Monday 6 May 2019

సనాతన ధర్మబద్ధ వివాహములో వధూ వరుల వయస్సు (వధూవరుల వయస్సు)


సనాతన ధర్మబద్ధ వివాహములో వధూ వరుల  వయస్సు 

https://cherukuramamohan.blogspot.com/2019/05/blog-post_6.html
వేదోక్త వివాహానికి వధువు వయసు వరునికన్నా తక్కువ వుండాలన్నది శాస్త్ర నిర్దేశము. ఎందుకు అన్నది ఒకసారి విమర్శించుకొందాము.

ముందు నేటి సమాజపు పోకడను గూర్చి కొంచెము మాట్లాడుకొందాము. మనసు పెట్టి ఆలోచిస్తే, మనకు గౌరవముంటే గురి వుంటుంది. అది వ్యక్తి కావచ్చు, శాస్త్రము కావచ్చు లేక దేవుడే కావచ్చు. అదే లేకుంటే ఏమీ లేదు. నేటి అధిక శాతము యువతకు, నా దృష్టిలో, సరియైన దిశానిర్దేశము లేదు. మన ఆచార వ్యవహార్తములగూర్చిన అవగాహనలేదు, అది గ్రహించడానికి సమయమూ లేదు. అసలు తెల్లవారినది మొదలు డబ్బు వెనుక పరిగెత్తుటకొరకే నిదుర లేస్తున్నామన్న గట్టి నమ్మకము నేటి తరము వారిది. వేరు విషయములపై ధ్యానము లేక ధ్యాస ఉండదు. 'సంపాదనే తన సర్వస్వమనుకొని శాస్త్రముల్ సమవర్తి సరస జేర్చె' సంపాదన తన సర్వస్వమనుకొన్నాడు. బాగానే ఉంది. కానీ శాస్త్రములను సమవర్తి అనగా యమధర్మరాజు వద్దకు చేర్చినాడు. యముడు ప్రాణాంతకుడే కానీ ధర్మాధర్మ విచక్షణకు ఆయన గీటురాయి. నేను చెప్పదలచినది ఏమిటంటే ధర్మస్వరూపుడైన యమధర్మరాజు వద్దకు ధర్మాన్ని చేర్చినాము అంటే తెలిసిన విషయమును, తెలిసిన వానివద్దకు చేర్చి చేతులు దులుపుకోన్నాము. ఇక మనకు తెలిసినది సున్న. తెలిసేదీ సున్నానే! ఇకనైనా ఎంతో కొంత తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము అన్నది నా ఉద్దేశ్యము.
కానీ అలసత్వము ఆపని చేయనీయదు. ఒక 3,4 సంవత్సరముల క్రితము ఆస్యగ్రంధి (Face Book) సభ్యులు తాము వ్రాయుట ద్వారాగాని, తెలిసిన వారు వ్రాసిన రచనలను పదుగురికి వ్యాప్తి (Sharing) చేయుట ద్వారాగానీ మంచిని పంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరో ఎక్కడో ఏ youtube లోనో ఉంచినది, మన సంస్కృతితో ఏమాత్రము సంబంధము లేనివి, సర్కసులు, విన్యాసాలు తమ కుడ్యమునకు చేర్చుచున్నారు (Posting on their walls). దీనివల్ల ఆస్య గ్రంధి అన్న ఒక చక్కటి మాధ్యమమును నిస్సారము, నిస్తేజము, అర్థ హీనము చేయుచున్నారు అన్నది నా అభిప్రాయము. మనకు జరిగిన, జరుగుచున్న అన్యాయాలను గూర్చి తెలుసుకోనవలసినది ఎంతో వున్నది. యువతకు మన సంస్కృతి తెలుసుకొనే తపన లేకుంటే దేశమే నిర్వీర్యమౌతుంది. అసలు పాశ్చాత్యులు ప్రాగ్దేశములపై, మోసముతో, తమ బావుటాను ఎగురవేసి లోకానికి అనాగారికులైన వీరికి మేము నాగరికత నేర్పుటకు వచ్చినామని ఉద్ఘాటించినారు కానీ నిజమునకు వారిలో తెలివయిన వారు మన విజ్ఞానమును దొంగలించి తమ పేరును దానికతికించి మనచే చదివించుచున్నారు. ఇది ఎట్లాఉన్నదంటే, మన ఊరినీళ్ళలో  ప్రాణాంతకమైన రసాయనములు కలిపి 10రూపాయలకు తక్కువలేని పెప్సీ కోకులగా త్రాపించుచున్నారు. అందు గల నీటి విలువ 10పైసలు చేయదు. ఇకనైనా యువత కళ్ళు తెరుచుట మంచిది.
ఇక నేటి వివాహ వ్యవస్థ ఎంత హేయమైన స్థితికి దిగజారిందో చూచెదము. నాటి, తెనుగునాట, ప్రసిద్ధ నటియైన శ్రీదేవి భర్త కొడుకు, అంటే శ్రీదేవికి సవతి కొడుకు, మలైకా అరోరా అన్న ఆవిడను వివాహమాడ దలచినాడు. ఆయన చేసేది తప్పా ఒప్పా అన్న విషయముతో మనకు నిమిత్తము లేదు. ఒక వాస్తవాన్ని పరిశీలించుదాము.  ఆమె 45 సంవత్సరముల వయసు కలిగినది కాగా అతని వయసు 33  సంవత్సరములు. తెలిసిన పేర్లు కావున వీరిని ఉదహరించినాను. దేశములో ఇటువనివారు ఎందఱో! అయ్య కులుకు ప్రాయములో ఉండగానే అమ్మ వణుకు ప్రాయముననుభవించుతూ వుంటుంది. Expiry Date దాటిన మందు వాడుటకు పనికిరాదు కదా!

ఓహో! అందుకా, స్వార్థ పూరితుడైన మగవాడు, తనకొక ఆడబానిస, తాను  బ్రతికినంతకాలమూ ఊడిగము చేయుటకు తక్కువ వయసు స్త్రీని వివాహము చేసుకొనవలెనని శాస్త్రములో చొప్పించినాడు అని తలచుట కద్దు. ఇది వాస్తవము కాదు. భార్యకు భర్తకు మధ్యన అనుబంధము రానురానూ అభివృద్ధి అవుతుంది. సాత్వికుడగు భర్త భార్య తనకోసము చేసే పనిని కృతజ్ఞతాపూర్వకముగా స్వీకరించుతాడు. ఆ కృతజ్ఞతను ఆమెకు ఇష్టమైన నగ నట్ర చేయించుటలో చూపించుతాడు. కాస్త వయోధికుడైన భర్త పోతే భరించలేక చనిపోయిన భార్యలు ఎందఱో ఉన్నారు. అట్లే భార్య పోతే మరణించే భర్తలు కూడా ఎందఱో వున్నారు. కావున ఊడిగము కొరకు చిన్నవయసు అమ్మాయిని పెద్దవయసు ఉన్నవానికి ఇచ్చి పెళ్ళి చేయుట లేదు. మహాభారతములో ఈవిధముగా చెప్పబడినది.
పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మపి సర్వతఃl
భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ll
కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము. ఎంత నిజమైన మాటో చూడండి.అసలు పెళ్లి మంత్రములలో భర్తను పెద్దకొడుకుగా చూచుకొమ్మని వధువుకు తెలియజేసే మంత్రములు కలవు. ఈ సందర్భములో మహాభారతము లోని మరొక మాటను గుర్తుచేసుకోవలసి వస్తుంది. అరణ్యవాసము వెళ్ళే సమయములో కుంతీదేవి ద్రౌపది తో ‘అమ్మా! నీ భర్తలలో ఒక సహదేవుని మాత్రము నీవు తల్లిలాగా చూసుకో! వానికి ఆకలి తెలియదు. అందుచే నీవే అడిగి వానికి అన్నము పెట్టు’ అని చెబుతుంది. మరి కొడుకులా చూచుట అంటే ఇదే కదా!
ఇక ఈ విషయమును కాస్త విపులముగా విమర్శించుకొందాము. స్త్రీ పురుషులకు అవయవ నిర్మాణ క్రమములోనే ఆంతర్యము అధికముగా వుంటుంది.  అవయవ విధులను ఉత్తెజితముజేసే రసాయన క్రియ (Hormonal function) ఇరువురిలో వేరువేరుగా వుంటుంది. అందుచే శిశువులగు ఆడపిల్లలు మాటలు, నడక, చెప్పినది అర్థము చేసుకొనుట మొదలగునవి శీఘ్రముగా,అంటే  మగ శిశువులకన్నా వేగముగా గ్రహించుతారు. అందుకే పెద్దలు ‘స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం’ అన్నారు. ఈ వాస్తవాన్ని గమనించండి ఒక 10 సంవత్సరముల వయసులోనున్న పిల్లల గొంతును పరిశీలించితే ఇద్దరి స్వరమూ  ఒకేమాదిరి వున్నట్లు తెలియవస్తుంది . ఆటరువాత ఇంచుమించు 2 ఏళ్లకల్లా ఆడపిల్లలగొంతు (సాధారణముగా) శ్రావ్యమైన రీతిలో నిలచిపోగా, తరువాత ఒక 4 సంవత్సరములకు మగపిల్లవాని గొంతుక మార్పులు చెండుతూవచ్చి ఒక 16 సంవత్సరముల వయసులో ఒకస్తాయినిచేరి నిలిచి పోతుంది. అదే విధముగా అమ్మాయి దాదాపు 12 సంవత్సరముల వయసులో రజస్వల అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయిని ‘సమర్త’ ఆడింది అని ముఖ్యముగా రాయలసీమవైపు అంటారు. నిజానికి అది సంస్కృత పదమగు ‘సమర్థ’ అంటే ఏపనికైనా సిద్ధము అని అర్థము. ఆ సమయమున అమ్మాయిని ‘పెద్దమనిషి’ అయినది అని కూడా అంటారు. అంటే మగపిల్లలతో ఆట పాటలు, అతిగా మాట్లాడటాలు నిలచిపోతాయి. కారణం అమ్మాయి పెద్దమనిషి కానీ అబ్బాయి ఇంకా పిల్లవాడే. వానికి మీసకట్టు, మొగగొంతు, శారీరిక మార్పు 16 ఏళ్లకు గాని రాదు. దీనిని బట్టి మనకు ఏమి అర్థమౌతున్నదంటే అమ్మాయి అన్నింటిలోనూ ముందుంటుంది. అందుచేత పెళ్లి విషయములో అమ్మాయి, అబ్బాయిల నడుమ వయోభేదము కనీసము 3,4 సంవత్సరాలన్నా పాటించుతారు. ఆతరువాత, ఆమె కుటుంబమునకు ఇచ్చే అతిపెద్దవరం ‘సంతానము’. రానురానూ ఆమె మన్మధ మార్గము నుండి మరలి పిల్లల రక్షణకు అంకితమై పోతుంది. మగవాడు మాత్రము కామాగ్నికి ఇంధనమై కాలుతూనే ఉంటాడు. అంటే పరిపక్వత ఆమెలో వచ్చినంత తొందరగా అతనిలో రాదు. అందుకే ‘కరణేషు మంత్రి’ ఆమె సలహాలను తీసుకో అన్నారు.
ఇది అసలు విషయము. కాబట్టి ఇందులో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. అంతా మనయొక్క దురాలోచన, దూరాలోచనపై ఆధారపడియుంటుంది .
స్వస్తి.

2 comments:

  1. మన శాస్త్రాలు పూర్తి విషయాలను తెలుసుకొని చెప్పినవి
    ఏదైనలోపముంటే మన అవగాహనలో మాత్రమే

    ReplyDelete