చాటువు ----
ఒక చెరువులో కొన్ని కొంగలు ( సంస్కృతంలో బకము అంటే కొంగ అని అర్థము.) వుండినాయి. వాటి వద్దకు ఓ రోజు ఒక హంస వచ్చింది. వాటి మధ్య జరిగిన సంభాషణకు అక్షర రూపమే ఈ చాటు పద్యము. రస విహీనుల మధ్య ఒక పండితుడు, చెడ్డ వారిమధ్య మంచి వాడు చేరితే ఎంత అవహేళనకు గురికాబడతాడో తెలియజెప్పే చాటువిది.
ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వెదకినా దొరకవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకు శ్రేష్టమైన పద్మముల, ముత్యముల గురించి తెలియదు కదా! బుద్ధిహీనులు ఎదుటి వారి గొప్పదనమును గానక ఎంత హీనముగా ప్రవర్తించుతారు అన్నదే చాటువు లో చెప్పిన ఈ బక మరాళ సంభాషణ.
కొంగలు— “ఎవరునువ్వు? నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది ఎందుకు?
హంస - ‘నేను హంసని!’
కొంగలు – “ ఎక్కడనుంచి వచ్చావు”?
హంస - “ చాలా దూరంలో ఉన్న మానస సరోవరం నుంచి వచ్చా!”
కొంగలు - ‘ అక్కడి విశేషాలు ఏమిటి’?
హంస - “బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వులు, మంచి ముత్యాలు లభిస్తాయి!”
కొంగలు – ‘ నత్తలు ఉంటాయా’?
హంస - ‘ అవేమిటో నాకు తెలియదు’!
కొంగలు – “నత్తలు తెలియవా? అని పక,పకా నవ్వుతాయి”
మనము గమనించవలసినది ఏమిటంటే, గొప్పవారు ఎన్నోవిశేషాలు, విషయాలు చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు. అటువంటి వారి ముందు ఊరక ఉండటము మంచిది. 'ఊరకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లే'దన్నారు పెద్దలు.
ఈ భావాన్నే శ్రీనాధుడు తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ “ అడరి కాకులు చేరి బిట్టరచునపుడు, ఉదధి రాయంచ యూరక యుంట లెస్స, సైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు. అంటే చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి వెక్కిరింపు మాటలకు మౌనంగా ఉండటమో లేక అక్కడ నుంచి వెళ్ళిపోవడమో ఉత్తమమని తెలుపుచున్నాడు కవిసార్వభౌముడు.. కావున ‘ మనకన్నా విద్య, విజ్ఞానము, చివరకు వయసులోనైనా సరే పెద్దలయినవారిని ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు’. ఎంతటి ఆచరణ యోగ్యమైన మాటో చూడండి.
చెవిటి వాని వద్ద చేరి శంఖమునూద
'ఎంక గొరుకుచుంటివేల యనును
మూర్ఖ మతుల నడుమ మూర్ధన్యుడిట్లురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి
వేమన గారు ఏమంటున్నారో చూడండి.
అలతి పదాలతో వేమన్న 'జ్ఞాన,విద్యా, వయో ధనులకు' ఈ విశదముగా సలహా ఇస్తూవున్నాడు:
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచేమైయుండదా
విశ్వదాభిరామ వినుర వేమ
అంత ఆచరణ యోగ్యమైన మాట.
జీవితానికి, నిజమునకు, కావలసిన విద్య ఇది. ఈ మెళుకువలు తెలుసుకొన్నవారు జీవితములో ఎంతో నేర్చుకొన గలుగుతారు.
*****************************************************************************************************************************
వర్ణం
శ్లో.ఎకవర్ణ మిదం పూర్వం ! విశ్వ మాసీ ద్యుధి స్టిర !
కర్మ క్రియావిశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్టితమ్ !!
కర్మ క్రియావిశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్టితమ్ !!
వ . ధర్మరాజా ! సృష్టాదిలో ఈ ప్రపంచమున ఒకే మానవ జాతి యుండెను కాలాంతరమున ఆయా మానవులోనర్చు వృత్తి ,ఉపాధి,కర్మ ధర్మాదుల వలన కర్మ క్రియా విశేషముల చేత నాలుగు వర్ణము లేర్పడినవి సుమా ! అని భీష్ముడు ధర్మ రాజునకు చెప్పెను .
అజ్ఞేభ్యో గ్రంధినః శ్రేష్టః గ్రంధిభ్యో దారినో వరాః
ధారి భోజ్ఞానినః శ్రేష్టా జ్ఞానిధ్యో వ్యవసాయినః
శ్లో! మిత్రద్రోహీ కృతఘ్నశ్చ నృశం సశ్చనరాధమః
క్రవ్యాదై.క్రిమిభిశ్చా స్తర్ణభుజ్యంతే హతా వ్రుకాః!
క్రవ్యాదై.క్రిమిభిశ్చా స్తర్ణభుజ్యంతే హతా వ్రుకాః!
No comments:
Post a Comment