Thursday 29 March 2018

ధనము - దానము

ధనము - దానము
https://cherukuramamohan.blogspot.com/2018/08/blog-post.html
రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి కొన్ని రాజ ధర్మాలు చెపుతూ, ఇలా
అంటాడు :
ధనమార్జిత కాకుత్స ధనమూలమిదం జగత్I
అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్యచII
కకుత్స అను సూర్యవంశపు రాజు పేరుతో రాముని వంశం ప్రసిద్ధిచెందినది. ఆయన తరువాత దేశమును పాలించిన అనువంశీకులు కాకుత్సులైనారు. అందుకే రాముని ‘కాకుత్స’ అని విశ్వామిత్రుడు సంబోధించినాడు.
ఆయన “ఓ రామా! ధనాన్ని బహుళముగా సంపాదించి తీరవలసిందే!  ఈ జగత్తు ధనముపైనే ఆధార పడి ఉంది. ధనము లేని వానికీ చనిపోయిన వానికీ మధ్య ఎటువంటి  వ్యత్యాసము నాకు  కనబడుట లేదు. కులము, గోత్రము, బలము, బలగము, అందము, చందము  ఏవి లేకపోయినా ఫరవాలేదు. ధనము ఒక్కటి ఉంటే చాలు అందరూ గౌరవిస్తారు. కష్టాలు, ఆపదలు కూడ ధనం ఉంటే దరిచేరవు.  అన్న గొప్ప సత్యమును పై శ్లోకం తెలుపుతుంది. ఇకొక మాట చెప్పవచ్చు. ధనము నిప్పులాంటిది. చిరిగినా పీలిక కప్పుకొన్న దరిద్రుడు చలి కాచుకోడానికి నిప్పువద్దకు వెళ్లి కూచుంటే ఏమరిపాటువల్ల కప్పుకొన్నది కాస్తా కాలిపోయిందట. జాగరూకత లేకుంటే ధనము కూడా అంతే!
మరి వక్రగతుల ధనము సంపాదించవచ్చునా? అంటే తగనే తగదు అంటుంది శాస్త్రము.
వేదమూల మిదం జ్ఞానం, భార్యామూల మిదం గృహంI
కృషి మూలమిదం ధాన్యం, ‘ధనమూలమిదం జగత్II
జ్ఞానానికి మూలము వేదము. ఇంటికి దీపము ఇల్లాలే. అందుకే భార్యను ‘ గృహ లక్ష్మీ’ అన్నారు. మంచిపంత చేతికందవలేనంటే కృషి అనగా వ్యవసాయం బాగా చేయాలి. అదే విధముగా  ఈ జగత్తులో అన్నింటికి మూలం ‘ధనమే’. కనుక ధనం తప్పక ఉండాలి అని పై శ్లోక పాదం తెలుపు తుంది. కానీ సంపాదన, వేదమూలమగు జ్ఞానమును సంపాదించినవాడు, ధర్మమార్గమును అనుసరించి సంపాదించుతాడే గానీ అన్యదా కాదు. అట్లని ఆ ధనమును కేవలము 'కూడబెట్టుట'కు మాత్రమే ఉపయోగించి కొడుకులకిస్తే 'కూడు పెడతారో లేదో' పరమేశునికెరుక. అట్లని వారికి ఇవ్వవద్దని కాదు నా అభిప్రాయము. 'చేతులకు తొడవు దానము' అన్నారు పెద్దలు. శక్తిలోపము లేకుండా చేసిన దానమే వ్యక్తి ని స్మరణీయుని చేస్తుంది.
ఒక సర్వసంగ పరిత్యాగి ఈ విధముగా అన్నాడు:
అర్తానాం ఆర్జితం దుఃఖం ఆర్జితానాంచ రక్షణే l
ఆయేద్దుఃఖం వ్యయేత్ దుఃఖం కిమర్థం దుఃఖ భాజనం ll
ధనము సంపాదించుట ఒక కష్టమైతే దాని సంరక్షణ మరియొక కష్టము. మరి రెండు విధాలా కష్టము ఉన్నపుడు కోరి కష్టము కొనితెచ్చుకొనుట ఎందుకు?
వేమన ఏమంటున్నారో చూడండి.
ధనము కూడబెట్టి  ధర్మంబు చేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ.
తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు, కూడ బెట్టిన ధనాన్ని తినక పోయినా, ధర్మం చేయక పోయినా, ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు.
అసలింకొక విషయము :
తాము డబ్బు నంత దాపెట్టి దాపెట్టి
కొడుకు చేతికివ్వ కూర్మి తోడ
తల్లి దండ్రి నంత తనయుండు వెలివేసె
రామ మొహనుక్తి రమ్య సూక్తి
కొడుకులంతా ఇట్లే ఉంటారు అని కాకపోయినా, ఇటువంటి కొడుకులు కూడా కద్దు అంటే కాదనేవారుంటారా!
ఎంత చెప్పినా నేటి సమాజములో డబ్బులేకపోతే దానికి గౌరవములేదు. కానీ దానికి పరిమితి మాత్రము ఎంతో అవసరము. పుట్టినది కేవలము ధనార్జనకే కాదు. మన అవసరమునకు మించిన ధనమును వితరనతో కూడిన దానము చేయుట ఎంతో అవసరము. ప్రముఖ చలనచిత్ర నటుడు చిత్తూరు ఉప్పలధడియం నాగయ్య గారు విరివిగా దానములు చేసి చేసి అమిత పెదరికములో అసువులు బాసినారు. నేడు మనము గొప్ప అనుకొంటూ ఉండే ఏ నటుడు కూడా ఆయన అంత్యక్రియలకైనా
సయహాయము చేయలేదు. నేడు ఆ నటులూ లేరు, పోనీ వారు పైకి పోవునపుడు తాము సంపాదించినది తీసుకుపోయినదీ లేదు. శోభన్ బాబు గారు గుప్త దానాలు చేసేవారని విన్నాను. తమిళ నటులు, విజయకాంత్, హాస్యనటుదు వివేక్ గారలు తమ దాన ధర్మములతో తమిళ నాడు లో ఎంతో ఖ్యాతి గాంచినారు. రతన్ టాటా దాన ధర్మములకు, దేశభక్తికి పెట్టినది పేరు. ఆయన డబ్బునే ప్రధానమని తలచియుంటే ప్రపంచములోని అమిత ధన వంతునిగా ఉండేవాడు. దేశ హిత, సమాజ హిత, సాహచార్యహితమగు ఎన్నో పథకములతో పేరుకు ప్రాకులాడకుండా చేయుచునే యున్నాడు. అదియే ఒక ధని చేయవలసిన పని.
అసలు భారతములోని విదురనీతి ఈ విధముగా చెబుతుంది:
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు మదంబున్ బొనరించును,
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా !
ధనము, విద్య, మంచి వంశము  అనునవి దుష్టులకు మదమును కలిగిస్తాయి. ఇవే
బుద్ధిమంతులకు వినయ విధేయతలను చేకూరుస్తాయి.
ఇక ధనార్జనను ' ధర్మార్థ కామమోక్షము' లను వేదవాక్కుతో ఒకసారి పరిశీలించుతాము. మన మొదటి మెట్టు ధర్మమే. తదుపరి అర్థము అంటే ధనము. అంటే మన సంపాదన ధర్మ బద్ధమై ఉండవలెనని నిర్దుష్టముగా చెప్పుచున్నది వేదము. అదేవిధముగా 'కామము' ధర్మార్థ బద్ధమై ఉండవలెను. అంతే తప్పించి ధనము వెంట పరుగిడరాదు.
సుమతి శతక కారుడు బద్దెన ఏమంటున్నాడో చూడండి. చేతులకు దొడవు దానము భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో నీతియ తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ! చేతులకు దానము అలంకారము, పాలకులకు సత్యవాక్పరిపాలన ఆభూషణము, ప్రతి వ్యక్తి కీ నీతియే ఆభరణము, స్త్రీకి మాన రక్షణమే ఆనూకము (నగ)
ధనరాశికి, మహాకాళసర్పము వలె కావలి యుండి దానధర్మముల యందు సద్వినియోగము చేయకున్ననూ ప్రయోజనములేదు. ఈ సందర్భమునకు సమంజసమనితలచి నేను వ్రాసిన ఈ పద్యమును మీకెరుకపరచుచున్నాను.
కాళము బోలె పెన్నిధికి  కావలి గాచియు ఖర్చు చేయ నే
వేళయు సాధ్యమౌనె జను వేళకు తోడుగ నిల్వగల్గునే
కూళలకీక చేయు భువి కూరిమి తోడుత దానధర్మముల్
ధూళిని చేరులోపలనె తోడగు పుణ్యము ప్రాప్తి చెందగన్
నాడే , నేటి పోకడ యగు  చెడుగు అన్న చెద పట్టుచుండిన సమాజమును ఉద్దేశించుతూ భర్తృహరి సుభాషితములలో ఏమి చెప్పినాడో తెలియజేస్తూ ఈ వ్యాసమును ముగించుచున్నాను.
జాతిర్యాతి రసాతలం గుణగణ స్తత్రాప్యాదో గచ్ఛతాత్
శీలం శైల తటాత్పతత్వభిజన స్సందహ్యతాం వహ్నినా,
శౌర్యే వైరిని వజ్రమాశు నిపతత్వర్థోస్తు నః కేవలం
ఏనై కేన వినా గుణా స్తృణలన ప్రాయాస్సమస్తా ఇమే.
ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత:
జాతి తొలంగు గాత గుణ శక్తి రసాతల సీమకుం జనుం
గాత కులంబు బూది యగు గాత నగంబుననుండి శీలముం
బాతము చెందు గాత బహు భంగుల విత్తమె మేలు వి
ఖ్యాత గుణంబు లెల్ల దృణ కల్పము లొక్క ధనంబు లేవడిన్
జాతియే తొలగి పోనిమ్ము, గుణము పాతాళము చేరనిమ్ము ,కులము భస్మమే కానిమ్ము, శీలము శిఖరాగ్రమునుండి అథః పతనమే కానిమ్ము, ఏవిధముగా చూచినా మాకు ధనమే మంచిది. ధనమొక్కటి లేనిచో పైన తెలిపిన మంచి గుణములన్నీ గడ్డి పోచతో సమానము.
ఇటువంటి హీన స్థితికి దిగజారి సమాజమును సాగరములో కలుపవద్దని ప్రార్థిస్తూ
ఈ వ్యాసమును ముగిస్తున్నాను.
స్వస్తి.

Wednesday 28 March 2018

యువతకు మనవి.


యువతకు మనవి.          (చెరుకు రామ మోహన్ రావు)
మనవి,మన్నింప దగినవి, మరువలేనివి,మరువకూడనివి,మనశ్శాంతి కూర్చేవి ఈ విధంగా మనము తప్పకుండా తలపోస్తాము . కానీ ఈ అభిప్రాయాలు ఏర్పరచుకొనుటకు ఏ వ్యాసమునైనా ఒకసారి చదివితే మీకే అవగతమౌతుంది. పై విభాగములలో,దేనికైనా ,మీరు చదివిన వ్యాసము చెందేటుగా వుంటే మీ అనుభూతి తెలుపండి. అట్లు చేయుటకూడా నా దృష్టిలో రచయిత కొరకు గాదు, సాటి పాఠకుల కోసం. అది చూసి ఇంకా కొందరు చదువవచ్చు. ముఖ్యంగా మన సంస్కృతి , మన భాష, తపోధనులైన మన మునుల గూర్చిన విషయాలు చదివినప్పుడు అవి ఇంకా పదిమందికి పంచండి. ప్రవచనములలో లోకమాన్యత పొందిన ఎందరో మహనీయుల ప్రవచనముల   వినివుంటారు. వారి పై ఎంతో ఆరాధనా భావమును పెంచుకొని వుంటారు. మరి అంతటి గొప్పవారు చెప్పిన విషయాలను ఎంతవరకు గ్రహించి పాటించుచున్నాము అన్నది సమస్య. చెప్పునపుడు, ఎంత వినవలెనని వున్నా మనసు తప్పుదారి పట్టవచ్చునేమోగానీ వ్రాసినది చదివేటపుడు ఆ వీలు లేదు . ఎందుకంటే ఎక్కడైనా మనసు ఒకవేళ చెదిరినా,తిరిగీ ఆ భాగము చదివే అవకాశము వుంటుంది . విన్నది నచ్చవచ్చు గానీ, నచ్చినదంతా చెప్పలేము. వినే వ్యక్తీ కూడా దొరకవలె . రచన ఐతే వీలు దొరికినపుడే చదవ వచ్చు. బాగుంది అని ఒక మాట వ్రాస్తే పదిమందికీ చదివే అవకాశమును ఇచ్చినవారవుతారు.అందువల్ల నేను కోరేదేమిటంటే మంచి వ్యాసము ఎవరు వ్రాసినవైనా నచ్చితే చదివి, బాగుంది నలుగురూ చదవవలసినది అని నాలుగు మాటలు వ్రాయండి. బాగున్న వ్యాసాలు పదిమందికి పంచండి. ఇది దయవుంచి నా వ్రాతలకు 'ప్రకటనగా' భావించవద్దు. ఈ గ్రంధముఖి కుడ్యముపైఎందరో పండితులు,అనుభవజ్ఞులు,విద్వాంసులు, ఎన్నో మంచి విషయాలు , తమ వయసును కష్టాన్ని లెెక్క చేయకుండా మంచిని పంచవలెనను ఒకే ధ్యేయముతో వ్రాస్తున్నారు. మీరు చదివి ,పంచి, సహకరించి అటువంటి వ్యక్తులను ఉత్తేజపరచితే తమ గ్లానిని కూడా మరచి ఇంకా మంచి విషయాలు చెబుతారు .
నన్ను తప్పుగా తలవరన్న ఆశతో వ్రాసినాను . మీ విజ్ఞతకిదే నా నమస్కారము.


Monday 26 March 2018

నా గీతములు నా గేయములు


నా గీతములు నా గేయములు
వేయి దీపముల వెలుగుల తల్లీ
వెతలనెల్ల వెలార్చిన తల్లీ
నవ్వు తీగెవై నడచిన తల్లీ
వేల నవ్వు వెదజల్లుచు తల్లీ
నికేతనమ్మును నింపిన తల్లీ
తిరిగి వచ్చునా దినములు తల్లీ

దొంగ భయము నీ తోడు కూడగా
అమ్మ కొంగు నీకభయమివ్వగా
నాన్నకు భయపడు నటనామయివై
అభినయించగా ఆనందించుచు
విహంగమై వినువీధి చరించుచు
ఆనందమునకు హద్దు వెదకు నెడ
కలతది ఏదో కలిగెను మది కడ
ఎదలో బాధకు ఎదో మూలము
కలిగెనన్న కలకలమున హృదయము
చింత చేయగా చిట్టితల్లికిక
కళ్యాణపు శుభ ఘడియ చూడుమిక
అని తలపనే మది ఆర్ద్రత నిండగ
పెళ్ళి జేసితిని పేరిమి మీరగ

అనురాగముతో అమ్మనాన్నలను
గాంచ వచ్చినా కట్టుబాటులను
పొరుగింటికి తా పోయిన రీతిని
మనసా, నినునే మసల, జూచితిని
అతివయన్నచో 'ఆడ'ది గానీ
ఇంగితమేర్పడె 'ఈడ'ది కాదని
రంగస్థలమున రంగము మారెను
పాత్ర దారినిది పాత్రయు మారెను
నాటి బిడ్డయే నేటి తల్లిగా
పొదిగిన నెనరుకు పొన్నువు కాగా
పరిణతి చెందిన పాత్రదారిణిగ
ఇంటి కాంతిగా కంటి రెప్పగా
పుచ్చుకొన్న మా పూర్తి ప్రేమమును
భర్త ఇంటిలో పంచివేయుచును
నీ తలిదండ్రుల నిజ గౌరవమును
విరుల తావులకు వీవెనవగుచును
మమ్ము ధన్యులుగ మసల జేసితివి
మంచికి మారై మరి నిలచితివి
అనురాగముతో అమ్మనాన్నలను
గాంచ వచ్చినా కట్టుబాటులను
పొరుగింటికి తా పోయిన రీతిని
మనసా, నినునే మసల, జూచితిని
అతివయన్నచో 'ఆడ'ది గానీ
ఇంగితమేర్పడె 'ఈడ'ది కాదని
+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*+*

దీపావళి
పల్లవి: వచ్చేనిదే వచ్చింది దీపావళి
పేదోళ్లకు ఉన్నకాస్త ఖాళీ ఖాళీ
చరణము 1. ఇల్లేమో చూడబోతె ఈగలతో ముసురు
                   నూకలపై ఆశతోడ వేచియుంది ఎసరు
                  అన్నమడిగితే అమ్మ కోపగించి కసురు
                 దొరికిన రూపాయి తోడ ఉరికిన చిన్నారివాడు
               చిచ్చుబుడ్డి తెచ్చి కాల్చి కడుపు చిచ్చు మరచినాడు.
చరణము 2. ఒళ్ళు దాచుకోడానికి వల్లలేని కోకతో
                     కళ్ళు కాయలౌదాకా వేచియుండు  ఓర్పుతో
                    శిశిరములో పండుటాకు బోలియున్న మోముతో
                   నిలిచినా ఇల్లాలి ముందు నిలువలేక కొట్టే మందు
                  పండగంత ఎండగాయె మగని డబ్బు దండగాయె

చరణము 3. పొరుగునున్న డోరా తారాజువ్వ వదిలె చూడగా
                    రివ్వు రివ్వుమంటూ అది ఎగిరె గువ్వ తీరుగా
                   పూరిగుడిసె పైన జేరి పూర్ణాహుతి చేయగా
                   నిలువరించు సంసారం నెలవులేక కృంగిపోయె
                 దిక్కులేని దీనులుగా దీపావళి చెసిపోయె
మరువలేవదేల
నా జ్ఞాపకాలలోన నీ కంట నీరేల
మదిన చిచ్చదేల నను మరువలేవదేలా
వాడియున్న మల్లెమాల తలన వుంచనేలా
మనసులో గతాన్ని మరువలేవదేల    llనా జ్ఞాపకాలలోనll
నా గమ్యమే వేరు నీ బాట వేరు
దిశలు వేరువేరింక కలుపువారు లేరు
అడవిలోన నేనుంటే నగరి నీది బాలా
మరులు గొనగనేల మరువలేవదేల    llనా జ్ఞాపకాలలోనll
పిగిలియున్న నా మనసు పలికెనిట్లు లేమా
చేరలేను నీదరికి నాది ముళ్ళ సీమా
ఆకసాన నీవుంటే నాదు నెలవు నేల
కలువలేము బెలా మరువలేవదేలా   llనా జ్ఞాపకాలలోనll

దైవమా చాలు ఈ జీవితం
దైవమా చాలు ఈ జీవితం
దైవమా  చాలు ఈ జీవితం
లోకమంతా ఉదాసీనమే
కలిగియుండేది వ్యామోహమే

వెలుగు విరజిమ్మేను చీకటులు క్రమ్మెను
ఆశ అడుగంటగా ఆశయము కృంగెను
చూపులెడబాసెను బాధలెద నిండెను
గుండె బరువెక్కెను తెలుపుమిది నీకు తగు కార్యమే   llదైవమా ll

ఉన్న సంతోషమును నిల్పుకోనైతిని
జీవినేగాని జీవించలేనైతిని
ఊపిరులు లాగిన ఊరకెట్లుందును
ఈర్ష్యతో సుఖమును నీవు కబళింపగా న్యాయమే  ll దైవమాll
ఎద వినిచిన గానము
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను గానము
కనురెప్పల తాళము  శ్వాస వాయులీనము
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను గానము
            ఊహలు తేలి మబ్బులై నింగిన విహరించగా
వన మయూరి నాట్య శాస్త్ర మెళకువ వినిపించగా
తన్మయత్వ వీచికలే తావుల వెదజల్లగా
            గళము తా విపంచి శ్రుతిని పరవశించి సవరించగ
           మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను గానము
జల జల ఝరి గమనము జలతరంగ ధ్వానము
ఇంద్ర ధనువు తోరణము చిరుజల్లుల ప్రేరణము
నీల జలద విరిబోణికి  నీరెండకు కళ్యాణము
పరిణయమది కనుదోయికి కమనీయము రమణీయము
మైనమౌచు మనసు కరుగ ఎద వినిచెను గానము
ఈ సమీర మీ సిరి వెన్నెల
ఈ సమీరమీ సిరి వెన్నెల
ఈ రేయి నూయాల లూపెనే
ఆనందమందగా నీయక
నీ తలపు తలుపులు మూసెనే || ఈ సమీర మీ సిరివెన్నెల ||
ఆ యామిని మృదు గామిని
ప్రియ భామినిని చేరాలని
ఆశించ నీవది కాదని
అన్నావు నీ దయ రాదనీ || ఈ సమీర మీ సిరివెన్నెల ||
కను లెర్ర బడె నంగారమై
తడియారి పోయెను దాహమై
దరి దారి గానక 'మోహన'
శిలనైతి భూమికి భారమై || ఈ సమీర మీ సిరివెన్నెల ||

కలత మది లోనిది
            కలత మది లోనిది మాసిపోలేనిది
ఎందుకో ఎందుకో ఆడె నాతో విధి
గతము కరుకైనది రేయి బరువైనది
అందుకే అందుకే నిదుర రాకున్నది  ll కలత ll
            తారకలులేని రాకా నభోవీధిలో
జాబిలే లేదు కనిపించ నా పరిధిలో
నాదు తలరాత నేనుంచి విధి చేతిలో
ఆడబడుచున్తినవలీల తన లీలలో     ll కలత ll
            పిలుపుకై వేచి నీనుండి నేనుండగా
గాలి రాలేదు నీ పిలుపునందివ్వగా
తలపులను వేడ పిలిపించగా మోహన
వదలి పోమంచు నాతోనే నిలచేనుగా  ll కలత ll

కొనకుండా నవ్వుకొనండి తృప్తి చెందే నాయకుడు
ఏమండీ ఇటు చూడండీ నా మాట మీరు విని చూడండి
ఒక్కసారి ఒటేసితిరంటే మీ సోమ్మేమీ పోదండీ
ఓటువేయుటకు అంతో ఇంతో ఎంతోకొంతిస్తానండి
నను గెలిపిస్తే మళ్ళీ మళ్ళీ నిలువబోను నను నమ్మండీ
స్పాంజీ నీరు  నేను డబ్బు జిగురు దోస్తులము నిజమండి
జిగిరీ దోస్తీ వీడను నేను సొమ్మే ప్రాణము నాకు సుమండీ
ఒక్కసారి గెలిపించిన ఇంటిని ఇంద్రుని భవనము చేస్తానండి
కోయినిగ్ సెగ్గు  లంబోర్ఘిని యను రెండే  కారులు కొంటానండి
టూరులేమో సర్కారుకారులో నెల నెల చుట్టేస్తానండి.
గాంధీ లందరి  ఫోటోలకు నా ఆఫీస్ రూమే మ్యుజియమండి
జాతి గీతమే మొబైల్ ఫోనుకు రింగుటోను అయిపోతుందండి
చందాలను పోగేసి కోట్లతో కాసినోలు నడిపిస్తానండి
మధ్యతరగతుల మనుషులకంతా స్వర్గమ్మును చూపిస్తానండి
ఈ ఐదేళ్ళూ ఖద్దరు నాతో ‘కర్ణ’ కవచమై  వుంటుందండి
మన్నూమిన్ను ఏకం చేసి వెయ్యికోట్లు సాధిస్తానండి
ఆపై  ఓటే అడుగ సుమండీ  అసలు మీకు నే కనబడనండి
ఒక్కసారి నను గెలిపించండి  బాహుబలిని చూపిస్తానండి


రాతిరి తీరని కలయే ఆయె
రాతిరి తీరని కలయే ఆయె
తరగని చెరగని ఆశల మాయె
కనులు తెరువగా కల మంచాయె
కటిక చీకటే కన నిజమాయె

          భూతకాలమే భూతమ్మాయె
          గతమును తవ్వే గతి వలదాయె
          మరచుటయే నా అభిమతమాయె

కలతల కడలికి మది నెలవాయె
ఎంత ఈదినా దరి రాదాయె
తీరమందినా నేను పరాయె
తండ్రి
ఎదిగే మొక్కకు ఎరువే తండ్రి
గువ్వకు ఒదిగే గూడే తండ్రి
ఐస్ కేండికి స్టిక్కగు తండ్రి
తీయని భవితకు దిక్కే తండ్రి
మేలౌ పునాది మేడకు తండ్రి
కూడుగుడ్డగూడే తండ్రి
‘ఆడీ’ కీ యగునతడే తండ్రి
రాడో’ వాచికి స్ట్రాపే తండ్రి
ప్రొలైను బట్టల పోగే తండ్రి
జీన్సు పేంటునకు జిప్పే తండ్రి
నాణెపు భవితకు నభమే తండ్రి
శుభకార్యములో శుభమే తండ్రి
మైలను బుచ్చే మమతల లాండ్రీ
పైడి నగలకది భేషగు ఫౌండ్రి
మైత్రి
కన్ను తనను కాపాడగ కనురెప్పను అడిగిందా
చెంప చెళ్ళుమనకుండా చేతి 'రక్ష'నడిగిందా
ఆహ్వానము కోరదురా అదే ముందు నిలచురా
హద్దు లేని ఆకాశమె ఆమైత్రికి గురుతు రా

ఆమని వచ్చే వరకూ ఆ మామిడి పూయునా
మండే వెసంగి లోనె మల్లెపూల వాసన
ప్రేమలోని సహజత్వము ప్రకృతికే తెలుసురా
ప్రపంచమే స్నేహానికి ప్రతిరూపము తెలియరా

అల కుచేలునకు  మిత్రుడు అఖిల లోకముల రాజు
సూతపుత్ర మిత్రుడైన సుయోధనుడు రాజరాజు
తరతమాల తలపులెపుడు తలపోయదు స్నేహమురా
చక్కనైన స్నేహితమే సర్వేశుని వరమురా

వెరపు చేరనీయబోక వెంటనడచు స్నేహితము
ఆపదలను బాపజేసి ఆదుకొనును సహవాసము
కలిమిలేములను చూడదు ఘడియకూడ వీడదురా
మనసు మమతలను పెంచే మైత్రీవనమదిగనరా
నా కవనము నాక వనము
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము
వివిధ వర్ణ సుమ సరసము
ఫలరసాల సాల తలము
అమలిన మాహ్లాదకరము

పూతేనెలు జాలువారు
అలిసంకులమచట తీరు
విరితావులు దిశలు జేరు
చిరుతెమ్మెర అలల బారు
చెప్ప తరము కాని సౌరు
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము

గతి మారెడు గమనమందు  
తాళగతులు తరగలందు
మేళవించు సరసు ముందు
భృంగ బృంద స్వనమునందు
  శ్రుతికి నతుకు  గానమందు
నా కవనము నాక వనము
తరుఛాయా సుఖగమనము

కల్పభూరుహముల వితతి
కామధేను సంతతి తతి
నిరత వసంతాకర స్థితి
సత్వసాదు జంతు సమితి
ఆనందముకది పరిమితి 
నా కవనము నాక వనము

తరుఛాయా సుఖగమనము 


నాదు భాష అజంతము

దాని కీర్తి అనంతము
వ్రాస్తినందు నాసాంతము
ఆనందము అనంతము
చదివినచో నీ స్వంతము  


జీవితం
చిత్రవిచిత్రం చూడ జీవితం
యోచిస్తే అది పరుగుల పందెం
గెలవాలంటే నాతోడుండరు
ఓడిపోతినో వెనక్కి చూడరు
అబద్ధాల మహాసభకు అధ్యక్షుని సందేశం
అబద్ధాల మహాసభకు అధ్యక్షుని సందేశం
'అబద్ధాలు ఆడరాదు' అందుకోండి ఆదేశం
మన వృద్ధికి ధన సిద్ధికి మణిదీపం మనదేశం
బంగారపు గుడ్ల బాతు కోయకుమని ఉపదేశం
            "అబద్ధమే మన వూపిరి అబద్ధమే మన కాపరి
             అదే వెంట లేకుంటే మనకేమున్నది ఉపరి"
            "నామాటను మనసుపెట్టి ఆలకించితే ఒకపరి
             అర్థమౌను అదే మీకు నెమరు వేయగా మరిమరి"
లోకమనే  రైలు బండి పట్టాలే అబద్ధాలు
బండి సాగవలెనంటే ఆడరాదు పట్టాలు
కదలకుండ అవి వుంటే కానరావు కుదుపులు
అందులకే తెలిసిందా ‘ఆడరాదు అబద్ధాలు’
            ‘సత్యం వధ ధర్మం చెర’ అన్న సూక్తి మరువబోకు
            చిరునవ్వులు పెదవులపై చిరకాలం చెదరనీకు
            మాటలలో చూపబోకు మెపుడైనా చిరాకు
      సంభాషణ సమయములో పనికిరాదు పరాకు


అబద్ధమే మన ఊపిరి మన పదవులకది కాపరి    
ఆడి తప్పినట్టివారు అగచాటుల నెపుడు బడిరి
గురితప్పని ఆయుధమది వాడితిమా మనమొకపరి
వద్దన్నా నిన్ను విడచి పోనేరదు అది తదుపరి

         అబద్ధాల మహాసభకు అధ్యక్షుని సందేశం
         'అబద్ధాలు ఆడరాదు' అందుకోండి ఆదేశం
         మన వృద్ధికి ధన సిద్ధికి మణిదీపం మనదేశం
         బంగారపు గుడ్ల బాతు కోయకుమని ఉపదేశం

ఆశ
బాల్యమందున అమ్మ తెలిపెను 'వేడి' 'ఉన్ని' న వుండుననుచును
బడిన గురువులు తెలియజేసిరి వేడి 'జూను' న వుండు ననుచును
తండ్రి తెలిపెను యౌవ్వనములో వేడి రక్తము వుండుననుచును
అనుభవమ్మనె, 'ఆశ' లోనే ‘వేడి రక్తము’ వుండుననుచును
మంచిచెడు నిన్నరయనివ్వక నీతినియమము దరినిజేర్చక
ఆశ’ చేసే మోసములు నిన్నొత్తి పండును జేయుననుచును
Mother said in the childhood that the warmth is in ‘Wool Rug’
Teacher said, in school, that ‘June’ gives summer’s heat
Dad said that young blood that keeps one in heat ever
Savoir faire, mine, said that ‘greed’ keeps you hot ever (Savoir faire=the ability to speak out of experience)
Never allows, it, you to think what is bad and what good
Use the pressure and fructifies you with ego and meanness
Season that is, which gets the sweetness not ego and frailty

కనికరించి జలజనేత్ర కనరావా జలద గాత్ర
నా పల్లవి చరణాలకు నర్తించగ చరణమ్ములు
నవ గీతిక నీ కొరకై నయమారగ రచియించితి
మైమరచే రాగముతో సంతరించి నేనుంచితి
కనికరించి జలజనేత్ర కనరావా జలద గాత్ర                II    II
నీ వ్రేళులు నీ వేణువు నీ అధరము బహు మధురము
తన్మయతను కలిగించే తత్వమెందు ఇమిడినది
దిక్కె  రుగక దిగులు చెంది దీనురాలి వేచియుంటి
గీతమొకటి చేతబూని నీ కొరకై వేదకుచుంటి              II    II 
సందెవేళ నను రమ్మని సైగనీవు చేసితివి
నిను చేరీ చేరకనే నీవు మాయమైతివి
కమల నయన నీ కన్నుల కనికారం కనరాదా
నా వేదన నీ వీనుల కణుమాత్రం వినరాదా                   II    II


ఈ నిజాన్ని మరి గమనించన్నా

ఈ నిజాన్ని మరి గమనించన్నా

పైసామే హై పరమాత్మా

అని అంటావే ఇటు చూడు

అసలు విషయమును గమనించు

నా మాటలపై మనసుంచు

సుఖసంతోషం కొనగాలవన్నా
మనశ్శాంతి మరి కొనగలవా?
బట్టలగుట్టల కొనగలవన్నా
అందచందముల కొనగలవా?
స్టారు భోజనము కొనగలవన్నా
ఆకలినయితే కొనగలవా?
మెత్తని పరుపుల కొనగలవన్నా
నిద్దురనయితే కొనగలవా?
ఆడీ కారును కొనగలవన్నా
చక్కని రోడ్డుల కొనగలవా?
పడతులెందరినొ కొనగాలవన్నా
కమ్మని అమ్మను కొనగలవా?
దండును దండిగ కొనగలవన్నా
దగ్గరితనమును కొనగలవా?
చెబుతూబోతే చేంతాడగుమరి
నా మాటలపై ఉంచినచో గురి
మాన్యత చేరును మరువక నీదరి
రారు ఎవ్వరూ అప్పుడు నీ సరి
ఈ నిజాన్ని మరి గమనించన్నా
డబ్బులు కోట్లకు నీకడనున్నా
కోరినదల్లా పొందుట సున్నా
మానవత్వమే అన్నిట మిన్న
అది సాధించుము ముద్దుల కన్నా!

హృదయారుణ ఫలకము పై – నయనపాత్ర సిరా తోడ
బాధ వ్రాసేనొక గీతం – సేగాతాకిన నవనీతం
        కాటుక చీకటి లోపల – కరిగిపోయె భాస్కరుడు
        వెలుగు పరుచు లోపలనే – అమావాస్య చందురుడు       II     II
నా గాధల సంద్రములో – నా బాధల కెరటమ్ములు
వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి – దరిగానక తరలిపోయె                     II      II
       శ్రీచందన గంధము, నా – సేదతీర్చునని తలువగ
       శిరీషములు చిదిమినట్టి – తావులు నా నాసము తాకెను     II      II
తలచినాను నేనోక్కటి – దైవమొసగె వేరొక్కటి
చూపు నిండె నతిచిక్కటి – కారుమబ్బు గుమి చీకటి               II      II
జయ సుందర నంద బాల
జయ గోపక జనపాలా
జయ వంశీ రవలోలా
మ్రొక్క నిలచినాను మ్రోల              II జయ వంశీ II

జయ దానవ దహన జ్వాల
ఫణి ఫణాళి నాట్య హేల
మాయా మొహాది జాల
సృష్ఠి స్థితి విలయ లీల                   II జయ వంశీ II

పరమ భక్త సుఫలసాల
ఋత పూరిత ఋషి కల
హృదయాంతర అణు కీల

తారామణి గణ సుచేల                   II జయ వంశీ II

నాడు కళల కాసారము లో నేమో 'కలువ'నీవు
కనుల ఎదుట కనిపించీ నన్నేమో కలువనీవు
ముద్దు ముద్దు పలుకులతో మురిపించే 'చిలుక' నీవు
మోము పైన దరహాసము నను జూచిన చిలుకనీవు
నా ఊహల వయ్యారికి 'చంద్ర వంక' నగ నీవు
నీవే ఆ వయ్యారివి అందామన కనగనీవు
పూల తావి పిల్లగ్రోవి రవళిని కల, గాలి నీవు
నీదు ప్రేమ తీరానికి నను కొనిపో కలగాలి నీవు
నీకొరకై వేచినాను హృదిని జేసి నాక వనము
నీకే అంకితమైనది కలకాలము నా కవనము
హృది హ్రదమందందముగా  విరిసిన చెంగలువ నీవు
'మోహనా' అని యంటూ రావా నను కలువ నీవు


కౌపీన సంరక్షణార్థం
సంసారము ఛీ సన్యాసము సైఁ
అని తలచుచు ఒక సంసారి
ఆలుపిల్లలను ఇంటిని వదలి
అడవి దారి బడె కౌపీనముతో
సగముదారి తా బోయిన పిమ్మట
ఇంకొక గోచియు అవసరమనుకొనె
ఇల్లుజేరి వేరొక్కటి గైకొని
అడవి జేరె నతడాత్రముగా
మొదటిరోజు తా గడిపిన పిమ్మట
వలనుగ కుటీరమవసరమనుకొని
అడవి కట్టెలకు వచ్చిన వారిని
అడిగి సహాయము, నిర్మించె
ఏటి స్నానమును జేసిన పిమ్మట
తడి గోచిని తన ఇంటివద్ద తా
నారవేసి వేరొక్కటి కట్టెను
దైనందిన సద్విధులకు నై
ఒకనాడొక చిట్టెలుక వచ్చి యా
కౌపీనమ్మును కోరికె కొద్దిగా
చింతించిన యా తాపసి యంతట
బిడాలమొక్కటి బిరబిర తెచ్చి
పెంచగనుంచెను పర్ణశాలలో
అప్పుడాతనికి అర్థంబాయెను
పిల్లికి వలయును క్షీరమటంచును
పాల కొరకు ఒక ఆవును తెచ్చెను
ఆవు గడ్డికై భూమిని దున్నెను
నాట్లు వేసి పంటలు పండించెను
పిల్లి త్రాగగా మిగిలిన పాలను
అమ్మదలచె నాసన్యాసంతట
అడవికి వచ్చిన అబ్బాయొకనిని
ఆందుకొరకు తా వినియోగించెను
పంటల దిగుబడి ఎక్కువ కాగా
ధాన్యాదుల తానమ్మసాగెను
రాను రాను వడి రాబడి పెరుగగ
వ్యవసాయమ్మును ఇంకా పెంచెను
సన్యాసమ్మును నదిలో వదలుచు
సంపద మార్గముననుసరించెను
అతనిజాడ తా వెదకుచు సతియూ
సంతానముతో అతనిని జేరెను
బ్రహ్మచర్యమతి దుర్భరమనుచూ
సంసారంమును చేరదీసెను
ఒకనాడంతట ఒక్క విలేఖరి
ఆతని కడజని అడిగే నిటు
అయ్యా నీకడ ఫ్రిజ్జీ టీవీ
గ్యాసు గొయ్యి మరి ఆపై పొయ్యి
భార్యాపిల్లలు సిరులూ సంపద
కలిగినదా సన్యాసమ్మంటే
అంతట ఆతను బదులు పల్కెనిటు
కౌపీనార్థము పటాటోపమిది
సంసారము సైఁయని నేనెరిగితి
దేశమంతటిని జంటల జేసెద
పుట్టగోచి కథ జనులకు తెల్పగ
పుట్టించెదనొక పార్టీనిప్పుడు
ఎన్నిక గుర్తును పుట్టగోచిగా
ఎంచుచు నిలిచెద నేనెన్నికలో
దేశమెల్ల సంసారుల నింపుచు
సన్యాసుల లేకుండ జేసెదను
గోచిపాత నా గొప్పకు మూలము
దరిద్రానికది శివుని త్రిశూలము
అందులకే నే నిర్ణయించితిని
గోచిపాత నా పార్టీ పేరు
గోచిపాత నా పార్టీ జెండా
గోచిపాత నా పార్టి ఎజెండా
గోచిపాత మహరాజను పేరును
దిక్కుల చాటుచు దేశమునేలెద
పెంచివేయుచూ నా సిరిసంపద 
ఫోర్బ్స్ లిస్టులో లో ఫస్టున వుండెద

బిల్లు గేట్సుతో వియ్యమునందెద


                               పాహి భారతీ తీర్థ                               
        పాహి భారతీ తీర్థ - తవ చరణం మమ  శరణం                    
                                                వేదవదన శ్రిత 
భక్త కరుణ మమ
                                                                   దురిత దమన అను నిత్యం
                                                            దురిత దమన అను నిత్యం
                                                               భవ తాపహర గురుదేవ
                                                                మమ పాపహర గురుదేవ
                                                                                                                                 1. జ్ఞాన కుసుమ వని                                                                                       శాస్త్ర దివ్య ఖని
                                                                               ఆర్ద్ర హృదయ సదన
                                                                                ఆర్ద్ర హృదయ సదన
                                                                           భవ తాపహర గురుదేవ
                                                                         మమ పాపహర గురుదేవ
                                                                                2. రాగ నేత్ర యతి పాణి వేత్ర ఘన
                                                                        సాంప్రదాయ  సూత్ర
                                                                      సాంప్రదాయ సూత్ర
                                                                          భవ తాపహర గురుదేవ
     
                        మమ పాపహరా గురుదేవ 

                                       3. చారుగుణగణ చపల హారణ
                              శారదేందు కిరణ
                              శారదేందు కిరణ
                                      భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                                                         4. భస్మ ధారణ పాప దారణ
                                                              భక్త వంద్య చరణ శరణం
                                                                 భక్తవంద్య చరణ
                                                                         భవ తాపహర గురుదేవ
                                                                        మమ పాపహర గురుదేవ
                                       5. చంద్ర శీర్షధర చారు శారద
                                      నిత్యపూజ నిరత స్వామి
                                పాహి భారతీ తీర్థ
                                      భవ తాపహర గురుదేవ
                                        మమ పాపహర గురుదేవ
                     గురుదేవ పాదాంఘ్రి రేణువు - చెరుకు రామ మోహన్ రావు











                                                                                                                                                                                                     

















మనసా సతతం స్మరణీయం
మనసా సతతం స్మరణీయం
వచసా సతతం వదనీయం
లోకహితం మమ కరణీయం
                   న భోగ భవనే రమణీయం
        న చ సుఖ శయనే శయనీయం
        అహర్నిశం జాగరణీయం
       లోక హితం మమ కరణీయం
న జాతు దుఃఖం గణనీయం
న చ నిజ సౌఖ్యం మననీయం
కార్యక్షేత్రే త్వరణీయం
లోకహితం మమ కరణీయం
                        దుఃఖ సాగరే తరణీయం
              కష్ట పర్వతే చరణీయం
              విపత్తి విపినే భ్రమణీయం
             లోకహితం మమ కరణీయం
గహనారణ్యే ఘనాంధకారే
బంధుజనాః యే స్థితా గహ్వరే
తత్ర మయా సంచరణీయం
లోకహితం మమ కరణీయం
సంస్కృత గీతము
సతతము శుభమే స్మరణీయం
వాక్కు సదా బహు కమనీయం
పరజన బాధలు హరణీయం
లోకహితమ్మాచరణీయం
కావు భవంతులు రమణీయం
నిదుర సుఖముపరిహరణీయం
జాగరూకతే గణనీయం
లోకహితమ్మాచరణీయం
వద్దు క్లేశ పరిగణనీయం
సుఖాలు కావాదరణీయం
కార్యదీక్ష అనుసరణీయం
లోకహితమ్మాచరణీయం
              
 దుఃఖ సంద్రములు తరణీయం
 కష్ట శిఖర మధివసనీయం
విపత్కరాటవి భ్రమణీయం
లోకహితమ్మాచరణీయం
గహనారణ్యం ఘనాంధకారం
అయ్యినదంటే స్వజనావాసం
నాకు అదే సంచరణీయం
లోకహితం మమ కరణీయం
 (ఇది అనువాదము) చెరుకు రామ మోహన్ రావు