Wednesday, 25 January 2017

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరాఅందుకు వలయు ఉపకరణములు కూడావ్ ముఖ్యము.

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా – 1
https://cherukuramamohan.blogspot.com/2017/01/blog-post_25.html

జాబిల్లి: సవివరంగా ప్రచురించారు. ధన్యవాదాలు... ఒక్క ప్రశ్న.. ఇది నా అజ్ఞానానికి తెలియనిదనానికి తార్కాణం కావచ్చు. ఇంత విజ్ఞానం భావి తరాలకు (అంటే మన పూర్వికుల తరువాతి తరాలకు) ఎందుకు సమగ్రంగా అందించబడలేదు? ఈ విజ్ఞానం మరుగునపడడానికి కారణం ఏమిటి?
నాకు తెలిసినంత వరకు తెలియ జేసే ప్రయత్నము చేస్తాను (రామ మోహన్ రావు జవాబు )
స్వచ్ఛమైన పాలు ఒక పాత్రలో వున్నాయనుకొందాము. ఒకడు ఆ పాలను చూస్తూనే అన్నీ త్రాగేయాలనుకొన్నాడు. అంతలో ఎవరో పిలిస్తే అటు వెళ్లి కాసేపు గడిపినాడు. వచ్చి త్రాగుదామనుకొంటే అంతలో అతని అర్ధాంగి పిలిచి పెరటిలోని కరివేపాకు వెంటనే కోసి ఇవ్వమనింది. ఇచ్చి వచ్చేసరికి కాస్త ఆలస్యమైనది. అంతలో ఇంటికి ఎవరో అతి ముఖ్యమైన అతిథులు వచ్చినారు. వారితో కూర్చొని మాట్లాడకుంటే బాగుండదని కూర్చున్నాడు. ఆటంకాలన్నీ తొలగించుకొని వచ్చి చూస్తే దానిలో ఈగ పడి వుంది. దానిని తీసివేసి కాచమన్నాడు భార్యను. ఆమె కాచితే అవి విరిగి పోయినాయి. ఈగ మాత్రము విమానము వలె ఇంటిలో స్వైరవిహారము చేస్తూ ప్రతి ఖాద్య యోగ్యమగు పదార్ధమును దాని పాత్రను, తాను దిగుటకు అంటే వాలుటకు యోగ్యమగు విమానాశ్రయమును చేసుకొని వుంది.
.....2

కళ్ళు తెరచి కనరా--ఒళ్ళు మరచి వినరా –2

ఇది ఇప్పటి మన తెలుగు పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మా తరము వారి ప్రతీక అని ఉహించుకొంటే, అతను పాలు త్రాగుటకు ఏర్పడిన వివిధ విధములగు ఆలస్యములు వారి జీవితములో ఏర్పడిన అడ్డంకులు అనగా ఉద్యోగమూ, సంపాదన, సంసారము, సంఘ గౌరవము, బంధుమిత్ర సంబంధములు మొదలగు ఎన్నో విషయములుండేవి.  మా తరములో కొన్ని అత్యంత అవసరాలకు సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగము కొరకు చదువుకొన వలసి వచ్చింది. చదువు ముగియగానే ఉద్యోగము. ఉద్యోగము లేకుంటే కుటుంబము గడుచుట కష్టమైపోయేది. ఉద్యోగము పెద్దదైతే పదవీ వ్యామోహము, చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి చదివే తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్ నవలు ఇంకొకప్రక్క , శృంగార సాహిత్యమను పేరుతో అసభ్య అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు వేరొక ప్రక్క, మాసపత్రికలు మరొక ప్రక్క, ప్రొద్దు పుచ్చుటకు సినిమాలు తలకెక్క, ఇక గ్రంథములు చదువుటకు వేసలుబాటేదీ!

ఒక అదృష్టమేమిటిటంటే ఉత్సాహమున్న వారికి చెప్పేవారు మా కాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే వారూ కూడా కను మరుగే.

ఒక వాహనచోదకుడు తాను బండి నడిపినంతకాలమూ ఒకే ధ్యేయమే! తన గమ్యమును ఎటువంటి వడి-దుడుకు లేకుండా తన దృష్టిని మరల్చకుండా సజావుగా పోతూ ఉండుట. ఆ వాహన చోదకునిగా మనల నూహించుకొంటే మన జీయిత గమ్యము వరకూ బండి నడచినంతకాలమూ దృష్టి సంపాదనపైనే! అప్పుడు ఏమీ చేయలేని స్థితి వచ్చినపుడు చేతలుడిగి మూలాన కూర్చుంటాము. అదే మనము ఒక పూలతోటకు మాలి అయితే రోజుకునొక పూల చెట్టువద్ద దాని సౌరభామును ఆస్వాదిన్చుతూ ఆనందముగా గడుపవచ్చును. అందుచేత నేను చెప్పవచ్చేదేమిటంటే డబ్బుగాక ప్రపంచములో భక్తీ జ్ఞానము వైరాగ్యము (సన్యాసము కాదు) కూడా ముఖ్యము. 

.......౩

కళ్ళు తెరచి కనరా--వళ్ళు మరచి వినరా –౩

ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠనమో అవధానమో (అవధానము,కవి సమ్మెళనము సా. 5 గం. లకు మొదలయ్యేది.) కవి సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే వారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా అవధానములను నిర్వహించేవారు వున్నారు. వారికి ధనము, పేరు, పలుకబడి పై మక్కువ ఎక్కువ. వినేవారు మాత్రము తప్పక కొదవయిపోయినారు. ఏతా వాతా ఎవరయినా వచ్చి కూర్చున్నా వారి అర్థమయ్యేది సున్న. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై తాండవమాడుతూవుంది. పిల్లల వద్ద వుండేది ఆయ. వారిలో సంస్కారము మాయ. ఇవి స్పీకింగ్లీష్ వాకింగ్లీష్ ఈటింగ్లీష్ రోజులాయె. దీనికి తోడు పిల్లలకు వెబ్బు లో దొరికే గబ్బు మీద మోజెక్కువాయె. మా కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక వారి పిల్లల కెంతెంత.

ఇది కాక కొందరు మహా పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక నాటి ఆంగ్లేయాధికారుల మెప్పుకై  వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే తెలుగును ప్రభుత్వమును ఒప్పించి పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.

భాష వుంటే గ్రంధాలుంటాయి. గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు వారిగా లేక ఆంధ్రులుగా గుర్తింపు వుంటుంది. లేకుంటే గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే !

మోహము వీడి సంపదల, మొత్తము జీవితమంత డబ్బుకై

దాహము చెందబోక తన దారిన దేహము పోక ముందరే 

ఈహను వీడుచున్ ఇహము ఈ క్షణమే నిను వీడునంచు, దా

సోహము ఆ పరేశుడగు సుందరమూర్తికి యంచు కొల్వరే!  

స్వస్తి.




No comments:

Post a Comment