బాలుడైన గోపాలుని
పాదాలకు అంకితం
భక్తి తత్వ శిఖరాగ్రణి పాదసేవనం
అజర్ బైజాన్ అన్న దేశము ఒకటి ఉన్నదన్న విషయమే
కొందరికి తెలిసి ఉండదు. ఒకప్పుడిది USSR కు అనుబంధ దేశముగా ఉండేది. అందులో ‘బకు’
అన్నది ఒక ఊరు. ఆ ఊరికి చెందిన ఆ భక్తురాలు మార్చుకున్న పేరే పాద సేవనం. పాదముల
సేవించుట అన్నది ఈ మాట యొక్క అర్థము అన్న విషయము నేను ప్రత్యేకముగా మీకు తెలుప
నవసరము లేదు. ఎవరి పాదములు అంటే బాలగోపాలుని పాదములు.
అసలు ఎక్కడో మారు మూల ఉన్న ఆమెకు ఈ భక్తి ఏవిధముగా అబ్బిందబ్బా
అనుకొంటున్నారేమో!
ఒకానొక పర్యాయము ఒక కృష్ణ భక్తుడు భక్తి వేదాంత
శ్రీల ప్రభుపాద స్వాములవారు వ్రాసిన భగవద్గీత పుస్తకము ఆమెకు ఇవ్వటము జరిగింది.
ఆసాంతము ఆమె దానిని చదివిన పిమ్మట అర్థమైపోయింది అది ఒకసారి చదివి ముగించే పుస్తకము
కాదు నిత్య పారాయణము చేయవలసినది అని. ఆమె పిల్లలంతా సంపాదకులై ఎవరి దారిన వారు
పోగా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండేది. తన పని ముగిసిన వెంటనే ఆమె భగవద్గీతను పారాయణము
చేస్తూ వుండి పోయేది. ఆమె వయసు 74 సంవత్సరములు అప్పటికి. పుస్తకము పై ISCON వారి
చిరునామా ఉడుటచే బకు లోని ఆ గుడిని చేరుకొంది
తన జీవితములో మొదటిసారి. అతిథులు కూర్చునే చోట ఆమెను కూడా కూర్చుండజేసి ఇంకా కొందరు అతిథులను చేరబిలుచుటకు పోయినాడు
కార్య కర్త. క్షణము ఆలస్యము లేకుండా తాను భగవద్గీత అధ్యాయాలలో గుర్తులుంచుకొన్న పుటలలోని
శ్లోకములను రసవత్తరముగా తనతోబాటూ వున్న భక్త బృందమునకు తనదైన శైలిలో చెప్పుట
మొదలుపెట్టినది. ఆశ్చర్యపోయినారు ISCON అంతేవాసులు. ఆమెతో కూర్చొన్నవారు ఆమె వాక్
ఝరి లో ఓలలాడుట ISCON సదస్యులు గమనించి
అచ్చెరువందినారు.
గుడికి వచ్చుట ఆమె నిత్య విధి అయిపోయినది. ఒకరోజు
ఆమె అచటి ISCON పెద్దలతో తాను నివసించే తన స్వంత భవనమును అమ్మి ISCON కు ఇచ్చి
వేస్తానని చెబుతూ అందుకు ప్రతిగా తన నిత్య నైమిత్తిక అవసరాలకు అనువుగా వుండే విధముగా
ఒక్క గదిని తనకు గుడిని ఆనుకొని ఏర్పాటు చేయమని అడిగినది. తర్జన భర్జనల తరువాత ఆమె
సరేననడమూ జరిగినది. కాలక్రమేణ ఆమె అచట చేరుటయే కాక అచట తులసి తోటను పెంచింది.
వచ్చిన భక్తులకు కృష్ణ తత్వోపదేశములోనే కాలము గడిపేది. రాజకీయములకు ఆమె బహుదూరము.
1974 లో ISCON లో భక్తి వేదాంత స్వామి గురుత్వములో చేరిన రోహిణీ సుత ప్రభు
తన పర్యటన లోని భాగముగా బకు వచ్చినపుడు ఆ
మహానీయురాలికి పాద సేవనం అన్న పేరు
పెట్టుట జరిగినది. అది మొదలు ఆమె పేరు అందరూ మరచిపోయినారు. తన కృష్ణ భక్తియే తన
లక్ష్యము అన్యము నిర్లక్ష్యమే! చతుర్విధ పురుషార్థములలో అత్యున్నతమైనది మోక్షము.
దీనిని ఇంకా అనేక నామములతో పిలుస్తారు. అవి ఏవంటే ముక్తి, విముక్తి, కైవల్యము, నిర్వాణము, వర్గము, నివృత్తి, నిశ్రేయసము, పరమగతి, పరమపదము, అని మనము చెప్పుకోవచ్చు.
ముక్తి త్రయం అనే మూడు పదాలు ఉన్నాయి. అవి : క్రమ
ముక్తి, జీవన్ముక్తి, విదేహ ముక్తి. ఇది నాలుగు విధములుగా కూడా చెప్పబడినది. వానిని ముక్తి చతుష్టయము అని
అంటారు. అవి సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము.
మోక్ష మార్గం - కర్తృత్వ భావన లేకుండా కర్మలను చేసి, సర్వ ప్రాణుల పట్ల దయగా వ్యవహరిస్తూ, సాధన చతుష్టయాన్ని అనుసరించే వారు మోక్షాన్ని
సాధిస్తారు. అర్చిరాది మార్గాలతో వీరికి పనిలేదు. ఈ మార్గాన్నే విదేహ కైవల్య
మార్గమనీ అంటారు. దీనికి ఆలంబనము భక్తి. ఈ భక్తిని తొమ్మిది విధములుగా
విభజించినారు. అవి
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
ఈ మహా భక్తురాలు నా ఊహ ప్రకారము అటు సాలోక్య
మార్గమును ఇటు సఖ్యము మరియు ఆత్మ నివేదనమును ఆశ్రయించినది. ఒక రోజున ఒక అనార్ద్ర
ఘటము (Dry Cell) తో నడిచే ఒక బొమ్మ తేరు (Car) ను తెచ్చి ఆమె అందులో తన బాలకృష్ణుని కూర్చుండ బెట్టుకొని తన శక్తి మేరకు ఆ
చుట్టుప్రక్కల త్రిప్పుతూ వుండినది. భక్తులు ఆమెను అడిగితే ఆమె చెప్పిన జవాబు
ఏమిటంటే నా కృష్ణుడు పసి బాలుడు. తానూ ఆటలాడుకోవాలంటాడు కదా! కారులో త్రిప్పమని
నన్నడిగినాడు. త్రిప్పుతూ వున్నాను. ఆమె కృష్ణుని కోసం మంచము వాల్చి పక్క వేసి
యుంచేది. ఆమె చేసే ఏపనీ చూపరులకు కొంత చిత్రముగానే వుండేది.
ఆమె ప్రవర్తన ఎంతసేపూ కృష్ణుడు తన కొడుకో మనుమడూ
అయినట్లు ఆయన బాగోగులు తానే చూసుకోనవలసినట్లు తలచేది. ఒకరోజు అక్కడ వుండే తనకు
కాస్త ఎక్కువగా పరిచయము వున్న వారితో ఈ విధముగా చెప్పింది. “నాకు నా కృష్ణుడు రాత్రి కలలో కనిపించినాడు. నన్ను అహోబళం పొమ్మని నా కృష్ణుడు
నన్ను ఆదేశించినాడు. అక్కడ ‘వీర నరసింహుడు’ నిర్జన కీకారణ్యము’ లో వారానికి ఒక రోజు పూజతో వుండిపోతునాడట.” ఎక్కడి అహోబళము ఎక్కడి అజర్ బైజాన్. 74 సంవత్సరముల పండు ముసలి ఆమె, చేరవలసినది పులులు సింహాలు పాములు తేళ్ళు విరివిగా వుండే కీకారణ్యము. పరమాత్మ
ఆదేశము ముందు వయసు, దూరము, కష్టము, భయము, నిస్సహాయత ఏవీ ఆమెను నిలుపలేక పోయినాయి. ఆమె
అనుచరులు ‘నీవు కృష్ణ భక్తురాలివి కదా బృందావనము నిన్ను
క్షేమముగా పంపుతాము నీ జీవితాంతము అక్కడనే వుండు” అని ఎంతగానో బుజ్జగించి చెప్పినారు. “కృష్ణుడు ఇది చెప్పినాడు కానీ అదెందుకు చెప్పలేదు” అని ఎదురు ప్రశ్న వేసింది. “వారు నీవద్ద డబ్బులేక టిక్కట్టుకే యిక్కట్టు పడుతూ
ఉన్నావే మరి ఆ అడవిలో నీకు వసతి భోజనము ఏలాగు” అని ఎదురు ప్రశ్న వేసినారు. మరి ఆమె
అన్నది “ఆ విషయము నా కృష్ణునికి తెలియదంటారా” అని. వారి నోటికి తాళము పడింది.
ఎట్టకేలకు ఆమె ప్రయాణమునకు అన్నీ సిద్ధము చేసినారు.
హైదరాబాదు లో విమానము దిగగానే అహోబళము పోవుటకు ఏర్పాటు జరిగి పోయినది. ముందు
నేరుగా పూజారిగారి ఇంటికి పొమ్మన్నది ఆమె. పరిచయము అయిన పిదప ఆయనే ఆమెను ఆమెతో వచ్చిన ఒకరిద్దరిని తన వెంట పిలుచుకు
పోయినాడు. ఆమెకు ఒక గుడ్డి లేక బుడ్డి దీపము, దీనిని పలుచటి ఇనుపరేకుతో కిరోసిను పోయుటకు వీలుగా
చేసి అందులో కిరోసిను పోసి పాత బట్ట పొడవుగా ఒక తాడులా తయారుచేసి దానిని వత్తిగా ఆ
చిన్న డబ్బీ లోనికి జొనిపి పైకి కొద్దిగా కనిపించు విధముగా వుంచి దానిని
వెలిగించేవారు, ఏర్పాటు చేసి వెళ్ళిపోయినారు. ఆ రోజుకు ఆమె గుడిలోనే, ఉన్న మేరకే తల దాచుకొనింది. తెల్లవారిన పిదప దగ్గర వూర్లలోని జనము వచ్చి ఆమెకు
ఎండుటాకులతో బస ఏర్పాటు చేసినారు.
అంత ముసలావిడ అక్కడ వుండగా లేనిది నేనెందుకు నిత్య
పూజనము చేసి నిత్య నైవేద్యము పెట్టకూడదనుకొన్నాడు పూజారి. రాను-రాను భక్తుల రద్దీ
పెరిగింది. విషయము అప్పటి ఆంధ్ర రాజధాని హైదరాబాదు వరకు ప్రాకింది. అప్పటి
గవర్నరుగారే వచ్చి అక్కడ జరిగిన పురోగతి గాంచి అబ్బురపడి, ఆమె పాదములకు నమస్కరించి ఆ ప్రదేశములో చేయవలసిన మిగతా ఏర్పాట్లు చేయించుటను తన
బాధ్యతగా తీసుకొని వెడలిపోయినాడు.
ఒక రోజు ఆమెను పాము కరచింది. ఆమె ఏ మాత్రము భీతి
చెందక నారశింహుని వద్దకు పోయి “నేను చేయవలసినది ఇంకా ఏమయినా వుంటే భూమిపై నన్ను
వుంచు, లేకుంటే నీలో చేర్చుకో” అంది. స్వామికి ఆమె ఇంకా జీవించ వలసినది ఉన్నదీ అని అనిపించిందేమో, ఏ మందు మాకు లేకుండానే ఆమె జీవించి స్వామీ సేవలో జీవితము గడిపింది. ఆమె తన
కృష్ణుని ఎన్నడూ మరచినది లేదు. ఉదయాత్పూర్వమే లేచి నిత్య కర్మలను ముగించుకొని తన
బాల కృష్ణుని నారశింహుని గుడికి ఆనుకొని యుండే తన పాకలో ఒక Plastic chair లో కూర్చొబెట్టి తనదయిన రీతిలో
కోలుచుతూ వుండేది. ఉదయమే భగద్దర్శనమునకు వచ్చిన భక్తులు ఆమెను సందర్శించి మ్రొక్కి
నరశింహుని చూడబోయే వారు. ఆరోజు దైవ దర్శనమునకు మొదటిగా వచ్చిన ఒక స్త్రీ పాదసేవనము
తలుపు తెరిచి చూస్తే ఆమె తన బాలకృష్ణుని కౌగలించుకొని స్థాణువులా వుంది యుండినది .
ఆ పరమ భక్తురాలిని కదిలించిన పిదప గాని, ఆ స్త్రీ కి అర్థము కాలేదు, ఆమె బాలకృష్ణుని లో లీనమైపోయినదని.
స్వస్తి.
No comments:
Post a Comment