Sunday 18 June 2017

భారత రత్న భీమ్ రావ్ అంబేద్కర్

భారత రత్న భీమ్ రావ్ అంబేద్కర్

రాజ్యాంగ నిర్మాతగా చెప్పబడే భీం రావ్ అంబేద్కర్ గారిని గూర్చి నాలుగు మాటలు తెలుపుతాను.
భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు(ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956)  ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి,  వృత్తి రీత్యా న్యాయవాది,  తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు,  రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ మతావలంబియే గాక బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ అంబేద్కర్ గారు.
వీరు ఆ కాలములో అంటరాని తెగగా భావింపబడే మహార్ కులానికి చెందినవారు. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచినాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.
పాఠశాలలో భీం రావ్ గారి గురువు బ్రాహ్మణుడునగు మహదేవ్ అంబేద్కర్ గారు భీం రావ్ ను ఆత్మీయునిగా తప్పించి అంటరానివానిగా చూసేవాడు కాదు. ఆయన 'అంబావాడి' అన్న వూరికి చెందిన వాడగు 'భీం రావ్' ఇంటిపేరులో వున్న 'అంబావాడేకర్' 'మహార్' బదులుగా తన ఇంటిపేరునిచ్చి  అంటే 'అంబేద్కర్' అన్న ఇంటిపెరునిచ్చి పాఠశాలలో ఆ పేరునే నమోదు చేయించినాడు.
అంబేద్కర్ గారి చదువుకు అన్ని విధములా సహాయము చేసిన బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గాడు. ఆ కాలములో 25 రూపాయలు నేడు 10,000 రూపాయలతో సమానము. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపినాడు. ఆయనా ప్రోత్సహించినాడు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరినాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించినాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అను పేరుతో ప్రచురించబడింది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చినాడు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు.
కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించినాడు.
1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగినాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు. ఆయనను అప్పుడు ఖండించినవారు లేరట.
అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి వారి మొదటి భార్య గతించి చాలా కలమయివుండినది. 1956 అక్టోబరు 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించినాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి ప్రమాదములేని దానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్లదెబ్బ తినవని తెలిపి బౌద్ధమును అవలంబించినాడు.  
ఆయన జీవిత కాలములో గాంధీజీ నెహ్రూజీలతో సిద్దాంతికముగా విభేదించినా ఆయన తన దృష్టి దేశ ప్రగతి పైననే కేంద్రీకరించినాడు. దళితునిగా పుట్టి సమాజములో అవమానములను ఎదుర్కొన్నా బ్రాహ్మణ క్షత్రియుల అభిమానమును చూరగొని విదేశములో మొదటి Doctorate సంపాదించిన వ్యక్తి. Bar-at-Law అయ్యును, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వములో వుండియును ఆయన నేహ్రూగారి చేత మరియు కాంగ్రేసు చేత 'భారత రత్న' గా గుర్తించబడలేదు. 1990 లో మొరార్జీ దేశాయి గారు (ఈయనా బ్రాహ్మణుడు) ప్రధాన మంత్రిగా వున్న  జనతా ప్రభుత్వము (BJP కూడా అందులో ఒక భాగము) హయాములో అంబేద్కర్ గారికి 'భారత రత్న' ఇవ్వటము తటస్తించినది.
అదే నెహ్రూ గారి హయాములో కేంద్ర మంత్రిగా వున్నా అంబేద్కర్ గారిని 'భీం రావ్'  అని పిలిచేవారట. అది కాక కొటీశ్వరులగు నెహ్రు గారు కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయమునకు చదువుటకు వెళ్లి  పరీక్ష తప్పినారట.అట్టి వారికి ఆ కాలములో 'Colonies' అంటే ఆంగ్లేయ వలసలనుండి చదువుకొనుటకు ఇంగ్లాండు వచ్చే  వారు 'Fail' అయితే వారికి 'Gentleman Pass' ఇచ్చే సాంప్రదాయముండినదట. దానిని ఆయన సాధించి స్వదేశమునకు ఆయనను అందరూ 'పండిట్ జీ' అని పిలిచేవారు. డాక్టరేటు సాధించి తన తెలివితేటలతో పట్టుదలతో  నెగ్గిన అంబేద్కర్ గారిని 'భీం రావ్' అని పిలిచేవారు. నెహ్రూ గారు తాను ప్రధాన మంత్రిగా వున్న కాలములోనే తనకు 'భారత రత్న' తెచ్చుకొన్నారు కానీ నిజమయిన రత్నాన్ని గుర్తించక వదలివేసినారు. ( ఈ విషయమును శ్రీ సుబ్రమణ్యస్వామి వారి ఉపన్యాసము నుండి గ్రహించినాను.)


లోకములో మంచి చెడ్డా రెండూ ప్రక్క ప్రక్కనే వుంటాయి. చెడ్డను మాత్రము విస్తృతముగా ప్రచారము చేసి మంచిని వదలకూడదు. అంబేద్కర్ గారి ప్రగతికి తోడుపడిన అగ్ర వర్ణస్తులు లేరా! అంబేద్కర్ గారికి హైందవ మతము సహించకున్నా బౌద్ధమును అవలంబించినారు కానీ విదేశీ మతములను అవలంబించలేదుకదా! మరి వారి అనుయాయులమని చెప్పుకొనువారు ఆయన అడుగుజాడలలో నడుస్తున్నారా! వారు శాఖాహారులై ఉండగలుగుతున్నారా! కాంగ్రెస్  లో వున్నా వారికి సముచిత సత్కారము నెహ్రూ గారి ప్రభుత్వము ఎందుకు చెయలెకపొయినది అన్నవి శేషప్రశ్నలే!

4 comments: