Wednesday 30 April 2014

పిల్లలు -- తల్లిదండ్రులు -- పెంపకము :


పిల్లలు -- తల్లిదండ్రులు -- పెంపకము :

రాజవత్ పంచ వర్షాణి దశ వర్షాణి తాడవత్
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదా చరేత్

ఇది నీతిశాస్త్ర వచనము.శిశువు పుట్టిన మొదటి 5 సంవత్సరములు రాజు/రాణి లాగా చూసుకో. ఆతరువాత 10 సంవత్సరములు పట్టి తిట్టి కొట్టి ఏమి చేసి అయినా సరే  పిల్లలను దారిలో వుంచవలె. 16 వ సంవత్సరము వచ్చినప్పటి నుండి సంతానమును స్నేహితులగా చూసుకోమ్మన్నది ఆర్య వాక్కు. మరి దాన్ని పాటించుతూ వున్నామా!

పెద్ద చేయు పనుల దద్దయు గమనించి
చేయుచుందురింట చిన్నవారు
బుద్ధి లేని పనుల పోరాదు పెద్దలు
రామమోహనుక్తి రమ్య సూక్తి
కొన్ని వాస్తవాలను గమనించుదాము. పెళ్ళయిన అనతి కాలములోనే ఒక శిశువు కలిగితే, ఆ శిశువు వయసు 2 సం. లోపు వున్నప్పుడు కొందరు దంపతులు సరసమైన తమ కోరికలనాపుకోలేక అసహ్యముగానో అసభ్యముగానో ప్రవర్తించుచుంటారు.
ఇది చాలా తప్పయిన విషయము . పిల్లలలో జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. వాళ్ళు గమనించినది ఆ వయసులో వ్యక్తపరచ లేకున్నా వయసు వచ్చిన తరువాత తమ జ్ఞాపకాలకు రెక్కలు సమకూర్చుకొంటారు. ఇంకొక జంట తరచూ పోట్లాడుకొంటూ వుంటారు. అది కూడా ఆ శిశువు మనసులో నెలవైపోతుంది. పెరిగేకొద్దీ తాను విపరీతమైన 'అహం' తో సాటి వారితో తగవులాడుతాడు.

పూర్వము మన దేశములోని సాంప్రదాయ కుటుంబాలు సమిష్ఠిగా  ఉండేవి. తాతలు, నాన్నమ్మలు, పెదనాన్నలు,పెద్దమ్మలు బాబాయిలు, పిన్నమ్మలు ఇంత మంది పెద్దల మధ్య పెరిగేవారు. ఆ పెద్దల  ప్రవర్తన నుండి పిల్లలు సహజంగా నేర్చుకొనేవారు. ఇప్పటి కాలంలో పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కేవలం తల్లి,తండ్రుల మీద ఉంటున్నది. కారణము మనకు తెలిసినదే! ఇప్పుడు ముసలి వాసన గిట్టుట లేదు యువతకు. అందువల్ల వారిని శ్రద్ధగా వృద్ధాశ్రమానికి పంపుతున్నారు. మరి ఇక పిల్లల బాధ్యత తామే తీసుకొనక తప్పదుకదా!  మరి తమకు తీరుబాటేదీ! ఆయమ్మో ఈయమ్మో ఏదో ఒక ఆయమ్మే గతి.
బిడ్డపైన తల్లిది  మొట్టమొదటి చెరగని ముద్ర. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఆలోచనావిధానం ప్రవర్తన బిడ్డలో ఏర్పడుతాయి.  
ఈ వాస్తవాన్ని మన పూర్వులు భాగవతములో ప్రహ్లాదుని చరిత్ర ద్వారా, భారతములో అభిమన్యుని పద్మవ్యూహ ప్రవేశ కథనము ద్వారా  మనకు వ్యాసులవారు చెప్పనే చెప్పినారు. నేటి శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా ఆ విషయమునకు పుష్ఠిని కలిగించినారు. తల్లి తరువాత తండ్రి ఆ తరువాత గురువు అంటే పాఠశాల,  అటుపిమ్మట స్నేహితులు ఆపైన సమాజము, శిశువు పెరిగేకొద్దీ తమ తమ ముద్రలను కలిగియుంటాయి.
ప్రఖ్యాత శిశు మానసిక శాస్త్రవేత్త యైన బౌల్బే ఏమంటున్నాడో గమనించండి.
Bowlby’s evolutionary theory of attachment suggests  that children come into the world biologically pre-
programmed to form attachments with others,
because this will help them to survive.
బ్లాజ్ అన్న మరో శిశు మనోవికాస శాస్త్రజ్ఞుడు ఈ విధముగా చెప్పినాడు.
Blatz focused on studying what he referred to as “security theory.” This theory outlined Blatz’s idea that different levels of dependence on parents meant different qualities of relationships with those parents, as well as, the quality of relationships with future partners. 

మానసిక శాస్త్రజ్ఞులు 6-8సంవత్సరాల మధ్య పరావస్థ దశ ముఖ్యమైనదిగా భావిస్తారు. బాల్య దశ మంచి అలవాట్లను నేర్పుటకు అనువైనది. ఎంత చిన్నవాడైన అతని మనస్సు అంత గ్రహణశక్తి మృదుత్వము కలిగి ఉంటుంది. కుటుంబములోని తల్లిదండ్రులు పిల్లల మీద చూపు ప్రేమ, దయ,విసుగు, మొదలగునవి ప్రధమంగా వారి ప్రవర్తనకు మూల బీజములు. పిల్లల్ని చీటికీ మాటికి తిట్టటం వారిని గురించి చెడుగా ఇతరుల వద్దచెప్పడం,కొట్టటం,వెక్కిరించడం,చులకన చేయడంవంటివి వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. పిల్లలకు తల్లితండ్రులమీద ఇంటిమీద ప్రేమ కలిగేటట్లుగా పెద్దల ప్రవర్తన ఉండాలి. అప్పుడే వారు మంచి పిల్లలుగా పెరుగుతారు.

ఒక గుడికి పోయినపుడు తల్లిదండ్రులు కాకుండా శిశువుతో 3,4 ధర్మాలు భిక్షగాళ్ళకు చేసేవిధముగా చూడండి. పెద్దయితే వారిలో ఎక్కడ లేని దయ జాలి ఉంచుకొంటారు. సాటి మనిషికి సాయపడగలుగుతారు.ఆడపిల్లలకు మొదటిసారి తలనీలాలు తీయిన్చినతరువాత మరులా క్రాపులు కటింగులు లేకుండా చూడండి. పిల్లలకు చిన్న యసులోనే పరికిణీలు కట్టించండి. కాలకృత్యములు తీర్చుకొన్న వెంటనే స్త్నానము చేయిచి మీకు తెలిసిన శ్లోకాలో పద్యాలో ఒక్కొక్కటిగా చెప్పించండి.ప్రతిచెట్టు అటు బీజము వల్లనైనా ఇటు గాలికో, ఎటూ గాకుంటే కాకి పిచ్చుకల ద్వారానో మొక్కగా మొలుస్తుంది.మొలిచినతరువాత మనకు పరిశీలించే సమయము వుంటే మొక్క మంచిదా కాదా అని తెలుసుకొని దానిని వుంచటమో వూడపీకడమో చేస్తాము . మరి చూడకపోతే ఏదోఒకరోజు గోడ్డలి కెరగాక తప్పదు. మొక్క వంగుతుందికానీ మాను వంగదు కదా!

పిల్లలకు చిన్న వయసు లో తప్పక రామాయణ భారత నీతిచంద్రిక కథలు చెప్పండి, పెద్దలను ఇంటిలో వుంచుకోనేవాళ్ళు వారితో చెప్పించండి. ఇవికాక సమయస్పూర్తి, హాస్యము , మొదలగు గుణముల కాలవాలమైన కాళీదాసు,తెనాలి రామకృష్ణ కథలు తెలియజేయండి.ఈ కాలము పిల్లలకు అక్షర వ్యత్యాసాలే తెలియదు. మన భాష లోని అక్షరాలలో ప్రాణ మహా ప్రాణాలను గూర్చి పిల్లలకు ఈ కాలములో చెప్పేటప్పటికి చెప్పే వారి ప్రాణాలు పోతాయి. భాష నాశనమౌతుందన్న చింత రవ్వంత కూడా లేకుండా ఎంతో కాలము నుండి వస్తున్న భాషను కేవలము తమ పేరు ప్రతిష్ఠ కోసమే పాటుబడి,వున్న అక్షరాలలో కొన్ని తీసివేసియును, వాడుక భాష అన్న పేరుతోను, చనిపోయిన మహనీయులు చనిపోయి కూడా మనలను మన పిల్లలను చంపుచున్నారు. ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రుల మీద పడింది. తప్పక పిల్లలకు 'అమరము' ఆంధ్ర నామ సంగ్రహము' నేర్పించండి.ముఖ్యము గా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఆధునిక కవులైన 'శ్రీ శ్రీ' 'దేవరకొండ బాలగంగాధర తిలక్' లాంటివారి కవితల లోని కొన్ని పదాలు నిఘంటువును ఆశ్రయించనిదే అర్థము చేసుకోలేరు. దిగంబర కవితలు నగ్న కవితలు ఎందుటాకులైపోయినాయి. పచ్చగా ఎప్పటికీ ఉండేది కళ్యాణ సాహిత్యమే.

తండ్రి పిల్లలకు సినిమా కథానాయకుడు. అతనే ఆదర్శము.మరి ఆతండ్రి పిల్లలను పెళ్ళాన్ని తీసుకొని పార్టీలని పబ్బులని, ఫంగ్షన్లని తీసుకు పోతున్నాడు. అవి చూసి పిల్లలు ఏమి నేర్చుకొంటారు అనే ఆలోచన వారికి ఉందా! సినిమా మంచిదయితేనే పిల్లలతో కూడా వెళ్ళండి.చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకోవద్దు.ఒక కొడుకు ఈ విధంగా తండ్రి తో అంటున్నాడు.

పబ్బుకేగ వలయు పదివేలు నాకివ్వు
"తనయ! డబ్బు గాదు తగినబుద్ధి
నీకు వలయు " నన్న నీవద్ద యది లేదు
కలిగియున్న దడుగ గలుగుదనెను

ఆ స్థితి కలగకుండా చూచుకొనుట మంచిది.

కాస్త 7 నుండి 10 సంవత్సరముల లోపువారవుతునే ఆడ మగ తేడా లేకుండా ఆటలు మొదలు పెడతారు. సహవాసము మంచిదయితే పరవాలేదు. కాకుంటే? 'సహవాస దోషయా పుణ్య గుణా భవంతు' 'సహవాస దోషయా పాప గుణాభవంతు' అన్నారు పెద్దలు. మరి ఎంతమంది తల్లిదండ్రులకు ఇవి గమనించే వెసలుబాటు వుంది. అసభ్యమైన అసహ్యమైన మన బుద్ధికి అనూహ్యమైన తిట్లను ఆడ పిల్లలు తమ ఆటలలో వాడుచున్నారు.

ఇక ఇంట్లో శుభ్రత. ఇంటి పనులకు పెట్టుకొన్న పనిమనుషులు ఎంత శుభ్రముగా పని చేస్తారు అన్నది మీ ఆలోచనకే వదిలి మీరు చేసే పనుల గూర్చి ఒక మాట చెబుతాను. చాలా మంది ఇళ్ళలో mineral water పేరుతో వచ్చే నీళ్ళు త్రాగడానికి ,పిల్లలకు త్రాపడానికి అలవాటు పడినారు. అసలు అందులో ఏమి minerals కలుస్తున్నాయి ,అవి minerals అని అనవలెనా లేక అవి chemicals అనవలేనా! సాధారణమైన మంచినీరు త్రాపుటలేదే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెంపొందగలదా? ఇంట్లో అమ్మ తదితర పెద్దలు చేసే వంట కంటే hotel భోజనాలు అంత ఆరోగ్యకరమా? మీరిట్లు పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలను ఎట్లు పెంచుతారు అన్నది ఆలోచించుతున్నారా.
ఇక ఆటల గురించి ఒక్క మాట . శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖచక్రగాదాఖడ్గములున్నట్లు నేటి పిల్లలచేతిలో శెలవు తోజున తెల్లవారుతూనే బ్యాటు,బాలు,స్టంప్సు,గ్లోవ్సు వుండవలసినదే.బయట ఆడే ఆట అది ఒక్కటే.
గోలీలు ,బొంగరాలు,బిళ్ళంగోడు (చిల్ల-కట్టే,గిల్లి-దండ) మొదలగు సూర్యుని వెలుతురులో ఆడే ఆటలు చీకటిలోకి వెళ్ళిపోయినాయి. చీకటి ఆటలు వెలుతురులోనే పిల్లలు ఆడుతూవుంటే చూసే దౌర్భాగ్యస్థితిలోమనమున్నాము. 
అసలు గోలీలు బొంగరాలు లాంటి ఆటలలో ఏకాగ్రత ,లక్ష్యము, పట్టుదల మొదలుగునవి వ్యక్తిగతముగా పెంపొందించు కొనవచ్చును. మట్టిలో ఆడుటవల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆట వస్తువుల ఖర్చు ఈ కాలమైతే ఒక 5 రూపాయలు.అదే క్రికెట్ అయితే 2000 రూపాయలకు పై మాటే. వర్షా కాలములో ఇంట్లో బారాకట్ట,పులిజుదము, బేరి ఆట మొదలుగునవి ఆడే వారు. వానికగు ఖర్చు 'శూన్యము.' ఇప్పుడు పిల్లల indoor games కు వేల వేల రూపాయలు తగలేస్తున్నారు.

పిల్లలలో అతి తక్కువగా, తాము చేసే పని తప్పా ఒప్పా అని తర్కించుకొనే వాళ్ళు కూడా వుంటారు. అప్పుడు వారు మంచి వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. కానీ ఈ విధమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా అతి చిన్న వయసునుండి పిల్లలకు చెబుతూ రావలసిన బాధ్యత తల్లి తండ్రులపై వుంటుంది. అసలు కొన్ని గుణములు జన్మతః పూర్వ జన్మ వాసనలతో వస్తాయి. అవి గమనించి మంచివైతే పెంచుకునేరీతిగా చెడ్డవయితే తెంచుకునే రీతిగా తెలియజెప్పు బాధ్యత తల్లిదండ్రులదే అందులోనూ ముఖ్యముగా తల్లిదే! సంపర్కము చె పిల్లలను గనుట జంతువులకు కూడా తెలిసిన విషయమే ! సంస్కారము నింపుటే తల్లి యొక్క గురుతర బాధ్యత. ఆతరువాత తండ్రిది.

ఒక చిన్న కథ చెబుతాను. అన్నివ్యసనాలూ కలిగిన ఒక రాజుకు ఇద్దరు కొడుకులుండేవారు. రాజ కుటుంబము కాబట్టి పెద్దవుతూనే ఎవరి భవనాలు వారికుండేవి. కానీ బాల్యములో తల్లిదండ్రుల వద్ద వుండేవారు కావున ఇరువురూ తండ్రిని పరిశీలించేవారు. పెద్దవాడు తల్లికి తెలియకుండా తండ్రిని ఎంతో జాగ్రత్తగా గమనించేవాడు. చిన్నవాడిని మాత్రము తల్లి గమనించి ఎంతో గోముగా తన తండ్రి చేసే పనులన్నీ చేయకూడనివి అని హెచ్చరించింది. బాలుని మనసులో అది బలంగా నాటుకుంది.
వారు ఇరువురు పెద్దవారై తమ తమ భవనాలలో ఉండజొచ్చినారు. రాజు తన కాలము ముగియ వచ్చిందని తెలుసుకొని మంత్రితో తన ఇద్దరు కొడుకులలో తగిన వారసుని ఎన్నామని మంత్రి తో చెప్పినాడు. సరేయన్న మంత్రి మొదటి కొడుకు వద్దకు పోయి చూస్థే తండ్రెంతనో తానంతగానే వున్నాడు. మంత్రి 'నీవు వ్యసనాలకు ఇంత బానిసవైపోయినావే రాజ్యము ఎట్లు ఎలగలవు'
అన్నాడు. అందుకు అతడు 'వేరే ఏమి నేర్చుకోగలను ఆ తండ్రిని చూసి' అన్నాడు. మంత్రి రెండవ రాకుమారుని వద్దకు పోతే ఎంతో కళా కాంతులతో అలరారుచున్నాడు. మంత్రి అతనితో కూడా అదే ప్రశ్న అడిగినాడు. అందుకు ఆ రెండవ అబ్బాయి నేను తండ్రినుండి ఏమేమి నేర్చుకొనకూడదు అన్న విషయాన్ని నేర్చుకొన్నాను. ఇది నా తల్లి పెట్టిన భిక్ష అన్నాడు. తరువాత ఎవరు రాజైవుంటారు అన్న ముగింపు మీకు తెలిసిందే .
పిల్లల మానసిక స్థితికి వారి తల్లిదండ్రులే కారణము. మానసిక చికిత్సా నిపుణుడు చేయగలిగినది డబ్బు తీసుకొనుట మాత్రమె.అదే తల్లి దండ్రులు తలచితే తమ సంతును ఉన్నత శిఖరాలనధిరోహింప జేయవచ్చు.

నా మాటలలో చెబుతున్న  ఈనాటి మన మానసిక దుస్థితి ఈ విధముగా లేదేమో యోచించండి.

పండు తేనె తెనుంగు ప్రాచి పోవగ జూచు
ప్రతిభ గలిగినట్టి  ప్రభుత మనది
నన్నయ తిక్కన్న నాణెంపు కవితల 
కాలాన గలిపేటి ఘనత మనది
శాస్త్రీయ సంగీత ఛాయ నాసాంతమ్ము
పడనీక కాపాడు పాట మనది
అలవలాతల కూడ అద్భుతమ్మౌకైత
యనుచు కొండాడేటి యాస్థ మనది

అమెరికా తప్పటడుగుల నడుగు లిడుచు
స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది
విల్వలకు వల్వలెల్లను విప్పివేసి
గంతులేయించు చున్నట్టి గరిత మనది

మనదు సంస్కృతి నంతయు మరచి పోయి
నాగరీకమ్ము కౌగిట నలిగిపోయి
తాతలను వారి చేతల త్రవ్వి గోయి
పాతి పెట్టితిమన బదుల్ పల్కగలమె


ఈ విషయము గమనించండి. డబ్బు సమయాన్ని హరించుతుంది. మనము డబ్బుకు 

దాసులము అందుకే 

కుబేరుని వాహనము మనిషి . ప్రక్కనే వున్నాడు పరమేశ్వరుడు(ఉత్తరము 

ప్రక్కన ఈశాన్యము) . కానీ దృష్టి 

ఆవైపు మరలదు . దాసునిగా ఉన్నంతకాలము దండన అనుభవించ వలసినదేకదా. 

సమయమంతా సంపాదనకే 

సరిపోతే సంతానముతో సహవాసమెన్నడు.


తెల్లవారినతోడ తేనీరు సేవించి 

జాగింగు చేసేసి జంట తోడ 
బ్రష్షింగు బేతింగు బహుశీఘ్రముగ జేసి 
కనగ నూడిల్సుతో కడుపు నింపి 
కం కమ్ము కమ్మంచు కన్నబిడ్డలనంత
స్కూలుకు కారులో చొరగజేసి
అమ్మగారొకచోట అయ్యగారొకచోట
కార్యాలయమ్ముల గడిపి గడిపి

పగటి యాకలి కేంటీను పాలు జేసి
రాత్రి కన్నమ్ము స్టవ్ లోనె రగుల బెట్టి
వీధి వంటలకొట్టుకు విధిగ బోయి
కూరలను తెచ్చి కడుపున కూరుతారు

పిల్లల ప్రేమబోయె కన పెద్దలు చేరగ వృద్ధ వాటికల్
ఇల్లను పేరు నిల్చెనది ఇమ్ముకు మారుగ నివ్వ బాధలన్
ఉల్లము చిల్లులయ్యె గన ఊహలు మొత్తము జారిపోవగన్
చెల్లని కాసుగా మిగిలె జీవిత యంత్రము త్రుప్పు పట్టగన్


'నా' నుండి'మన' చేరవలేనంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరము .కష్టనష్టాలు వుంటాయి 

కానీ కడకు సంస్కృతి నిలిపిన సంతృప్తి మిగులుతుంది.సంస్కృతి నిలిస్తే సంతోషము వెల్లివిరుస్తుంది. 

పెద్దలు లేని ఇల్లు గ్రద్దలు తిరిగే ఆకాశము లాంటిది.

ఇప్పటి కాల పరిస్థితులకు అనుగుణముగా కొంచెము యవ్వనము లోనికి ప్రవేశించీ ప్రవేశించక యుండే పిల్లలను గూర్చి కాస్త మాటలాడుకొందాము.

ఉద్వేగము అంటే మన English లో Reaction అని,ఉపశమనము అంటే Restraint అని మనము తీసుకొవచ్చు. ఉద్వేగమును Emotion గా కూడా తలువవచ్చు. . ఈ ఉద్వేగము అంటే ఏమిటి. కంటి ముందు కనిపించే ప్రతి విషయానికీ మనకు హృదయస్పందన వుంటుంది.తల్లిని కౌగలించుకొన్న శిశువు హృదయములో కలిగే స్పందన భాషకు అతీతము. అదే ఎలుకను నోట కరచిన పిల్లినిచూస్తే ఏడుపుతో స్పందించుతాడు శిశువు.  స్పందన పరిమి మీరితే ఉద్వేగమౌతుంది. ఆ ఉద్వేగము ఎక్కువగా నేటికాలములో, యువకులకు, ముఖ్యముగా కళాశాల విద్యార్థులకు ఎందుకు కలుగుతూ వుంది?వయసు పెరిగేకొద్దీ వ్యక్తి ముఖ్యంగా యువత స్పందన పై తమ అమిత ఆసక్తిని చూపుతూ భావోద్వేగాన్ని లోలోపలే అణచుకొంటారు. ఎందుకంటే తాము అమితోత్సాహముతో స్పందించేవిషయాలు తమ పెద్దలతో పంచుకొనేటంత మంచివి కాదు కాబాట్టి.ఒక మంచి పాత సినిమాకు పొతే నటుల అభినయమునకు అనుగుణముగా మనము స్పందిస్తాము. పాత సినిమా పెరు ఎందుకు వాడినానంటే అందులో భరతముని చెప్పిన నవరసాలూ వుండేవి కాబట్టి. నేడు రసాలు ఆవిరియైపోయి 'నవ' మాత్రమే మిగిలింది. . ఒక విధంగా చెప్పవలసివస్తే జీవితములో కూడా స్పందన రసానుగుణముగానే వుంటుంది. అందుకే నాట్య శాస్త్ర రచయిత భరతుడు ఈ విధముగా అంటాడు:
యః తుష్టా తుష్ట ఆప్నోతి, శొకే శోకముపైతిచ
క్రోధేకృద్ధో భయో భీరః సశ్రేష్ఠః ప్రేక్షకః స్మృతః .
 ఈ మాట ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకొంటున్నారేమో! చెబుతాను. 9 చాలా ఎక్కువన్న ఉద్దేశ్యముతో నెమో మన సినిమా వారు వానిని ఇప్పుడు 3 గా వర్గీకరించినారు. గమనించితే ప్రతి సినిమాలోనూ ఈమూడు విషయాలు చూడవచ్చు. అవి 1. పట్టుడు 2. కొట్టుడు 3. తిట్టుడు. 4 కళ్ళు రెండయినాయి 9 రసములు మూడయినాయి అని
మనము పాడుకోవలేనేమో!.
 కథానాయికనో లేక ఒక నట్టువరాలినొ(Dancer) అవసరమున్న లేకున్నా తాకి, గోకి, కౌగలించి, పామి ఎన్నోవిధములైన జుగుప్సాకరమగు చేష్టలు చేస్తాడు నాయకుడు. విరిసీ విరియని , ఆ హీనమైన నీచమైన, జుగుప్సాకరమైన, హేయమైన, దరిద్రమైన సన్నివేశములు చూసే, వచ్చీరాని యవ్వనములో వున్న పిల్లల పరిస్థితి ఏమిటి? అదే విధంగా ప్రతినాయకునితో (Villon) తలపడుచున్నప్పుడు బంతిని కాలుతో తన్నినట్లు ప్రతినాయకుని అనుచరులను,ప్రతినాయకుని, తంతే కారుకు వాని శరీరము గుద్దుకొని కారు పప్పైపోతుంది.వాడు తిరిగీ తన్నులు తినడానికి నాయకునివద్దకు వూగుతూ తూగుతూ వస్తాడు.అప్పుడు యువకుల మనస్థితి ఏమిటి. ఆ నాయకునిగా తమనూహించుకొని వూగిపోవుటయే కాక ఒక అవకాశము వస్తే ప్రయత్నము చేయవలెననే తపన వారిలో కలుగుతుంది. ప్రయత్నించి తన్నులు తిన్నవారు లెక్కకు మిక్కుటము.
ఇక హాస్యము పేరుతో పాత్రధారులు ఒకరినొకరు కించపరచుకోవడము తిట్టడ ము అతి సహజము. ఇవి చూసి యువతకు ఏవిధమైన స్పందన కలుగుతుంది. Punch Dialogues పేరుతో తమ మేధస్సు లో భద్రపరచి Theater బయటికి వచ్చిన వెంటనే వుండబట్టలేక వాడుతూ పోవడము. ఆడపిల్లలైతే ఈ 'సినీ మాయలు' చూసి ఉండబట్టలేక, వంటి పై వుండ 'బట్ట' లేక వుండటము.సినిమా హాళ్ళలో తల్లిదండ్రులతో కూర్చుని మరీ సినిమా చూస్తూవుంటారు. సినిమాలో లీనమగుట తప్పించితే ఆ దృశ్యముల ప్రభావము తమ పిల్లలపై ఎంతగా పడుతూవుందోనని ఎప్పుడైనా ఆలోచన చేసినారా!

ఇక TV ల విషయానికి వస్తాము. ఇది TV SERIALS కాలము. ఇంటిల్లపాదీ ముఖ్యముగాఆడవారు, త్వరత్వరగా పనిముగించుకొని TV లముందుచేరుతారు. వారిపిల్లలు వారితోనే ఉన్నారన్న విషము వారికిజ్ఞాపకముకూడాఉండదు.Serials, క్రికెట్టు ప్రసారములు,మధ్యంతర ప్రకటనల విషయానికి వస్తాము.
చదువుకొనే అమ్మాయిలు, కొత్తగా పెళ్ళయిన ఆడపిల్లలు Serials ను  చూసి నేర్చుకొనేదేమిటంటే కట్టుకొనే బట్టలు, Hotel తిండ్లు లాంటివేకదా మగవానితో,మొగునితో కల సంబంధ సంపర్కాలు అన్నది. రెండు మూడు సంవత్సరముల నుండి కొన్ని channels పనికట్టుకొని ఈ సనాతన ధర్మము కుసంస్కారాల నిలయమని చెవుల్లో ear phones పెట్టి మరీ చెబుతున్నారు. ఆవేశాముగా FB లో వారిని దుయ్యబట్టడము తప్పితే  తమ నియోజకవర్గపు  MLA తోనో MP తోనో యువత ఒక ప్రభంజనములా తయారయి , కలిసి,నిలదీసి యడిగితే వారి స్పందన దేశము దశ దిశల మారుమ్రోగుతుంది కదా! రాజు తలచితే దెబ్బలకు కొదవా అన్నట్లు ఒక ముఖ్యమంత్రి గారు తలచి నండువల్లగదా ఒక channel ఒక రాష్ట్రములో మూత బడింది. కాబట్టి మూయించుట సాధ్యము అన్నది మనకు అవగాతమగుచున్నది కదా! నేడు ఒకటైతే రేపు వేరొకటి. ఇక ఈ విషయముపై విశ్లేషణ ఇంతటి తో చాలించి కాస్త క్రికెట్ మరియు మద్యంతర ప్రకటనలను గూర్చి తెలుసుకొందాము.

 ఒక 45,50 సంవత్సరాలక్రితము BCCI అన్నది నాటి యువతలో తక్కువ మందికి తెలిసేది. ఇన్నివిధముల ప్రచార మాధ్యమాలు, సాధనాలు నాడు లేవు. Matches కూడా సంవత్సరములో అరుదుగా జరిగేవి. క్రికెట్ వార్తలు పత్రికా ముఖంగానే తెలుసుఒనేవారు విద్యార్థులు. పరదేశీయుల పరిపాలనా కాలములో ఈ విద్యార్థులు అన్న పేరు వచ్చింది కానీ అంతకు పూర్వము వీరిని నియతులు అనేవారు. అంటే వీరికి నియమ నిష్ఠలు ముఖ్యము. తరువాతనే చదువు. పరదేశీయుల పరిపాలనా కాలములో ఈ విద్యార్థులు అన్న పేరు వచ్చింది కానీ అంతకు పూర్వము వీరిని 'నియతులు' అనేవారు. అంటే వీరికి నియమ నిష్ఠలు ముఖ్యము. తరువాతనే చదువు. ఆ విద్యా విధానము వేరు. అది పూర్తిగా మన మెకాలే దొరగారి వల్ల వారి విధానమును దైవ వాక్కుగా భావించిన మన తండ్రి, బాబాయిలు వారి అన్యాయుల వల్ల పోగొట్టుకొని ' వాడుగొట్టె వీడు గొట్టే తాంబుర్ర-- ఉత్తబుర్ర చేతికొచ్చే తాంబుర్ర అన్నట్లు తయారయినాము.' మన విద్యా విదానమున్న కాలములో దేహ దార్ఢ్యము, శరీర సౌష్ఠవము క్రీదాభినివేశములు ముఖ్యమైనవి. అవి పిల్లల చదువుకు భంగకరముగా వుండేవికావు. corporate colleges వచ్చి పిల్లల నడ్డి విరిచినాయి. అయినా మనకు వాటిని నిర్మూలింపజేసే ఆలోచన రాదు. పూర్వపు గురుకులములలో రాజు రౌతు అంతా ఒకటే. పిల్లలకు ఆడుకొనే అవకాశమే లేదు. పిల్లక్లకు తలనొప్పి అంటే తెలియని మా కాలమెక్కడ ట్లననోప్పి తో తల్లడిల్లే ఈ కాలము పిల్లలెక్కడ. పిల్లలకు సూర్యుడు అపురూప వస్తువైపోయినాడు. అసలు కొందరు తల్లిదండ్రులు మా పిల్లవాడు ఎక్కువగా శ్రమ పడుతాడు కాబట్టి migraine తోబాధ పడుతూ వుంటాడని గర్వంగా
చెప్పుకొంటారు. నిజము చెప్పవలెనంటే పిల్లలకు సంస్కారము తల్లి కడుపునుడి మొదలు కావలె. ఈకాలము ప్రాధాన్యతలు మారిపొయినాయి. మొక్కగా ఉన్నపుడే దేవునిపై భక్తీ, పెద్దలపై గౌరవము, విద్యపై శ్రద్ధ , 

సంఘములో నడవడిక, సంస్కృతిపై అవగాహన కలిగించుతూ రావాలి. అది జరుగుటలేదు . ఒకచిన్నఉదాహరణ. 

ఒకతల్లి , కొడుకును గలిగిన తన బిడ్డ తో 'అమ్మ! పిల్లలను అలాగూడమీద గీయటము అర్థములేని 

అల్లరిచేయటము ఇప్పటినుంది కాస్త తగ్గించేప్రయత్నమూచేయుం' అనిఅంటే ఆ తల్లీయైన బిడ్డ తన తనతల్లికి 

ఉపదేశ మిచ్చిం్చిందట 'అమ్మాపిల్లలను అల్లరి చేయనీకుంటే చెడిపోతారు' అని. ఇదినేటితల్లుల తెలిసినతనము 

మరియు బాధ్యత .


2.
దారి తప్పినాము. వెనుదిరిగి TV --ఆటల ప్రసారణ అన్న విషయానికి వస్తాము.
 ఒక 45,50 సంవత్సరాలక్రితము BCCI అన్నది నాటి యువతలో తక్కువ మందికి తెలిసేది. ఇన్నివిధముల ప్రచార మాధ్యమాలు, సాధనాలు నాడు లేవు. Matches కూడా సంవత్సరములో అరుదుగా జరిగేవి. క్రికెట్ వార్తలు పత్రికా ముఖంగానే తెలుసుఒనేవారు విద్యార్థులు. కొన్ని పదుల కొట్ల యజమానియైన BCCI నేడు కొన్ని వేలకోట్ల యజమాని. ఎందుకంటే వారికి విద్యార్థుల గూర్చిన చింత ఏకొంత కూడా అవసరము లేదు. వారికి వారి Schedules తప్ప పిల్లల పరిక్షలు పట్టవు. ఇక పిల్లలో "ఇది చాలా ముఖ్యమైన Match పరిక్షది ఏముంది అది మళ్ళీ అయినా వస్తుంది,Match రాదుగదా అన్న ధోరణి. ఇక ఉద్వేగము ఇక్కడ మొదలౌతుంది. ఒక 20/20 Match ని వూహించుకొండి. చివరి Over 25 Runs కొట్టాలి.   ధోని Batting చేస్తున్నాడు. రెండవ ప్రక్క ఒక 'వాలాగ్రము' వున్నాడు. అక్కడ మొదలౌతుంది ఉద్వేగమంతా! గోళ్ళు మొత్తము 10వ్రేళ్ళవి కొరికి ముగించి ప్రక్కవాని గోళ్ళు కొరుకుతూ వుంటాడు. ఇంతTension అవసరమా! తన ఆరొగ్యము పై ఆ ఉద్వేగము యొక్క ప్రభావము పడుతుందనే యోచన ఆ వ్యక్తిలోనికి ఆ సమయములో వస్తుందా . అనవసరమైన ఆ క్షణికమైన ఆందోళణకు ఆరోగ్యాన్నే బలిచేయడానికి సిద్ధపడుతున్న అతని పతనమునకు కారణమెవరు? ఇవన్నీ ఒకప్రక్కయితే Betting అన్న మహమ్మారి ఇంకొకపక్క !
అంతకన్నా ఘాతుకమైనవి ప్రకటనలు. 10సెకనుల సమయము తీసుకొనే ఒక్కొక్క Advertisement Film ఎంత హీనమైన శృంగారమును జొప్పిస్తున్నారు వానిని చూసే యువతీ యువకుల ,విద్యార్థుల ఆలోచనలు ఏవిధముగా వుంటాయని, వానివల్ల దేశము ఎంత నిర్వీర్యమైపోతుందన్న ఆలోచన ఎవరికైనా వుందా!కనీసము 80 సంవత్సరాలు ఆరోగ్యముగా బ్రతుకవలసిన నేటి యువకుడు 80 ఏళ్ళకు  ఈ విధమైన పరిస్థితులలో  వుంటాడా ! వుంటే ఆరోగ్యంగా వుంటాడా !వున్నా తన దేశానికి, గ్రామానికి, కడకు తన తల్లిదండ్రులకు, కనీసము భార్యాబిడ్డలకు
పనికి వస్తాడా! 'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా, రుచి పచి లేని కూర చట్టినిండా' అన్నట్లు ఉంటాడు.
కాబట్టి యువకులు తమ ఉద్వేగమును ఉపశమింపజేసుకోవలె. మరి ఏ విధంగా! మొదటిది విద్య . అసలు విద్యకు మంచి చెడ్డలు లేవు. ఒక వ్యక్తి నిజానికి జీవితమంతా విద్యార్థే ! ౘక్కెర ఇసుకతో కలిసి వున్నా మనసుంటే రెంటినీ వేరు చేయవచ్చు. నీటి సహాయము కావాలి అంతే! ఆ నీరే నీ సహవాసము. గుణముగల పెద్దలతో చెలిమి చేసుకొంటే వారిద్వారా పంచదార అన్న పవిత్ర భావాల అణువులనన్నిటిని సాధించవచ్చు. రామాయణ భారత, భాగవతాది కథలను విధిగా చదవాలి. సులభశైలిలో వ్రాయబడిన పుస్తకములు ౘాలు. నేటికాలపు మహా పురుషులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోసె, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ , లాల్ బహదుర్ శాస్త్రి, అబ్దుల్ కలాం, లాంటి వారి జీవిత చరిత్రలు బాలురు,యువత తప్పక చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. తల్లిదండ్రులకు కలకాలము  తగిన గౌరవమివ్వాలి. పెద్దలుకూడా చిన్నపిల్లలకు మన సంస్కృతి అందజేసిన కళ్యాణ సాహిత్యమును చిన్నవయసులోనే KG లకు పంపకుండా  చదివించితే గొప్పవారవుతారు కాబట్టి తప్పక ౘదివించాలి. ఈ  లా కతీతంగా  నేడు నాటిన మొక్క నాడు నీడ నివ్వాలంటే  వీడకుండావారిని బాధ్యత అన్న నీరు పోసి పెద్దలు పెంచాలి. మొక్క మానైన పిదప నీరు పోయుట ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆలోచిస్తే పెద్దలకు తెలియనిది కాదు.

స్వస్తి.



























4 comments:

  1. చాలా చక్కగా వివరించారు..... ధన్య వాదములు

    ReplyDelete
  2. great sir. good explanation. meeru emaina YouTube channel pettandi sir.

    ReplyDelete