Showing posts with label కర్ణుని దాన గుణముతోబాటు గొప్ప గుణము చూడండి.. Show all posts
Showing posts with label కర్ణుని దాన గుణముతోబాటు గొప్ప గుణము చూడండి.. Show all posts

Sunday, 6 January 2019

దానకర్ణుడు - ఎడమచేత దానము

దాన కర్ణుడు

https://cherukuramamohan.blogspot.com/2019/01/blog-post.html

కర్ణుడికి దాన కర్ణుడని గదా పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దుననే కర్ణుని 

భవనానికి వెళ్ళినాడట.

అప్పుడు కర్ణుడు అభ్యంగ స్నానానికి తయారవుతున్నాడు. తలకు నూనె 

రాచుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె 

నూనెతో వున్నది. కృష్ణుడు మాటలాడుతూ అటుఇటు చూస్తే ఆ రత్నాలు పొదిగిన గిన్నె 

కనిపించింది. కర్ణా ఆ గిన్నె చాలా బాగున్నది ఇస్తావా? అని అడిగినాడు. వెంటనే కర్ణుడు 

తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె

ఆలస్యము చేయకుండా ఇచ్చివేసినాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో 

యిస్తున్నావు? కుడిచేతితో కదా ఇవ్వవలసినది అన్నాడు. అందుకు కర్ణుడు

క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో: l

యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి: ll

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో 

తెలియదు. లక్ష్మి చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణం లో 

ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుండి ఆ చేతికి పోయే లోపలే ఏ 

మార్పయినా కలుగవచ్చు. అందుకే ధర్మ కార్యాన్ని తత్ క్షణమే చెయ్యవలెనను ఆర్యోక్తి 

ననుసరించి ఈవిధముగా చేసినాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు 

సంతోషించి ఏదైనా వరము కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు

దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా l

దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ ll

కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం. అంతే కాదు 

నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా 

నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించమని కోరినాడు.

దానము విషయము లో సదా సాత్వికమే ప్రధానము. చెయ్యాలనే సంకల్పం కలుగ గానే 

ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా 

తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి. దానం చేసి నేను చేసినానని డప్పు 

కొట్టుకోకూడదు. ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే 

చేసివేయవలసిందే! 

‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు కదా పెద్దలు. మనము కర్ణుడి లాగా వ్యవహరించ 

లేకపోయినా మన శక్త్యానుసారము గ్రహీత యొక్క పాత్రత తెలుసుకొని  దానం 

చేయుట అలవరుచుకొనవలెను.

ఇక్కడ దాగివున్న కర్ణుని గొప్పదనము మరొకటి గమనించవచ్చును. కృష్ణుడు 

కోరుకొమ్మన్నాడు కదా అని దురాశతో ఏదయినా కోరియుండవచ్చును. కానీ 

ఔచిత్యమునెరిగి కోరినాడు ఘనుడగు కర్ణుడు.

స్వస్తి.