Saturday 11 November 2017

అమ్మా నా బంగరు తల్లీ

అమ్మా నా బంగరు తల్లీ
అమ్మాయి పుట్టిందని ఆవేదన చెందేవారు కొందరైతే ఆనందించేవారు ఎందఱో! అసలు ఆడబిడ్డ పుట్టినింటి సంస్కృతిని లోకానికి చాటే రాయభారి. కష్టము నిష్టూరము అంటే ఏమిటి అన్నది అమ్మాయికి తెలిసినంత అబ్బాయికి తెలియదు. అనుభవాలను హృదయములో పదిలపరచుకొనే కుశీదికము(Treasury). ఆమె మనసు వంటగదికి సంబంధించిన సామానుల అర. ఏదేది ఎంతెంత వాడవలయునో, జీవితమనే వంటలో ఆమెకే తెలుసు. అట్టి చిట్టి తల్లిని గూర్చి ఒక తండ్రి మనసులోని మాట ఈ గేయము. మనసారా చదవండి.

అమ్మా నా బంగరు తల్లీ
వేలు పట్టుకొని విడువని తల్లీ
వెడ వెడ యడుగుల నడచిన తల్లీ
చిలిపి చేష్టలను చేయుచు తల్లీ
ఆనందమునందించిన తల్లీ
రాజ లోహమున రవ్వలు తల్లీ
పలుకగ నీపలువరుసలు తల్లీ
వేయి దీపముల వెలుగుల తల్లీ
వెతలనెల్ల వెలార్చిన తల్లీ
హాస కిరణముల భాసము తల్లీ
అందరినీ అలరించెను తల్లీ
వీడని తావుల వాడని మల్లీ
తిరిగివచ్చునా దినములు మళ్ళీ

దొంగ భయము నీ తోడు కూడగా
అమ్మ కొంగు నీకభయమివ్వగా
నాన్నకు భయపడు నటనామయివై
బెదురు నయనముల పేర్మి బొమ్మవై
అభినయించగా ఆనందించుచు
విహంగమై విను వీధి చరించుచు
ఆనందమునకు హద్దు వెదకునెడ
కలతది ఏదో కలిగెను మదికడ
ఎదలో బాధకు ఎదో మూలము
కలిగెనన్న కలకలమున హృదయము
చింత చేయగా చిట్టి తల్లికిక
కళ్యాణపు శుభ ఘడియ చూడుమిక
అని తలపనె మది ఆర్ద్రత చేరగ
సెలయేరులు నా చెంపలు జారగ
వెదకి వరుని నీ వేడుక తీరగ
పెళ్ళి చేసితిని పెరిమి మీరగ

అనురాగముతో అమ్మ నాన్నలను
గాంచ వచ్చినా కట్టుబాటులను
పోరుగింటికి తా పోయిన రీతిని
మసలే నిను మనసార జూచితిని
'ఆడది' గానే అతివ నిలువబడె
'ఈడది' కాదను ఇంగితమేర్పడె

రంగస్థలమున రంగము మారెను
పాత్రధారిణిది పాత్రయు మారెను
నాటి బిడ్డయే నేటి తల్లిగా
పొదిగిన నెనరుకు పొన్నువు కాగా
పుచ్చుకొన్న మా పూర్తి ప్రేమమును
భర్త ఇంటిలో పంచివేయుచును
నీ తలిదండ్రుల నిజ గౌరవమను
విరుల తావులకు వీవెనవగుచును
మము ధన్యులుగా మసల జేసితివి
మంచికి మారుగ నిలిచి పోయితివి

కాల క్రమములో కరగి మారితివి
తల్లివౌచు తలపింప జేసితివి
నాటి ముచ్చటలు నాటి మురిపెములు
అనునయాలు ఆత్మీయ భావనలు
ఎన్నో విధముల మాకు జూపగా
నిలచితివమ్మా ఆదర్శముగా
భావి తరాలకు నీ సంతానము
కొలమానముగా నీవు నిలుపుము
ఇదియే మాదగు దీవెన తల్లీ
అఖండ జ్యోతిగ నిలువుము తల్లీ



చెరుకు రామ మోహన్ రావు

No comments:

Post a Comment