ఆచారములు సాంప్రదాయములు
https://cherukuramamohan.blogspot.com/2017/03/blog-post_16.html
ఆచరించుట అన్న మాటకు చేయుట అని అర్థము. ఇల్లు శుభ్రముగా
ఉంచుకొనుట ఆచారము. మరి అందరి ఇళ్ళు శుభ్రముగానే ఉంటాయా అంటే ఉండకనూ పోవచ్చు అన్న
జవాబు వస్తుంది . ఒకప్పుడు ఆవు పేడ కలిపిన నీళ్ళు ఇంటి ముంగిట చల్లి ముగ్గువేయుట
ఆచారము. నేడు అది మృగ్యము. ఒకప్పుడు అయ్యా, స్వామీ , పెద్దాయనా, పంతులుగారూ, గురువుగారూ అనుట ఆచారము . దగ్గరితనము వుంటే అత్త ,మామ,బాబాయ్,పిన్ని,అన్న, వదినె, అని ఎన్నోవిధాల
పిలుచుకొనే వాళ్లము. ఇప్పుడది లేదు. అన్నింటికీ ఒకటే మంత్రమే! అదే ' ఆంటీ-అంకుల్' మంత్రము. అంటే
ఒకనాటి ఆచారము వదిలి కొత్త ఆచారాన్ని అమలుపరచుకొనవచ్చు. దానివల్ల కొంత కాలానికి
అటువంటి పని ఒకటి చేస్తూవుండినామా అన్న సందేహము మనలో తలెత్తుతుంది. పూర్వము ఈ
ఆచారాలను 3
విధములు జేసినట్లు తోచుచున్నది. 1. దేశాచారము 2. కులాచారము 3. జ్యాత్యాచారము ఈ మూడు కాకుండా 4.మతాచారము
అనునది కూడా ఏర్పరచుకొనవచ్చును.
1.దేశాచారము:
మనలో మేనమామ కూతురుని వివాహము చేసుకొనుట కద్దు. కొన్ని ప్రాంతములలో చేసుకోరు.
ముస్లిములు, క్రైస్తవులు
వారి మతములలో లేకున్నా పుస్తెలు మెట్టెలు ధరించుట కద్దు. ఇది దేశాచారమేకదా!
2.కులాచారము:
దీనికి ప్రత్యేకముగా నేను ఉదహరించ నవసరము లేదనుకొంటాను. ఇది స్త్రీలకు బాగా
తెలుస్తుంది.
వారికి కార్యాల విషయములో పరిశీలన అధికముగా వుంటుంది. అందుకే
ఆపస్తంభ ధర్మ సూత్రములలో 'యత్
స్త్రీయాహుస్తత్' అని
తెలుపబడినది. అంటే 'స్త్రీలు
చెప్పిన విధముగా చేయుడు.'అని
అర్థము.
3.జాత్యాచారము:
ఎన్నో కొండ జాతులు వుండేది మనము చూస్తూనే ఉన్నాము. వారి ఆచారాలు విలక్షణముగా
వుంటాయి. వారి వారి కులపెద్దలు ఆదేశించిన తీరుగా ఆ జాతీయులు నడచుకొంటారు .
4.మతాచారము:
ఇక్కడ మతము అంటే ఏ క్రీస్తు మతమో, ఏ ఇస్లామో కాదు. మనసుకు తోచిన ఆలోచనను మతము అంటారు. ఒక
సమూహములో ఏమి చేయవలయునో తెలియని పరిస్థితి ఏర్పడితే వారు పెద్దగా ఎంచుకొన్న అతని
అభిమతము ప్రకారము ఆ విధిని నిర్వర్తించుతారు. రాను రానూ అదే అచారమైపోతుంది.
సాంప్రదాయము అటువంటిది కాదు. అది ఎప్పటికీ వుంటుంది. ఆచరణ
లేక అమలులో తేడాలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు పెళ్లి, దేవతార్చన , నోములు, వ్రతములు
ఆచరించుట. పండుగలను పాటించుట. ఇవి సాంప్రదాయము క్రిందికి వస్తాయి. మనము పాటించ
వచ్చు లేక ఆచరించ వచ్చు ఆచరించకనూ పోవచ్చు. సాంప్రదాయమునకు ఒక మూలము వుంటుంది.
ఆచారము ఒక కుట్టించుకొన్న బట్ట లాంటిది. వేసుకొన్నంత కాలము వేసుకొని వేరేది
కుట్టించుకొంటాము. సాంప్రదాయము, సంస్కృతి అనే శరీరమునకు అంగము. ఇది వాడక పోవచ్చును గానీ
నరికివేయము.
అసలు సంస్కారముల ప్రతిరూపములే సాంప్రదాయములు. బంకమట్టిని
ఉదాహరణగా తీసుకొందాము. కుమ్మరి దానిని సంస్కరించే వరకు అది కేవలము మట్టే, దానిని తగిన
విధముగా సంస్కరించిన తరువాతే ఒక చట్టి గానో,ఒక మూకుడు గానో ఒక బాన గానో, ఒక కడవ గానో,ఒక కళాఖండము
గానో తయారవుతూవుంది. కావున ఈ సంస్కారములు మనకూ అవసరమేగదా. అసలు సంస్కారములే
మానవులను సంఘటితము చేస్తాయి. ఈ సంస్కారాలు 16 అని స్మృతులు, గృహ్యసూత్రాలు తెలుపుతాయి. ఇవి గర్భాదానము, పుంసవనము, సీమంతము,
విష్ణుబలి,,జాతకర్మ,చంద్రదర్శనము,నామకరణము,అన్నప్రాశనము కర్ణవేధ, చూడాకరణము,అక్షరాభ్యాసము,
ఉపనయనము,కేశాంతము, స్నాతకము,వివాహము,అంత్యేష్టి .ఈ సంస్కారములు శూద్రుల విషయములో 10 యగునని
వ్యాసులవారు చెప్పినారు. కానీ నేడు చాలా సంస్కారాలు అంతటా కరువై పోయినాయి'
వివాహము ,అంత్యేష్టి అందరూ జరుపుకొంటూనే వున్నారు. నామ కరణమూ, అన్నప్రాసన ,చూడాకరణము(పుట్టు
వెంట్రుకలు),కర్ణ
వేధ (చెవులు కుట్టించుట ) ఇవి అన్నీశాస్త్రోక్తముగా జరుపుకొనుట దాదాపుగా
మానుకొన్నాము.
ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః.
మన సాంప్రదాయాన్ని కాపాడుట మన ధర్మం. మరి మన ధర్మాన్ని
కాపాడుదాం. మన సంస్కృతికి పూర్వ వైభవము కల్పిద్దాం.
Very neatly explained on sampradayam
ReplyDelete