Wednesday, 8 February 2017

విధి లేక నందో రాజా భవిష్యతి

విధి లేక నందో రాజా భవిష్యతి

తామరయందలి మధువును
ఏమరి తాత్రాగు చుండెఇనుడస్తాద్రిన్
తామరి చేరినయంతనె
సోమరి మధుపమ్ము సొక్కె సుమకోశమునన్

ఉదయము రాదా సూర్యుడు
ఉదయించక మానడంచు ఊహించంగా
ఉదయినుడు బొడము లోపల
మదగజమది త్రొక్కి వేసి మనుగడ బాపెన్

ఒకసారి ఒక మధుపము తనివితీరా తామర తేనెను గ్రోలుదామని ఆ పూవు కేసరములపై వాలింది. ఆస్వాదనలో మునిగి చీకటి ఆవరించినది గమనించలేక పోయింది. గమనించే సరికి
చీకటిపడి తామర ముకుళించుకొొనింది. తుమ్మెద ఎంతో ధైర్యముగా ఈ రాత్రిని ఎదో విధముగా గడిపినానంటే తెల్లవారుతూనే తామర వికసించుట నేను బయల్వెడలుట జరిగిపోతాయని తనకు తానూ ధైర్యము చెప్పుకొనినది. కానీ తరువాతి రోజు పూవు వికసించక ముందే అంటే ఇంకా తెలవారక మునుపే ఒక ఏనుగు ఆ కొలనిలోనికి వచ్చి ఆ తామరను కలిగిన తూడునే పెకలించి వేసింది. ఇక తేనెటీగ కథ ముగిసి పోయింది. ఒక్కొక సారి ఆపద కలిగినపుడు మనము ఏమీ చేయలేని పరిస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు మన భవిష్యత్తు విధిని అనుసరించే వుంటుందిఅది మంచి అయినా చెడ్డ అయినా! దానిని గూర్చి చెప్పేదే ఈ 'నందోరాజా భవిష్యతి' కథ

నందో రాజా భవిష్యతి
నందో రాజా భవిష్యతి అన్న నానుడిని మనము విరివిగా వాడుతూనే వుంటాము.ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడూరకుంటామా ! జరిగినప్పుడు చూద్దాములే అన్న భావనకు అనుగుణముగా వాడుతూవుంటారు.అసలు దీనికి ఒక కథ వుంది. అందులో ఒక దాసి తన రాణికి ధైర్యము నూరిపోసే సందర్భములో ఈ మాట చెబుతుంది.నిజానికి మనిషిలో నిరాశ నిస్పృహ ఆవరించినపుదు ప్రోత్సాహము అత్యవసరము. మనము క్రీడలలో ఈ విషయమును గమనించుతూనేవుంటాము. అసలు సీతమ్మను వెదుక సుగ్రీవుడు వానరసైన్యమును అఖండ భూమండలములోని అన్ని దిక్కులకు తన వానర సైన్యమును పంపి వెదకించుతాననుట ఒక ఆశను కలిగించే ప్రోత్సాహమే కదా! మనము చేయగలిగినది లేనపుడు చేసిపెట్టమని భగవంతుని ఆశించుచూనే వున్నాము కదా!
మన అబ్దుల్ కలాము గారు కూడా కలలుగను. కన్న కలను సాధించు అన్నారు. కొన్ని కష్టపడి సాధించేవైతే కొన్ని కాకతాళీయంగా జరిగి పోయేటివి వుంటాయి. అందుకే అటువంటపుడు ఆశ ఉన్నా అవకాశము వచ్చేవరకు ఊరక ఉండవలసినదే. భర్తృహరి సుభాషితముల తెనిగించిన ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేతలోని ఈ పద్యము చూడండి. 
రాతిరి మూషకంబు వివరంబొనరించి కరండ బద్ధమై
భీతిలి చిక్కి యాశ చెడి పీదయు దస్సిన పాము వాత సం
పాతముజెందె దానిదిని పాము తొలంగె బిలంబు త్రోవనే
ఏతరి హానివృద్ధులకు నెక్కుడ్ దైవము కారణంబగున్
బుట్టలో బంధింపబడిన పాము బయటికి పోయే దారి లేకపోయినా బ్రతుకుతూ వుండింది కేవలము ఆశతోనే.ఆ ఆశే అసంకల్పితంగానే ఎలుక బుట్టకు రంధ్రము చేసి లోనిలి పోవుట తో పాము దానిదిని బయటకు కూడా రాగలిగింది. కాబట్టి కొన్నిటిని విధికి వదిలి పెట్టుటలో కూడా  ఎటువంటి తప్పు లేదు.
ఒకానొక రాజుగారు నిక్షేపంగా ఉన్న సంసారములో శీలవతియైన భార్యను కాదని వేశ్యా వ్యామోహములో పడినాడు.  ఇద్దరుభార్యలుండటం, గతము మరచి, గణిక తో శేష జీవితము గడపనెంచి పట్టపురాణీగారిని సదరు రాజావారు నిర్లక్ష్యంచేస్తూ ఆమెను అంతఃపురములో గాకుండా రాజ ప్రాసాదానికి దూరముగా ఉంచ దలచినాడు ఆ వేశ్య మాటలు నమ్మి.
అతను వేశ్య మాటను మంత్రముగా భావించి తన పట్టపురాణిని రాజప్రసాదమునకు దూరముగా తమ వనాంతర గృహము (farm house) లో ఆమె దాసితో బాటూ వుంచినాడు. ఆ రోజులలో రాణిగా మెట్టినింటికి వచ్చే వధువు పుట్టినింటి నుండీనే తన ఇష్ట సఖిని తెచ్చుకోనేది. ఆవిధముగానే తనతో తెచ్చుకొన్న సాహి తోడు రాగా ఆమె ఆ వనాంతర గృహములో ఉండసాగింది. వనాంతర గృహము చేరు సమయమునకే  రాణి గర్భవతి. ఆ విషయము అప్పుడు రాజుకు తెలియదు. ఆమె రాజ్యానికి వారసుని ప్రసవించినది . అయినా రాజు ఆమెను చూచుటకు కూడా రాలేదు వెలయాలి ప్రభావముతో! పిల్లవాడు దినదిన ప్రవర్ధమాను డౌతూవస్తున్నాడు. బాలునికి నందకుమారుడన్న పేరు పెట్టుకొన్నది ఆ తల్లి.
ఒకనాడు ఒక బంగారు నగల వర్తకుడు ఒక అత్యంత విలువ గల వజ్రాల హారాన్ని అమ్మకానికి రాజు వద్దకు తెచ్చినాడు. అతనికి పిల్లలు లేరు. రాజు అప్పటికే తన సర్వము వేశ్యకు దారపోయుటవల్ల వర్తకునితో వద్దు అని అన్నాడు. వెశ్య ఆయన పై అలిగింది. రాజు ఇంతకాలము తన సర్వస్వము వెశ్య పై వెచ్చించినా ఒక హారము కొననందుకు అట్లు వేశ్య ప్రవర్తించుట నచ్చ లేదు.
ఆవ్యాపారి మొదటినుండి రాణి గారు తెలిసిన వాడయినందువల్ల ఆవిడ ఉనికి కనుగొని ఆవిడ వద్దకు వెళ్ళినాడు. విషయము తెలుసుకొని బాధ పడిన వాడై ఆనగను ఆమెకు అప్పుగా , ధర కూడా తగ్గించి ఇవ్వదలచుకొన్నాడు. పిల్లవాడు పెద్దయ్యే వరకు ఆగుతానన్నాడు. అప్పుడు రాణి యొక్క దాసి ఆమెను ప్రక్కకు పిలిచి, అమ్మా హారము ఎంతో బాగుంది. రేపు మీ కుమారుడు రాజయిన తరువాత కోడలికైనా ఉపయోగ పడుతుంది. కావున తప్పక కొనమని ప్రోత్సహించుతూ పై శ్లోకము చెప్పింది:
ఉత్తుంగ భుజ నాశోవా దేశ కాల గతోపివా
వేశ్యా వణిజ నాశోవా నందోరాజా భవిష్యతి
అమ్మా! భవిష్యత్తు ఎవరికి తెలుసు. మహారాజయిన ఉత్తుంగభుజుడే మరణించ వచ్చు, దేశ కాల పరిస్థితులే మారి పోవచ్చు వేశ్య (పిల్లలులేని), వర్తకుడు కాలాంతరములో చనిపోవచ్చు, రాజకుమారుడైన నందుడే రాజు కావచ్చు . అందువల్ల  హారాన్ని తప్పక కొనుమని ప్రోత్సహించింది. రాణి అట్లే చేసింది. రాజు పై కక్ష తీర్చుకొనుటకు వేశ్య ఒక పామును తెప్పించి రాజును మాయ మాటల చేత తన మందిరానికి రప్పించి రాజు చూడకుండా పాము నాతనిపై వుసిగొలిపినది . పాము కాటుకు రాజు మరణించగా, ఆత్రముతో రాజువైపుకు నడచిన వేశ్య , పామును గమనించనందువల్ల, తానూ పాము కాటుకు గురియైనది. అక్కడ వర్తకుడు వయోభారముచే గతించినాడు.
దాసి చెప్పినట్లు నందుడు రాజయినాడు. హారము దక్కింది.
ఈ కథను ఆశావాదమును బల పరచుటకు పూర్వము పెద్దలు చెప్పే వారు. మా అమ్మమ్మ గారి వద్దనుండి నేను విన్నది మీతో పంచుకొనుచున్నాను.
స్వస్తి.


No comments:

Post a Comment