Monday 18 October 2021

సమస్య మనది-సలహా గీతది-43

సమస్య మనది సలహా గీతది 43

https://cherukuramamohan.blogspot.com/2021/10/37.html


త్రికరణ శుద్ధిగా నేను ఒక్క పని కూడా చేయలేదు. స్వార్థము నా కనులుగప్పి యున్నది. 'చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష' అన్నదే నా మనస్తత్వము. చేయుచున్నది పాపమని తెలుసు, మరి నిష్కృతి లేదా!

 

సలహా: త్రికరణముల గూర్చి నీకు తెలుసునో లేదో నాకు తెలియదు. ఈ ‘త్రికరణము’ అన్న  పదమును యాదృచ్ఛికముగా వాడినావని భావించి  దానిని గూర్చి ముందు నాలుగు మాటలు చెబుతాను.

త్రికరణములు అనగా మనసు వాక్కు మరియు చేయు కార్యము. ఈ మూడు ఒకటిగా కలిపి చేసేపనిని త్రికరణశుద్ధిగా చేసిన పని అంటారు.

ఈ మాట ఎందుకు చెబుతున్నాడు అని అనుకోకుండా కాస్త ఓర్పుతో గమనించు. శ్రీమద్ వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ 34వ సర్గ లో 12 వ శ్లోకము  కృతఘ్నతా లక్షణమును గురించి ఈ విధముగా చెబుతుంది.

బ్రహ్మఘ్నేచ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా!

నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతిః!!

బ్రహ్మ హత్య చేసిన వానికి, సురాపానము చేసిన వానికి, దొంగతనము చేసిన వానికి, ఒక వ్రతము చేయబూని మధ్యలో ఆపిన వానికి ప్రాయశ్చిత్తము ఉన్నది కానీ, కృతఘ్నునకు  ప్రాయశ్చిత్తము లేదు.

అనగా నీవు చేసిన పాపములలో కృతఘ్నత లేనంతవరకూ నీవు ప్రాయశ్చిత్తమునకై ప్రయత్నించివచ్చును కానీ, నీకు మేలుచేసిన వానికి కీడు తలపెట్టనంతవరకు, నీకు స్వార్థము ఎంతవున్నా,  చిత్త శుద్ధితో దానినుండి విముక్తి పొందవచ్చును. దీనికి నీ నియము నిష్ఠ మిక్కిలి అవసరము. నియమము నిష్ఠ అన్నవి భగవదారాధనతో సమానము. భగవంతుని పూజలో త్రికరణములు ఏకీకృతం అయితేనే ఆ ఉపచారం అయినట్లు. నోటితో చెప్పిన మంత్రం, చేతితో చేసిన ఉపచారం, ఈ రెండింటినీ దర్శనం చేసిన మనస్సు  ఈ మూడూ ఏకీకృతం కావాలి. లేకుంటే పూజాపత్రి దండుగే! కావున నేను చెప్పవచ్చేదేమిటంటే నీ స్వార్థ ప్రయోజనముల కొరకు చేసిన నీ పాప కార్య ఫలమునుండి విడుదల పొందవలెనంటే  ముందు ఆత్మ విమర్శ ఆపై అన్యుల యందు ఆరాధనా భావము అత్యవసరము. నీ మేలు కొరకు ఎదుటి వానికి కీడు తలపెట్టకు.

 

వేలాది విధముల జన్మల సత్కర్మల ఫలితంగా లభించిన ఉత్కృష్ట జన్మ మానవ జన్మ. కానీ ఆ జన్మ తన కర్మ ఫలితము అనుభవించక తప్పదు. నీవు చేసిన పుణ్యకర్మ ఫలము ఎక్కువ మరియు పాప కర్మ ఫలము అంతకన్నా తక్కువ ఉండుటచే నీవు మానవునిగా నైతే పుట్టినావు. కానీ ఈ జన్మలో ఆ పాప ఫలితమును తగ్గించుకోవలసిన బాధ్యత నీదే! అందుకే మంచి వైపు మరలు. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయి. జన్మ పావనం కావాలంటే ఆత్మసాధన అవసరం. ఆ సాధన సదాచరణతో సిద్ధిస్తుంది. సత్సాంగత్యముతో వృద్ధిపొందుతుంది. దానినే ధర్మమార్గంలో సత్యాచరణ, సత్కార్య, ఆధ్యాత్మిక, అహింసాచరణగా అనేక విధాలుగా ఆచరించి విమలంగా వెలయించి మహాత్ములైనారు ఎందఱో నాటి మానవులు. మానవుడి జీవన సంపూర్ణ వికాస సద్గతికి, పునీత బుద్ధికి ప్రమాణమైన భగవద్గీతను లోకానికి అందించి మానవులను తరింపచేసినారు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడే సర్వాన్నిభరిస్తు సంసారమనే సమద్రాన్ని దాటించే ముక్తి దాత. పరమాత్మ ఈ సందర్భములో 3వ అధ్యాయమయిన కర్మయోగాములో ఒక మాట అంటాడు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున |

కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||               7-3

జ్ఞాపకముంచుము జ్ఞానేంద్రియముల

తోడుగమనసును దొరకబుచ్చుకొని

నిష్కామునివై నిలచితివంటే

నీదేజయమగు నిక్కము అర్జున

అర్జునా ! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. ఎంత గొప్ప మాటో గమనించు.

నీవుచేసే పనిలో, నీ పనికి సంబంధించిన సిబ్బందిని, చిన్న పెద్ద తారతమ్యములేక, బాధ్యతలప్పగించు. వారిలో నన్ను ఈపనికి తీసుకోనలేదే అన్న బాధ కలగకుండా చూచుకోవలసిన బాధ్యత నీదే!

ఇటుక ఇటుక కలిస్తే ఇల్లు తయారౌతుంది

నీటిచుక్కలొకటైతే నిండు సంద్రమౌతుంది

చేయి చేయి ఒకటైతే చేయలేనిదేముంది

అందరు ఒకటైనచో ఆనందం పండుతుంది

ఇది మనసులో ఉంచు. నీవు బాగు పడు, నిను నమ్మినవారి బాగుకు పాటుపడు. నీ మనసుకు వద్దన్నా ప్రశాంతత చేకూరుతుంది. నీవు జ్ఞానార్జనకు అడుగు ముందుకు వేసినట్లే! ఈ విషయములో భగవంతుదేమంతున్నాడో గమనించు:

అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః l

సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి l l  36-4 

Even if you are the most sinful of all the sinners you shall verily cross over all sin by the raft of knowledge.

 

పాపపు పనులకె పరిమితమైనా

పరిమితి గానక పాపము చేసిన

పశ్చాత్తాపమె ప్రాయశ్చిత్తము

బ్రహ్మ జ్ఞానమె పరమౌషధము   36-4 

తెలిసినది కదా! ఇటువంటి పనులలో ఆలస్యము కూడదు. ఈ వేదవాక్కు నీ మేజా పై ఉన్న గాజు ఫలకము క్రింద వుంచుకో!

సర్వేపి సుఖినస్సంతు

సర్వేసంతు నిరామయా

సర్వే భద్రాణి పశ్యంతు

మాకశ్చిద్దుఃఖభాగ్భవేత్

 అంతా సుఖించాలి, అంతా వ్యాధిరహితులు కావాలి, అందరూ శుభాలను చూడాలి,  ఏ ఒక్కడూ దుఃఖముచే బాధించబడరాదు. ఇంతకన్నా మంచిమాట వేరొకటి ఉండదు ఇది పాటించు. అంటా నీకు జయమే!

స్వస్తి.

1 comment:

  1. Very nicely expressed sir. One should clearly understand and practise doing good things and have a positive view on what he does and adopts. Thanks for the post.

    ReplyDelete