు విష్ణువర్ధనుడు ఆమెను మోహించి వివాహము చేసుకోను ప్రస్తాపన కుసుమ శ్రేష్టి గారి ముందు ఉంచితే, వాసవి తన తండ్రితో తానూ వివాహము చేసుకోను ఉద్దేశ్యమే లేదని చెబుతుంది. రాజు ఆగ్రహోదగ్రుడై దండెత్త దలచినపుడు తనకు బాసటగా 714 గోత్రములయందలి 102 గోత్రములవారు నిలచుతారు. ఆమె జీవచ్ఛవాలుగా బ్రతికేకంటే ప్రాయోపవేశము చేయుట సముచితమని వ్గారికి తెలుపుతుంది. ఆమెను మహాత్మురాలిగా గుర్తించి కుసుమశ్రేష్ఠి మొదలగువారు ఆమెను గూర్చి ప్రశ్నించుతారు. తానూ ఆర్యామ్బానని తెలియజేస్తూ వారికి తన దివ్యదర్శనమునొసంగి తనతోబాటు అగ్నికి ఆహుతి కమ్మని చెబుతుంది. వారంతా తిరిగీ ఆర్యవైశ్యులుగా, వాసవాంబ వారి ఇలవేల్పుగా తిరిగీ భూమిపై అవతరించుతారు. ఆర్య అన్న అమ్మయొక్క నామమును ఆలంబనగా చేసుకొని వారు ఆర్యవైశ్యులైనారు. ఆర్య అన్న మాటకు శ్రేష్ఠము అన్న అర్థము ఉండుటవల్ల వారు శ్రేష్ఠి యన్న బిరుదమును వారు కలిగియున్నారు. శ్రేష్ఠి అన్న తత్సమ శబ్దమునకు వికృతే 'శెట్టి'. ఆ విధముగా ఈ శబ్దము ఎంతో గౌరవార్థమును కలిగియున్నది.
నిబద్ధతతో ఒకపనిని సదా ఆచరించుతాను అన్న భావనను వర్తన అని అనుట కద్దు. ఈ వర్తన దురాశతో ముడిపడితే దుర్వర్తన అవుతుంది. పరిమితి ఏర్పరచుకొంటే సద్వర్తన అవుతుంది. అట్టి సక్రమమైన పరిమితితో సమాజములోనికి అడుగు పెట్టినవారే వర్తకులు. అసలు శ్రేష్ఠులైనవారు కావున నాడు వారు వర్తకులైనారు.
ఇది కలికాలము. ఇది వంచన
కల కాలము. సంపదకు ఆకలి కాలము. మోసపు మూకల కాలము. అందుచే ఎంతోమంది వ్యాపారులితే అయినారుగానీ వృత్తి పై నిష్ఠ లేదు. అట్లని అందరూ నిష్ఠ లేనివారేనా అంటే అది సమంజసము కాదు. నీతినియమములన్న పట్టాలపై నేటికి కూడా నడిచే ఆర్య వైశ్యులుండుటచే వాసవాంబ చల్లని చూపుల బాటలో పయనించుతూ, తమ లాభములో 10 శాతము నేటికినీ ప్రజా హితమునకు సంఘ సేవకు దోహదపడుచున్నారు. ఆతల్లికి కృతజ్ఞతగా దసరా ఉత్సవాలను ప్రొద్దుటూరి వైశ్యులు ఎంత ఘనంగా చేస్తారో చెప్పుట, తలకందని విషయము. అమ్మకు అంతటి కృతజ్ఞులు వారు. మైసూరు లో వలె మహారాజు జరిపించడు ఇక్కడ, వైశ్యుల కష్టార్జితముతోనే జరుపుతారు.
నేను నా బాల్యములో ప్రతి రోజూ చూసిన మాట చెబుతున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో రంగయ్య గారి సత్రము పేద విద్యార్థులకు భోజన వసతులను ఉచితముగా సమకూర్చేది. అచ్చటి అమ్మవారిశాల లో కూడా విద్యార్థులకు ఉచిత గదులను భోజన వసతిని కలిగించేవారు. పత్తి, నూనె, బంగారునకు పెట్టింది పేరు ప్రొద్దుటూరు. వైశ్యులయి కూడా కర్నాటక సంగీతమును దేశ విదేశములలో వినిపించిన నా మిత్రులు శ్రీ తలిశెట్టి వెంకట సుబ్బారావు గారు, వారి కుమార్తె, వాణీ వరప్రసాదిని, వాణీ నామధేయిని చి.కుం.సౌ. వాణి గొప్ప సంగీత విద్వాంసులు. శ్రీ సదానందీశ్వరయ్యగారు గొప్ప Association Leader. జమ్మలమడుగులో వంకదార వారిసత్రము ప్రయాణీకులకు తాత్కాలిక ఉచిత బస కొరకు గదులనిచ్చేది. లభ్ద ప్రతిష్ఠులు, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు, కొణిజేటి రోశయ్య గారు గవర్నర్లగా పనిచేసిన వారు. వెంకటయ సుబ్బయ్యగారు ఇపుడు లేరు. తమిళనాడులో సుంకువారి సత్రము, జనపన వారి సత్రము మొదలగునవన్నీ వైశ్యులవే! మద్రాసు మహానగరములోని G.N. Chetty రోడ్ అన్న వీధి దీవాన్ బహద్దూర్ గోపతి నారాయణస్వామి చెట్టి గారి పేరుతో నేటికినీ విలసిల్లుచున్నదని బహుశ అతి తక్కువమందికి తెలిసియుండవచ్చు. తిరుమల బ్రహ్మోత్సవములకు నేటికినీ చెన్న పట్టణములో వాసికెక్కిన Parrys Corner  ప్రాంతములో వుండే వైశ్యులే గొడుగులు తీసుకొని వస్తారు. ఈ కార్యక్రమము అక్కడి చెన్నకేశవ స్వామి గుడినుండి మొదలోపుతుంది. ఆంధ్రులకు రాష్ట్రమును తెచ్చిన పొట్టి శ్రీరాములు గారు కూడా వైశ్యుడే! ఈ విధముగా వైశ్యులలో అగ్రగణ్యులు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తరిల్లియున్నారు.
పేదరికపు పంచన నిలచిన నేను, మా తండ్రిగారి పట్టుదల, వితరణ పరులైన వైశ్యుల ధన సహాయము వల్ల
P.U.C. నుండి P.G. వరకు చదువగలిగినాను. ప్రచారము వారి ఆచారము కాదు. నాటి దాతలకు ఈ విధముగా కృతజ్ఞత తెలుపుకొనగల్గుట నా సుకృతము. వర్ణములు వుండి కూడా ఆంగ్లేయులు రాకమునుపే కాదు వచ్చిన తరువాత కూడా, 1917 వ సంవత్సరములోRe.1= 13$ లు గా వుండినది. 1947 కు అది Re.1=$1అయినది. ఈ రోజెంత? రూపాయి విలువ అన్నది  మనము చెప్పనవసరము లేదు, తెలిసినదే కాబట్టి. మన పాటికి మన ధర్మమును పాటించనివ్వకుండా చేసి మన ఐక్యతను చిన్నా భిన్నము చేయుటచే మనకీదశ దాపురించినది.

అసలు ఇంత జరిగినా వర్ణాశ్రమ ధర్మమును నిష్ఠతో పాటించుతూ సాంఘీకపరమగు అవమానములను సహించుతూ ధర్మానికి కట్టుబడి నెగ్గుకు వస్తూవున్న ఏకైక వర్ణము వైశ్యులే!
వారి దీక్షాదక్షతకు ఇవే నా నమస్సుమాంజలులు.
స్వస్తి.

Thursday 14 September 2017

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు

ములకనాటిని నేటికీ మొదటి వరుస
నిలుపగల్గిన మేధావి నియమ వ్రతుడు
మోక్షగుండపు వారాశి మూల మణిగ
వెలసె భారత రత్నమై విబుధనుతుడు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు దాదాపు మూడువందల సంవత్సరాల క్రితం ఒకప్పటి కడప జిల్లా, అటుమిమ్మట కర్నూల్‌ జిల్లా, ఇప్పటి ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 'మోక్షగుండం'' అన్న గ్రామము నుండి అప్పటి మైసూరు రాజ్యమయిన,   బెంగళూరు నగరమునకు  38 మైళ్ళ దూరంలోని ముద్దనహళ్ళి గ్రామమునకు వలస వెళ్ళినారు.  అతి సామాన్య మధ్యతరగతి కుటుంబమునకు చెందిన ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ గారలు. ఆ దంపతుల సంతానమే విశ్వేశ్వరయ్య గారు. ఆయన 1861 సెప్టెంబరు 15న జన్మించినారు. తండ్రి గొప్ప సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. ఎందరో మహనీయుల మాదిరిగానే విశ్వేశ్వరయ్య జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. విశ్వేశ్వరయ్య విద్యాభ్యాసం చిక్కబళ్ళాపూరులో ప్రారంభమైంది. ఆ బాలుని అనన్య మేధాశక్తిని, కుళాగ్రబుద్ధిని మొదటగా గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించింది ఆయన మొదటి గురువు నాదమునినాయుడు, మేనమామ హెచ్‌. రామయ్య.  అందరూ తెలుగువారే! నేటికిని తెలుగు బ్రాహ్మణులు, ముఖ్యముగా ములకనాడు వారు కర్నాటక రాష్ట్రమున లెక్కకు మిక్కుటముగా నున్నారు. విశ్వేశ్వరయ్య 15వ ఏట పితృవియోగం పొందినారు. అయినా పట్టు వీడక అనేక వ్యయప్రయాసలకోర్చి 20వ ఏట బెంగళూరు సెంట్రల్‌ కాలేజీ నుండి B.A డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులై అందరినీ అందరినీ అబ్బురపరచినారు. సెంట్రల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వెబ్‌స్టరు ఆయన తెలివితేటలు, క్రమశిక్షణకు, ముఖ్యంగా ఆంగ్ల భాష మరియు గణితములో  ఆయన యొక్క అనన్యసామాన్య  పాండిత్యమునకు ముగ్ధుడై అనేక బహుమతులు ఇవ్వటమే గాక ఆయన యొక్క ఉన్నత విద్యాభ్యాసానికి ప్రత్యేక శ్రద్ధ చూపించినారు. ఆయన, అప్పటి మైసూరు రాజ్యపు దివాను రంగాచార్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వ ఉపకారవేతనంపై పూణేలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్పించినారు. 1883లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరిలోకీ ప్రథమునిగా నిలచినారు  విశ్వేశ్వరయ్య గారు. అటుపిమ్మట 1884లో అప్పటి బొంబాయి రాష్ట్రంలో నేరుగా పిడబ్ల్యుడి శాఖ అసిస్టెంట్‌ ఇంజనీరుగా  నియమితులయినారు. 1884 నుంచి 1909 మధ్య కాలంలో, ఇరిగేషన్‌ ఇంజనీరుగా, శానిటరీ ఇంజనీరుగా అనేక కార్యక్రమాలు చేపట్టి, నిర్ణీత కాలం కంటే ముందుగా పనిని పూర్తిగావించి ఎందరో అధికారుల మన్ననలు పొండినారు. 1909లో స్వచ్ఛందంగా సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి రాజీనామా చేసి విదేశీ పర్యటనకు వెళ్లినారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా, ఎన్నో నగ రాలకు రక్షిత మంచి నీటి సరఫరా, మురుగు నీటి రవాణా, వరద నివారణ పథకాలు అతిస్వల్ప వ్యవధిలో పూర్తి గావించి విదేశీ అధికారులను సైతం ముగ్ధులను గావిం చినారు. 1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజసాగరం జలా శయం కావేరీ నదిపై నిర్మించినారు. ఈ ఆనకట్ట మైసూరు సంస్థానం సమగ్రాభివృద్ధికి దోహదపడింది. ఆ రాజ్యానికి జీవనాడి అయింది. ఇది ఇరిగేషన్‌ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయం.
మైసూరు సంస్థాన సమగ్రాభివృద్ధికై చీఫ్‌ ఇంజనీరుగా బాధ్యత స్వీకరించి తమ రాజ్య ప్రజలకు తన మేధాశక్తి సత్ఫలితాలను పంచి ఇవ్వవలసిందిగా అప్పటి మైసూరు మహారాజా తమ దివాన్‌ ఆనందరావు ద్వారా విశ్వేశ్వరయ్యను కోరినారు. అందుకు విశ్వేశ్వరయ్య తన జీవితాశయాలైన పరిశ్రమల స్థాపన, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి మొదలైన అన్ని కార్యక్రమాలకూ మహారాజు సహకరించి, ఆమోదముద్ర వేయవలసి ఉంటుందనే షరతులపై చీఫ్‌ ఇంజనీరుగా 1909లో ఆ బాధ్యత స్వీకరించినారు. ఆరేళ్ల కాలంలో మైసూరు రాజ్యం ఆయన నేతృత్వంలో అన్ని రంగాలలో పురోగమించింది. నష్టాల ఊబిలో ఉన్న భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని లాభం ఆర్జించే విధంగా చేసినారు. ఇది ఆర్థికవేత్తగా విశ్వేశ్వరయ్య గారు సాధించిన అపూర్వ విజయం. నేటి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కళాశాల మైసూరు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు ఎన్నో పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలను స్థాపించినారు. అతి గొప్ప విషయము ఏమిటంటే ఆయన రాత్రి సమయములలో దీపపు వెలుతురున ప్రభుత్వ కార్యములు చేయవలసి వస్తే వెలుగు కొరకు ప్రభుత్వ ఇంధనమునే ఉపయోగించేవారు. స్వంతపనులు మాత్రము తానూ కొన్న కిరోసిను లాందరను స్వంత ఖర్చుతో కిరిసిను పోసి ఉపయోగించుకోనేవారు. 

ఆయనకు 'భారతరత్న'బిరుదమునిచ్చి దేశము తనను తానుసన్మానించుకొనింది.. 1938 నుంచి 1958 మధ్యకాలంలో దాదాపు 8 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇవ్వతము గరిగినది. 1962, ఏప్రిల్‌ 14వ తేదీన ఆయన తనువు చాలించితే, మైసూరు ప్రభుత్వం వారి భౌతికకాయానికి సకల రాజ లాంఛనములతోలతో వారికోరిక మేరకు తమస్వగ్రామముగా నేర్పరచుకొన్న 'ముద్దనహళ్లి'లో అంతిమ సంస్కారం గావించుట జరిగినది.102వ ఏట తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ఆ మహనీయుని కనీసము ఈ రోజయినా తలచుకోకుంటే వేరు ఏరోజున తలచుకొనగలుగుతాము.
స్వస్తి


Monday 11 September 2017

అవధానం - సమస్యాపూరణం - దత్తపది


అవధానం - సమస్యాపూరణం - దత్తపది

https://cherukuramamohan.blogspot.com/2017/09/blog-post_11.html

అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు

కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ

సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ,

అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు

చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.

ఇందులో అవధానికి అతిముఖ్యమయినవి ధార, ధారణ,చమత్కృతి,

సమయస్ఫూర్తి. ఇందులో ఏది కొరవడినా అవధానము రక్తి కట్టదు. అందుకే

అవధానమును అసిధారా వ్రతమన్నారు.

తిరుపతి వేంకటకవులు అవధానమునకు ఆద్యులు కాకపోయినా ఆవిద్యను

దశదిశల వ్యాపింపజేయుటకు ఆద్యులు వారే. ముఖ్యముగా ఈ అవధాన విద్యలోని

సమస్యా పూరణములోనూ, దత్తపదిలోనూ బాహిరముగా అశ్లీలము అగుపించినా

దానిని వేటగాడు వాల్మీకియైన చందమున తమ ప్రజ్ఞాపాటవమును జతజేసి

అవధానులు పూరించుట కద్దు. ఆశుకవితా సంప్రదాయానికి ఇది కొత్త ఊపిరి.

తిరుపతివెంకట కవులకు ముందు అవధానప్రక్రియలో ఉద్దండులైన వారు

ఎందరో వున్నా, దాన్ని రాజాస్థానాల్లోంచి జనసామాన్యంలోకి విస్తరింపజేసిన వారు

వీరు. ఆ ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే వున్నాము. వీరికి పృచ్ఛకులుగా

ఉభాయభాషలలోనూ మహా ఉద్దండులు ఉండేవారు. ఒక అవధాన సభలో వారికి

ఇచ్చిన సమస్య: ‘సంధ్యావందనమాచరించ వలదా చౌశీతి బంధంములన్’. ఇది

సాధారణ సమస్య కాదు. భాషా విభవము మిక్కిలి ఎక్కువగా వున్నవారు మాత్రమే

చక్కగా పూరించగలరు, తమ సమయస్ఫూర్తిని జతజేస్తూ. లేకుంటే

సంధ్యావందనమెక్కడ చౌశీతి బంధములు (84 విధములగు బంధములు) ఎక్కడ.

వారు పూరించిన నైపుణ్యమును గమనించండి:

వింధ్యాద్రిప్రభలొప్పు బల్కుచములన్ వేపట్టి పెంపొందు కా

మాంధ్యంబార్పగలేక వేర్రివయి ఎలా మంచి ఈ రాతిరిన్

సంధ్యన్ జేసెదు కాముకేళి యనగా సాహిత్యమా లేక నీ

సంధ్యావందనమా! చరించ వలదా చౌశీతి బంధంములన్

మరి ఇచట శృంగారపరముగా చెప్పుట తప్పనిసరి. అంతమాత్రముచే వారి

పాండితీగరిమను తప్పుబట్ట వచ్చునా!

ఇక 20 వ శతాబ్దములో అవధానమే తన వృత్తి మరియు ప్రవృత్తిగా చేసుకొని

కుటుంబ పరమైన వ్యాపారమునకు పెద్దపీటవేయక, అవధానమే ప్రధానముగా

చేసుకొనుచూ గడియారము వెంకటశేష శాస్త్రి గారి ప్రియశిష్యుడై మహా మహా

ఉద్దండులైన నాటి పండితులను పృచ్ఛకులుగా కలిగి లోకాన్ని ఒప్పించి మెప్పించిన

అనర్ఘ అవధాన రత్నము C.V. సుబ్బన్న శతావధాని గారు. నాటి ఆయన

పృచ్ఛకులలో గడియారము వెంకటశేష శాస్త్రి గారు, దుర్భాక రాజశేఖర

శతావధాని గారు, పుట్టపర్తి నారాయణాచార్యులవారు, విశ్వనాథ సత్యనారాయణ

గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు, గంటి జోగి సోమయాజి

గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తుమ్మల

సీతారామమూర్తి చౌదరి గారు, జమ్మలమడక మాధవరాయ శర్మ గారు,

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, పేరి

సూర్యనారాయణ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు, బోయి భీమన్న

గారు, దాశరథి గారు సినారె గారు, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే చేంతాడంత

పట్టిక తయారవుతుంది ఉండగా అవధానమును పండించిన నిండుకుండ ఆయన. అన్నిటికీ మించి వీరి అవధానము శంకరాచార్య పీఠమున చంద్రశేఖర యతీంద్రుల

వారి పనుపున జరిగినపుడు సంస్కృతి, సంస్కృత శిరోమణి యగు జయేంద్ర సరస్వతి

స్వాములవారు పృచ్ఛక స్థానమును అలంకరించి వారికి దత్తపదిని ఇచ్చియుండినారు.

మొదటి ప్రపంచ తెలుగు మహాసభకు ఆదరపూర్వకముగా ఆహ్వానింబడి, అత్యున్నత,

అద్వితీయ గౌరవమును బడసిన ఆదియవధాని వీరే! ఈ ఉపోద్ఘాతమంతా

ఎందుకంటే పైకి అశ్లీలముగా కనిపించే దత్తపది, సమస్యలు పైన తెలిపిన

మహామహులలో కొందరిచ్చినా సుబ్బన్న గారు ఎంత గొప్పగా ఏమాత్రమూ

అశ్లీలమునకు తావివ్వక పూరించినారో తెలియజేయుటకే! వీరు పూరించిన ఒక

సమస్య :’ మీనాక్షికి కుచాములారు మీసములేడున్’

ఆనాడు ప్రోద్దువోయెను

జానయు తత్పతియుగూడి సరి క్రీడింపన్

లూన ముకురమున దోచెన్

మీనాక్షికి, కుచములారు మీసములేడున్

ఒకానొకరోజు తమకముతో తల్లడిల్లిన దంపతులు ఒకరికొకరు తీసిపోక

పెద్దప్రోద్దు క్రీడించిరి. అద్దము చిట్లినది (లూన ముకురము) అన్న జ్ఞాపకము కూడా

వారికి లేదాయే. అలసిన మీనాక్షి అనుకోకుండా అద్దములో చూస్తే ఆరు

కుచములు ఏడు మీసములు కనిపించినవట.ఇక్కడ కవి ‘మీనాక్షి’ అన్న

పదమును సాభిప్రాయ విశేషణముగా చేసినాడు. కామోద్రిక్తయైన మగువ

తత్సమయమున  మత్స్యస్ఫూర్తి పొందునన్నది శాస్త్ర వచనము. ఆశువుగా చెబుతూ

కూడా ఎంత గొప్పగా పూరించినారో చూడండి. ఇందులో చూడవలసినది

చమత్కారముకానీ శృంగారము కాదు. సందర్భానుసారముగా స్పందించినవాడే

నిజమయిన శ్రోత లేక పాఠకుడు.

ఇక ఆయన అవధానము చేయు కాలములోనే మహామహులగు పృచ్ఛకులు

ఆయనకు అలనాటి సినిమా తారామణుల పేర్లు దత్తపదిగా ఇవ్వటము

తటస్తించినది. గమనించండి:

భానుమతి, అంజలి, జయప్రద, జమున

సీత హరించె భానుమతి శిష్ట గతిన్ జని రావణుండు,

జ్ఞాతిని సంహరింప యతి సంఘము గోరగనంజలించి, దో

ర్భూతి జయప్రద ప్రథనమున్ నడిపించి రఘుప్రవీరుడా

క్రోతి యశోక భూజమునకున్ బ్రధితత్వము గూర్చె శూరుడై

భానుమతి = ప్రకాశవంతమైన అంటే జ్ఞానియయ్యును సన్యాసి వేషములో సీతను

అపహరిచగా, అరాచాకములు సేయు ఆతనిని సంహరించమని ఋషిగణము

అడుగగా (ఇచ్చట జ్ఞాతి అన్న శబ్దము ఉపయోగింపబడినది, పులస్త్యుడు బ్రహ్మ

మానస పుత్రుడు మరియు మహర్షి. బ్రహ్మ మానస పుత్రులగు మిగత మహర్షుల

సంతతికి రావణుడు జ్ఞాతియే కదా!) భయంకర (దోర్భూతి జయప్రద ప్రథనము =

జయప్రదమైన భయంకర యుద్ధము) చేసి కోతికీ (హనుమంతునికి), అశోక

వృక్షమునకు యశస్సు(ప్రధితత్వము) ను గూర్చెను.

ఆ కాలముననే ఇటువంటి దత్తపదుఇలు ఉండినవి అని తెలుపుటకు ఈ పద్యము

ఉటంకించినాను. ఇక్కడ చూడవలసినది సినీతారల పేర్లుకాదు. అందులోని

వరుస అక్షరములను భిన్న పాదములలో యథా తథముగా వాడి ఎట్లు రక్తి

కట్టించినారు అన్నది గమనించవలసిన విషయము. అసభ్యత అశ్లీలత ఆవగింజంత

కూడా కనిపించవు పూరణలో. ఆమాటకొస్తే ఆ పద్యము కవియొక్క ఊహాశక్తికి

అద్దము పడుతుంది. ఈవిధమైన తారల పేర్లతో నేను నింపాదిగా పూరించిన

పద్యమును ఒక పండిత పాఠకుడు (నాకు అన్నయ్యతో సమానము) సినిమాతారల

పేర్లెందుకు అని నిరసించుతూ మీరు కూడా అవధానియైపోయినారు అని అనటము

జరిగినది. వారి మాటను ఆశీస్సుగా తీసుకొని, పరమాత్ముని వచ్చే జన్మలో నాకూ అంతటి ధిషణ ప్రసాదించమని కోరుకొంటాను. ఈ విధమైన ప్రయత్నము చేయుట వల్ల ధీజడిమ తగ్గి ధీపటిమ పెరుగుతుంది. నేర్పుగలవారు ఇటువంటి ప్రయత్నము చేయుట మంచిది. నేను చేసినదీ అటువంటి ప్రయత్నమే . తప్పేమీ నాకు గోచరము కాలేదు.

ఇక మాడుగుల వారిని గూర్చి: ఈ కాలములో ఆయన అశేష శేముషీ దురంధరుడు,  అపార పాండితీ ధిషణాలంకృతుడు. నా దృష్టిలో ఆయన వాక్పతి మరియు పుంభావ సరస్వతి.శృంగేరి పీఠాధిపతి సంస్కృతావధానము చేయించనెంచి ఆయనను పిలువనంపి ఏర్పాటు చేయించినారు. తాను తెలుగు పండితునిగా పనిజేసిన   కడప రామకృష్ణ జూనియర్ కాలేజి లో  పనిచేసిన కాలములో ప్రిన్సిపాల్ గా వుండిన శ్గోరీయుతులు గోపాల కృష్ణమూర్తిగారు తాను వ్రాసిన పుస్తక ఆవిష్కరణకు అధ్యక్షత వహించమని ఆహ్వానించితే తన ఖర్చులతో హైదరాబాదు నుండి కడప జిల్లాలోని బద్వేలు తాలూకాలోని బ్రాహ్మణపల్లెకు పోయి ఆపని నిర్వహించి అందరికీ ఆనందము పంచినారు. అంతటి కృతజ్ఞతామూర్తి యతడు.

ఆయన చరవాణి సంఖ్య తెలుసుకొని  నేను ఆయనతో పునః

పరిచయము చేసుకొంటూ  SBI-ZO-తిరుపతిలో ఆయన అవధానమును

ఏర్పాటుచేసిన విషయము గుర్తుచేస్తే కష్టకాలములో వున్నపుడు నాలోని

ప్రత్యేకతను గుర్తించి తగువిధముగా సన్మానించిన మీ వంటివారిని మరచిపోను

అన్నాడు. అది ఆయనలోని సద్గుణము. గుర్తింపు దొరికిన పిమ్మట ప్రతివ్యక్తిలోనూ

మంచి చెడు చూచుట సహజము, కానీ అది సందర్భానుసారముగా ఉండుట

ఎంతో అవసరము. మనము హంసలమై క్షీరమును గ్రోలి నీటిని విడుచుట

మంచిది. కానీ శర్మ గారు అట్లుకాదు. వారొక అన్ని పదార్తములూ వడ్డించిన ఆకు. 

  వారి ఆశు కవితాధారకు ప్రతీకగా ఒక శ్లోకము ఇక పద్యము మీ ముందుంచుచున్నాను.

అనుష్టుప్ ఛందో శ్లోకములో ఉండే అక్షరాల సంఖ్య 32. 14 అక్షరాలూ రూపు తేరా మస్తానా ప్యారుమేరా దీవాన రూపములో పృచ్ఛకులు ఇవ్వగా శ్రీరామ పరంగా ఆ హిందీ శబ్దములను సంస్కృత భాషానుగుణముగా కేవలము తాను స్వంతముగా వాడిన 18 అక్షరములు కలిపి ఎంత మనోజ్ఞముగా ఆశువుగా తెలిపినారో చూడండి.

నీలాభర రూపతేరామ సమస్తానాం శుభంకర 

తత్తధాప్యారమే రామే  నదీవానంద వర్ధన 

వేరొక అవధానములో వారి పూరణ

ఒక చిన్న తేటగీతి పద్యములో ప్రళయము,రౌద్రము. భీభత్సము, వాత్సల్యము లను ఉపయోగించుతూ దఖ నిరీశ్వర యజ్ఞ ధ్వంసమును వర్ణించిన ఈ అసమాన ప్రతిభను గమనించండి.

ప్రళయ దీప్తివి అంబికా ప్రణయ మూర్తి 

నిరత రౌద్రప్రసార నిర్నిద్రకీర్తి 

నెరయు భీభత్స రసమెల్ల కరగి కరగి 

ఒదిగి వాత్సల్య రసమౌను సదయ నిలయ



నేనసలు ఒక నాలుగు దినముల క్రితము ప్రచురించిన దత్తపది ప్రజ్ఞ కలిగిన

యువతను ప్రోత్సహించుటకే! నేనేమీ తప్పు చేయలేదు. అటువంటివి నాకు

తోచినపుడు ఆస్య గ్రంధి లో పెడుతూ వుంటాను, యువత స్పూర్తిని పొందుతారన్న

నమ్మకముతో! నేడు మనకూ, మన తెనుగుకూ జగద్విఖ్యాతిని ఒనగూర్చుచున్న

మహా పండితులను, మహా అవధానులను, మహాకవులను మనసారా గౌరవించి

మన తెలుగునకు సాతియగుభాశాలేదని జగతికి చాటుదాం. మనది “Italian Of

The East’ కాదు, వాళ్ళది ‘Telugu of the West’ ఎందుకంటే ఆ భాషలు

పుట్టకమునుపు వేల సంవత్సరముల క్రితము పుట్టిన భాష మనది.  చివరిగా ఒక

మాట. ఒకరినొకరు గౌరవించుకొంటే వాతావరణము సుహృద్భావముతో నిండి

ఆహ్లాదకరముగా ఒప్పారుతుంది.

ఆదిశగా అడుగేద్దాం.

స్వస్తి.

Saturday 9 September 2017

అగ్ని



అగ్ని

(క్లుప్తముగా వ్రాసిన ఈ నాలుగు మాటలు చదవండి)

https://cherukuramamohan.blogspot.com/2017/09/blog-post.html

అన్నం పరబ్రహ్మస్వరూపం’ అన్నదిపెద్దల ద్వారా మనము విన్న మాటే! మనము ఉడికిన 

దాన్యమునే అన్నము అంటాము. ధాన్యము ఉడుకుటకు కావలసినది అగ్ని. కాబట్టి అగ్ని 

మనకు దేవత. హుతవాహుడు హుతాశనుడు అన్న పేర్లను కూడా ఈయన 

కలిగియున్నాడు. నేను వ్రాసిన ఈ గేయములోని భావమును గమనించండి.

పొయ్యి పైన ఎసరుపెట్టి

అన్నమ్మును ఉడకబెట్టి

గిన్నె పోయి మీదనుండి

దిన్చినంతసేపు మండి

పరిసరాలనున్న వరకు

వెచ్చదనమునిచ్చు మనకు

ఆ వేడిమి లేని ఒళ్ళు

ఊపిరాగిపోయి కుళ్ళు

హుతాశానుడు జీవదాత

హుతవాహనుకిదే జోత

శృతి సారము తెలుసుకొన్న

నిజము మనకు తెలియునన్న

అగ్నిమీళె’ తోలిమంత్రము

దాని కలిగె ఋగ్వేదము

అగ్ని యొక్క ప్రాధాన్యతను గూర్చి ఈశావాస్యోపనిషత్తు ఏమంటున్నదో చూడండి.

ఈ శ్లోకముతో ఆ ఉపనిషత్తు సమాప్తమౌతుంది. అగ్ని మనకు కనిపించే ఒక ప్రకృతి లోని 

పదార్థము. దాని అధిష్టాన దేవతను ‘అగ్ని’ అనే అంటారు. అగ్ని దేవత యొక్క 

గొప్పదనము ఆయన పట్ల మనకు ఉండవలసిన విధేయత ఇక్కడ ఈ శ్లోకములో 

ఆవిష్కరింపబడినది గమనించండి.

శ్లోకము:

అగ్నేనయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్l

యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమll

భావము:

ఓ అగ్నిదేవా! (ఈ దేహమును ఈ జగత్తును నియంత్రణ లో ఉంచుతూ మార్గదర్శనము 

చేయు మహానీయునివి. అందుకే "అంగం దేహం గుణాభూతం జగద్వ నయతి 

ప్రేరయతి” అన్నారు, సృష్ఠికి కారణము అగ్ని, ఇక్కడ వేడిమి అని అన్వయము, స్థితికి 

కారణము అగ్ని, ఇక్కడ వెలుగు అని అన్వయము, లయమునకు కూడా కారణము, 

ఇక్కడ దావానలమునకు అన్వయము. అందుకే కగ్నిదెవుని కనిపించే దైవము అన్నారు.)   

మాకు ఋజువర్తనతో కూడిన శ్రేయోమార్గమును చూపించు. మా  ప్రారబ్ధ కర్మలన్నీ నీకు 

తెలియనివికావు. మమ్ము అపమార్గము త్రొక్కనీయక ఘోరమైన తప్పుదారులనుండి 

మరల్చి  మాకు భక్తిజ్ఞానములను ప్రసాదించుము. తండ్రీ! పదేపదే నీకిదే  మా 

నమస్కారాలు.

మనలో నిక్షిప్తమైయున్న ఆ అగ్నికిదే మన నమస్కారము.

స్వస్తి