Wednesday 15 February 2017

మొహమ్మద్ ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము

మొహమ్మద్ ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము

మన చరిత్రను గురించి తెలుసుకొనుట మన తక్షణ కర్తవ్యము. మన గతము మన   వారసత్వము, మన సంస్కృతిని గూర్చి మనసారా  తెలుసుకొనుట మన బాధ్యత. మన దేశమును మన కళ్ళతో చూసుకొనుట అత్యంత ఆవశ్యకము. సద్గురు శివానంద మూర్తి గారు.
ఆ భవిష్యద్దార్శనికుని మాటలను మనసారా విశ్వసిస్తూ ‘సారే జహాఁసె అచ్చా’ అన్న జాతీయ హోదా గలిగిన గీతమును గూర్చి దానిని వ్రాసిన మొహమ్మద్ ఇక్బాల్ గారిని గూర్చి నేను విన్నది, చదివినది, పెద్దలచే తెలుసుకొన్నది  అతి క్లుప్తముగా తెలియజేస్తాను. వీరిని పాకిస్తాన్ దేశపు ఆధ్యాత్మిక పితగా గుర్తించుతారు. వీరికి అల్లామా ఇక్బాల్ అని గౌరవముగా పాకిస్తానీయులు పిలుచుకొంటారు. 'అల్లామా' అన్నది ముస్లీములు ఘనమైన విద్వాంసులకు ఇచ్చే బిరుదము.
ఈ విషయమును గురించి వ్రాయుటకు కారణము కొంత కాలము క్రితము ఈ విషయమై నేను చూచుట  తటస్థించిన  ఆస్య గ్రంధి లోని ఒక ప్రచురణ. అది ఇక్బాల్ గారిని గూర్చిన కొన్ని కల్పనలు కలిగియుండుట చేత నేను వాస్తవమును నా చేతనయినంత మేరకు మీ ముందుకు తేవలసి వచ్చినది. నేను ఎక్కువ మందికి చేరుతుందను ఉద్దేశ్యముతో ఆంగ్లములో వ్రాసినాను కానీ దానిపై ఎక్కువమంది దృష్టి సారించలేదు. కారణమును పాఠకుల మనస్సాక్షికే వదలివేస్తున్నాను. ఈ తెలుగు వ్యాసమునైనా చదివి వాస్తవాలు తెలుసుకొందురని నా ఆశ. ఈ  ఆశను దేశ ప్రేమకు కొలమానముగా భావించుతూ వున్నాను.
ఇక్బాల్ గారు ఈ గీతమును తమ 27 సంవత్సరముల వయసులో వ్రాసియుండవచ్చునని చదివినాను. వారపుడు లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగా ఉద్యోగము చేసే వారు.  దీనిని తరానా అంటారు. ఇది ఘజల్ శైలిలో వ్రాయబడింది. 16 ఆగస్టు 19౦4 లో లాలా హరి దయాళ్ అన్న విద్యార్థి అభ్యర్ధన మేరకు ఆయన ఏర్పాటుచేసిన సభకు ఉపన్యాసకునిగా వచ్చినా ఇక్బాల్ గారు ఈ పాటను ఆక్కడి శ్రోతలకు ఆవిధముగా లోకానికీ మొదటిసారిగా వినిపించినారట. ఈ గీతమునకు ‘తరానా-ఏ-హింద్ అన్న నామకరణమును వారు చేసినారు. తరువాత కొంత కాలమునకు వారు భవిష్యద్ ఇస్లాం సమాజ స్థాపన కొరకు, ఇస్లాం వేదాంతమును చదువనెంచి ఐరోపా వెళ్ళుట తటస్తించినది.

ఇక గీతము యొక్క విషయమునకు వస్తే అది 9 చరణములను కలిగి వుంది. అందులోని 5 వ చరణము ఈ విధముగా కనిపిస్తుంది.
అయ్ అబ్ ఎ రుద్ ఎ గంగా! వహ దిన్ హై యాద్ తుఝ్ కొ
ఉతరా తెరే కినారే జబ్ కారవాఁ హమారా
Ai āb-i rūd-i Gangā! Wuh din haiṉ yād tujh KO?
Utr
ā tire kināre jab kārwāṉ hamārā
మా బిడారు నీ ఒడ్డున విడిది చేసిన ఆరోజు నీకు జ్ఞాపకము ఉన్నదా! అని ప్రశ్నించుతున్నాడు కవి. మరి మహమ్మదీయులు మనము కలిసి బిడారును గంగ ఒడ్డున ఏర్పరచియుండినామా? చరిత్ర లో ఎక్కడయినా ఉటంకించ బడినదా!
బహుశ వారు తమ మతస్థులను గూర్చి చెప్పియుండవచ్చు. అప్పుడు, సనాతన ధర్మావలంబులమైన మనకు అన్వయించదు కదా! మరి అన్వయించనపుడు జాతీయ గీతము యొక్క హోదాకు తగుతుందా!
మనము వినే ఆ పాటలోని 3వచరణములో, అనగా అది పూర్తి పాఠము లోని 6వ చరణమౌతుంది, హిందీ, హిందుసితాఁ అన్న పదాలు వస్తాయి. బెంగాల్ బెంగాలీ గుజరాత్ గుజరాతీ, నేపాల్ నేపాలీ పాకిస్తాన్ పాకిస్తానీ అన్న విధముగా  హిందూస్తాన్ లో వున్న వారిని హిందీ అన్నారు. మరి హిందూస్తాన్ అన్నది మనము పెట్టుకొన్న పేరు కాదు కదా! ఇండియా హిందూస్తాన్ మనము పెట్టుకొన్న పేర్లు కాదు. ఎవరో నోరు తిరగని వారు పెట్టినవి. మనది భారత దేశము.
ఎందుకు మనము ఈ దేశమునకు భారత్ అన్న అధికారిక నామమును ఉంచుకొన కూడదు. ‘భ’ అన్న అక్షరానికి నిఘంటువు కొన్ని అర్థములను తెలిపింది, కానీ ఒక మహనీయుడు, మహా పండితుడు ‘భ’ అన్న అక్షరానికి అభివృద్ధి అన్న అర్థము లేక అన్వయము కూడా ఉన్నదని నాకు తెలియజేసినాడు. ‘నభము’ అభివృద్ధి లేనిది ఆకాశము, ‘భగము’ అన్న మాటకు వృద్ధి ప్రగతి కలిగించునది. 'అభము' అభివృద్ధి లేమి, ఎంత గొప్ప అర్థమో గమనించండి.

ఇక  హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు అన్న ఒక క్రొత్త అర్థమును ఎవరో ప్రతిపాదించినారు. ఆధారము కానరాదు. అంత అర్థవంతమూ కాదు. హిమాలయములకు ఆవలనున్న అరబ్బు దేశీయులు ‘స’ ను ‘హ’ గా పలుకుటచే ‘సింధు’ నది కలిగిన దేశము ‘హిందు’ దేశమైనది.
ఉత్తర భారతమున ‘స’ ను ‘హ’ గా పలుకుతారని ఒక వ్యక్తి ఆస్య గ్రంధిలో వ్రాయగా చదివినాను. హిందీ భాషలో శ, ష, స మూడు అక్షరాలూ ఉండుటయే గాక వారి పేర్లలో సందీప్, శారద, కృషి--- ఈ విధముగా మూడు అక్షరములనూ ఉపయోగించుతారు. అరేబియా దేశాల వారు నేటికినీ గణితమును ‘హింద్స’ అనే పిలుస్తారు. ఉత్తర భారత దేశమున ‘గణిత్’ అంటారు ‘హింద్స’ అన్నది ఔత్తరాహిక  సామాన్యులకు తెలియని పదము.
తిరిగీ అసలు విషమునకు వస్తే, ఇక్కడ మనము అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే మనమంతా హిందూ దేశమునకు చెందినవారము కావున హిందీలమైనాము అని మాట వరుసకు సమర్థించుకొందాము.  మీ దేశమేది అని ఒక విదేశీయుడడిగితే హిందూ దేశము’ అంటామా లేదా? హిందీ దేశము అని మాత్రము అనము కదా! అసలు మన ధర్మమును పాటించనివారు ‘హిందూస్తాన్’ అని అంటారనుకొందాము. అప్పుడు కూడా ‘స్తాన్’ అన్నది సంస్కృత పదమే. ‘హిందు’ శబ్దోచ్ఛారణ యే వారి మత రీత్యా ఉచ్చరించుట దోషము కదా! దంత్యములు, కంఠ్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనునాసికములు  ఇత్యాదిగా వర్గీకరింపబడిన మన సంస్కృతము భాషలకు ఆది పునాది. మిగతా ఏ ప్రపంచ భాషకు కూడా ఈ వర్గీకరణ లేదు. అది వారు తెలుసుకొన ప్రయతించరు. ‘హింది’ ‘హిందు’ రెండూ ఒకటే కానీ వారు మొదటిది మాత్రమె ఉచ్చరించుతారు. అసలు అక్షరము అంటేనే బాహిరముగా ’అ’ నుండి ‘క్ష’ వరకు అని ధ్వనిస్తున్నా ‘క్షరము’ అనగా ‘నాశము’ కానిది అక్షరము. ఇంతటి గొప్ప విషయములను మనకందించిన మహనీయులు  మన పూర్వులు.
ఇక తిరిగీ ఇక్బాల్ గారి విషయమునకు వస్తే ఆయన ఇస్లాం వేదాంతమును పుణికి పుచ్చుకున్న తరువాత ‘తరానా-ఏ-మిలి’ అన్న గేయమును ‘సారే జహాఁ సె అచ్ఛా’ ఛందస్సులోనే వ్రాసినారు. ‘తరానా-ఏ-మిలి’ అంటే ‘మతానుగత గీతము’ అని మనము అనువదించుకొనవచ్చు. ఇక్బాల్ గారి లౌకిక తత్వమునకు సాధారణముగా ‘సారే జహాఁసె అచ్చా’ లోని ఈ చరణమును ఉటంకించుతారు.
మజహబ్ నహీఁ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా
హిందీ హైఁ హం వతన్ హై హిందూసితాఁ హమారా
Maẕhab nahīṉ sikhātā āpas meṉ bair rakhnā
Hindī haiṉ ham, wat̤an hai Hindūstāṉ hamārā
మతము అన్నది వైరమును బోధించదు. మనము హిందువులము మనది హిందూస్థానము అని నుడివినారు.
1910 లో ఆయన వ్రాసిన ‘తరానా-ఏ-మిలి’ లో ఏమి వక్కాణించినారో చూడండి.
సైన్-ఓ-అరబ్ హమారా, హిందూసితాఁ హమారా
ముస్లిం హైఁ హం వతన్ హై సారా జహాఁ హమారా
Cīn o-ʿArab hamārā, Hindūstāṉ hamārā
Muslimhaiṉ ham, wat̤an hai sārā jahāṉ hamārā

మధ్య ఆసియా మనది, అరేబియా మనది, హిందూస్తాన్ మనది. మనము ముస్లిములము  ఈ ప్రపంచమే మనది. దీనితో వారి హిందూదేశ భక్తి ఏమయి పోయిందో గమనించండి. రెండు దశాబ్దముల పిమ్మట 1930 లో ఇక్బాల్ గారు అలహాబాదులో ముస్లిం లీగ్ వార్షిక సమావేశములోని తమ అధ్యక్షోపన్యాసములో ఏఏ ప్రాంతములలోనైతే ముస్లిం జనాభా ఎక్కువగా వుందో ఆయా ప్రాంతాలను అన్నింటినీ ముస్లిం దేశాలుగా మార్చవలెనని ఉద్ఘాటించిన మహనీయుడు ఆయన. ఈ దేశానికి, మన ధర్మమును పాటించే వారిలో దేశభక్తి గీతము వ్రాయ గలిగే మహా కవియే లేడా! అసలు పాకిస్తాను బీజమును నాటిన మహానీయుడాయనే!  ఆయన 1887 నవంబరు 8 న సియాల్కోట్(ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతము) (1938 ఏప్రిల్ 21 న లాహోర్ (బ్రిటీష్ ఇండియా) లో మరణించినారు.
పాకిస్తానులో నేటికినీ ఆయన పుట్టిన దినమును ‘ఇక్బాల్ డే’ గా పిలుస్తూ ఆ రోజును సెలవు రోజుగా ప్రకటించుకొంటారు.
 చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆయన పూర్వీకులు  ‘సప్రూ’ అన్న ఇంటిపేరు గలిగిన బ్రాహ్మణులు. వారు ఇస్లాం లోకి బలవంతముగా మార్చబడినవారే! ఆతరువాత కాలములో వారు పంజాబ్ నకు వలస వచ్చినారు. అదే కాశ్మీరుకు చెందిన పండితులు ముస్లిముల చెర తప్పించుకొని జమ్మూ చేరి తమ తిప్పలు తాము పడుతూ వుండగా తగుమమ్మా అంటూ వచ్చి మీకు సహాయము చేస్తాము మా మతములోనికి మారండి అన్న విదేశీ క్రైస్తవులను త్రిప్పి పంపిన ఆ గొప్పవారిని గూర్చి తలచినవారున్నారా!
తెలిసినది క్లుప్తముగా తెలిపినాను. మంచి చెడుల నిర్ణేతలు మీరే! ఇక వారి అభిప్రాయము హిందువులపై ఏవిధముగా ఉండినది అన్నది తెలిపి నేను విరమించుతాను.
Iqbal expressed fears that not only would secularism weaken the spiritual foundations of Islam and Muslim society, but that India's Hindu-majority population would crowd out Muslim heritage, culture and political influence. (Muhammad Iqbal From Wikipedia)
మరి స్వాతంత్ర్యమునకు మునుపు ఈయన వ్రాసిన 'సారే జహాఁ సే అచ్ఛా' మనకు జాతీయ గీతము ఎట్లు కాగలుగుతుంది.
స్వస్తి.

2 comments:

  1. Dhanyavaadaalu RAMMOHAN gaaru...meelaanti peddaley maaku dishaanirdesham cheyaali...

    ReplyDelete
    Replies
    1. ఉత్సాహవంతులగు మీవంటి వారు ఇటువంటి విషయములను విరివిగా చదివితే 'మనము మన చరిత్ర ను గూర్చి తెలుసుకోనుటలో ఎంత వెనకబడి ఉన్నామో' తెలుస్తుందమ్మా!

      Delete