Saturday 4 December 2021

జంబుద్వీపం:

 

జంబుద్వీపం:

https://cherukuramamohan.blogspot.com/2021/12/blog-post_4.html

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబువులు అంటే నేరడు పళ్ళు. బహుశా ఈ ప్రదేశమంతా నేరేడు చెట్ల మాయమై ఉండేదేమో!

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించినారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. ఇవి మొత్తము 9 ద్వీపములు.

అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కిం పురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం, ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతము అబద్ధమని అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ద్రావిడ సిద్ధాంతాన్ని సృష్టించినారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరూ దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు. ఇందుకు ఉదాహరణ సుగ్రీవుడు సీతమ్మను వెదకుటకు గానూ మొత్తము భూగోళమును గూర్చి రామాయణము నందు వానర మూకకు చెప్పటమే!

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టింనది కాదని అదంతా  తప్పుడు ప్రచారమని తెలియవస్తూ ఉన్నది. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

ప్రాచీన భారతదేశ చరిత్రకు ఉపయుక్తంగా ఉన్న విషయాలెన్నో పురాణ వాఙ్మయంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా భౌగోళిక శాస్త్రమును గురించి ఎంతో విశధముగా కూడా వ్రాయబడి ఉన్నది. మన ప్రాచీనులు భూభాగాన్ని ఏడు ద్వీపాలు గాను, ఏడు సముద్రాలుగానూ విభజించినారు. 'సప్త ద్వీపావసుమతీ' (జంబు,ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కర) అని మార్కండేయ పురాణంలోనూ, 'సప్త ద్వీపవతీ మహీ' అని బ్రహ్మాండ పురాణంలోనూ కలదు. పురాణాలలో వర్ణింపబడిన ప్రకారం జంబూ ద్వీపమే ఈ ఏడు ద్వీపాలకు మధ్యలో ఉన్నది. ఈ జంబూ ద్వీపమే ఇప్పటి ఆసియా ఖండానికి, దానికి తూర్పు దక్షిణంలో ఉన్న ద్వీపాలకు సరి పోతున్నది. ఈ జంబూ ద్వీపంలో మొదటి పదం నేటి జమ్ము కాశ్మీర్ అను రాష్ట్రంలోని జమ్మూగా ఉన్నది అన్నది నాలో కలుగు సందేహము.

 జంబూ ద్వీపం తొమ్మిది వర్షాలుగా విభజింపబడింది. ఈ జంబూ ద్వీపంలో ఏడు కుల పర్వతాలు న్నాయి. అవి హిమవంతం, హేమకూటం, నిషధం, మేరువు, నీలగిరి, శ్వేతాచలం, శ్రుంగవంతం అనేవి. ఈ కులపర్వతాల నంటుకొని ఏడు వర్షములున్నాయి. అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కింపురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. హిమవన్నగానికి దక్షిణంగా, సముద్రానికి ఉత్తరంగా భరత వర్షమున్నదని, ఈ భరత వర్షమునకు తూర్పున కిరాతులు, పశ్చిమాన యవనులు, మధ్యన బ్రాహ్మణ, క్షత్రి య, వైశ్య, శూద్రులు ఉన్నారని వాయుపురాణంలో రాయబడినది. ఈ భరత వర్షాంతర భాగమే నేటి భరత ఖండం, హిందూ దేశమని మన రాజ్యాంగ శాసనంలో ఉన్నది.

భరతవర్షము పురాణాల ప్రకారం ఇంద్ర, కేతుమంత, తామ్ర వర్ణ, గభస్తిమంత, నాగ, సౌమ్య, గాంధర్వ, వారుణ, కుమారికా అను తొమ్మిది ద్వీపాలుగా విభజించబడింది. నాటి కుమారికా ద్వీపమే నేటి హిందూ దేశం తో సరిపోవును. ఈ కుమారీ ఖండము హిందూ దేశమును ఆఫ్రికాతో కలిపి యున్చేదిదని, కాలాంతరమున ఇది సముద్రములో కలిసిపోయినదని కూడా కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఈ కుమారికా ద్వీపము మరలా ఏడు విషయాలుగా విభజించబడింది. అవి మధ్య, ఉదీచ్య, ప్రాచ్య, దక్షిణాపథ, అపరాంత, వింధ్య, హిమాలయ ప్రదేశములు. ఇందలి దక్షిణాపాతమే నేటి దక్కన్ పీఠ భూమి. ఈ దక్షిణాపథ దేశాలలో పాండ్య, కేరళ, చోళ, కూల్య, మహారాష్ట్ర, మహిష, కళింగ, విదర్భ, కుండల, ఆంధ్ర దేశములు తెలుపబడినవి. మార్కండేయ పురాణాదులలో ఆంధ్ర దేశము దక్షిణాపథములలో చెప్పబడి నది. కానీ నాటి దేశముల యెల్లలు పురాణములలో వివరింపబడలేదు. స్థల నిర్దేశాన్ననుసరించి ఆంధ్రదేశం కళింగ దేశానికి దక్షిణం గాను, ద్రావిడ దేశానికి ఉత్తరం గాను, కర్ణాటక మహారాష్ట్ర దేశాలకు పశ్చి మాన ఉన్నట్లు మాత్రం చెప్పవచ్చును. ఈ స్థలనిర్దేశం సంస్కృత కావ్యయుగం  తర్వాతి  శిలాశాసనాలలో స్పష్టం చేయబడినది. అసలు దీనిని బట్టి ఆంధ్రదేశము వారి భాష యగు ఆంధ్రము ఎప్పటినున్దియో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినదని తెలియవచ్చుచున్నది.

 

          నేటికిని మన సంకల్పంలో జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోఃదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఉత్తర, ఆగ్నేయ ప్రదేశే అని ఆయా ప్రాంతముల ఉనికిని చాటుటలో కృష్ణాగోదావరీ మధ్య దేశే అని కలిపి చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని ప్రాంతాలవారు శ్రీకృష్ణాకావేరియోః మధ్య ప్రదేశే అని చెప్పుకొనుట కూడా కద్దు. నేటి ఆంధ్రదేశం సగం భాగం దండకారణ్యంలోనూ, సగం భాగం కిష్కింధరాజ్యం లోనూ ఇమిడి ఉన్నది అని పెద్దలు చెబుతారు. వింధ్య పర్వతానికి దక్షిణంగా, కృష్ణాస్రవంతికి ఉత్తరంగా, మలయా,మహేంద్ర పర్వ తాలకు మధ్యగా దండకారణ్య మున్నది. దానిలో తూర్పు భాగం జనస్థానం, కృష్ణకు దక్షిణంగా కిష్కింధా రాజ్యముండెను. రామాయణ కాలమున రావణుని సోదరుడగు ఖరుడు ఈ జనస్థానానికి అధిపతి. ఈ జన స్థానమందే పంచవటి కలదు. శ్రీ రామభద్రుడు సీతా సౌమిత్రి సమేతుడై ఈ పంచవటి యందే కొంతకాలం కాపు రముండెను. ఇచ్చటనే సీతాపహరణం జరిగినది. ఈ పంచవటి ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరీ మండలంలోని భద్రాచల క్షేత్రానికి ఉత్తరంగా ఇరవై రెండు మైళ్ళు దూరంలో ఉన్నది. శ్రీమద్రామాయణం, కిష్కింధాకాండలో హనుమదాదులను సీతను వెదకటానికి దక్షిణ దిక్కుకు పోయి, దండ కార ణ్యానికి వెళ్ళి అక్కడ గిరివన దుర్గముల, గోదావరీ తీరముల నండ్ర, పుండ్ర, కేరళ, కురుదేశముల పరికించి రండని ఆజ్ఞాపించినట్లు గలదు.

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

స్వస్తి.

 

No comments:

Post a Comment