Thursday 9 November 2017

తిరుచందూరు - కార్తికేయ లీల

తిరుచందూరు - కార్తికేయ లీల 

https://cherukuramamohan.blogspot.com/2017/11/blog-post.html
2004 డిసెంబరు లో తమిళనాడులోని సముద్రతటములందు వున్న ప్రాంతములన్నీ సునామీ కి గురియైనవే. బహుశ మన దేశ చరిత్రలో ఇది మొదటిసారేమో! కంచి పరమాచార్యులు జయేంద్ర సరస్వతికి నాటి ప్రభుత్వము చేసిన దురంతానికి తగిన శిక్ష విధి విధించినాడా అనికూడా ఒక వార్త చాలా ప్రబలముగా వుండినది. ఏది ఏమయినా, ఆ జలప్రలయమునకుసముద్రము ఒడ్డునే ఉండి కూడా చెక్కు చెదరకుండా నిలచినది ఒక దేవాలయము. అదే తిరుచందూర్ కార్తికేయుని ఆలయము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయము.
ఈ ఆలయమును గూర్చి ఒక వాస్తవ కథ ప్రచారములో వుంది. అది ఆంగ్లేయులు మన దేశమును పరిపాలించుచున్న కాలము. ఈ దేవాలయము లోని విగ్రహము పంచలోహ మూర్తి. ఆ కాలములో స్వామికి ఇప్పుడున్నంత పెద్ద ఆలయము లేదు. ఎన్నో మందిరములలోని ధన రాశులను, పంచలోహ విగ్రహమును దోపిడీదారులగు ఆంగ్లేయులు అపహరించినట్లే ఈ దేవాలయమునకు సంబంధించిన ధన రాశులనూ, స్వామీ పంచలోహ విగ్రహమును దొంగలించి తమ ఓడలో తమదేశమునకు తరలింప దొడగినారు. ఇంచుమించు, ఓడ, ఒక 10 కిలోమీటరు పోయినతరువాత సముద్రములో తుఫాను చెలరేగింది. ప్రాణభయము ఏర్పడిన నావికులలోని ఒక అనుభవజ్ఞుడు వెంటనే స్వామి విగ్రహమును అక్కడికక్కడే నీటిలో  వదలివెయమన్నాడు. వారు అట్లు చేయుటతో తుఫాను నిలచిపోయినది. తమదారిన తాము మిగిలిన సంపదతో తరలిపోయినారు.

ఆరాత్రికి స్వామి పూజారి కలోకనిపించి తన విగ్రహము సముద్రములో ఎక్కడ వున్నది అన్న విషయమును గూర్చి కొన్ని గుర్తులు చెప్పి,  ఎక్కడయితే ఒక నిమ్మకాయ తేలియాడుట చూచుట జరుగుతుందో అక్కడ సముద్రములో వెదకితే విగ్రహము కనిపించుతుందని తెలిపి అంతర్ధానమైనాడు. తెల్లవారిన పిమ్మట ఆ బాపడు మరికొందరి సహాయముతో ఒక పడవలో బయలుదేరి స్వామీ చెప్పినరీతిగానే ఆ విగ్రహమును పునఃప్రతిష్ఠ ఆలయములో చేసినాడు.

తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించినాయి. వారిలో చేరులు, పాండ్యులు ముఖ్యులు. వీరు పెద్ద పెద్ద రాజగోపురములను నిర్మించి ఎంతయో వన్నె తెచ్చినారు ఈ దేవాలయానికి. తారకాసురుని తమ్ముడగు శూరపద్ముని కుమారస్వామి ఇచ్చట వధించినాడు. అందువల్ల ఇది పురాణ ప్రసిద్ధి గాంచిన దేవాలయము. మామిడి చెట్టుగా మారిన శూరపద్ముని రెండుగా చీల్చి చంపినట్లు పురాణ కథనము. ఆ రెండు భాగములు ఒకటి నెమలిగానూ ఒకటి కోడిగానూ మారినట్లు చెబుతూ ఆరెంటినీ కూడా తన వాహనములగా చేసుకొన్నాడని స్థలపురాణము. ఆయన ఆయుధమైన వేల్ అనగా బల్లెముఆయనకు ప్రతీకగా పూజలందు కొంటుంది. ఇక్కడ కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరపటము విశేషము. మరియొక విశేషమేమిటంటే సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించుట. 
 ఇచ్చట స్వామి బ్రహ్మచారి కాదు. శ్రీవల్లీ దేవసేనా సమేతుడు. ఇచట ఎంతో అరుదగు గ్రంథ సముదాయము కూడా మనకు లభించుతుంది. ఇచట శివ కేశవా విగ్రహములను కూడా మనము చూడవచ్చు.
మరొక విశేషమేమిటంటే దేవాలయము వద్ద ఒక శిలాన్యాసము వుంది. అందులో సముద్రుడు తనవల్ల కలిగే, లేక తనకు కలిగే ఏ విపరీతము వలన గూడా ఆ ఆలయమునకు ఎటువంటి ముప్పు కలుగదని చెప్పినట్లు అందు లిఖిత పూర్వకముగా వున్నదని చెబుతారు. 2004 డిసెంబరులో వచ్చిన సునామీ ఈ విషయమును పుష్ఠి చేస్తుంది. అంతటి సునామీ కూడా సముద్రపు ఆటుపోటులను  గుడికి రెండు కిలోమీటర్ల దూరమునకు పరిమితము చేసింది. ఇటు గుడికి గానీ అటు ఆ ప్రాంతమునకు గానీ కలిగిన ముప్పు ఏమియూ లేదు. అది షణ్ముఖుని దయ అందుకే ఆవూరు షణ్ముఖప్రియ.

అటువంటి పుణ్యక్షేత్రమును దర్శించి నేత్రపర్వము గావించుకొనుట సుకృతముగా తలువ వలసియుంటుంది.
స్వస్తి.

1 comment:

  1. Beautifully spelt out the history of the temple. Thanks for your efforts sir. It's marvelous and quite informative.

    ReplyDelete