Thursday, 29 March 2018

ధనము - దానము

ధనము - దానము
https://cherukuramamohan.blogspot.com/2018/08/blog-post.html
రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి కొన్ని రాజ ధర్మాలు చెపుతూ, ఇలా
అంటాడు :
ధనమార్జిత కాకుత్స ధనమూలమిదం జగత్I
అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్యచII
కకుత్స అను సూర్యవంశపు రాజు పేరుతో రాముని వంశం ప్రసిద్ధిచెందినది. ఆయన తరువాత దేశమును పాలించిన అనువంశీకులు కాకుత్సులైనారు. అందుకే రాముని ‘కాకుత్స’ అని విశ్వామిత్రుడు సంబోధించినాడు.
ఆయన “ఓ రామా! ధనాన్ని బహుళముగా సంపాదించి తీరవలసిందే!  ఈ జగత్తు ధనముపైనే ఆధార పడి ఉంది. ధనము లేని వానికీ చనిపోయిన వానికీ మధ్య ఎటువంటి  వ్యత్యాసము నాకు  కనబడుట లేదు. కులము, గోత్రము, బలము, బలగము, అందము, చందము  ఏవి లేకపోయినా ఫరవాలేదు. ధనము ఒక్కటి ఉంటే చాలు అందరూ గౌరవిస్తారు. కష్టాలు, ఆపదలు కూడ ధనం ఉంటే దరిచేరవు.  అన్న గొప్ప సత్యమును పై శ్లోకం తెలుపుతుంది. ఇకొక మాట చెప్పవచ్చు. ధనము నిప్పులాంటిది. చిరిగినా పీలిక కప్పుకొన్న దరిద్రుడు చలి కాచుకోడానికి నిప్పువద్దకు వెళ్లి కూచుంటే ఏమరిపాటువల్ల కప్పుకొన్నది కాస్తా కాలిపోయిందట. జాగరూకత లేకుంటే ధనము కూడా అంతే!
మరి వక్రగతుల ధనము సంపాదించవచ్చునా? అంటే తగనే తగదు అంటుంది శాస్త్రము.
వేదమూల మిదం జ్ఞానం, భార్యామూల మిదం గృహంI
కృషి మూలమిదం ధాన్యం, ‘ధనమూలమిదం జగత్II
జ్ఞానానికి మూలము వేదము. ఇంటికి దీపము ఇల్లాలే. అందుకే భార్యను ‘ గృహ లక్ష్మీ’ అన్నారు. మంచిపంత చేతికందవలేనంటే కృషి అనగా వ్యవసాయం బాగా చేయాలి. అదే విధముగా  ఈ జగత్తులో అన్నింటికి మూలం ‘ధనమే’. కనుక ధనం తప్పక ఉండాలి అని పై శ్లోక పాదం తెలుపు తుంది. కానీ సంపాదన, వేదమూలమగు జ్ఞానమును సంపాదించినవాడు, ధర్మమార్గమును అనుసరించి సంపాదించుతాడే గానీ అన్యదా కాదు. అట్లని ఆ ధనమును కేవలము 'కూడబెట్టుట'కు మాత్రమే ఉపయోగించి కొడుకులకిస్తే 'కూడు పెడతారో లేదో' పరమేశునికెరుక. అట్లని వారికి ఇవ్వవద్దని కాదు నా అభిప్రాయము. 'చేతులకు తొడవు దానము' అన్నారు పెద్దలు. శక్తిలోపము లేకుండా చేసిన దానమే వ్యక్తి ని స్మరణీయుని చేస్తుంది.
ఒక సర్వసంగ పరిత్యాగి ఈ విధముగా అన్నాడు:
అర్తానాం ఆర్జితం దుఃఖం ఆర్జితానాంచ రక్షణే l
ఆయేద్దుఃఖం వ్యయేత్ దుఃఖం కిమర్థం దుఃఖ భాజనం ll
ధనము సంపాదించుట ఒక కష్టమైతే దాని సంరక్షణ మరియొక కష్టము. మరి రెండు విధాలా కష్టము ఉన్నపుడు కోరి కష్టము కొనితెచ్చుకొనుట ఎందుకు?
వేమన ఏమంటున్నారో చూడండి.
ధనము కూడబెట్టి  ధర్మంబు చేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ.
తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు, కూడ బెట్టిన ధనాన్ని తినక పోయినా, ధర్మం చేయక పోయినా, ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు.
అసలింకొక విషయము :
తాము డబ్బు నంత దాపెట్టి దాపెట్టి
కొడుకు చేతికివ్వ కూర్మి తోడ
తల్లి దండ్రి నంత తనయుండు వెలివేసె
రామ మొహనుక్తి రమ్య సూక్తి
కొడుకులంతా ఇట్లే ఉంటారు అని కాకపోయినా, ఇటువంటి కొడుకులు కూడా కద్దు అంటే కాదనేవారుంటారా!
ఎంత చెప్పినా నేటి సమాజములో డబ్బులేకపోతే దానికి గౌరవములేదు. కానీ దానికి పరిమితి మాత్రము ఎంతో అవసరము. పుట్టినది కేవలము ధనార్జనకే కాదు. మన అవసరమునకు మించిన ధనమును వితరనతో కూడిన దానము చేయుట ఎంతో అవసరము. ప్రముఖ చలనచిత్ర నటుడు చిత్తూరు ఉప్పలధడియం నాగయ్య గారు విరివిగా దానములు చేసి చేసి అమిత పెదరికములో అసువులు బాసినారు. నేడు మనము గొప్ప అనుకొంటూ ఉండే ఏ నటుడు కూడా ఆయన అంత్యక్రియలకైనా
సయహాయము చేయలేదు. నేడు ఆ నటులూ లేరు, పోనీ వారు పైకి పోవునపుడు తాము సంపాదించినది తీసుకుపోయినదీ లేదు. శోభన్ బాబు గారు గుప్త దానాలు చేసేవారని విన్నాను. తమిళ నటులు, విజయకాంత్, హాస్యనటుదు వివేక్ గారలు తమ దాన ధర్మములతో తమిళ నాడు లో ఎంతో ఖ్యాతి గాంచినారు. రతన్ టాటా దాన ధర్మములకు, దేశభక్తికి పెట్టినది పేరు. ఆయన డబ్బునే ప్రధానమని తలచియుంటే ప్రపంచములోని అమిత ధన వంతునిగా ఉండేవాడు. దేశ హిత, సమాజ హిత, సాహచార్యహితమగు ఎన్నో పథకములతో పేరుకు ప్రాకులాడకుండా చేయుచునే యున్నాడు. అదియే ఒక ధని చేయవలసిన పని.
అసలు భారతములోని విదురనీతి ఈ విధముగా చెబుతుంది:
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు మదంబున్ బొనరించును,
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా !
ధనము, విద్య, మంచి వంశము  అనునవి దుష్టులకు మదమును కలిగిస్తాయి. ఇవే
బుద్ధిమంతులకు వినయ విధేయతలను చేకూరుస్తాయి.
ఇక ధనార్జనను ' ధర్మార్థ కామమోక్షము' లను వేదవాక్కుతో ఒకసారి పరిశీలించుతాము. మన మొదటి మెట్టు ధర్మమే. తదుపరి అర్థము అంటే ధనము. అంటే మన సంపాదన ధర్మ బద్ధమై ఉండవలెనని నిర్దుష్టముగా చెప్పుచున్నది వేదము. అదేవిధముగా 'కామము' ధర్మార్థ బద్ధమై ఉండవలెను. అంతే తప్పించి ధనము వెంట పరుగిడరాదు.
సుమతి శతక కారుడు బద్దెన ఏమంటున్నాడో చూడండి. చేతులకు దొడవు దానము భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో నీతియ తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ! చేతులకు దానము అలంకారము, పాలకులకు సత్యవాక్పరిపాలన ఆభూషణము, ప్రతి వ్యక్తి కీ నీతియే ఆభరణము, స్త్రీకి మాన రక్షణమే ఆనూకము (నగ)
ధనరాశికి, మహాకాళసర్పము వలె కావలి యుండి దానధర్మముల యందు సద్వినియోగము చేయకున్ననూ ప్రయోజనములేదు. ఈ సందర్భమునకు సమంజసమనితలచి నేను వ్రాసిన ఈ పద్యమును మీకెరుకపరచుచున్నాను.
కాళము బోలె పెన్నిధికి  కావలి గాచియు ఖర్చు చేయ నే
వేళయు సాధ్యమౌనె జను వేళకు తోడుగ నిల్వగల్గునే
కూళలకీక చేయు భువి కూరిమి తోడుత దానధర్మముల్
ధూళిని చేరులోపలనె తోడగు పుణ్యము ప్రాప్తి చెందగన్
నాడే , నేటి పోకడ యగు  చెడుగు అన్న చెద పట్టుచుండిన సమాజమును ఉద్దేశించుతూ భర్తృహరి సుభాషితములలో ఏమి చెప్పినాడో తెలియజేస్తూ ఈ వ్యాసమును ముగించుచున్నాను.
జాతిర్యాతి రసాతలం గుణగణ స్తత్రాప్యాదో గచ్ఛతాత్
శీలం శైల తటాత్పతత్వభిజన స్సందహ్యతాం వహ్నినా,
శౌర్యే వైరిని వజ్రమాశు నిపతత్వర్థోస్తు నః కేవలం
ఏనై కేన వినా గుణా స్తృణలన ప్రాయాస్సమస్తా ఇమే.
ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత:
జాతి తొలంగు గాత గుణ శక్తి రసాతల సీమకుం జనుం
గాత కులంబు బూది యగు గాత నగంబుననుండి శీలముం
బాతము చెందు గాత బహు భంగుల విత్తమె మేలు వి
ఖ్యాత గుణంబు లెల్ల దృణ కల్పము లొక్క ధనంబు లేవడిన్
జాతియే తొలగి పోనిమ్ము, గుణము పాతాళము చేరనిమ్ము ,కులము భస్మమే కానిమ్ము, శీలము శిఖరాగ్రమునుండి అథః పతనమే కానిమ్ము, ఏవిధముగా చూచినా మాకు ధనమే మంచిది. ధనమొక్కటి లేనిచో పైన తెలిపిన మంచి గుణములన్నీ గడ్డి పోచతో సమానము.
ఇటువంటి హీన స్థితికి దిగజారి సమాజమును సాగరములో కలుపవద్దని ప్రార్థిస్తూ
ఈ వ్యాసమును ముగిస్తున్నాను.
స్వస్తి.

No comments:

Post a Comment