ఘటన (భర్తృహరి సుభాషితం)
కొందరు ప్రతిభ లేకుండానే రాణిస్తారు లేక
ప్రతిభ కలిగిన మేరకు పూర్తిగా రాణించుతారు. కొందరు ప్రతిభకు మించి ప్రకాశించుతారు.
కొందరు అప్రతిహతమైన ప్రతిభ కలిగి కూడా విధి అన్న అగ్నికి ఆహుతియైపోతారు. భర్తృహరి
ఈ విషయాన్ని బహు చక్కగా వివరించినాడు. గమనించండి .
సంతప్తాయసి సంస్తితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితందృశ్యతే
అంతస్సాగర శుక్తిమధ్య పతితం తన్మౌక్తికం
జాయతే
ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషా మేవంవిదా వృత్తయః
దీనికి ఏనుగు లక్ష్మణకవి వారి తెలుగు సేత
నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు
నా
నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత
ప్రభన్
పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు
వారికిన్
ఒకే నీటి బిందువు కాలే ఇనుము పై బడితే
ఆవిరియై పోతుంది, అదే తామర ఆకు పైబడితే ముత్యమువలె ప్రకాశిస్తుంది, మరి ముత్యపుచిప్పలోనే బడితే ముత్యమే అయి కూర్చుంటుంది. ఈ శ్లోకమున అధమ మధ్యమ
ఉత్తమ పురుషులను పైన చెప్పిన విధముగా పోల్పబడింది. నిజానికి ఆయా వ్యక్తుల వద్ద
పనిచేయవలసి వచ్చుట కూడా ఘటన లేక అదృష్టమే కదా! ఇందుకు కర్ణుడు చక్కని ఉదాహరణ.
ఈ సందర్భములో నాకొక వాస్తవిక సంఘటన గుర్తుకొస్తూవుంది.
ఒక సారి కార్యాలయ కార్యార్థినై నేను మా
ఉన్నతాధికారి యొద్దకు పోవలసి వచ్చింది. పని ముగిసిన తరువాత 'అదృష్టము' అన్న విషయము పై మా మాటలు మరలినాయి. అప్పుడు
నేను పైన తెలిపిన భర్తృహరి సుభాషియమును తెలుపుట జరిగింది. ప్రొద్దు బుచ్చుటకు కాక
మాటలు మనఃపూర్వకముగా సాగుతున్నాయి కాబట్టి నేను పై ఉదాహరణ చెప్పినవెంటనే ఆయన మరి
ఆవిరయిన ఆనీటిచుక్క వాతావరణ ఉష్ణోగ్రతకు
తిరిగీ ద్రవీభవించి, ఈ పర్యాయము ముత్యపు చిప్పలో పడవచ్చు కదా!
అన్నారు. అందుకు నేను అవకాశము 1/3 వ వంతే కదా, కావున తిరిగీ కాలే ఇనుము పైన పడే అవకాశము కూడా అంతే ఉన్నదన్నాను. ఆయన నా మాటను
త్రోసిపుచ్చలేదు.
ఈ ఉపపత్తిని జీవితమునకు అన్వయించుకొంటే మనము
ఆహా ఓహో అని అనే వారికంటే గొప్పవారు ఎంత మంది గుర్తింపే లేక మట్టిలో
కలిసిపోయినారో!
సరస్వతీపుత్రునిగా స్వామీ దయానంద సరస్వతిచే
ఆప్యాయముగా పిలువబడిన, 14 భాషలలో అసాధారణ పాండిత్యము గలిగిన, రష్యన్ కాన్సలేట్
జనరల్ – చెన్నపట్టణమునందు
అనర్గళముగా ఒకటిన్నర గంట ఉపన్యసించిన, సంగీత నాట్యములలో అద్భుత ప్రావీణ్యము
కలిగిన, మధుర గాత్రము కలిగిన, వైష్ణవుడయ్యును శివతాండవమును ఆచంద్ర తారార్కము గావించిన , ఒకనాటి
దేశాధ్యక్షుడు రాధా కృష్ణన్ కొనియాడబడిన పుట్టపర్తి నారాయణాచార్యులవారికి దాదాపు చేతికందబోయిన జ్ఞానపీఠ
పట్టమును తన లౌకికమునుపయోగించి ఒక రెడ్డిగారు తన్నుకుపోయినారు.
దీనివల్ల జ్ఞానపీఠ
పట్టమును పాండిత్యమునకు గాక పైరవీకి అందించినట్లయినది.ఘటన అంటే అదే కదా!
annagaru.. mee post nu FB lo share chesikonnanu.. kshamimchagalaru..
ReplyDeleteసంతోషం అమ్మా. ఇందులో క్షమున్చావలసినది ఏమీ లేదు. ఆ మహనీయునికి అంజలించుట తప్ప వేరేమి చేయగలను.
Delete