ఉదయం సాయంత్రం మాత్రమే దర్శనం
ఇచ్చే శివలింగం ...?
భోళా శంకరుడు
అయిన శివుడికి నీళ్ళతో అభిషేకించినా కరుణించి వరాలు ఇస్తాడు అనేది లోకవిదితమే.
అయితే నిత్యం సముద్రంలోనే నివశిస్తున్న శివలింగం గురించి మీకు తెలుసా? కేవలం
ఉదయం, సాయంత్రం మాత్రమే దర్శించుకునే శివలింగం గుజరాత్ లోని
అరేబియా సముద్రంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక గుట్టమీద నిష్కళంక మహాదేవ్ గా
పూజలు అందుకుంటున్నాడు. ప్రతి రోజూ కొన్ని గంటలే దర్శనం ఇచ్చి మిగిలిన సమయం అంతా
సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది ఈ
శివలింగం. ఉదయం,
సాయంత్ర వేళలలో ఆలలు వెనక్కు తగ్గిన
కొన్ని గంటలే స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ ఆలయం వెనుకు ఒక
ఆసక్తికరమైన కథ వుంది. కురుక్షేత్రం ముగిసిన తరువాత పాండవులు తమ రక్తసంబంధీకులైన
వారిని ఎంతో మందిని చంపవలసి వచ్చినందుకు బాధపడుతూ ఈ పాపాలనుండి తమను
తప్పించవలసిందిగా శ్రీకృష్ణపరమాత్ముడిని వేడుకున్నారు. అందుకు శ్రీకృష్ణ
పరమాత్ముడు పాండవులకు ఒక నల్ల ఆవును, ఒక
నల్ల జెండాను ఇచ్చి 'ఈ
ఆవును వదిలివేయండి అలాగే ఈ జెండాను పట్టుకుని దాని వెంట మీరు కదలండి ఇవి రెండూ ఎక్కడ రంగుమారి తెల్లగా అవుతాయో
అక్కడ పరమేశ్వరుడిని దోష పరిహారం కోసం ప్రార్థించి ఒక్కొక్కరు, నందీ సమేతుడగు
పరమేశ్వరుని ప్రతిష్ఠించండి' అని
చెప్పి పాండవులను పంపించినాడు. పాండవులు నల్ల ఆవును వదిలి దాని వెంట నల్ల జెండా
పట్టుకుని నడక ప్రారంభించినారు. అలా సాగిన వారి నడక గుజరాత్ లోని భావ నగర్ కు
ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలియాక్ గ్రామంలో వాటి రంగు తెల్లగా మారిపోయాయి. ఆ
ప్రదేశంలోనే పాండవులు భోళాశంకరుడిని ధ్యానిస్తూ కూర్చున్నారు. పరమేశ్వరుడు పాండవుల
ధ్యానానికి కరుణించి పాండవుల ముందు ఐదు శివలింగాల రూపంలో దర్శనం ఇచ్చాడు. పాండవులు
ఆ ఐదు శివలింగాలను కలకాలము నిలుచు లాగున వేడుకొని వానిని ప్రతిష్ఠించి వారి పాపాలను తొలగించమని
వేడుకున్నారు. అందుకే ఈ శివలింగాలను నిష్కళంక మహాదేవ్ గా భక్తులు నేటికీ కొలుస్తూ
పూజిస్తున్నారు. ఈ శివలింగాలను దర్శించాలనుకునేవారు కొలియాక్ గ్రామం దగ్గర అరేబియా
సముద్రం దగ్గర నిలుచుని వుంటే సముద్రములో రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ
కనిపిస్తాయి. సముద్రపు పోటు తగ్గినప్పుడు 500 వందల అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల
కనిపిస్తుంది. కాలి నడకన ఈ గుట్టపైకి చేరుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే ఐదు శివలింగాలు
నందితో పాటు కనిపిస్తాయి. ఒక ప్రక్కన పాండవ కొలను అనే చిన్న సరస్సు ఉంటుంది.
భక్తులు ఇక్కడ కాళ్ళు కడుక్కుని శివలింగాల దర్శనం చేసుకుంటారు. ఉదయం ఒకసారి
సాయంత్రం ఒకసారి మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా
ఈ శివలింగాలకు గోపురాలు లేవు. పౌర్ణమి, అమావాస్య
రోజులలో కూడా సముద్రపు పోటు ఎక్కువగా ఉన్నా వెనక్కు వెళ్ళే సమయమూ ఎక్కువగానే
ఉంటుంది. ఆ రోజులలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. భావ్ నగర్ పాలకుడు అయిన భావ్
సింగ్ 17 వ శతాబ్దంలో భక్తులు పూజ చేసుకోవడానికి వీలుగా కాంక్రీటు, నాపరాళ్ళతో మలచారు. భాదర్వి పేరుతొ ఇక్కడ ప్రతి శ్రావణ
మాసంలో ఒక వేడుకను నిర్వహిస్తారు. భావ్ నగర్ మహారాజులు ఈ రోజున ఇక్కడి ధ్వజస్తంభం
మీద కొత్త జెండాలను ఆవిష్కరిస్తారు. సముద్ర తీరంలో భూకంపం వంటివి వచ్చిన
సందర్భాలలో కూడా ఈ జెండాలు అక్కడినుంచి కదలలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇక్కడ హారతి నిర్వహిస్తారు. ఆ రోజు
తిథిని బట్టి హారతి సమయాలలో కొద్దిపాటిగా సమయం మారుతూ ఉంటుంది.
ఈ
లింగమును చూచుటకు సాధారణముగా సముద్రము మధ్యాహ్నము 1గంట నుండి
రాత్రి 10 వరకు
ఉపసంహరించుకొని భక్తులకు దర్శన అవకాశమును ఇస్తుంది. భక్తులు, తిరిగీ
అలలు లింగమును సముద్రములోనికి చేర్చక మునుపే భక్తులు 'హరహర
మహాదేవ' అను
నినాదములతో స్వామిని దర్శించి వెనుకకు మరలుతారు.
ఇటువంటి
భక్తితో కూడిన విచిత్రమైన విషయములు ఈ భారత దేశములో మాత్రమే కనిపించుతాయేమో!
No comments:
Post a Comment