Thursday 30 April 2020

పిల్లలు - తలిదండ్రులు

                             పిల్లలు – తల్లిదండ్రులు

ఋజు మార్గములో నడిచే పిల్లల మరియు తల్లిదండ్రుల గూర్చి నేను ప్రస్తావించుటలేదు. అట్లు కాని కొన్ని  వాస్తవాలను గమనించుదాము. 
పెళ్ళయిన అనతి కాలములోనే ఒక శిశువు కలిగితేఆ శిశువు వయసు 2 సం. లోపు వున్నప్పుడు కొందరు దంపతులు సరసమైన తమ కోరికలనాపుకోలేక అసహ్యముగానో అసభ్యముగానో ప్రవర్తించుచుంటారు.

ఇది చాలా తప్పయిన విషయము . పిల్లలలో జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. వాళ్ళు గమనించినది ఆ వయసులో వ్యక్తపరచ లేకున్నా వయసు వచ్చిన తరువాత తమ జ్ఞాపకాలకు రెక్కలు సమకూర్చుకొంటారు. ఇంకొక జంట తరచూ పోట్లాడుకొంటూ

వుంటారు. అది కూడా ఆ శిశువు మనసులో నెలవైపోతుంది. పెరిగేకొద్దీ తాను విపరీతమైన 'అహం' తో సాటి వారితో తగవులాడుతాడు.

అదే ఒక గుడికి పోయినపుడు తల్లిదండ్రులు కాకుండా శిశువుతో 3,4 ధర్మాలు భిక్షగాళ్ళకు చేసే విధముగా చూడండి. పెద్దయితే వారిలో ఎక్కడ లేని దయ జాలి ఉంచుకొంటారు. సాటి మనిషికి సాయపడగలుగుతారు. ఆడపిల్లలకు మొదటిసారి తలనీలాలు తీయించిన తరువాత మరులా క్రాపులు కటింగులు లేకుండా చూడండి. పిల్లలకు చిన్న యసులోనే పరికిణీలు కట్టించండి. కాలకృత్యములు తీర్చుకొన్న వెంటనే స్త్నానము చేయించి మీకు తెలిసిన శ్లోకాలో పద్యాలో ఒక్కొక్కటిగా చెప్పించండి. ప్రతిచెట్టు అటు బీజము వల్లనైనా ఇటు గాలికో, ఎటూ గాకుంటే కాకి పిచ్చుకల ద్వారానో మొక్కగా మొలుస్తుంది. మొలిచిన తరువాత మనకు పరిశీలించే సమయము వుంటే మొక్క మంచిదా కాదా అని తెలుసుకొని దానిని వుంచటమో వూడపీకడమో చేస్తాము . మరి గమనించక పోతే ఏదోఒకరోజు ఆ చెట్టు గొడ్డలికెరగాక తప్పదు. మొక్క వంగుతుందికానీ మాను వంగదు కదా!

పిల్లలకు చిన్న వయసు లో తప్పక రామాయణ భారత నీతిచంద్రిక కథలు చెప్పండి, పెద్దలను ఇంటిలో వుంచుకొనేవాళ్ళు వారితో చెప్పించండి. ఇవికాక సమయస్పూర్తి, హాస్యము , మొదలగు గుణముల కాలవాలమైన కాళీదాసు, తెనాలి రామకృష్ణ కథలు తెలియజేయండి. ఈ కాలము పిల్లలకు అక్షర వ్యత్యాసాలే తెలియదు. మన భాష లోని అక్షరాలలో ప్రాణ మహా ప్రాణాలను గూర్చి పిల్లలకు ఈ కాలములో చెప్పేటప్పటికి చెప్పే వారి ప్రాణాలు పోతాయి. భాష నాశనమౌతుందన్న చింత రవ్వంత కూడా లేకుండా ఎంతో కాలము నుండి వస్తున్న భాషను కేవలము తమ పేరు ప్రతిష్ఠ కోసమే పాటుబడి, వున్న అక్షరాలలో కొన్ని తీసివేసియును, వాడుక భాష అన్న పేరుతోను, చనిపోయిన మహనీయులు చనిపోయి కూడా మనలను మన పిల్లలను చంపుచున్నారు. ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రుల మీద పడింది. తప్పక పిల్లలకు 'అమరము' ఆంధ్ర నామ సంగ్రహము' నేర్పించండి.ముఖ్యము గా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఆధునిక కవులైన 'శ్రీ శ్రీ' 'దేవరకొండ బాలగంగాధర తిలక్' లాంటివారి కవితల లోని కొన్ని పదాలు నిఘంటువును ఆశ్రయించనిదే అర్థము చేసుకోలేరు. దిగంబర కవితలు నగ్న కవితలు ఎందుటాకులైపోయినాయి. పచ్చగా ఎప్పటికీ ఉండేది కళ్యాణ సాహిత్యమే.

తండ్రి పిల్లలకు సినిమా కథానాయకుడు. అతనే ఆదర్శము. మరి ఆతండ్రి పిల్లలను పెళ్ళాన్ని పార్టీలని పబ్బులని, ఫంగ్షన్లని తీసుకు పోతున్నాడు. అవి చూసి పిల్లలు ఏమి నేర్చుకొంటారు అనే ఆలోచన వారికి ఉందా! సినిమా మంచిదయితేనే పిల్లలతో కూడా వెళ్ళండి. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకోవద్దు.ఒక కొడుకు ఈ విధంగా తండ్రి తో అంటున్నాడు.

పబ్బుకేగ వలయు పదివేలు నాకివ్వు

"తనయ! డబ్బు గాదు తగినబుద్ధి

నీకు వలయు " నన్న నీవద్ద యది లేదు

కలిగియున్న దడుగ గలుగుదనెను

ఆ స్థితి కలగకుండా చూచుకొనుట మంచిది.

కాస్త 7 నుండి 10 సంవత్సరముల లోపువారవుతునే ఆడ మగ తేడా లేకుండా ఆటలు మొదలు పెడతారు. సహవాసము మంచిదయితే పరవాలేదు. కాకుంటే? 'సహవాస దోషయా పుణ్య గుణా భవంతు' సహవాస దోషయా పాప గుణాభవంతు’ అన్నారు పెద్దలు. మరి ఎంతమంది తల్లిదండ్రులకు ఇవి గమనించే వెసలుబాటు వుంది. అసభ్యమైన అసహ్యమైన మన బుద్ధికి అనూహ్యమైన తిట్లను ఆడ పిల్లలు తమ ఆటలలో వాడుచున్నారు.

నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతూ ఉంది:

రాజవత్ పంచవర్షాణి దశ వర్షాణి  తాడవత్ l

ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్ ll

పుట్టినది మొదలు 5 సంవత్సరముల వరకు, అమ్మాయి గానీ అబ్బాయి గానీ రాజు వలె లేక రాణి వలె చూచుకోవాలి. తరువాత 10 సంవత్సరములు అదుపాజ్ఞలలో, అవసరమైతే కొట్టియైనా సరే, ఉంచుకోవాలి. ఆపై మాత్రము తల్లిదండ్రులు వారి సంతానముతో ప్రాణ స్నేహితుల వలె మెలగాలి. శాసించేది శాస్త్రము. ‘Science  ‘Subject to Change’. అందుకే పాశ్చాత్యులది ‘Moral Science’ , మనది ‘నీతి శాస్త్రము’.

ఇక ఇంట్లో శుభ్రత. ఇంటి పనులకు పెట్టుకొన్న పనిమనుషులు ఎంత శుభ్రముగా పని చేస్తారు అన్నది మీ ఆలోచనకే వదిలి మీరు చేసే పనుల గూర్చి ఒక మాట చెబుతాను. చాలా మంది ఇళ్ళలో mineral water పేరుతో వచ్చే నీళ్ళు త్రాగడానికి ,పిల్లలకు త్రాపడానికి అలవాటు పడినారు. అసలు అందులో ఏమి minerals కలుస్తున్నాయి ,అవి minerals అని అనవలెనా లేక అవి chemicals అనవలేనా! సాధారణమైన మంచినీరు త్రాపుటలేదే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెంపొందగలదా? ఇంట్లో అమ్మ తదితర పెద్దలు చేసే వంట కంటే hotel భోజనాలు అంత ఆరోగ్యకరమా? మీరిట్లు పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలను ఎట్లు పెంచుతారు అన్నది ఆలోచించుతున్నారా? అట్లని అసలు బయట తిండి తిననే వద్దు అనుటలేదు. ఎప్పుడో  ఒకసారి అంటే పరవాలేదు. ఎప్పుడూ అంటేనే వస్తుంది చిక్కు.
గతములో నేను వ్రాసిన పద్యము సందర్భోచితముగా దలచి మీముందు ఉంచుచున్నాను:

ఈ నాటి భోజనపు అలవాట్లను గూర్చి నేను వ్రాసిన పద్యము సందర్భోచితమని దలచి  మీ ముందుంచుచున్నాను. ఒకసారి గమనించండి.

పిజ్జాలు బర్గర్లు ప్రియ భోజనమ్మాయె 

మంచిజొన్నల రొట్టె మరుగు పడియె

నూడుల్సు ఫాస్తాలు నోరూరగా జేసె

సద్దియంబళులెల్ల సమసి పోయె 

చాక్లెట్లు కేకులు చాల ఇష్టమ్మాయె

వేరుశెనగలుండ వెగటుగలిగె

కెంటకీ చికెనేమొ కీర్తనీయంబాయె 

వంట ఇంటిన వంట మంట గలిసె 


వైను బ్రాందీల విస్కీల వరద మునిగి

స్టారు హోటళ్ళ కేగేటి సరళి పెరిగి 

పనికిమాలిన యలవాట్ల ఫలితమంది

ఆసుపత్రుల పాలైరి అధిక యువత 

 పిల్లలలో అతి తక్కువగా తాము చేసే పని తప్పా ఒప్పా అని తర్కించుకొనే వాళ్ళు కూడా వుంటారు. అప్పుడు వారు మంచి వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. కానీ ఈ విధమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా అతి చిన్న వయసునుండి పిల్లలకు చెబుతూ రావలసిన బాధ్యత తల్లి తండ్రులపై వుంటుంది.

ఒక చిన్న కథ చెబుతాను. అన్నివ్యసనాలూ కలిగిన ఒక రాజుకు ఇద్దరు కొడుకులుండేవారు. రాజ కుటుంబము కాబట్టి పెద్దవుతూనే ఎవరి భవనాలు వారికుండేవి. కానీ బాల్యములో తల్లిదండ్రుల వద్ద వుండేవారు కావున ఇరువురూ తండ్రిని పరిశీలించేవారు. పెద్దవాడు తల్లికి తెలియకుండా తండ్రిని ఎంతో జాగ్రత్తగా గమనించేవాడు. చిన్నవాడిని మాత్రము తల్లి గమనించి ఎంతో గోముగా తన తండ్రి చేసే పనులన్నీ చేయకూడనివి అని హెచ్చరించింది. బాలుని మనసులో అది బలంగా నాటుకుంది.

వారు ఇరువురు పెద్దవారై తమ తమ భవనాలలో ఉండజొచ్చినారు. రాజు తన కాలము ముగియ వచ్చిందని తెలుసుకొని మంత్రితో తన ఇద్దరు కొడుకులలో తగిన వారసుని ఎన్నమని మంత్రి తో చెప్పినాడు. సరేయన్న మంత్రి మొదటి కొడుకు వద్దకు పోయి చూస్థే తండ్రెంతనో తానంతగానే వున్నాడు. మంత్రి 'నీవు వ్యసనాలకు ఇంత బానిసవైపోయినావే రాజ్యమును ఎట్లు ఏలగలవు' అన్నాడు. అందుకు అతడు 'వేరే ఏమి నేర్చుకోగలను ఆ తండ్రిని చూసి' అన్నాడు.

మంత్రి రెండవ రాకుమారుని వద్దకు పోతే ఎంతో కళా కాంతులతో అలరారుచున్నాడు. మంత్రి అతనితో కూడా అదే ప్రశ్న అడిగినాడు. అందుకు ఆ రెండవ అబ్బాయి నేను తండ్రినుండి ఏమేమి నేర్చుకొనకూడదు అన్న విషయాన్ని నేర్చుకొన్నాను. ఇది నా తల్లి పెట్టిన భిక్ష అన్నాడు. తరువాత ఎవరు రాజైవుంటారు అన్న ముగింపు మీకు తెలిసిందే .

ఇంకా వ్రాయవచ్చు గానీ ఇదే ఎక్కువైనదని ఈ పద్యము తో విరమిస్తున్నాను.

పండు తేనె తెనుంగు ప్రాచి పోవగ జూచు

ప్రతిభ గలిగినట్టి ప్రభుత మనది

నన్నయ తిక్కన్న నాణెంపు కవితల

కాలాన గలిపేటి ఘనత మనది

శాస్త్రీయ సంగీత ఛాయ నాసాంతమ్ము

పడనీక కాపాడు పాట మనది

అలవలాతల కూడ అద్భుతమ్మౌకైత

యనుచు కొండాడేటి యాస్థ మనది

అమెరికా తప్పటడుగుల నడుగు లిడుచు

స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది

విల్వలకు వల్వలెల్లను విప్పివేసి

గంతులేయించు చున్నట్టి గరిత మనది

మనదు సాస్కృతి నంతయు మరచి పోయి

నాగారీకమ్ము కౌగిట నలిగిపోయి

తాతలను వారి చేతల త్రవ్వి గోయి

పాతి పెట్టితిమన బదుల్ పల్కగలమె

స్వస్తి.

 

5 సంవత్సరముల క్రితము వ్రాసిన ఈ వ్యాసముపై స్పందన ఈ దిగువ పొందుపరచినాను.
పూర్ణ చంద్ర రావు మంత్రాల
పూర్ణ చంద్ర రావు మంత్రాల kaani ee rojullo puttina 6 va nelalone crushlo cherchi thalli thandri office ki velthunnaru inka pillalaki thalli thandrulameeda  gouravam gaani peddalu cheppe maata vinaalani ela anpisthundhi

Ranga Prasadarao చాల చాల మంచి విషయాలు చక్కగా   వివరించారు...గురువుగారు శ్రీ గరికపాటి గారు చెబుతున్నట్లు.....పిల్లలందరికీ ఈ వేసవి సెలవల్లో భాస్కర సుమతి దాశరధి శతకాలు ప్రతి పదార్ధం వివరించి బట్టీ పట్టేలా చేస్తే కూడా బాగుంటుందని అనుకుంటాను... 

 Rama Devi Cheruku Ramamohanrao గారు మంచి విషయాన్ని పంచినందుకు, ధన్యవాదాలండి... కాని ఆచరించే వారు తక్కువ.. ఎవరిని తప్పు పట్టాలని కాదండీ... ఆరోగ్యమైన సంస్కారవంత మైన ఇంకో తరం కోసం ఎవరు ఆలోచించడం లేదు.. పిల్లలకి కావలసినవి ఇవ్వడం అంటే డబ్బుతో చేసేవే ఎక్కువ అదే వారికి సులువు.. మీరు చెప్పినవి చేయడానికి సమయం కావాలి.... అదే మా దగ్గర లేదు అనేవాళ్ళు కోకొల్లలు.... ఇదివరకు డబ్బు మాత్రమే సమస్య.. ఇపుడు మాత్రం డబ్బు కంటే సమయము లేకపోవడమే (లేదు అనడమే ) పెద్ద సమస్య..
Cheruku Ramamohanrao అమ్మా డబ్బు సమయాన్ని హరించుతూవుంది. కుబేరుని వాహనము మనిషి . ప్రక్కనే వున్నాడు పరమేశ్వరుడు(ఉత్తరము ప్రక్కన ఈశాన్యము) . కానీ దృష్టి ఆవైపు మరలదు .
దాసునిగా ఉన్నంతకాలము దండన అనుభవించ వలసినదేకదా. 'నా' నుండి 'మన' చేరవలేనంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరము .కష్టనష్టాలు వుంటాయి కానీ కడకు సంస్కృతి నిలిపిన సంతృప్తి మిగులుతుంది.
Krishna Murthy చాలా మంచి సందేశం ...వీటితో పాటూ వీలైతే ఏదైనా ఒక శతకం నుండి ఒక పద్యం కూడా అందిస్తే బాగుంటుందని నా కోరిక...నమస్సులు...
B V Narasimha Rao Ittanam Batti chettandi babu, Manchi toraga yekkadandi. Anta America vallu yekkuvai poyarandi. Machi Nearchu Kontea Manchidea.
శ్రీ లు పగిడి Good chala baaga chepparu.

Mohan Sandya Mana samskruti sampradayalu gurinchi chala bagachepparu. Pillalanu ela terchi diddali annavisayalu chala baga chepparu neti balale repati pavurulu. Andaru mella alochiste mana bharata mata garvapade navataram munu mundu chudagalamni cheputunna. Mee lanti valla bodanalu chala avasaram. Marinni manchi vakyalu telupagalarani korukuntunna.

No comments:

Post a Comment