Thursday 13 March 2014

కాండము-పర్వము స్కందము

కాండము-పర్వము స్కందము 


Rajasree Radha

భారతరామాయణ కథలు విన్నపట్టి నుంచి నాకో సందేహం.భాగవతం లోని భాగాలకు స్కంధాలని, రామాయణం లోని భాగాలకు

కాండం అని, మహా భారతంలోని భాగాలకు పర్వాలని పేర్లు ఎందుకు పెట్టారు? మూడు హిందూ పురాణాలు అయినా పేర్లలో

తారతమ్యం ఎందుకు?మా తెలుగు ఉపాధ్యాయులను ఇంకా తెలిసినవాళ్ళను అడగాను. వారిచ్చిన సమాధానం నాకు సరైనదని

అనిపించలేదు.మన పెద్దలు ఏంచేసినా దానికి ఒక కారణం ఉంటుందని నా నమ్మకం.

మీకు తెలిసి ఉంటే చెబుతారని ఆశిస్తున్నాను
అమ్మా

కాండము అన్న మాటకు పరిచ్ఛేదము అంటే a section అన్న అర్థము తో బాటూ కాడ, అంటే శాఖ అన్న అన్వర్థమును

తీసుకొనవచ్చు. దీనికి సమయము అన్న అర్థాన్ని కూడా పెద్దలు చెబుతారు . పరిచేదము అంటే విభాగము, ఉత్తర కాండ

కాకుండా 6 శాఖలున్నాయి రామాయణ కల్పవృక్షానికి. అందుకే మహనీయులైన విశ్వనాథ వారు కూడా తాము వ్రాసిన

రామాయణమునకు 'రామాయణ కల్ప వృక్షము' అన్న పేరునే పెట్టినారు. అంటే మనము ఇందు ప్రేమ ,భక్తి, వాత్సల్యము ,

మమకారము, ద్వేషము,కామము,పౌరుషము,ధర్మనిరతి మొదలగు ఎన్నో శాఖలను మనము గాంచవచ్చు. అందుకే వాల్మీకి

అడిగిన ప్రశ్నకు బదులుగా నారదుడు 16 లక్షణాలు(చంద్రుని కళలు 16) కలిగినవాడు రాముడు అని చెబుతాడు. అందువల్లనే

ఆయన రామచంద్రుడు అయినాడేమో. రామాయణము ఆది కవి వాల్మీకి విరచితము. ఆయన చేట్టు'కొమ్మ'పై క్రౌంచ

మిధునమును చూచుటతోనే కదా రామాయణ ప్రారంభము. వాల్మీకి మొదటి కవి రామాయణము మొదటి కావ్యము అయినా

ఆయన దానిని ఆచంద్ర తారార్కము ఉంటుందని నొక్కి వక్కాణించినారు. రుషి వాక్కు రిత్త పోదు కదా . అంతటి మహనీయుడు

రామాయణ భాగములను కాండములు అంటే అవి కాండములే .

ఇక పర్వము. భారతము యొక్క విభాగాములకు పర్వము అన్న పేరు పెట్టినారు. పర్వము అన్న మాటకు 'గణుపు' అని ఒక

అర్థము . భారతము చెరుకుగడ అయితే ఒక్కొక్క విభాగము ఒక్కొక్క పర్వము. చివరివరకూ మధురమే. పర్వము అన్న

మాటకు పండుగ అన్న అర్థము కూడా వుంది . భారతము చదువుతూ వుంటే అంత ఉల్లాసంగా ఉత్సాహంగా వుంటుంది.

'ధర్మెచార్థేచ కామేచ మొక్షేచ భరతర్షభ --యది ఆస్తి తదన్యత్ర యన్నేహాస్తి తతత్క్వచిత్' అన్నారు వ్యాసులవారు. భారతములో

నేనిది ఎక్కడా దొరకదన్నారు. వేరెక్కడైనా దొరికేది భారతములో కూడా ఉంటుందన్నారు. ఆయన భారత భాగాలను పర్వములు

అంటే మనము వారిని అనుసరించవలసినదే.

ఇక భాగవత స్కందములు. 'స్కందము' అంటే చెట్టు బోదె లేక బొందె. ఇందులోని అన్ని కథలకు మూలము మహావిష్ణువే.

అవతారములు మారవచ్చు. అందుకే వ్యాసులవారు వారిని అనుసరించి పోతన్న 'లలితస్కందము కృష్ణ మూలము

శుకాలాపాభిరామంబు ... 'అని అన్నారు.

అమ్మా నాకు తెలిసినది జ్ఞాపకమున్నంతవరకు తెలియబరచినాను.

తత్సత్

No comments:

Post a Comment