అవధానం - సమస్యాపూరణం -
దత్తపది
https://cherukuramamohan.blogspot.com/2017/09/blog-post_11.html
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక
విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు
కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ
ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ
సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ,
అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు
చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని
చేసే సాహితీ విన్యాసమే అవధానం.
ఇందులో అవధానికి అతిముఖ్యమయినవి ధార, ధారణ,చమత్కృతి,
సమయస్ఫూర్తి. ఇందులో ఏది కొరవడినా అవధానము
రక్తి కట్టదు. అందుకే
అవధానమును అసిధారా వ్రతమన్నారు.
తిరుపతి వేంకటకవులు అవధానమునకు ఆద్యులు
కాకపోయినా ఆవిద్యను
దశదిశల వ్యాపింపజేయుటకు ఆద్యులు వారే.
ముఖ్యముగా ఈ అవధాన విద్యలోని
సమస్యా పూరణములోనూ, దత్తపదిలోనూ బాహిరముగా అశ్లీలము అగుపించినా
దానిని వేటగాడు వాల్మీకియైన చందమున తమ
ప్రజ్ఞాపాటవమును జతజేసి
అవధానులు పూరించుట కద్దు. ఆశుకవితా
సంప్రదాయానికి ఇది కొత్త ఊపిరి.
తిరుపతివెంకట కవులకు ముందు
అవధానప్రక్రియలో ఉద్దండులైన వారు
ఎందరో వున్నా, దాన్ని రాజాస్థానాల్లోంచి జనసామాన్యంలోకి విస్తరింపజేసిన వారు
వీరు. ఆ ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే
వున్నాము. వీరికి పృచ్ఛకులుగా
ఉభాయభాషలలోనూ మహా ఉద్దండులు ఉండేవారు. ఒక
అవధాన సభలో వారికి
ఇచ్చిన సమస్య: ‘సంధ్యావందనమాచరించ వలదా
చౌశీతి బంధంములన్’. ఇది
సాధారణ సమస్య కాదు. భాషా విభవము మిక్కిలి
ఎక్కువగా వున్నవారు మాత్రమే
చక్కగా పూరించగలరు, తమ సమయస్ఫూర్తిని జతజేస్తూ. లేకుంటే
సంధ్యావందనమెక్కడ చౌశీతి బంధములు (84 విధములగు బంధములు) ఎక్కడ.
వారు పూరించిన నైపుణ్యమును గమనించండి:
వింధ్యాద్రిప్రభలొప్పు బల్కుచములన్
వేపట్టి పెంపొందు కా
మాంధ్యంబార్పగలేక వేర్రివయి ఎలా మంచి ఈ
రాతిరిన్
సంధ్యన్ జేసెదు కాముకేళి యనగా సాహిత్యమా
లేక నీ
సంధ్యావందనమా! చరించ వలదా చౌశీతి
బంధంములన్
మరి ఇచట శృంగారపరముగా చెప్పుట తప్పనిసరి.
అంతమాత్రముచే వారి
పాండితీగరిమను తప్పుబట్ట వచ్చునా!
ఇక 20 వ శతాబ్దములో
అవధానమే తన వృత్తి మరియు ప్రవృత్తిగా చేసుకొని
కుటుంబ పరమైన వ్యాపారమునకు పెద్దపీటవేయక, అవధానమే ప్రధానముగా
చేసుకొనుచూ గడియారము వెంకటశేష శాస్త్రి
గారి ప్రియశిష్యుడై మహా మహా
ఉద్దండులైన నాటి పండితులను పృచ్ఛకులుగా
కలిగి లోకాన్ని ఒప్పించి మెప్పించిన
అనర్ఘ అవధాన రత్నము C.V. సుబ్బన్న శతావధాని గారు. నాటి ఆయన
పృచ్ఛకులలో గడియారము వెంకటశేష శాస్త్రి
గారు, దుర్భాక రాజశేఖర
శతావధాని గారు, పుట్టపర్తి నారాయణాచార్యులవారు, విశ్వనాథ సత్యనారాయణ
గారు, వెంపరాల
సూర్యనారాయణ శాస్త్రిగారు, గంటి జోగి సోమయాజి
గారు, దీపాల పిచ్చయ్య
శాస్త్రిగారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తుమ్మల
సీతారామమూర్తి చౌదరి గారు, జమ్మలమడక మాధవరాయ శర్మ గారు,
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, పేరి
సూర్యనారాయణ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు, బోయి భీమన్న
గారు, దాశరథి గారు
సినారె గారు, ఈ విధముగా చెప్పుకొంటూ పోతే చేంతాడంత
పట్టిక తయారవుతుంది ఉండగా అవధానమును పండించిన
నిండుకుండ ఆయన. అన్నిటికీ మించి వీరి అవధానము శంకరాచార్య పీఠమున చంద్రశేఖర
యతీంద్రుల
వారి పనుపున జరిగినపుడు సంస్కృతి, సంస్కృత శిరోమణి యగు జయేంద్ర సరస్వతి
స్వాములవారు పృచ్ఛక స్థానమును అలంకరించి
వారికి దత్తపదిని ఇచ్చియుండినారు.
మొదటి ప్రపంచ తెలుగు మహాసభకు
ఆదరపూర్వకముగా ఆహ్వానింబడి, అత్యున్నత,
అద్వితీయ గౌరవమును బడసిన ఆదియవధాని వీరే!
ఈ ఉపోద్ఘాతమంతా
ఎందుకంటే పైకి అశ్లీలముగా కనిపించే
దత్తపది,
సమస్యలు పైన తెలిపిన
మహామహులలో కొందరిచ్చినా సుబ్బన్న గారు ఎంత
గొప్పగా ఏమాత్రమూ
అశ్లీలమునకు తావివ్వక పూరించినారో
తెలియజేయుటకే! వీరు పూరించిన ఒక
సమస్య :’ మీనాక్షికి కుచాములారు
మీసములేడున్’
ఆనాడు ప్రోద్దువోయెను
జానయు తత్పతియుగూడి సరి క్రీడింపన్
లూన ముకురమున దోచెన్
మీనాక్షికి, కుచములారు మీసములేడున్
ఒకానొకరోజు తమకముతో తల్లడిల్లిన దంపతులు
ఒకరికొకరు తీసిపోక
పెద్దప్రోద్దు క్రీడించిరి. అద్దము
చిట్లినది (లూన ముకురము) అన్న జ్ఞాపకము కూడా
వారికి లేదాయే. అలసిన మీనాక్షి అనుకోకుండా
అద్దములో చూస్తే ఆరు
కుచములు ఏడు మీసములు కనిపించినవట.ఇక్కడ
కవి ‘మీనాక్షి’ అన్న
పదమును సాభిప్రాయ విశేషణముగా చేసినాడు.
కామోద్రిక్తయైన మగువ
తత్సమయమున మత్స్యస్ఫూర్తి పొందునన్నది శాస్త్ర వచనము.
ఆశువుగా చెబుతూ
కూడా ఎంత గొప్పగా పూరించినారో చూడండి.
ఇందులో చూడవలసినది
చమత్కారముకానీ శృంగారము కాదు.
సందర్భానుసారముగా స్పందించినవాడే
నిజమయిన శ్రోత లేక పాఠకుడు.
ఇక ఆయన అవధానము చేయు కాలములోనే మహామహులగు
పృచ్ఛకులు
ఆయనకు అలనాటి సినిమా తారామణుల పేర్లు
దత్తపదిగా ఇవ్వటము
తటస్తించినది. గమనించండి:
భానుమతి, అంజలి, జయప్రద, జమున
సీత హరించె భానుమతి శిష్ట గతిన్ జని
రావణుండు,
త
జ్ఞాతిని సంహరింప యతి సంఘము గోరగనంజలించి, దో
ర్భూతి జయప్రద ప్రథనమున్ నడిపించి
రఘుప్రవీరుడా
క్రోతి యశోక భూజమునకున్ బ్రధితత్వము
గూర్చె శూరుడై
భానుమతి = ప్రకాశవంతమైన అంటే
జ్ఞానియయ్యును సన్యాసి వేషములో సీతను
అపహరిచగా, అరాచాకములు సేయు ఆతనిని సంహరించమని ఋషిగణము
అడుగగా (ఇచ్చట జ్ఞాతి అన్న శబ్దము
ఉపయోగింపబడినది, పులస్త్యుడు బ్రహ్మ
మానస పుత్రుడు మరియు మహర్షి. బ్రహ్మ మానస
పుత్రులగు మిగత మహర్షుల
సంతతికి రావణుడు జ్ఞాతియే కదా!) భయంకర (దోర్భూతి
జయప్రద ప్రథనము =
జయప్రదమైన భయంకర యుద్ధము) చేసి కోతికీ
(హనుమంతునికి), అశోక
వృక్షమునకు యశస్సు(ప్రధితత్వము) ను
గూర్చెను.
ఆ కాలముననే ఇటువంటి దత్తపదుఇలు ఉండినవి
అని తెలుపుటకు ఈ పద్యము
ఉటంకించినాను. ఇక్కడ చూడవలసినది సినీతారల
పేర్లుకాదు. అందులోని
వరుస అక్షరములను భిన్న పాదములలో యథా తథముగా
వాడి ఎట్లు రక్తి
కట్టించినారు అన్నది గమనించవలసిన విషయము.
అసభ్యత అశ్లీలత ఆవగింజంత
కూడా కనిపించవు పూరణలో. ఆమాటకొస్తే ఆ
పద్యము కవియొక్క ఊహాశక్తికి
అద్దము పడుతుంది. ఈవిధమైన తారల పేర్లతో
నేను నింపాదిగా పూరించిన
పద్యమును ఒక పండిత పాఠకుడు (నాకు
అన్నయ్యతో సమానము) సినిమాతారల
పేర్లెందుకు అని నిరసించుతూ మీరు కూడా
అవధానియైపోయినారు అని అనటము
జరిగినది. వారి మాటను ఆశీస్సుగా తీసుకొని, పరమాత్ముని వచ్చే జన్మలో నాకూ అంతటి ధిషణ ప్రసాదించమని కోరుకొంటాను. ఈ విధమైన ప్రయత్నము చేయుట వల్ల ధీజడిమ తగ్గి ధీపటిమ పెరుగుతుంది. నేర్పుగలవారు ఇటువంటి ప్రయత్నము చేయుట మంచిది. నేను చేసినదీ అటువంటి ప్రయత్నమే . తప్పేమీ నాకు గోచరము కాలేదు.
ఇక మాడుగుల వారిని గూర్చి: ఈ కాలములో ఆయన అశేష శేముషీ దురంధరుడు, అపార పాండితీ ధిషణాలంకృతుడు. నా దృష్టిలో ఆయన వాక్పతి మరియు పుంభావ సరస్వతి.శృంగేరి పీఠాధిపతి సంస్కృతావధానము చేయించనెంచి ఆయనను పిలువనంపి ఏర్పాటు చేయించినారు. తాను తెలుగు పండితునిగా పనిజేసిన కడప రామకృష్ణ జూనియర్ కాలేజి లో పనిచేసిన కాలములో ప్రిన్సిపాల్ గా వుండిన శ్గోరీయుతులు గోపాల కృష్ణమూర్తిగారు తాను వ్రాసిన పుస్తక ఆవిష్కరణకు అధ్యక్షత వహించమని ఆహ్వానించితే తన ఖర్చులతో హైదరాబాదు నుండి కడప జిల్లాలోని బద్వేలు తాలూకాలోని బ్రాహ్మణపల్లెకు పోయి ఆపని నిర్వహించి అందరికీ ఆనందము పంచినారు. అంతటి కృతజ్ఞతామూర్తి యతడు.
ఆయన చరవాణి సంఖ్య తెలుసుకొని నేను ఆయనతో పునః
పరిచయము చేసుకొంటూ SBI-ZO-తిరుపతిలో ఆయన అవధానమును
ఏర్పాటుచేసిన విషయము గుర్తుచేస్తే కష్టకాలములో
వున్నపుడు నాలోని
ప్రత్యేకతను గుర్తించి తగువిధముగా
సన్మానించిన మీ వంటివారిని మరచిపోను
అన్నాడు. అది ఆయనలోని సద్గుణము. గుర్తింపు
దొరికిన పిమ్మట ప్రతివ్యక్తిలోనూ
మంచి చెడు చూచుట సహజము, కానీ అది సందర్భానుసారముగా ఉండుట
ఎంతో అవసరము. మనము హంసలమై క్షీరమును గ్రోలి
నీటిని విడుచుట
మంచిది. కానీ శర్మ గారు అట్లుకాదు. వారొక అన్ని పదార్తములూ వడ్డించిన ఆకు.
వారి ఆశు కవితాధారకు ప్రతీకగా ఒక శ్లోకము ఇక పద్యము మీ ముందుంచుచున్నాను.
అనుష్టుప్ ఛందో శ్లోకములో ఉండే అక్షరాల సంఖ్య 32. 14 అక్షరాలూ రూపు తేరా మస్తానా ప్యారుమేరా దీవాన రూపములో పృచ్ఛకులు ఇవ్వగా శ్రీరామ పరంగా ఆ హిందీ శబ్దములను సంస్కృత భాషానుగుణముగా కేవలము తాను స్వంతముగా వాడిన 18 అక్షరములు కలిపి ఎంత మనోజ్ఞముగా ఆశువుగా తెలిపినారో చూడండి.
నీలాభర రూపతేరామ సమస్తానాం శుభంకర
తత్తధాప్యారమే రామే నదీవానంద వర్ధన
వేరొక అవధానములో వారి పూరణ
ఒక చిన్న తేటగీతి పద్యములో ప్రళయము,రౌద్రము. భీభత్సము, వాత్సల్యము లను ఉపయోగించుతూ దఖ నిరీశ్వర యజ్ఞ ధ్వంసమును వర్ణించిన ఈ అసమాన ప్రతిభను గమనించండి.
ప్రళయ దీప్తివి అంబికా ప్రణయ మూర్తి
నిరత రౌద్రప్రసార నిర్నిద్రకీర్తి
నెరయు భీభత్స రసమెల్ల కరగి కరగి
ఒదిగి వాత్సల్య రసమౌను సదయ నిలయ
నేనసలు ఒక నాలుగు దినముల క్రితము
ప్రచురించిన దత్తపది ప్రజ్ఞ కలిగిన
యువతను ప్రోత్సహించుటకే! నేనేమీ తప్పు
చేయలేదు. అటువంటివి నాకు
తోచినపుడు ఆస్య గ్రంధి లో పెడుతూ వుంటాను, యువత స్పూర్తిని పొందుతారన్న
నమ్మకముతో! నేడు మనకూ, మన తెనుగుకూ
జగద్విఖ్యాతిని ఒనగూర్చుచున్న
మహా పండితులను, మహా అవధానులను, మహాకవులను
మనసారా గౌరవించి
మన తెలుగునకు సాతియగుభాశాలేదని జగతికి
చాటుదాం. మనది “Italian Of
The East’
కాదు, వాళ్ళది ‘Telugu of the West’ ఎందుకంటే
ఆ భాషలు
పుట్టకమునుపు వేల సంవత్సరముల క్రితము
పుట్టిన భాష మనది. చివరిగా ఒక
మాట. ఒకరినొకరు గౌరవించుకొంటే వాతావరణము
సుహృద్భావముతో నిండి
ఆహ్లాదకరముగా ఒప్పారుతుంది.
ఆదిశగా అడుగేద్దాం.
స్వస్తి.
అవధాన విద్యను గురించి మీ వ్యాసము చాలా చాలా విపులంగా రచించేరు.రాజాస్థానాలలోనుంచి ప్రజా బాహుళ్యములోనికి అవధాని ప్రక్రియను అందజేసిన శ్రీ తిరుపతి వేంకట కవుల గొప్ప దనమును చాలా వివరంగా తెలిపేరు.
ReplyDeleteశ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని గారి అవధానము గురించి సోదాహరణంగా వివరించారు.
ఆ నాటి మహా పండితులైన పృఛ్ఛకాళిని పేరు పేరునా ఉటంకించారు.
మహా సహస్రావధాని శ్రీ మాడుగుల .నాగఫణి శర్మ గారి సంస్కృత అవధానమును శ్రీ శృంగేరి పీఠాధిపతి వారు తమ పీఠంలో యేర్పాటు చేయడం ఆ అవధానంలో వారి పురణలను బాగా వివరించారు. ఎంతో విలువైన యీ మీ సందేశాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరుతున్నాను. అందుకు గాను నా ఫేస్బుక్ లో షేర్ చేస్తానండి.
మీకు అనేకానేక అభినందనలండీ రామ మోహన రావు గారూ.