Thursday, 14 September 2017

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు

ములకనాటిని నేటికీ మొదటి వరుస
నిలుపగల్గిన మేధావి నియమ వ్రతుడు
మోక్షగుండపు వారాశి మూల మణిగ
వెలసె భారత రత్నమై విబుధనుతుడు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు దాదాపు మూడువందల సంవత్సరాల క్రితం ఒకప్పటి కడప జిల్లా, అటుమిమ్మట కర్నూల్‌ జిల్లా, ఇప్పటి ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 'మోక్షగుండం'' అన్న గ్రామము నుండి అప్పటి మైసూరు రాజ్యమయిన,   బెంగళూరు నగరమునకు  38 మైళ్ళ దూరంలోని ముద్దనహళ్ళి గ్రామమునకు వలస వెళ్ళినారు.  అతి సామాన్య మధ్యతరగతి కుటుంబమునకు చెందిన ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ గారలు. ఆ దంపతుల సంతానమే విశ్వేశ్వరయ్య గారు. ఆయన 1861 సెప్టెంబరు 15న జన్మించినారు. తండ్రి గొప్ప సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. ఎందరో మహనీయుల మాదిరిగానే విశ్వేశ్వరయ్య జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. విశ్వేశ్వరయ్య విద్యాభ్యాసం చిక్కబళ్ళాపూరులో ప్రారంభమైంది. ఆ బాలుని అనన్య మేధాశక్తిని, కుళాగ్రబుద్ధిని మొదటగా గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించింది ఆయన మొదటి గురువు నాదమునినాయుడు, మేనమామ హెచ్‌. రామయ్య.  అందరూ తెలుగువారే! నేటికిని తెలుగు బ్రాహ్మణులు, ముఖ్యముగా ములకనాడు వారు కర్నాటక రాష్ట్రమున లెక్కకు మిక్కుటముగా నున్నారు. విశ్వేశ్వరయ్య 15వ ఏట పితృవియోగం పొందినారు. అయినా పట్టు వీడక అనేక వ్యయప్రయాసలకోర్చి 20వ ఏట బెంగళూరు సెంట్రల్‌ కాలేజీ నుండి B.A డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులై అందరినీ అందరినీ అబ్బురపరచినారు. సెంట్రల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వెబ్‌స్టరు ఆయన తెలివితేటలు, క్రమశిక్షణకు, ముఖ్యంగా ఆంగ్ల భాష మరియు గణితములో  ఆయన యొక్క అనన్యసామాన్య  పాండిత్యమునకు ముగ్ధుడై అనేక బహుమతులు ఇవ్వటమే గాక ఆయన యొక్క ఉన్నత విద్యాభ్యాసానికి ప్రత్యేక శ్రద్ధ చూపించినారు. ఆయన, అప్పటి మైసూరు రాజ్యపు దివాను రంగాచార్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వ ఉపకారవేతనంపై పూణేలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చేర్పించినారు. 1883లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరిలోకీ ప్రథమునిగా నిలచినారు  విశ్వేశ్వరయ్య గారు. అటుపిమ్మట 1884లో అప్పటి బొంబాయి రాష్ట్రంలో నేరుగా పిడబ్ల్యుడి శాఖ అసిస్టెంట్‌ ఇంజనీరుగా  నియమితులయినారు. 1884 నుంచి 1909 మధ్య కాలంలో, ఇరిగేషన్‌ ఇంజనీరుగా, శానిటరీ ఇంజనీరుగా అనేక కార్యక్రమాలు చేపట్టి, నిర్ణీత కాలం కంటే ముందుగా పనిని పూర్తిగావించి ఎందరో అధికారుల మన్ననలు పొండినారు. 1909లో స్వచ్ఛందంగా సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి రాజీనామా చేసి విదేశీ పర్యటనకు వెళ్లినారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా, ఎన్నో నగ రాలకు రక్షిత మంచి నీటి సరఫరా, మురుగు నీటి రవాణా, వరద నివారణ పథకాలు అతిస్వల్ప వ్యవధిలో పూర్తి గావించి విదేశీ అధికారులను సైతం ముగ్ధులను గావిం చినారు. 1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజసాగరం జలా శయం కావేరీ నదిపై నిర్మించినారు. ఈ ఆనకట్ట మైసూరు సంస్థానం సమగ్రాభివృద్ధికి దోహదపడింది. ఆ రాజ్యానికి జీవనాడి అయింది. ఇది ఇరిగేషన్‌ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయం.
మైసూరు సంస్థాన సమగ్రాభివృద్ధికై చీఫ్‌ ఇంజనీరుగా బాధ్యత స్వీకరించి తమ రాజ్య ప్రజలకు తన మేధాశక్తి సత్ఫలితాలను పంచి ఇవ్వవలసిందిగా అప్పటి మైసూరు మహారాజా తమ దివాన్‌ ఆనందరావు ద్వారా విశ్వేశ్వరయ్యను కోరినారు. అందుకు విశ్వేశ్వరయ్య తన జీవితాశయాలైన పరిశ్రమల స్థాపన, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి మొదలైన అన్ని కార్యక్రమాలకూ మహారాజు సహకరించి, ఆమోదముద్ర వేయవలసి ఉంటుందనే షరతులపై చీఫ్‌ ఇంజనీరుగా 1909లో ఆ బాధ్యత స్వీకరించినారు. ఆరేళ్ల కాలంలో మైసూరు రాజ్యం ఆయన నేతృత్వంలో అన్ని రంగాలలో పురోగమించింది. నష్టాల ఊబిలో ఉన్న భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని లాభం ఆర్జించే విధంగా చేసినారు. ఇది ఆర్థికవేత్తగా విశ్వేశ్వరయ్య గారు సాధించిన అపూర్వ విజయం. నేటి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కళాశాల మైసూరు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు ఎన్నో పరిశ్రమలు, విశ్వ విద్యాలయాలను స్థాపించినారు. అతి గొప్ప విషయము ఏమిటంటే ఆయన రాత్రి సమయములలో దీపపు వెలుతురున ప్రభుత్వ కార్యములు చేయవలసి వస్తే వెలుగు కొరకు ప్రభుత్వ ఇంధనమునే ఉపయోగించేవారు. స్వంతపనులు మాత్రము తానూ కొన్న కిరోసిను లాందరను స్వంత ఖర్చుతో కిరిసిను పోసి ఉపయోగించుకోనేవారు. 

ఆయనకు 'భారతరత్న'బిరుదమునిచ్చి దేశము తనను తానుసన్మానించుకొనింది.. 1938 నుంచి 1958 మధ్యకాలంలో దాదాపు 8 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇవ్వతము గరిగినది. 1962, ఏప్రిల్‌ 14వ తేదీన ఆయన తనువు చాలించితే, మైసూరు ప్రభుత్వం వారి భౌతికకాయానికి సకల రాజ లాంఛనములతోలతో వారికోరిక మేరకు తమస్వగ్రామముగా నేర్పరచుకొన్న 'ముద్దనహళ్లి'లో అంతిమ సంస్కారం గావించుట జరిగినది.102వ ఏట తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ఆ మహనీయుని కనీసము ఈ రోజయినా తలచుకోకుంటే వేరు ఏరోజున తలచుకొనగలుగుతాము.
స్వస్తి


No comments:

Post a Comment