కుమారిలభట్టు
https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_8.html
ముందు ఈ విషయమును ఒకసారి పునశ్చరణ చేసుకొందాము. 1 లేక రెండవ శతాబ్దములో
అశ్వఘోషుడు వ్రాసిన ‘బుద్ధ చరిత’ ఆధారంగా
గౌతమ బుద్ధుడు క్రీస్తుకు పూర్వము 6 వ శతాబ్దమువాడని మనకు తెలియవచ్చుచున్నది.
'విమర్శకాగ్రేసర''భారత చరిత్ర భాస్కర' మహామహులైన కోట వెంకటాచలం గారు
శంకరులవారి కాలాన్ని సహేతుకంగా నిరూపించినారు. ఆ వెలుతురులో మన యానము
ప్రారంభించుదాము.
శంకరుల
కాలమునుండి అవిచ్ఛిన్నముగా గురుపరంపర గలిగిన జోషిమఠము,పూరి,ద్వారక,కంచి మఠములు కలి 2593(క్రీ.పూ.
509) శంకరుల కాలంగా నిర్ణయించినారు.
కుమారిల
భట్టు,
(శంకరులకన్నా 48 సం. పెద్దవారు). వారు తుషాగ్ని లేక కుమ్ము (వేరుసెనగ పొట్టు
నివురు గప్పిన నిప్పు)లో ఆత్మాహుతి చేసుకొనుచున్న అవసాన దశలో శంకరులవారు వారిని
కలిసినట్లు ఈ క్రింది శ్లోకములో చెప్పబడినది.
ఋషి ర్బాణ
స్తధా భూమి ర్మర్త్యాక్షౌ వామమేళనాత్|
ఏకత్వేన
లభేతాంకం తామ్రాక్షా తత్ర వత్సరః|
ఋషి =7(సప్తర్షులు),బాణ(మన్మధ బాణములు)=5,భూమి=1,మర్త్యాక్షు
(మానవుని కన్నులు)=2 ,తామ్రాక్ష =రక్తాక్షి నామ సంవత్సరము
విలోమముగా
లెక్కించితే యుధిష్ఠిర శక (జైనులు ,బౌద్ధులు యుధిష్ఠిర శకమును
పాటించుతారు. ఆయా మతములకాద్యులు క్షత్రియులు కావుననేమో.)2157
సం. న నిర్యాణమని చెప్పబడినది.
ఈ
విషయమును ఎందుకు చెప్పవచ్చినానంటే చాలామంది పాశ్చాత్యులకనుయాయులగు చరిత్రకారులు
క్రీస్తుకు పూర్వము 4 శతాబ్దికి చెందిన ఈ మహనీయుని కాలమును క్రీస్తు శకము 6
నుండి 8 వ శాతాబ్ది వరకు లెక్క కట్టినారు. అందుకే నేను
బుద్ధుని కాలము తెలిపి ఆతరువాత దాదాపు 2౦౦ సంవత్సరముల కాలములో ఆ మతము యొక్క
విస్తరణ ప్రబలమై వైదికము తిరోన్ముఖము పట్టదొడంగినపుడు 4వ శతాబ్ది లో ఈయన
జన్మించినాడని తెలియజేసినాను. వాస్తవము తెలుపవలెను/వాస్తవము తెలుసుకోవలెను అన్న
జిజ్ఞాస ఉంటేనే కొంత పరిశోధన చేయగలరు ఎవరయినా! అదిలేకపోతే నిజమును నిగ్గుదేల్చ
వీలుపడదు కదా!
శంకరుల చే
శృంగేరి మఠ ప్రధమ పీఠాధిపతిగా, శంకరుల వారిచేతనే నియమింపబడ్డ మండన
మిశ్రులవారి (సన్యాస నామము సురేశ్వరాచార్యులు) ప్రధమ గురువులు కుమారిలభట్టు
మాన్యవరులు 'తంత్రీ వార్తీకం' అన్న
పుస్తకం వ్రాస్తే దాని వ్యాఖ్యానము భట్ట
సోమేశ్వరులవారు వ్రాసినారు.
ఇక
కుమారిలభట్టు గారిని గూర్చి తెలుసుకొందాము.
ఆంధ్రులు
ఆటవికులు కాదు అన్న విషయమును మహనీయులు వేదమూర్తులునాగు కోట వెంకటాచలము గారు
సహేతుకముగా సాధికారికముగా బలపరచినారు. ఆంద్ర బ్రాహ్మణులు వేదవిద్యా సంపన్నులేగాక
మహా విద్వామ్సులగా కూడా పేరెన్నికగన్నవారు. ఇప్పటికి కూడా ఆంధ్రబ్రాహ్మణులు
వేదపఠనమునందసమాన ప్రజ్ఞగలవారని డాక్టరు భాండర్‌కర్ మొదలగు విద్వాంసు లభిప్రాయము
లిచ్చి యున్నారు. ‘వేదవేత్తలయి ప్రఖ్యాతిగాంచిన యాంధ్ర
బ్రాహ్మణులలో కుమారిలభట్టు మిక్కిలి ప్రముఖుడుగానున్నాడు. ఇతడు జైమిని సూత్రములకు భాష్యమును విరచించెను.
ఈ మతమునకే పూర్వ మీమాంస యని పేరు. ఇది
కర్మప్రధానమైన వైదికమతమును బోధించును. కవలుని సాంఖ్యతత్వము నాధారపఱచుకొని
హేతువాదికములై నవీనతత్వమార్గముల బోధించుచు కర్మప్రధానమైన వైదికమతము నిరర్థకమైనదని
నిరసించెడు జైనబౌద్ధమతముల ఖండించి కుమారిలభట్టు కర్మమార్గ ప్రధానమైన వైదిక
ధర్మమునుప్రబలజేసెను ఈకుమారిలభట్టునకు భట్టపాదుడను మఱియొకపేరుగలదు. ఈతడు
వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగువారు కొందఱు వ్రాసిరిగాని యితడాంధ్రదేశీయుడని
జైనుల గ్రంథమునందు జెప్పబడియుండుటచేత నాంధ్రుడని విశ్వసింపవచ్చును. జినవిజయమను
జైనగ్రంథమునం దీక్రిందిశ్లోకము గానంబడుచున్నది.’
శ్లో.
ఆంధ్రోత్కలానాం సంయోగే పవిత్రే జయమంగలే
గ్రామే
తస్మిన్ మహానద్యాం భట్టాచార్యః కుమారకః
ఆంధ్రజ్యోతి
స్తిత్తిరిరో మాతా చంద్రగుణాసతీ యజ్ఞేశ్వర పితాయస్య.
ఈ విషయము
ఒక విధముగా ఆంధ్రుల గొప్పదనమును మరియు కుమారిల భట్ట మహాశయుని వంటి ప్రతిభా సంపత్తి
గలిగినవారు ఈ ఆంధ్రజాతి మకుటమునకు శ్యమంతక మణులై ఈ జాతిని ప్రభావింప జేసినారని
తెలియవస్తూ వుంది. ఇక కుమారిల భట్టుగారిని గూర్చి నాకు తెలిసిన మేరకు
తెలియజేస్తాను.
కుమారిలభట్టు
ఒకానొక సమయంలో
భారతదేశమంతటా బౌద్ధము వ్యాప్తిలో యుండినది.
బౌద్ధము వేదమును అంగీకరించదు.
బౌద్ధమును ఖండించి ప్రజలలో కర్మ
నియతిని ఏర్పరచి, అందరినీ
తిరిగీ వేదమార్గమున నడిపించుతకా అన్నట్లుకుమారస్వామి కుమారిల భట్టుగా వెలసినారని
చెబుతారు. వేదవిజ్ఞాన సంపంనుడగు ఆ మహనీయుడు
అవైదిక మతములచే మన సనాతన ధర్మముపై నీలినీడలేర్పడుటకు అంగీకరించక పోవుటేగాక దానిని
ఖండించి వేదమతమును పునఃప్రతిష్ఠ త్రికరణశుద్ధిగా చేయ దలచినాడు.
నాటి
మహామహానుభావులు ఏవిషయమునయినా సాకల్యముగా సమగ్రముగా సాధికారకముగా తెలుసుకోకుండా
ఖండించే ఆలోచనే కలిగియుండేవారు కాదు. నేడు మనము ఆ బాట తప్పి చాలా దూరము
వచ్చివేసినాము. కేవలము వాచాలత వాదమునకు ఎన్నటికీ పరిపుష్ఠి చేకూర్చదు. అందువల్ల ఆ
శ్రేష్ఠతరుడు తన నిత్య నైమిత్తిక వేద కర్మలను తాత్కాలికముగా తగ్గించుకొన్నాడో లేక
తాత్సారమే చేసినాడో కానీ ఒక
బౌద్దారామమునందు ఆయన చేరినది ఒక చారిత్రిక సత్యము. 7 అంతస్తులను కలిగిన
ఆ కట్టడము బౌద్ధమునకు కాణాచియై యుండినదట.
ఆయన, అచటి ఉపాధ్యాయులు సనాతన ధర్మమును ఖండించి చెప్పునపుడు కంట తడి పెట్టుకొనేవారట. ఒకరోజున గురువు అది గమనించి ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని
అడగగా అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను
ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం
చెప్పారు. ఆ సమయమున మానసికముగా ఆయన ఎంత కృంగిపోయి వుంటాడో!
వంచన, మంచికేనైనా
చెడ్డకేనయినా కలకాలమూ గుప్తముగా వుండిపోదు. ఆయన అసలు రహస్యము ఆ బౌద్ధ సంఘమునకు
తెలిసిపోయింది. ఆయనకు చెప్పకుండా వారు 7 అంతస్తునకు తోడుకొని
పోయి అచ్చట నుండి త్రోసివేసినారు ఆయన చేసిన వంచనకు ప్రతీకారముగా!
అపుడు కుమారిల భట్టు క్రింద పడిపోతూ ‘వేదమే ప్రమాణం
అయితే,
సనాతన ధర్మమే సత్యమయితే
నేను భూపతనమయినా మరణించకుందును గాక’ అని మనఃపూర్వకముగా
తలచినాదట. కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు
వచ్చుట తప్పించి ప్రాణహాని కలుగలేదు.
ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం
అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను.
నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు
గుచ్చుకోవాలి?’ అని అడిగాడు.
మనము
ముఖ్యముగా భాగవతములో అశరీరవాణి పలికింది
అని వింటాము. అశరీరవాణి అంటే వేరేమీకాడు వేదమే! ఇప్పుడు ఆ వేదమే అశరీరవాణియై
పలికింది. సంపూర్ణ ధ్యాననిష్ఠాగరిష్ఠులగు మునివర్యులకు మాత్రమే అది వినిపిస్తుందు
కాబట్టి దానికి ‘శృతి’ అని పేరు
వచ్చింది. గురుశిష్య పరంపరలో వింటూ స్వరం తెలుసుకుని పలుకుతారు కనుక ఆవిధముగాకూడా
అది శ్రుతిఅగుచున్నది. అట్టి శృతిణి నమ్మిన నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు
దెబ్బతగిలింది’ అని అడిగినాడు ఆయన. ఆయనకు సమాధానము
ఈ విధముగా అందినది. ‘నీవు ‘వేదమే ప్రమాణం
అయితే’ అన్న మాటలో సంశయము కనిపించింది. ఆ అనుమానం
ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది.’ అని వినిపించింది.
తన మీద
తనకే ఒకవిధమగు ఎహ్యభావము కలిగింది కుమారిల భట్టు గారికి. తుషాగ్ని ప్రవేశం
చేసినసారు ఆయన. ఊక, వరిదాన్యపు పొట్టు, వేరుసెనగ పొట్టు ఇటువంటివి రగిల్చితే
ఒకేసారి మండి బూడిద కావు.రాజుకొంటూ రాగులుకొంటూ పొగను వేడిమిని కలిగించుతూ బూడిద
అయ్యేవరకూ కాలుతూనే వుంటుంది. ఆవిధముగా కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన
కాలిపోతున్న సమయంలో శంకరాచార్యుల వారు వారివద్దకు వచ్చినారు. తానూ కర్మకాండ కంటే
జ్ఞాన యోగము గొప్పదని వారితో వాదించ వచ్చినట్లు తెలిపినారు. అందుకు ఆయన జరిగిన
కథనంతా వివరముగా విశదముగా తెలియబరచి ఈ విధముగా తుషాగ్నిలో కాలుటయే తగిన ప్రాయశ్చిత్తమని
తలచి ఆవిధముగా చేయుచున్నట్లు తెలిపినాడు. వాదనకు తన శిష్యుడు మండనమిశ్రుడు తగినవాడనిచేబుతూ
మాహిష్మతీ నగరములో వుండే ఆయన వద్దకు శంకరులవారిని పంపి క్రమేణా ఆమహనీయుడు తనువు
చాలించినాడు.
కుమారస్వామి
కుమారిలభాట్టుగా జన్మించి బౌద్ధ, జైన మతములను వృద్ధిజెందనీయక నిలువరించి తన అవతార
పరిసమాప్తి గావించుకొన్నారు. పునః ప్రతిష్ఠకై కుమారుని తండ్రియగు శంకరులే లోకశంకరులై
ఆదిశంకరులై జగద్గురువులై భూమిపై అవతరించినారు. వారు మండనమిశ్రుని ఓడించిన పిదపనుండీనే
పూజా సమయమున జేయు సంకల్పములో ఏ దేవతాపూజ చేస్తూ ఉన్నామో ఆదేవత పేరుజెప్పి ‘ప్రీత్యర్థం’ అన్న
మాటను చేర్చమని ఆదేశించినారు. తరువాతికాలములో ఆయన ‘తిరుజ్ఞాన
సంబంధర్’ గా తమిళనాడులోని శీర్గాళి లో శివపాదహృదయ,
భగవతి దంపతుల బిడ్డగా జన్మించి వైదిక ధర్మమును శివపారమ్యమును చాటినాడు.
పరమేశ్వరార్పణమస్తు.
శుభం
భూయాత్.
No comments:
Post a Comment