Tuesday 7 February 2017

ప్రణయ లేఖా రహస్యం

ప్రణయ లేఖా రహస్యం (శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు)
భోజుని సభకు ఒకనాడు మల్లినాధుఁడనే పండితుడు వచ్చాడు . రాజుగారికి వినయంగా నమస్కరించి " మహారాజా! మీసభలో కాళిదాసుగారి వంటి గొప్పకవులు, పండితులు, మేథావులు అనేకమంది ఉన్నారు వారిలో యెవ్వరైనా ఈశ్లోకంలోని మర్మం విప్పి చెప్పగలరా?" - అంటూ
శ్లో: కాచిత్ బాలా రమణ వసతిీం ప్రేషయంతీ కరండమ్
దాసీహస్తాత్, సభయ మలిఖత్ వ్యాళ మస్యోపరిష్టాత్
గౌరీ కాంతం , పవన తనయం, చంపకం , చాత్ర భావం
పృఛ్ఛత్యార్యో నిపుణ తిలకో, మల్లినాధః కవీంద్రః ;- అనేశ్లోకం చదివి వినిపించాడు. దాని యర్ధమిది;
కాచిత్-ఒకానొక; బాలా-యువతి; కరండం-చిన్నపెట్చెను; దాసీహస్తాత్- దాసిచేతికి యిచ్చి; రమణవసతిం-ప్రియునియింటికి; 
ప్రేషయంతి -పంపుచున్నదియై; అస్య- దానియక్క; ఉపరిష్టాత్- పైభాగమునందు; సభయం- భయపడుతున్న; వ్యాళం-పామును,;
గౌరీకాతం- శివుని;పవనతనయం-హనుమంతుని;చంపకం--సంపెంగపూవును;అలిఖత్--చిత్రించినది;ఆర్యః--సభలోనిపెద్దలు;నిపుణతిలకః--ెతెలివైనవారు; కవీంద్రః- కవాశ్వరులను; మల్లినాధః--మల్లినాధకవి; అత్రభావం--ఇందలిభావము,యేమైయుండునని పృఛ్ఛతి--అడుగు చున్నాడు;
భావము; ఒకయువతి దాసిచేతికి ఒకపెట్టెనిచ్చి ప్రియుని యింటికి పంపుచున్నది. ఆపెట్టెపై పాము, శివుడు,
ఆంజనేయుడు , సంపెంగల బొమ్మలను భయం భయంగా చిత్రించింది. దీని భావమేమి? యని మీసభలోని పెద్దలను ,కవులను, తెలివైనవారిని మల్లినాధుడు అడుగుచున్నాడు. అని;
విన్నవారందరూ మౌనము వహింపగా కాళిదాసు ఆశ్లోక భావము నిట్లు వివరించెను.
" ఆయువతి అష్టవిధ శృంగార నాయికలలో ప్రోషిత భర్తృక. యెక్కడనోయున్న ప్రియునికి తన విరహబాధను మర్మంగా సందేశం పంపుతున్నది. తన విరహ బాధను నలుగురు పెంచుతున్నారని,నువ్వు త్వరగా వచ్చి ఆబాధను పోగొట్టమని ,యీసందేశంలోని మర్మం!
ఆనలుగురు యెవరనేది వారి శత్రువులను పెట్టెపై చిత్రించటం ద్వారా తెలియ జేసింది. విరహాన్ని పెంచేవి యేమిటి?1 మలయమారుతం . దానికి శత్రువు పాముగదా (పామునకు గాలియాహారం) 2 రెండవది మన్మధుడు. మన్మధునకు శత్రువుశివుడుగదా! ఇక3 మూడవది ఉద్యాన వనములు . వనమునకు శత్రువు వానరనేగదా!( అదేహనుమంతునిబొమ్మ) 4 నాల్గవది తుమ్మెదలు.వాటికి శత్రువు సంపెంగపూలు.( సంపెంగ వాసన తుమ్మెదకు పడదు)
ఇంత రహస్యంగా కోడ్ భాషలోవలె యెవరికీ అర్ధం గానంతగా చిత్రించిన యువతినీ, ఇదిచక్కగా వర్ణించిన మల్లినాధునీ, దీనిని చక్కగా విపులంగా వివరించిన కాళిదాస మహాకవిని సభఎలోనున్నవారెల్లరు బహుధా ప్రశంసించినారు.
భోజుడు కాళిదాస మల్లినాధులను ఘనంగా సత్కరించినాడు.
నాటి కవుల ప్రతిభా వ్యుత్పత్తులట్టివి!

No comments:

Post a Comment