Wednesday 30 November 2016

హిందీ సినిమా ధృవతార మీనాకుమారి

హిందీ సినిమా ధృవతార మీనాకుమారి
మీనాకుమారి జీవిత చరిత్ర వినోద్ మెహతా గారు రచించినారు. అందునుండి నాకు జ్ఞాపకమున్న కొన్ని విషయయాలను తెలియ చేద్దామనుకున్నాను. 'ఎంతటి వారు ఏమైపోతారు బలహీనతలకు లొంగిపోతే ' అన్న వాస్తవానికి ఈమె జీవితము చక్కని ఉదాహరణ. ఈమె లోని నిర్వేదమునకు మూలము, వెనుక సుందరీ ఠాకూర్. ఈమె రవీంద్ర నాథ ఠాకూర్ గారి స్వంత తమ్ముని కుమార్తె. ఒక క్రైస్తవుని వివాహమాడి  క్రిష్టియన్ మతము పుచ్చుకొని తన ఇల్లు వాకిలి ఆస్తి వంశమును కూడా వదలుకొని వచ్చింది బాల్యములోనే. కానీ ఆ పసితనముననే విధవరాలు అగుటచే  ప్యారేలాల్ శంకర్ మీరూతి అన్న ఉర్దూ విలేఖరిని పునర్వివాహమాడింది. ఆమెకు కలిగిన ఇద్దరు కుమార్తెలలో ప్రభావతి ఒకరు. ఈ ప్రభావతియే మొదటి సారిగా అలిబక్స్ అన్న ఒక చిన్న తరహా నటుడు, కవి, హార్మోనియం వాదకుని  రెండవ పెళ్ళాముగా, ముస్లిం మతము తీసుకొని స్థిరపడింది. ఆమె కామిని అన్న రంగస్థల నామముతో నాట్యము చేసేది, జీవనాధారము కొరకు. వారిరువురికీ కలిగిన సంతానమే మీనాకుమారి. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మెహజబీన్ బానొ. అసలు ఆమెను పోషించలేక ఆమె తండ్రి ఆమెను ఒక ముస్లిం అనాధ శరణాలయములో వదిలివేసినాడు. కొడుకు పుట్టవలెనన్న ఆయన బలమైన కోరికకు విరుద్ధముగా అమ్మాయి పుట్టుట కూడా కారణము. ఆమెకు ఒక అక్క ఒక చెల్లెలు ఉండేవారు. అమ్మాయిని వదలిన వెంటనే కాస్త దూరము పోయిన పిదప అతనిలో ఎందుకో మానవత్వము జాగృతమై తిరిగీ వెళ్ళే సమయమునకు, ఎదో పాత చాప పై పడుకొని ఉండినదేమో  ఆమె శరీరమంతా చీమలతో నిండిపోయి వుండినది. వెనుకకు తీసుకు పోనయితే తీసుకు పోయినాడు కానీ పూట గడుచుట మాత్రము కష్టముగానే వుండినది. ఆమె బాధా తప్త హృదయ కుహరము నుండి వెలువడిన ఈ మాట గమనించండి.
  I never had a collection of bright colored marbles like other children -Meena Kumari.
 అలిబక్స్ తాను సంపాదించలేనని నిర్ధారించుకొని, భార్య నాట్యము చూసే వారలు లేక పోగా, ఎదో తంటాలు పడి మీనా కుమారిని 'బేబీ మీన' అన్న పేరుతో బాలనటిగా 1939 లో విజయ భట్ గారి చిత్రము లో నటింప జేసినారు. అప్పటి నుండి ఆమెయే తన కుటుంబమునకు అన్న దాత. ఆమె పాఠశాలలో ఎక్కువ కాలము నిలువలేదు. ఆమె ఆత్మగతము ఒకసారి వినండి.   Little Mahjabeen is said to have said, "I do not want to work in movies, I want to go to school, and learn like other children. సంపాదన విధి వ్రాత అయితే చదువెట్లు వస్తుంది. ఆమె చదువు పై కలిగిన మక్కువ తో Sets కు పుస్తకములను తీసుకొనిపోయి చదువుకునేది. ఆమెను ఆ రోజులలో 'READING MEHZABIN' అని పిలిచేవారట. బేబీ మీనా గా తన వృత్తి ప్రారంభించి వయసు రాగానే 'మీనా కుమారి అయిపోయింది. 34 సంవత్సరముల కమాల్ ఆమ్రోహి కి చేరువై 19 ఏండ్ల వయసులో ఆమె రహస్యముగా ఆతనిని నిఖా చేసుకొంది. అప్పటికే ఆతనికి పెళ్ళయి ముగ్గురు పిల్లలు. తండ్రికి తెలియకుండా వివాహము చేసుకొన్నందువల్ల, అలీ బక్స్ ఆమెను ఇంటినుండి గెంటివేసినాడు. అమ్మే భర్త అమ్రోహీ ని చేరింది.  అమ్రోహీ ని వదిలిన పిదప కూడా తండ్రిగారింటికి పోలేదు.
అంతకు మునుపు కొన్ని పేరుగాంచిన సినిమాలలో నాయకిగా వేసినా ‘బైజు బావరా’ ఆమెకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. దీని నిర్మాత విజయ భట్ అయినా సంభాషణలు జియా సర్హది, పాటలు షకీల్ బదాయూని, శాస్త్రీయ సమ్మిళిత బాణీలను సమకూర్చిన సంగీత కర్త నౌషాద్. నాయకుడగు భరత్ భూషణ్ కు పాడినది మహమ్మద్ రఫీ. కథ బైజు అనబడు బైజనాథ్ మిశ్రది. 15,16 శతాబ్దములకు చెందిన మొఘలాయి సామ్రాజ్యము నాటి వాడు. రాజా మాన్ సింగ్ ఆస్థాన విద్వాంసునిగా ఉండినాడు. ఈ సినిమా నాయిక యగు మీనాకుమారికి ఉత్తమ నాయకి AWARD ను ఆర్జించి పెట్టింది. నౌషాద్ ఉత్తమ సంగీత దర్శకుడు. ఆ కాలములో హిందీ సినీ మహాలోకములో హిందూ ముస్లిముల అన్యోన్యానుబంధమే గాకుండా సాహితీ సంస్కృతుల అవగాహన కూడా అంత గొప్పగా వుండేది.
ఏమయితేనేమి ఆమ్రోహీతో ఆమె అనుబంధము  10 సంవత్సరములకు మించలేక పోయింది. అనుమానము, ఆధిక్యత కారణాలుగా ఆమ్రోహీని ఆమె విడిచిపెట్టవలసి వచ్చింది. ఆతరువాత, రెండు తప్ప, అరకొర సంబంధాలు ఏర్పడినా అవి అనుబంధాలుగా మారలేదు. ఆరెండింటిలో ఒకటి ధర్మేంద్రతో. ఆతని సినిమా భవితవ్యానికి పునాది ఆమె శిక్షణ మరియు పలుకుబడి. అందుకు ప్రతిగా ఆయన కృతజ్ఞత మన కంటికి కనిపించదు. రెండవ వ్యక్తి గుల్జార్. అనుబంధము శారీరికమైనదని చెప్పలేము.  ఆమె చివరి సినిమా పాకీజా పూర్తియగుటకు 14 సంవత్సరములు పట్టింది. అంటే అమ్రోహీ అనుబంధముతో మొదలయిన ఆ సినిమా, ఇరువురూ విడిపోయిన పిదప 3,4 సంవత్సరములకు గాని పూర్తికాలేదు. అయినా తమ మధ్యనున్న  మనస్పర్థలకు తావివ్వక ఆ సినిమా పూర్తి చేసింది. ఆమె అనుబంధము సినిమాతో అటువంటిది. చివరి రోజులలో ఆరోగ్యము పూర్తిగా చెడిపోయినా పట్టుదలతో సినిమా పూర్తి చేసింది. కానీ దాని విజయాన్ని చూడలేక పోయింది. సినిమా విడుదలయిన కొన్ని వారాలకే ఆమె మరణించింది.   జీవిత వైఫల్యము ఆమెను త్రాగుడుకు బానిసను చేసింది. ఒక అనాథగా చివరకు ఆమె liver cirrhosis తో  1972 లో మరణించింది.
భారత దేశ ప్రఖ్యాత నటీమణులలో సావిత్రి, మీనాకుమారి, సుచిత్ర సేన్ అనర్ఘ రత్నములు. సత్యజిత్ రే గారు మీనాకుమారిని  "undoubtedly an actress of the highest calibre." అని ప్రశంసించినారు. అసలు ఒకనాటి హాలివుడ్ అసమాన నటి ‘మార్లిన్ మన్రో’ మరియు ఆమె భర్త ‘ఆర్థర్ మిల్లర్’ కు మీనాకుమారి మరియు ఆమె భర్త కమాల్ ఆమ్రోహీకి చాలా పోలికలు వున్నాయని చెబుతారు సినిమా పండితులు. విషాదభరితమౌ ఆమె జీవిత
కథ దివిన పిదప నా మనసు ఈ నాలుగు మాటలు చెప్పింది.

కొండ మీది రాయి కోరి, కోరి దొరలి
సాటి రాళ్ళ చేత సంతతమ్ము
దెబ్బ తినుచుతినుచు దిగి తాను భువి పైకి
మురికి గుంట చేరి మునిగిపోయె!


 ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఈమె గొప్ప నటీమణియే కాదు, గొప్ప గాయకి మరియు కవయిత్రి. ఖయ్యాం ( కభీ-కభీ సినిమా సంగీతకర్త) స్వరపరచిన  ఈ కవయిత్రి వ్రాసి పాడిన ఘజల్ మరియు ఆ ఘజల్ కు నాకు చేతనైన రీతిలో మాతృకకు అన్యాయము చేయకుండా చేసిన అనువాదముతో ఈ వ్యాసమును ముగిస్తూ వున్నాను. హిందీ లిపి ఎక్కువమంది చదువలేరేమో నన్న సంశయముతో ఆంగ్లములో ఆ ఘజల్ ను మీ ముందుంచుచున్నాను.



Chaand tanhaa hai aasmaan tanhaa.
Dil milaa hai kahaan kahaan tanhaa.
Bujh gaii aas chhup gayaa taaraa.
Tharatharaataa rahaa dhuaan tanhaa.
Zindagii kyaa isii ko kahate hain.
Jism tanhaa hai aur jaan tanhaa.
Hamasafar koii gar mile bhii kahiin.
Dono chalate rahe tanhaa tanhaa.
Jalatii bujhatii sii raushanii ke pare
Simataa simataa saa ek makaan tanhaa.
Raah dekhaa karegaa sadiyon tak.
Chhod jaayenge ye jahaan tanhaa.

[Moon is alone and sky is alone
My heart goes alone on the journey
Day has brought the light but the hope is lost
My existence trembles alone
Is this the life, (dhuaan has a meaning of a boat other than smoke)
Where body and soul walk separately?
Though I found companion during my journey
But we kept walking separately
Far away on other side of that dim light
I see a small, closed and confined heart
It will wait for me for ages
After I walk alone from this world]


చంద్రుడేకాంతము గగనమూ అంతే
చూడగా నా హృది పయనమూ అంతే
తారలే కృంగె నాశయూ మాసె
జలధి మునిగే నావ, దరికి రాదంతే  
దీనినే జీవితమంటారా
దేహి తానొంటరి ఆత్మయూ నంతే
మార్గమున బాటసారెదురైనా
నాకు నేనొంటరి మరియు దానంతే
మినుకు మినుకంచదో నొక దివ్వె
పదిలమై నిల్చెనొంటరి ఇంటిలోనంతే   
యుగాయుగాలెన్నొ గడచినా కూడా
నన్ను చేరదీయుటకై  వేచియుందంతే 

చంద్రుడో యొంటరి గగన మొంటరిగా
మానస మ్మాయెగా నిట నొంటరిగా
                                            ఇంకెగా నాశ గ్రుంకెగా తార
                                            మంచు వణికేనె యిట నొంటరిగా
జీవితమ్మది యిదంచు బిలిచేరో
దేహమో ఒంటరి జీవ మొంటరిగా
                                            దారిలో నొకని నే గాంచినచో
                                             వేరు దారుల వెళ్లెద మొంటరిగా
వెలిగి యారేను కాంతిదీపికలే
మిగిలె నొక గృహ మ్మిక్క డొంటరిగా
                                         పథము వెదకుచుందు యుగయుగాలు

                                       వీడిపోయెద నీ భూమి నొంటరిగా    
By J K Mohan Rao

No comments:

Post a Comment