Thursday, 20 October 2016

ఆర్యుల దండయాత్ర కథ

ఆర్యుల దండయాత్ర కథ 

మన పాఠశాలలో మనం చిన్ననాటి నుండీ నేర్చుకుంటున్న కల్పిత సత్యాలు ఏమనగా.......

*ఆర్యులు తెల్లజాతి వారనీ, వారు ఎక్కడో మధ్య ఆసియా లేక నల్ల సముద్ర తీరం నుండీ గుర్రాల పై భారతావనికి వచ్చి ఇక్కడ స్థానికులైన ద్రావిడులను నల్లవారని దక్షిణ భారతావనికి తరిమివేసారనీ లేదా విజ్ఞానం ఆవిష్కరించి ఉన్నత నాగరికతను ఆచరించారనీ ఇలా ఇంకా ఎన్నో విషయాలు మన పాఠ్య పుస్తకాలలోని చరిత్ర పాఠాలు చెబుతున్నాయి.
*ఈ విషయం భారతీయులలో ఎంతో ఆందోళన కలిగించింది. జాతిని రెండు ముక్కలు చేసి ఉత్తర భారతీయులు ఆర్యులనీ దక్షిణ భారతీయులు ద్రావిడులనీ విడ గొట్టింది. ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ఆర్యులనీ తక్కిన శూద్రులు ద్రావిడులనీ వివాదం సృష్టించింది. అంతే కాకుండా ఈ ఆర్య అహంకార భావం తలకెక్కిన హిట్లర్ ఆర్యులే ఉన్నతులనే భావంతో ఇతర జాతులను సంహరిస్తూ నరమేధం సాగించి రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి కారకుడయ్యాడు.
*ఆర్యజాతి కథ బ్రిటీషు పాలకులు కల్పించిన, వ్యాపింప జేసిన అభూత కల్పన. ఇందుకు తార్కాణం.........
1) వేదాలలో ఎక్కడా ఆర్యులు వలస వచ్చినట్లు చెప్పబడలేదు.
2) వేద పరిభాషలో ఆర్యుడు అంటే గౌరవవాచకం. ఉత్తమ నడవడిక, శీల వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు. అంతే గానీ ఆర్యుడు అనేది జాతి వాచకంగా ఎక్కడా ఉపయోగంప బడలేదు.
3) దాస్యుడు అంటే - నడవడిక లేనివాడని అర్థం. వ్యసనాలకు లోనైన వాడు దాస్యుడు.
4) ఆర్యావర్తము - ద్రవిడ ప్రదేశం అంటే భరత వర్షంలోని వేరు వేరు ప్రదేశాలుగా మన ఇతిహాసాలు పురాణాలలో గుర్తించబడింది.ఆర్యావర్తంలో నివసించే వారు ఆర్యులు. ద్రవిడ ప్రాంతంలో నివసించే వారు ద్రావిడులు. ఇవి ప్రాంతాల వలన ఏర్పడిన పేర్లు మాత్రమే.
5) ఆర్యుల దండయాత్రా కథాక్రమం ఎలా కల్పించబడిందో చూడండి.
*1866, ఏప్రిల్ 10 న లండన్ నగరంలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఒక రహస్య సమావేశం జరిపి ఈ క్రింది విధంగా తీర్మానించింది.
*ఈ ఆర్యదండయాత్ర సిద్ధాంతం భారతీయుల మదిలోకి ఎక్కించాలి. అప్పుడే వారు బ్రిటీషు వారిని పరాయి పాలకులుగా భావించరు. ఎందుకంటే అనాదిగా వారి మీద ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు. అందువల్ల పవిత్ర క్రిస్టియన్ పరిపాలనలో భారతీయులు చిరకాలం బానిసలుగా కొనసాగుతారు.
(Source : Proof of Vedic Culture's Global Existence - by Stephen Knapp. P. 35)
*విలియమ్ జోన్స్ (1746 - 1794) భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కోల్ కతా లో పని చేసినారు. ఇతను సంస్కృతానికీ యూరోపియన్ భాషలకూ గల సంబంధం కనుగొన్న తొలివ్యక్తి. ఇతనూ మాక్స్ ముల్లర్ ఈ ఆర్య అనే శబ్దాన్నీ విస్తృతంగా ప్రచారం చేసారు. కానీ వీరి అసలు బుద్ధి ఇక్కడ చూడండ.
*1784లో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ, "విలియమ్ జోన్స్" మన మతాన్ని ఎలా వ్యాపింప జేయాలి? రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదు. అందుకే బైబిలును సంస్కృతంలోకి అనువదించి, స్థానిక మేధావి వర్గంలో వ్యాపింప చేయాలి అంటూ రాస్తాడు.
*ఇక మ్యాక్స్ ముల్లర్ 1886లో తన భార్యకు రాసిన ఉత్తరంలో, నేను ఈ వేదం అనువదించడంతో భారతదేశం తలరాత గొప్పగా మారబోతోంది. అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది. ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు. అది వారికి చూపించి, వేల ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకిలించి వేస్తుంది.
(Sorce : The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife, 1902, Volme - 1, p328)
*1946లో అంబేద్కర్ రచించిన Who were the sudras అనే పుస్తకంలో "శూద్రులు - ఆర్యులు" అనే ఒక అధ్యాయమే రచించారు. అందులో పాశ్చాత్య రచయితలు సృష్టించిన "ఆర్యజాతి సిద్ధాంతం" ఏ రూపంలోనూ నిలువజాలదు. ఈ సిద్ధాంతాలు పరిశీలించినట్లైతే వారికి సుస్పష్టంగా ఈ సిద్ధాంతంలోని లోటుపాట్లు రెండు విధాలుగా కనిపిస్తాయి. ఒకటి ఈ సిద్ధాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకున్న ఊహల నుంచి గ్రహించిన భావనలు గానీ, రెండు మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ నిజాలను గుర్తించకుండా మొదటే నిర్ణయించుకున్న సిద్ధాంతానికి అనుగుణంగా రుజువులు చూపిస్తున్నట్లుగా ఉంది.
*వివేకానందుడు అమెరికాలో చేసిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు. మీ యూరోపియన్ పండితులు ఆర్యులు ఎక్కడినుంచో ఊడిపడి అనాగరికులైన భారతీయుల భూములను ఆక్రమించి, భారతదేశంలో స్థిరపడినట్లూ స్థానికులను తరిమి వేసినట్లూ చెప్పడం ఊకదంపుడు మాటలు, తెలివితక్కువ మాటలు. విచిత్రం ఏమిటంటే భారతీయ మేధావులు కూడా దానిని సమర్థించడం.
*అరబిందో ఇలా అన్నారు....ఆర్యుల సిద్ధాంతం గురించిన హేతువులు ఋజువులు వేదంలో అసలు కనిపించవు. దీనికి సంబంధించిన తార్కాణాలు చాలా తక్కువ. అవి కూడా ప్రాముఖ్యత లేనివి. అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి ఎక్కడా లేదు.
(Source : Secrets of Vedas - by Aurobindo)
*ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం 1920లో బయటపడిన సింధూ నాగరికత తవ్వకాలతో పలుచబడింది. హరప్పా మొహంజదారో మొదలైన స్థలాలు ,లోతల్ రేవు, వీటి నగర నిర్మాణ రీతులు, ఇంకా మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో దాదాపు 10వేల సంవత్సరాలుగా నాగరికత ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతున్నదని ఋజువులు చూపుతున్నాయి. అటువంటిది, గుర్రాల పై దండెత్తి ద్రావిడులను తరిమి కొట్టడం ఏ మాత్రం సమంజసంగా లేదు.
*1980లలో ఉపగ్రహాల ద్వారా సరస్వతీ నదీ పరీవాహక ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్టు ఈ నదీప్రవాహ మార్గం సరిపోతూ ఉంది. ఇన్ని రోజులుగా ఆంగ్లేయులు ఈ నది వేదాల సృష్టిగా ఊహగా చిత్రీకరించారు. ఆర్యుల దండయాత్రా కథను ప్రచారం చేస్తూ ఉన్నారు.
*ఈ మధ్య కాలంలో స్టీఫెన్ ఓపెన్ హియర్ అనే జన్యు శాస్త్రజ్ఞుడు మైకో కార్డినల్ డి.ఎన్.ఏ పై పరిశోధన చేసాడు. దీని ద్వారా మన పూర్వుల లక్షణాలను గుర్తించవచ్చు. దీని ప్రకారం భారతీయుల వంశవృక్షం చాలా పురాతనమైనది.
*డేవిడ్ ఫాలే ప్రకారం (సుప్రసిద్ధ ఇండనాలజస్ట్) భారతదేశపు ప్రభావం ఇతర దేశాల పై ఉందని ఇక్కడి ప్రజలే నాగరీకులై యూరప్ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళి ఉంటారనీ ఋజువులతో సహా నిరూపించాడు.
*సుప్రసిద్ధ ఫ్రెంచ్ తత్త్వవేత్త వాల్ట్రెర్ ఫాంకోయిస్ (1694 - 1774) "నా నమ్మకం ఏమిటంటే, అన్నీ గంగాతీరం నుండే ప్రభవించాయి. ఖగోళశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం మెటాఫిజిక్స్ నాగరికత విజ్ఞానం అన్నీ అక్కడ నుండ వచ్చాయన నా నమ్మకం" అని అన్నాడు.
*ఇలా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం బూటకం అని, ఆంగ్లేయులు కల్పించిన కట్టుకథ అని, ఎన్నయినా ఆధారాలూ ఋజువులూ చూపించవచ్చు.
*ఇంతవరకూ ఆర్యుల దాడి సిద్ధాంతానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎక్కడా లభించలేదు.
*కానీ నేటికీ మన పాఠ్యపుస్తకాలలో బ్రిటీషు వారి కథలనే పాఠ్యాంశాలనే చెప్పడం చాలా అవమానకరంగా ఉంది.

No comments:

Post a Comment