Wednesday 26 October 2016

కాదేదీ కవిత కనర్హం
'కాదేదీ కవిత కనర్హం' అని అభ్యుదయ కవిత్వమున అగ్రగణ్యుడైన మహా కవి శ్రీశ్రీ  ఏ ఆలోచనతో ఏ ముహూర్తమున అన్నారో కానీ నేడు ఆ మాట అక్షర సత్యము. వారు ఆమాట అనకుండా వుండియుంటే నాలాంటివారు పలువిధములైన ఉత్త,చెత్త,లోత్త కవితలు ప్రచురించే ధైర్యము చేసియుండేవారు కాదేమో. వారు ఏ కవితా వస్తువునైనా రసమయము చేసి రసనపై రాసలీల జరిపించగల దిట్ట. నా లాంటి వారికి ఆయనతో సామ్యమెట్ట. వారి కవితలలో కథావస్తువు క్రొత్తదైనా అందులో పరిశీలన,రసము,శయ్య, భావము, అలంకారము, అనుప్రాసము, పాండితీ ధిషణ అడుగడుగునా అణువణువునా కనిపించుతుంది. మరి నాలాంటి వారిలోనో? వారికన్నా ఒక అడుగు ముందుకు వేసిన 'దేవరకొండ బాల గంగాధర తిలక్, గారి కవితలు వచన కవితలేయైనా రసపుష్టి కలిగినవని పండితులు పదేపదే చెబుతూ వుంటారు. మరి నాలాంటి వారిలో అది ఎక్కడ. 

నన్నయ, తిక్కన ఆదిగా గల కవులందరూ వాల్మీకి,వ్యాస,కాళిదాసాది మహా కవులకు మ్రొక్కక తమ రచనలు ప్రారంభిచలేదు. వారి తదుపరి వచ్చిన తెలుగు కవులు అటు సంస్కృత కవులను ఇటు నన్నయాది కవులను మనసారా తలంచక తమ కవిత్వ మహత్వ పటుత్వ సంపదలను మనకు పంచి పెట్టలేదు. మరి నాలాంటి వారికో అవి తలచే అర్హత కూడా మృగ్యమే! మరియా అనర్ఘ సంపద ఏమికావలె? చెదపురుగుల కాహారమేనా ! ఒకానొక కాలములో కవిత్వము వ్రాయుటకు భయముగా వుండేది, గురువుల ఎదుట సిగరెట్టూ అంటించనట్లు . మరినేడో గురువు శిష్యుడు కలిసే కానిస్తున్నారు. శ్రీనాథుడు ఒక సందర్భములో అంటాడు :


బూడిద బుంగలై యొడలు పోడిమి తగ్గి మొగంబు తెల్లనై

వాడల వాడాలన్ దిరిగి వారును వీరును చొచ్చొచో యనన్
గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో 
'గాడిద'నీవునున్ కావివి కావుకదా యనుమాన మయ్యెడిన్ 

అని అనగలిగినాడు. మరి వాక్స్వాతంత్ర్యము , భావ స్వాతంత్ర్యము ,వ్యక్తీ స్వాతంత్ర్యము కలిగిని మనలను నేడు అనగలడా!
అల్లసాని పెద్దన యంతటి వాడిని
'ఉమ్మెతక్కయ తిని సెపితొ
క్రమమెరుగక ఎర్రి పుచ్చ కయ డిని సెపితో
ఎమి తిని సెపితో కపితము
అమవస నిసి యనుచు నువ్వు అలసని పెదనా

యని ధిక్కరించినాడు తెనాలి రామకృష్ణుడు. మరి నేడో?

ఇదే తెనాలి రామకృష్ణుడు ప్రెగ్గడ నరసరాయలన్న కవి,  పెద్దలైన 'పెద్దన' లాంటి వారిని నిరసించితే 'భావ్య మెరుంగక పెద్దలైన వారల నిరసింతువాప్రగడరాణ్ణరసా విరసా తుసా భుసా' చూచినారా నవ్వులాట వేరు గౌరవ మర్యాదలు వేరు. ఇప్పటి కవితలలో ఇంతటి నిర్దుష్ఠత కనగలమా! ఏ దిగంబర కవులలోనో నగ్న కవులలోనో విప్లవ కవులలోను కనగలమంటే, వారి కవితలనేమాత్రము మనము గుర్తుంచుకో గలిగినాము. వేటూరి, సీతారామ శాస్త్రి లాంటి సినిమా కవుల గీత రచనలలోని పదములు అన్నీ తెలియక పోయినా వింటూ ఎంతనో అనందించుతాము.
ఇది ,భాష గొప్పదనము అన్న పుష్పమునకు,  వారి భావము, పదముల కూర్పు, అన్న రంగు సువాసన కూర్చినట్లైనది కదా! పింగళి నాగేంద్రరావు గారు సినిమాలకు మాటలు పాటలు వ్రాసే కాలములోఎన్నోతెలుగు పదాలు తేర మీదికి తెచ్చినారు . అందులో 'హల' అన్న పదము ఒకటి. జగదేకవీరుని కథలోని 'జలకాలాటలలో'అన్న పాటలో 'ఏమి హాయిలే హల' అన్న ప్రయోగము ఆపాటను ఎంత ప్రసిద్ధి చెంద జేసిందో
ఆతరము వారికెవరికైనా  ఇప్పటికీ మరచి పోలేని విషయమే. అది కవిత్వమంటే.
2. మాకు ముందు తరములోని పెద్దలు వాడుక భాష పేరుతో పర్వత శిఖరాగ్రమున వుండే భాషకు పతన మార్గము చూపించి చరిత్రలో మార్పుకు మార్గదర్శకులుగా, భాషను అప్రతిష్ఠ పాలు చేసినా, తమ ప్రతిష్ఠను పదిలం చేసుకొన్నారు. భాష మీద పట్టులేకుండా కవితలలో భావ ప్రకటన సాద్యమా.కవిత తమలపాకు లాంటిది. దానికి తడి తగులుతూ ఉంటేనే తన పచ్చదనమును కోలుపోక తాంబూలమునకు రాసిక్యత చేకూర్చుతుంది. చెమ్మ లేకుంటే అప్పుడు కూడా అది తమలపాకే అవుతుంది కానీ తాంబూలానికి పనికి రాదు. నాకు ఇక్కడ ఒక జానపదుల సామెత గుర్తుకొస్తూవుంది. అది ఏమిటంటే 'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా-రుచిపచి లేని కూర చట్టి నిండా.' నాలాంటివారి కవితలకు ఈ సామెత సరిగా సరిపోతుందేమో! ఒక రవివర్మ చిత్తరువు మనవద్ద వుంటే దానిని పదిలంగా ఒక చట్రము లో బింగించితే ఆ చిత్రమునకే కాక దానిని తగిలించిన గోడకు గోడ కలిగిన ఇంటికి కూడా అందమొస్తుంది, ఇల్లు కలిగిన మనకు ఆనంద మొస్తుంది. ఇది నిజమా కాదా అన్నది ఒక్కసారి మనము మనసుపెట్టి యోచించితే మనకే అవగతమౌతుంది.ఇంకొక ముఖ్యమైన విషయము మహాకవి కాళీదాసు తన 'మాళవికాగ్నిమిత్రము' అన్న నాటకములో ఈ మాట చెబుతాడు :
'పురాణమిత్యేవ నసాదు సర్వం నచాపికావ్యం నవమిత్య వాదం' దాని అర్థము 'పాత రోతా కాదు కొత్త చెత్త కాదు.' ఎంత గొప్ప మాటో చూడండి . పాత రచనలలో తలలోనికి దూరనివి, కొత్త రచనలలో తలపులకే రానివి కోకొల్లలు. వీనిని 'అజగళస్థనము లంటారు.' మేక గొంతుక్రింద చన్నులనుండి పాలు రావు కదా. అంటే వుండీ వుపయోగములేనివి అని అర్థము.

వాల్మీకి కవి వ్యాసుడు కవి కాళీదాసు కవి అంతకు మించిన విశేషణముల నేవీ వారు తగిలించుకోలేదు.మరి నేడో 'సరస కవి' 'విరస కవి' 'విప్లవకవి' 'భావకవి' 'ప్రేమ కవి' 'దిగంబర కవి' 'నగ్న కవి' 'భగ్న కవి' ఉద్విగ్నకవి' 'మధుర కవి' అన్న ఇవికాక అనేకానేకములైన బిరుదములు. అసలు 
'కవి యను నామంబు నీరుకాకికి లేదే' అని ఒక కవి కుండను బద్దలు కొట్టినాడు. వాల్మీకి మహర్షిని వారి తరువాతి
కవులు ఎన్నివిధములుగా పొగిడినారో గమనించండి. అన్ని పొగడ్తలకు అర్హుడైన ఆ మహాకవి వాడిన భాష, భావము, ఉపమానములు అనన్య సామాన్యములు. ఆయన, భాషను అంతగా వాడుకోన్నారంటే ఆభాష ఎంత గొప్పదో ఆలోచించండి. ఆభాష ఎంతో పురాతమైనదైతేనే కదా తరగని వజ్రాలగని కాగలిగినది. దీనిని బట్టే ఈ భూమి ,ఈ  భాష , ఈ ధర్మమూ ఎంత ప్రాచీనమైనవో మనకు అర్థమౌతుంది. మన కవులు ఒక కావ్య నీతికి కట్టుబడినవారు.మన సాహిత్యమునకు అందుకే 'కళ్యాణ సాహిత్యము' అన్న పేరు కలదు. షేక్స్పియర్ ఎంత గొప్ప నాటకాలు ఆంగ్లములో వ్రాసినా ఒక రాముని ,ఒక రావణుని కూడా పాత్రలలో చూడలేము. ధర్మానికి ప్రతీక యైన నాయకుడు ఆంగ్ల నాటకములలో దొరకదు. అదేవిధంగా స్త్రీలోలత తప్ప అన్ని సద్గుణములు గలిగిన  పరాక్రమ శీలియైన రావణుని వంటి ప్రతినాయకుడూ దొరకడు.
వాల్మీకి మహర్షి తరువాతి  కవులు  వారినేమన్నారంటే 
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం 
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కొకిలం 

రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ' రామ' యని కూయు చున్నది .

వాల్మీకి ముని సింహస్య కవితా వన చారిణా
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతిం 

కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' యని గర్జించుతూ వుంటే విన్నవారు కైవల్యమును గాంచక ఎట్లుండగలరు. 

యాపిబన్ రామ చరితామృత సాగరం 
ఆరుతస్తం మునిం వందే ప్రాచేతాస మకల్మషం 

రామ చరితామృత సాగరాన్ని సంతృప్తి అన్న మాటను ఆపేక్షించక ఆసాంతము త్రాగుచుండే మహనీయుడు కల్మషము అన్న పుట్టలోనుండి నిష్కల్మషుడైన వ్యక్తీ ప్రాచేతసుడు. ప్రచేతసుడంటే వరుణుడు. వరుణుని దయా వర్షముచే పునీతుడైనాడు కావున ఆయన ప్రాచేతసుడైనాడు. 


వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని 

పునాతు భువనం పుణ్యా రామాయణ మహానది 

వాల్మీకి యన్న పర్వతము పై జనియించి రామ సాగరము లో చేరు ఈ నదీ ప్రవాహము తాను ప్రవహించే ప్రాంతము నంతా పుణ్యభూమిని చేయుచున్నది.
ఒక మహనీయుని గొప్పతనమును ఎన్నివిధముల పొగడవచ్చునో గమనించండి. ఇందులో ఎవరి స్వార్థము స్వలాభాములు లేవు.
ఇక వేదవ్యాసులవారు. తాను వ్రాసిన మహా భారతమునుగూర్చి ఒకే ఒక్క ముక్కతో దాని గొప్పదనాన్ని మనకు తెలియ జేసినాడు. '
'ధర్మెచార్థేచ కామేచ మొక్షేచ భరతర్షభ యది హస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్కచిత్' ఇందులో వుండేది వేరే ఏభాషలోని ఏ గ్రంథముము లోనైనా వుండవచ్చునుగానీ ఇందులోలేనిది ఎక్కడా వుండదు. ఇంచుమించు 125 ప్రముఖ పాత్రలు కలిగి అనేకానేకములైన ఆఖ్యాన ఉపాఖ్యానములు కలిగిన ఈ ఇతిహాసకావ్యము హోమర్ వ్రాసినట్లు చెప్పబడే ఈలియాడ్, ఒడెస్సిల కన్నా నిడివి లో 10 రెట్లు పెద్దదని తెలియు చున్నది.ఇది సాధారణమానవులకు సాధ్యమా!
వేదాలు విభజించి పురాణాలు ప్రచురించిన విష్ణ్వంశ సంభూతుడు ఆ మహానుభావుడు.

ఇక కాళీ దాసును గూర్చి యొక్క మాట :

పురాకవిత్వా గణనప్రసంగే అధిష్టికాదిష్టిత కాళిదాసా
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ 

కాళిదాసు మొదలు పురాతన కవులలో పేరెన్నిక గన్న వారిని చిటికెన వ్రేలితో ఎన్న ప్రారంభించగా తరువాత ఎంచుటకు ఎవరూ దొరకలేదు. అందుకే ఆ వ్రేలికి 'అనామిక' మనే పేరు సార్థకమైనది. మరి ఇది నిజమే కదా!

ఇది నిజమైతే వారి పేరు మసకబారకుండా ఉంచవలసిన బాధ్యత మనపైన లేదా!
3.

అసలింకొక చిన్న విషయము. పండిత ప్రపంచములో నాచన సోమనాథుని తిక్కనకు పోల్చదగినవాడని చెబుతూ వుంటారు.ఆయన వ్రాసిన ఉత్తర హరివంశములోని  'నరకాసుర వధ' ఘట్టములోని అనేక పద్యముల భావము,పోకడ 'పోతన' వంటి గొప్ప కవియే పూర్తిగా అనుకరించినాడు లేక అనుసరించినాడు. నేను నన్నయ, తిక్కన ,ఎర్రన, పోతనలను గూర్చి ప్రస్తావించలేదు ప్రత్యకంగా. వారి పేర్లు వినని తెలుగువారుండరు.అందువల్ల నాచన సోమనాథుని హరివంశాములోని ఒక పద్యమును తీసుకొని భావము నాకు అర్థమైన రీతిలో తెలుపుతూ, ఆయన గొప్పదనము పాఠకులకు తెలియజేయ ప్రయత్నించుచున్నాను.

ఇది శ్రీ కృష్ణుడు శివుని స్థుతించే పద్యము. ఇక్కడ శివుడు పారిజాత'వృక్షము' తో పోల్పబడినాడు.


కుజము కుంజరముచే కూలునో కూలదో 
కూలు,కుంజరమునీ కుజము గూల్చె 
మాను  పేరేటిచే  మడుగునో  మడుగదో
మడుగు,పేరేటినీ మాను మడచె
గాలునో యొకనిచే గాలదో సాలంబు 
గాలు, నీ సాలంబు గాల్చే నొకని 
దునియునో పరశు చే దునియదో వృక్షంబు 
తునియు, నీ వృక్షంబు తునిమె బరశు

ననుచు దమలోన చర్చించు నమరవరుల 
కభిమతార్థ పదార్థమై యందవచ్చు 
పారిజాతమ్ము నా మ్రోల పండియుండ
నందగంటిని కోర్కుల నందగంటి 

పద్యము చదివినవెంతనే కవి హృదయము మనకు బోధ పడదు. వాక్య నిర్మాణము లోనూ భావ ప్రకటనలోనూ అంటే చెప్పేతీరు లోనూ వైవిధ్యమే ఇందుకు కారణం . దీనిని పండితులు 'వక్రత' లేక 'వక్రగతి'అంటారని విన్నాను. చెట్టును ఏనుగు కూల్చుతుంది కానీ ఇక్కడ చెట్టు (పారిజాత వృక్షము తో పోల్పబడిన శివుడు) ఏనుగును, గజాసురుని, కూల్చింది.చెట్టు పెద్ద ఏరు వల్ల వంగిపోతుంది . ఇక్కడచెట్టు, శివుని శరీరము, గంగను వంచింది. చెట్టును ఎవరైనా కాల్చితే కాలి పోతుంది . ఇక్కడ చెట్టు, కాల్చేవానినే అంటే మన్మధునే కాల్చివేసింది.చెట్టు గోడ్డలిచే నరక బడుతుంది. ఇక్కడ చెట్టు, అంటే శివుడు గొడ్డలినే (దక్షయజ్ఞము లో శివుడు విష్ణువు యొక్క పరుశువును ద్రుంచుతాడు)ద్రుంచుతాడు.అటువంటి, దేవతలకిష్టమౌ పారిజాత వృక్షాన్ని అందుకొని తన కోర్కెను తీర్చుకొంటున్నాడు కృష్ణుడు. సోమనాథుని వేదశాస్త్రపురాణేతిహాస ప్రతిభ ,కవితాచమత్కృతి, వక్రగతిన పద్యము చెప్పిన తీరు గమనించండి. నాడు కవిత్వమంత నిర్దుష్టంగా వుండేది.
4. ఒకమాట ఆధునిక కవితానర్ఘ రత్నాలను గూర్చి కాస్త చెప్పుకొందాము. ఇందు పద్య సాంప్రదాయమును గూర్చి నేను వ్రాయబోవుట లేదు. గడియారం, విశ్వనాథ,రాయప్రోలు, జాషువ,కరుణశ్రీ ఇలా వ్రాస్తూ పొతే చాలా పెద్ద పట్టిక తయారౌతుంది.నేను ఇందు మాత్రా ఛందస్సు నుపయోగించి సనాతనత్వమును విడువని రెండు కవితలు, అదునాతనము తో కూడి మాత్రా ఛందస్సు తో రమ్యముగా వ్రాసిన ఒక కవితా శకలము, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఒక ఆధునిక కవిత ఉటంకించుచున్నాను.

మొదటిది పుట్టపర్తి నారాయణాచార్లు వారు వ్రాసిన 'శివ తాండవము' లోనిది. 
తమ్ములై,ఘటితమోదమ్ములై,సుకృత రూ
పమ్ములై,శాస్త్ర భాగ్యమ్ములై,నవకోర
కమ్ములై ,వికచ పుష్పమ్ములై ,తుమ్మెదల,
తమ్ములై,భావ మంద్రమ్ములై,హావపు
ల్లమ్ములై,నూత్న రత్నమ్ములై,వెల్గు హా 
సమ్ములై, కన్గొనల సోమ్ములై,విశ్రాంతి 
దమ్ములై, రక్త కిసలమ్ములై,రక్తి చి
హ్నమ్ములైన్తంద్ర గమనమ్ములై,గెడగూడి
కులుకు నీలపు గండ్ల తళుకు జూపులు బూయ
ఘలుఘల్లుమని  కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ
ఆదేనమ్మా శివుడు పాదేనమ్మా భవుడు
ఇందులో మనకు ఒకవేళ ప్రతి పదమూ అర్థము కాకున్నా ఆ పద సౌందర్యము మనలను ఆసాంతము చదివించుటేగాక శివతాండవము కనులకు కనిపింపజేస్తుంది.

రెండవది వెంకట పార్వతీశ్వర కవులు వ్రాసిన 'ఏకాంత సేవ' లోనిది :

పుష్పనికుంజ ప్రభూత హాసంబు
సౌరభాపూర్ణ ప్రసన్న హాసంబు
మందాకినీ మృదు మధుర హాసంబు
రాకానిశాకర రమ్య హాసంబు
తారకాకోరక తరళ హాసంబు
విద్యుల్లతా ప్రభా విమల హాసంబు
మద్ర మోహన మూర్తి మందహాసమున
అద్భుతంముగా లీనమైనట్టులుండ...

చూడండి ఎన్ని విధములైన హాసమ్ములో! చదువుతూ వుంటే మనసుకు ఎంత హాయో !

ఇక మూడవది శ్రీ శ్రీ గారి 'మహా ప్రస్థానం' లోని 'జ్వాలా తోరణము' లోనిది:

జాతి జాతి నిర్ఘాత పాత సం
ఘాత హేతువై , కాలకేతువై
అదె సంవర్తపు తుఫాను మేఘం
తొలి గర్జించిన తూర్య విరావం

ప్రదీప్త కీలా ప్రవాళ మాలా
ప్రపంచవేలా ప్రసారములలో
మిహిర వాజితతి ముఖవ ధనుర్ద్యుతి
పుడమికి నేడే పుట్టిన రోజట

ఆ కవిత సాగిన తీరు చూడండి. మరి ఇందులో కఠిన పదములు లేవా! అట్లని చదువ నారంభించితే వదలబుద్ధవుతుందా! అది శ్రీశ్రీ గారి గొప్పదనము, చలం గారు శ్రీశ్రీ గారిని గూర్చి ఒకమాట చెప్పినారు. "కృష్ణ శాస్త్రి తన బాధ లోకానికి పంచితే, శ్రీ శ్రీ లోకంలోని బాధనంతా తాను తీసుకొంటాడు." ఎంతటి గోప్పమాటో చూడండి.

ఇక దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు వ్రాసిన 'అమృతం కురిసిన రాత్రి'నుండి 'మన సంస్కృతి' యన్న ఒక ఖండికలోని కొన్ని పాదములు:

మాధుర్యం,సౌందర్యం,కవితా
మాధ్వీక చషకంలోరంగరించి పంచిపెట్టిన
ప్రాచేతస కాళిదాస కవిసంరాట్టులనీ,
వ్యూహా వ్యుహోత్కర భేద నచణ
ఉపనిషదర్థ మహోదధి నిహిత మహిత రత్న రాసుల్నీ
పోగొట్టుకొనే బుద్ధి హీనుడెవరు?

ఇందులో కఠిన పదాలు లేవా? వచనకవియైన  ఆయన వాల్మీకి కాళీ దాసులను పొగడుట లేదా ! అసలు ఆ భావము ఎంత గంభీరమైనదో చూడండి. వారిది సాధారణమైన కవిత కాదు. 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవితా సంకలనం. వారి కవితలు వారి మాటల్లోనే"నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు." వారు అంతటి గొప్పవారు కాబట్టే అభ్యుదయ కవిత్వాన్ని కూడా అద్భుత రీతిలో అందంగా ఆకర్షణీయంగా చెప్పవచ్చునని ఢంకా బజాయించి చెప్పినారు.

ఈ నాలుగు కవితలూ పరిశీలించితే కవిత్వానికి భాషాప్రాముఖ్యత ఎంత అవసరమో అర్థమగుట లేదా!కవితా వస్తు ఏదైనా కావచ్చు. భావ స్పష్టత, భాషాధిష్టత ఎంత అవసరమో మనకు అవగతమౌతుంది. అందానికి అంతోఇంతో ఎంతోకొంత అలంకారమూ అవసరమే. అవసరము మీరితే అసహ్యమే మరి. 

కావున పై విషయాలను మనసు పెట్టి చదివి కవితా సేద్యము ఆరంభించుతాము. ఇంకొక అతి ముఖ్యమైన విషయమేమిటంటే వీరెవరు 'ప్రేమ,విరహ,నిర్వేద' కవితలతో ప్రశస్థిపొందలేదు. చివరిగా శ్రీశ్రీ గారు కరుణశ్రీ గారితో ఏమన్నారో మీకు వినిపించి విరమించుతాను. 

'వాగ్దానం' అన్న సినిమా లో ' సీతా కళ్యాణ సత్కథ' అన్న'హరి కథ' శ్రీశ్రీ గారు వ్రాసినారు. అందులో 'ఫెళ్ళు మనెవిల్లు ఘంటలు ఘల్లుమనియె' అన్న పద్యము తో ఆ హరికథ ముగుస్తుంది.అది కరుణశ్రీ గారు వ్రాసినది. ఒకసారి శ్రీశ్రీ  కరుణశ్రీ గార్లు ఒకే వేదిక నలంకరించడం జరిగింది. అప్పుడు కరుణశ్రీ గారు " ఏమోయ్ నాపద్యము కాపీ చేసినావు నీ హరికథలో "అన్నారట.అది ఇంకా నీదెందుకౌతుంది. 'ప్రతి' బయటికొచ్చిన తరువాత వ్రాసిన వానిగా దానిపై నీకెంత హక్కో పాకునిగా నాకూ అంతే హక్కన్నారట. అంటే మంచి కవితకు ఎంతటి విలువ వుంటుందో మనము గమనించ వలెను. 

తత్సత్























వారి అజరామర కీర్తికి వన్నె తీసుకురాలేకపోయినా 

 . 

No comments:

Post a Comment