నే పొగడకుంటే
సంగీత సాహిత్యములను సరస్వతీ
దేవి యొక్క స్థన ద్వయమునకు పోల్పబడినది. పెద్దలు ఈ విధముగా చెబుతారు.
సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్థన ద్వయం
ఏక మాపాత మధురం
అన్య దాలోచనామృతం .
అంటే ఆ రెంటిదీ విడదీయలేని
బంధము. అసలు సంగీతమునకు సాహిత్యము ఊపిరి. అది గమనించకుంటే అర్థము కన్నా అనర్థము
ఎక్కువ.
తమిళులు తెలుగు తమ మాతృభాష
కానందువల్ల సంగీతమును విడువకుండా పట్టుకొన్నారు. మనము సంగీతము సారస్వతము రెండూ
వదలి ఆటవికతను ఆదరించుచున్నాము.
దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు శుభ
పంతువరాళి రాగం లోని 'నే పొగడకుంటే' అన్న త్యాగారాయ కీర్తన తమ కుడ్యము పై
ప్రచురించినారు. దానిని చూసిన తరువాత నాలుగు మాటలు చెప్పవలెనని అనిపించింది.
ఒక తమిళ శాస్త్రీయ గాయకుడు ఈ
కీర్తన పల్లవిని ‘నే పకోడా కొంటే నీకేమి కొదవ' అని పల్లవినెత్తుకొన్నాడు. తమిళ, శాస్త్రీయ సంగీత గాయయకులలో, పూర్వమున పెక్కురు త్యాగయ్య
కీర్తనలోని భాషకు కానీ భావానికి కానీ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వారి
భాషలో కవర్గమంతా'జ్ఞ' తప్పించి ఒకే అక్షరము ప్రతినిధిత్వము వహించుతుంది.
కావున వారు ఆ అక్షరము కలిగిన పదమును బుద్ధికి తోచినట్లు పలుకుతారు . చ ,ఛ ,సకు ఒకటే అక్షరము వాడుతారు. 'న' తప్పించి త వర్గమునకు ఒకటే
అక్షరము.'ణ'తప్పించి 'ట' వర్గమంతా ఒకటే అక్షరమే. ప
వర్గము కూడా అంతే. ఒక్క 'za' అన్న అక్షరము ఎక్కువ కానీ అది మనకు లేదు'. మనకు దాని ఉపయోగము లేదు. ఒక 'కృష్ణ' అన్న శబ్దము వ్రాయవలెనంటే
కి రుట్ చ్ న అన్న అక్షరాలను కలపవలె. పైపెచ్చు మనవలె ఆ భాషలో 'అమ్మ' వ్రాయవలసి వస్తే వారు 'అమ్ మ' అని వ్రాయవలె.
ఇంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను
అంటే అంత ఇబ్బంది వుండి కూడా 'సంగీత త్రిమూర్తులైన' మన ముగ్గురు వాగ్గేయకారులను దైవ సమానులుగా
చూసుకొంటారు.(త్యాగయ్య, శ్యామా శాస్త్రి వారి పూర్వులది ఒకప్పటి కడప
మండలములోని కంభము కాగా, ముత్తు స్వామి వారి పూర్వులది గోదావరీ తీర
ప్రాంతమని చెబుతారు. శ్యామా శాస్త్రి వారికీ త్యాగయ్య గారికి ముత్తుస్వామి గారికి
మధ్యన 10 సంవత్సరముల తేడా. వారు
సమకాలీనులు. మరి మనమో అసలు కర్నాటక సంగీతాన్ని సినిమా మాధ్యమములో కూడా, కొందరు విశ్వనాథ్ గారి లాంటి
దర్శకులను తప్పించి, బ్రహ్మానందం లాంటి హాస్య నటులతో సంగీత కచ్చేరీలో
అపాన వాయువుల జోప్పించి అవహేళన చేసినారు. అది చూసి ఆనందిచినామే కానీ అంగుళము మాత్రము
కూడా స్పందించని సంగీతాభిమానము మనది. అభినయించిన నటుడు తెలుగు ప్రొఫెసరు. కేవలము
బహుశ అతనికి డబ్బు మాత్రమె ప్రధానమేమో! ఇది ఆ నిర్మాతల నాదబ్రహ్మము పై గల అభిరుచి
తెలుపుతుంది. ఇక ఆ దర్శకుని కళాభిజ్ఞత గూర్చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఆ
దృశ్యమును ఆస్వాదించిన ప్రేక్షకులను అసలు మానవులుగా పరిగణించవలెనో లేదో నాకు
తెలియదు. బ్రహ్మ సాక్షాత్కారము పొందిన ఆ నాద బ్రహ్మలు పెట్టిన భిక్షను అవహేళన
చేసిన మన సంస్కృతిని ఏమని పొగడగలము. తమిళులైన M.S.సుబ్బలక్ష్మి,D.K. పట్టమ్మాళ్, M.L. వసంత కుమారి, వసంత కొకిలం లాంటి ఎందఱో తమిళ సంగీత విద్వాంసులు
ప్రత్యేకంగా తెలుగు సంస్కృత ఉచ్ఛారణ నేర్చుకొని కీర్తనలు పాడేవారు. వారి పాటలలో
ఆత్మ కనిపించేది. అసలు ఆత్మయే పరమాత్మ కదా! అచటి సంగీత ఆస్వాదకులకందరికీ రాగము
తాళము స్వరమును గూర్చి కొంచెమయినా తెలిసి వుంటుంది.
తమిళ సంగీత విద్వాంసులైన కొందరు తెలుగు పట్టించుకోకుండా
పాడినప్పుడు మనసుపెట్టి వినేవారికి నొప్పి కలుగుతుంది. నిజమే. వారికి సంగీతమే
ప్రధానము. ఈ వాస్తవము ఒకసారి గమనించండి.'బంటు రీతి కొలువు ఇయ్యవయ్య స్వామి...' అన్న కీర్తనను తెలుగుపై
అశ్రద్ధ కలిగిన తమిళులు ' పండు రీది గోలు వియ్యవయ్య చామి' అని పాడుతారు. ఒక సంగీతము
నేర్చుకొనే చిన్న అమ్మాయిని అమ్మా నీకు ఈ పాటకు మీ టీచరు ఏమన్నా అర్థము చేపిందా!
అన్నాను. అవును చెప్పింది అని అన్నది ఆ అమ్మాయికి. అయితే పల్లవికి అర్థము చెప్పమని
అడిగినాను. ఆ అమ్మాయి చెప్పింది నేను నాదయిన రీతిలో మీకు తెలియజేస్తున్నాను.
‘గొలు’ అంటే ‘బొమ్మల కొలువు’ అని అర్థము. ‘పండు’ అంటే అందులో ఉంచిన ‘బొమ్మ పండు,’
కావున మొత్తమునకు అర్థము ఏమిటంటే మా దశరా బొమ్మల కొలువులో బొమ్మ పండును పెట్టించు
‘చామీ’ అంటే ‘స్వామీ’ అని అర్థము. కావున భాష, భావము సంగీతమునకు రెండు కన్నులు.
ఎంతయినా శాస్త్రీయ సంగీతము పై వారికున్న భక్తి ప్రపత్తి సర్వదా సంస్తుతి పాత్రము.
ఒక పేరంటములో (ఇప్పుడు function అనవలెనేమో) ఇద్దరు ఆడవాళ్ళు
కలిసినారు. ఒకావిడ ఇంకొక ఆవిడ దుద్దులు చూసి ' అమ్మా! నీవి ఇత్తడి కమ్మలే అనింది'. రెండవ ఆవిడ వెంటనే 'నీకు అవి కూడా లేవే' అంది.
ఇది నేటి మన శాస్త్రీయ సంగీత
దుస్థితి.
శాస్త్రీయ సంగీత సాహిత్యములను గురించి యెంతో చక్కని సద్విమర్శగల వ్యాసాన్ని రచించేరండీ.
ReplyDeleteఆంధ్రులకు గల సినిమా సంగీతము పై అతి వ్యామోహము,
కర్నాటక సంగీతముపై గల తక్కువ స్థాయి అభిమానములను చక్కగా వివరించారు.
అవే అంశాలపై తమిళనాడు ప్రజలు యెటువంటి మంచి అభిరుచి గలవారో సోదాహరణంగా వివరించారు.
తమిళ భాషలో అక్షరావళికి తెలుగు భాషలో అక్షర మాలకు పొంతనలేపోయినా తమిళులు చాలా శ్రమపడి
యెంతో దైవ భక్తితో కర్నాటక సంగీతమును
యెలా సాధన చేసి ప్రదర్శనలిస్తూ ఉంటారో
గొప్పగా సవివరంగా తెలిపేరు.
సోదాహరణంగా పూర్వం తమిళులు కచేరీలలో తెలుగు పదాలను యెలాగ తప్పులు పాడేరో, వారికి తెలుగు పలుకడం కష్టం అయినప్పటికీ వారు ఆ సంగీతాన్ని యెలా ఆస్వాదిస్తూ వస్తున్నారో చాలా బాగా సోదాహరణంగా వివరించారు..
అద్భుతమైన మీ వ్యాస రచనలో మన తెలుగు భాష, సంస్కృతుల పట్ల గౌరవం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అలాగే సంగీత త్రిమూర్తులు
అయిన శ్రీ త్యాగరాజ స్వామి,
శ్రీ శ్యామ్ శాస్త్రి గారు,
శ్రీ ముత్తుస్వామి దీక్షితులు గారిని గురించి
చక్కని వివరాలు అందించేరు.
అలాగే సుస్పష్టంగా తెలుగును ఉచ్చరిస్తూ
శాస్త్రీయ సంగీతము పాడిన
శ్రీమతి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి,
డి,కె.పట్టమ్మాళ్ మొదలగు వారిని గురించి
సవివరమైన మీ అద్భుతమైన వ్యాస రచనకు
జోహార్లండీ రామ మోహన రావు గారూ.
మీ సందేశమునకు అనేక అభినందనలండీ.