Wednesday 27 March 2024

కుమ్మరికొక ఏడు గుదె కొకనాడు

కుమ్మరికొక ఏడు గుదె కొకనాడు

https://cherukuramamohan.blogspot.com/2024/03/blog-post.html

పూర్వము కుమ్మరివారు పలు విధములగు అమ్ముటకు యోగ్యమైన కుండలు చేయుటకు ఒక ఏడాది కాలమును తీసుకొనే వారు. గుదె అన్నది అవి చేయుటకు ఉపయోగపడే కొరముట్టు లేక పనిముట్టు. అది పట్టుకొనుటకు వీలు కలిగిన పిడితో ఉన్న దీర్ఘ ఘనపు దిమ్మె. దానితో ఎంతో ఎట్టయినా దొంతరగా పేర్చిన నేలను తాకియుండు  కొత్త కుండల వరుసను కొట్టినట్లయితే మొత్తము సంవత్సరపు కృషీ నేలపాలే!

అదేవిధముగా ఎంతో శ్రమకోర్చి వ్రాసే వ్యాసములను ఒక EMOJI తో కొట్టి వేయకుండా చదవండి. మన పూర్వుల ఔన్నత్యమును గ్రహించండి.చేతనైన నాలుగు మంచిమాటలు వ్రాయండి. ఒక్క మల్లె పూల సారము తన సౌరభామును ఎంతో దూరము వ్యాపిమ్పజేస్తుంది కదా! ఇది ముఖ్యముగా యువతకు నా మనవి. 

మనవి,మన్నింప దగినవి, మరువలేనివి,మరువకూడనివి,మనశ్శాంతి కూర్చేవి ఈ విధంగా మనము తప్పకుండా తలపోస్తాము . కానీ ఈ అభిప్రాయాలు ఏర్పరచుకొనుటకు ఏ వ్యాసమునైనా ఒకసారి చదివితే మీకే అవగతమౌతుంది. పై విభాగములలో,దేనికైనా ,మీరు చదివిన వ్యాసము చెందేతుగా వుంటే మీ అనుభూతి తెలుపండి. అట్లు చేయుటకూడా నా దృష్టిలో రచయిత కొరకు గాదు. సాటి పాఠకుల కోసం. అది చూసి ఇంకా కొందరు చదువవచ్చు. ముఖ్యంగా మన సంస్కృతి , మన భాష, తపోధనులైన మన మునుల గూర్చిన విషయాలు చదివినప్పుడు అవి ఇంకా పదిమందికి పంచండి. ప్రవచనములలో లోకమాన్యత పొందిన మాడుగులవారు,సామవేదం వారు, చాగంటివారు, గరికపాటి వారి అత్యుత్తమ ప్రవచనములు ఎన్నియో, ఎంతమందో వినివుంటారు. వారి పై ఎంతో ఆరాధనా భావమును పెంచుకొని వుంటారు. మరి అంతటి గౌరవనీయులు,పుంభావ సరస్వతులు చెప్పిన విషయాలను ఎంతవరకు గ్రహించుతున్నాము, ఎంతవరకు పాటించుచున్నాము అన్నది సమస్య. చెప్పునపుడు,ఎంత వినవలెనని వున్నా మనసు తప్పుదారి పట్టవచ్చునేమోగానీ వ్రాసినది చదివేటపుడు ఆ వీలు లేదు . ఎందుకంటే ఎక్కడైనా మనసు ఒకవేళ చెదిరినా,తిరిగీ ఆ భాగము చదివే అవకాశము వుంటుంది . విన్నది నచ్చవచ్చు గానీ, నచ్చినదంతా చెప్పలేము. వినే వ్యక్తీ కూడా దొరకవలె . రచన ఐతే వీలు దొరికినపుడే చదవ వచ్చు . అందువల్ల నేను కోరేదేమిటంటే మంచి వ్యాసము ఎవరు వ్రాసినవైనా నచ్చితే చదివి, బాగుంది నలుగురూ చదవవలసినది అని నాలుగు మాటలు వ్రాయండి. బాగున్న వ్యాసాలు పదిమందికి పంచండి. ఇది దయవుంచి నా వ్రాతలకు 'ప్రకటనగా' దీనిని భావించవద్దు. ఈ ముఖపుస్తకపు గోడపై ఎందరో పండితులు,అనుభవజ్ఞులు,విద్వాంసులు, ఎన్నో మంచి విషయాలు , తమ వయును కష్టాన్ని లక్క చేయకుండా మంచిని పంచావలెనను ఒకే ధ్యేయముతో వ్రాస్తున్నారు. మీరు చదివి ,పంచి, సహకరించి అటువంటి వ్యక్తులను ఉత్తేజపరచితే తమ గ్లానిని కూడా మరచి ఇంకా మంచి విషయాలు చెబుతారు . 

మంచిని పంచుదాం. మంచినిపెంచుదాం.

స్వస్తి.

 


Monday 11 March 2024

ఆసక్తి కరమైన చాటువు

వెలయాలును, శిశువల్లుడు
ఇలయేలిక, యాచకుండు నేగురుధరలో
గలిమియు, లేమిము, దలపరు
కలియుగమున గీర్తికామ! కాటయవేమా!
కాటయవేముని సంభోధిస్తూ, కీర్తిస్తూ ఎవరోకవి చెప్పిన పద్యమిది. వెలయాలు, పసిబాలుడు, ఇంటి అల్లుడు, భూపతి,  బిచ్చగాడు భూమిపై గల ఈ 5 మంది తాము ఆశించే వ్యక్తి వద్ద ఇవ్వగల సత్తా ఉన్నదా లేదా అని యోచించరు.

“ కవయః క్రాంత దర్శినః” అన్నారు పెద్దలు. సామాన్యులు చూడలేని దృశ్యాలని కూడా
 కవి తన మనోనేత్రంతో చూడ గలడు. అందుకనే “రవి గాంచనిచొ కవిగాంచును” అనగా

సూర్యుడు చూడలేనివి కూడా కవి చూసి వర్ణించ గలడు అని అర్థం. చిన్ని ఉదాహరణ.

ఓ పెంపుడు చిలక దానిమ్మ పళ్ళ గింజలని భుజిస్తోంది. సాధారణంగా దానిమ్మ గింజలు

కొంచెంతెల్లగా, కొంచెంఎర్రగా ఉంటాయి. మన కంటికి మామూలుగా కనపడే ఆ దానిమ్మ గింజలని కవి ఎంత అద్భుతంగా!

వర్ణించాడో చూడండి. ఆ చిలుక తినే దానిమ్మ గింజలు. “ హరి నఖర భిన్న మత్త మాతంగ

కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల బీజాని” హరి అంటే సింహం. సింహం యొక్క

నఖర=గోళ్ళతో (పంజాతో) భేదించ బడిన మత్త గజము యొక్క కుంభస్థలముపై నుండి కారుతున్న రక్తంతో తడిసిన, (ఏనుగు కనబడితే సింహం ముందుగా దాని కుంభస్థలం పైకి ఎగిరి కొడుతుందిట.)

ముత్యాలహారంలోని ముత్యాలవలె ( కుంభస్థలంనుండి స్రవిస్తున్న రక్తంతో తడిసి, కొంచెంఎరుపు,

కొంచెం తెలుపుగా కనబడే ముత్యాలవలె) దానిమ్మగింజలు ఉన్నాయిట” చూసేరా! చిన్న

విషయాన్ని ఎంత గొప్ప ఉపమానంతో వర్ణించాడో కవి. అందుకనే ---

“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః/

యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే”  అనగా

కావ్య సృష్టి చేయటంలో కవి బ్రహ్మవంటివాడు. తనకి తోచిన విధంగా తన కవితాప్రపంచాన్ని సృష్టించు కొంటాడు. అని ఆర్యోక్తి. అట్టి కావ్య ప్రపంచంలో చాటువులని కూడ కవే సృష్టించాడు.

అందరూ ఇష్టపడే మామిడి పండుని కవి ఎంతగోప్పగా చాటువులో వర్ణించాడో ఇప్పుడు చూద్దాం.---        

“ ఆభూచ్చామా జంబూ:, దళిత హృదయం దాడిమ ఫలం/

సశూలం సంధత్తే హృదయమవమానేన పనసః/

భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలి ఫలం/

సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి//” ఇది శ్లోకరాజం.

ఇప్పుడు ఇందులో ఉన్న గొప్పతనం చూద్దాం;--- “ జంబూ: = నేరేడు పండు. దాడిమ ఫలం= దానిమ్మ పండు. పనసః= పనసపండు. లాంగలి ఫలం = నారికేళఫలం.( కొబ్బరి కాయని సంస్కృతంలో ఫలమనే అంటారు) చూతం = మామిడిపండు.” ఇవి పై శ్లోకం లోని ఫలాలు. ఇప్పుడు వివరణాత్మకమైన భావాన్ని తెలుసుకొందాం. పై శ్లోకం మరలా చదవండి. ముందుగా నాల్గవ పాదం భావం చూద్దాం

“పళ్ళలో మామిడిపండు ‘ఫలరాజంగా’ ప్రపంచంలో కీర్తించ బడటం చూసి, మిగతాకొన్నిపళ్ళు చాలా బాధ పడ్డాయిట. ఎలా అంటే (ఇప్పుడు మొదటి పాదం నుండి చూద్దాం) నేరేడుపండు ముఖం మాడ్చుకొందట, దానిమ్మపండు గుండె బ్రద్దలైందిట, పనసపండు గుండెలో కత్తి దిగినట్లు అయిందిట, కొబ్బరికాయ గుండె నీరైపోయిందిట. ఈ విధంగా పళ్ళన్నీ తమ బాధని వ్యక్తపరచాయి.!” అని కవి ఎంత అద్భుతంగా వర్ణించేడో చూసేరా!? ఇందులో చమత్కారం ఏమిటంటే నేరేడు పండు నల్లగాఉంటుంది, దానిమ్మని పగలుకొట్టి కాని తినలేము, పనసపండుని కత్తితో గుచ్చికాని విడతీయలేము, కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి. ఇవి ఆయా పళ్ళకి సహజంగ ఉండే గుణాలు. వీటిని కవి ఎంత గొప్పగా పైచాటు శ్లోకంలో వర్ణించేడో చూసారా! అది కవియొక్క ప్రతిభ. ఇట్టిదే ఇంకొకటి.

“ధిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి/

సౌందర్య మాహవసి లోచన లోభ నీయం/

అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే/

యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి //

“రసాలసాలము” అనగా మామిడి పండునే పై చాటు శ్లోకంలో కవి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి.—“ఎవరికైనా కీర్తి, అందము ఉంటే చాలదు, మెత్తనైన మనసు కూడ ఉండాలి అది నీకు (మామిడి పండుకు) లేదు” అని కవి చమత్కరిస్తున్నాడు. ఎలాగో చూడండి.

 “ ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగ ఉంది;” అని మామిడిపండులో సహజంగా ఉండే టెంకని కఠినమైన మనస్సుతో పోల్చి వర్ణించడం కవి “క్రాంత దర్శిత్వానికి” నిదర్శనం. కనుకనే కవిని ‘ప్రజాపతి’తో పోల్చినారు.
స్వస్తి.