Friday 7 March 2014

కవి నారసింహుండు కాడు కానేకాడు

గరికెపాటి వారికి నచ్చిన నా పద్యము 'ఇది వారిని గురించే'

కవి నారసింహుండు కాడు కానేకాడు
సరళ భావతతి విశారదుండు
పాండితీ నరసింహ భాతి కానేకాడు
వాగ్దేవి యొసగిన వరసుతుండు
ధారణా నరసింహ ధమని కానేకాడు
ఆదికవి వాల్మీకి యనుజుడతడు
అవధాన నరసింహు డతనుకానేకాడు
సరస పద్యగరిమ సాంద్రుడతడు

పనిని సాధింప నరసింహు పగిదితాను
వేరు మార్గాల నెన్నని విభుదుడతడు
గాలివానలకెరగాని గరికెపాటి
నారసింహావధానులు నాకు ప్రీతి

గరికెపాటివారికి 'అవధాన బ్రహ్మ రాక్షస' అన్న బిరుదు ఉందని విన్నాను. ఆయన ధారణను ప్రశంసించుతూ బహుశా వారికీ బిరుదునొసంగియుండవచ్చు. నా మనసుకైతే 'రాక్షస' అన్న శబ్దము వారి ధిషణకు సరికాదేమో అనిపించింది. నాకు ఎరుక ఉన్నంతవరకు వారిది కల్మషము లేని మనస్తత్వము. వారి పూరణలు కవిత్వము ఎంతో మధురముగా ఉంటాయి. అయినా నాకు సరిపోనంత మాత్రాన అందరికీ సరిపోగూడదని లేదుకదా. బిరుదు వాడుతూవున్నారంటే వారికీ నచ్చినట్లేకదా.
నామనోగాతమును పై పద్యములో తెలిపినాను. ఒకసారి వారితో కలిసినపుడు ఈ పద్యము వినిపించితే వారు సంతసించుటయేగాక పై పద్యములో ,గాలివానలకెరగాని గరికేపాటి' అన్న ప్రయోగము చాలాబాగుందనిచెప్పినారు.

పై పద్య వివరణ ఇది.

పై పద్యములోని సీసము లోని నాలుగు పాదములలో తేటగీతిలోని రెండు పాదములలో 'నారసింహ' అన్న పదము వస్తుంది.అందుకు నా సంజాయిషీ ఇది: నరసింహుడు భక్త సులభుడే కానీ చూపులకు భయంకరుడు. సింహము తన వేటను చీల్చి చెందాడుతుంది. అంటే ఆవేశము పరాక్రము నరసింహునికి అతిశయము .ఆయన హిరణ్యకసిపును చంపినాడుగానీ చాలా హృదయవిదారకముగా చంపినాడు. ఇక్కడ ఈ నరసింహుడు కవ్విస్తూ నవ్విస్తూ ఊరిస్తూ పూరిస్తున్నాడు . అందువల్లనే అతడు 'ధమని' కాడు అన్నాను. ధమని అంటే కౄరుడు అని నిఘంటువు.ఇక ధారణలో ఆయనను వాల్మీకితో ఎందుకు పోల్చినానంటే మొత్తము రామాయణ కథను నారద, బ్రహ్మలు చెప్పినది చెప్పినట్లుగా,పర్వతాల, రాజధానుల,రాముని అనుచరుల, రాక్షసుల, రాజుల ,ఋషుల, పేర్లతో కలిపి గుర్తు పెట్టుకొనుటకు ఎంత ధారణ ఎంత ధీశక్తి అవి కలుగుటకు ఎంత తపస్సు కావలెనో మీ ఊహకే వదలుచున్నాను. ఇక 'గాలివానలకెరగాని గరికెపాటి నారసింహావధానులు నాకు ప్రీతి' అంటే అవధానమున ఎంతటి కఠిన,కఠినతర,కఠినతమ పరిస్తితులనెడు గాలివానలోకూడా ఆయన గడ్డి మొక్క వలె వంగి తిరిగీ నిటారుగా నిలుచుతాడు తప్పించి మర్రిమాను మాదిరి విరిగి పడడు.


భావతతి =భావసమూహము, భాతి= విధము,వలె,మాదిరి,  సాంద్రత = చిక్కదనము,density, పగిది=వలె

ఇడ్లీకి కొబ్బెర చట్నీ,అల్లపు చట్నీ, వేరుసెనగ పప్పులచాత్నీ. కారప్పొడి, సాంబారు అన్నీ ఉంచటమైనది. కోరిన పదార్థముతో ఇడ్లీ కొరుకవచ్చు.


















No comments:

Post a Comment