Monday 1 July 2019

విద్యా వ్యవస్థ నాడు నేడు


విద్యా వ్యవస్థ నాడు నేడు


నేటి విద్యావ్యవస్థను గూర్చి తెలుసుకొనుటకు ముందు ఒకానొకనాడు ఈ దేశములోని విద్యావ్యవస్థ ఏవిధముగా వుండినది అన్నది గమనించుట ఎంతో అవసరము. అందుకుగానూ కాళీదాసు రచించిన ‘రఘువంశము’ నుండి ఈ ఈ శ్లోకమును ఉటంకించున్నాను. మరి రఘువంశమే ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు. ‘ఉపమా కాళిదాసస్య’ అన్న నానుడి ఉండనే వుంది. రఘువంశము సూర్యవంశజులు, సూర్య అంశజులు అయిన రఘువు మరియు ఆతని తండ్రి దిలీపుని గూర్చి ఎంతో సవిస్తారముగా తెలియజేస్తాడు మహాకవి. అటువంటి మహనీయుల చరితము వ్రాసే కావ్యములో తప్పక తన రాజు విక్రమార్కుని దేశకాల పరిస్థితులను కూడా దిలీపుని కాలమునకు అన్వయించి తెలుపుట అతిశయోక్తి కాదు. ఆ శ్లోకమును చూడండి.
ఆకార సదృశః ప్రజ్ఞా ప్రజ్ఞయా సద్రుశాగమః    l
ఆగమైః సదృశారంభః ఆరంభస్సదృశోదయః ll
దిలీపుని కాలములో ఆకారమునకు తగిన తెలివితేటలు, తెలివితేటలకు తగిన విద్య, విద్యకు తగిన ఉద్యోగమూ, ఉద్యోగమునకు తగిన ఫలితము, ఇవి తగిన విధముగా వంక పెట్టుటకు వీలులేనంత పొంకముగా ఉండేవి. అంటే అర్థము చేసుకోండి, ఒకనాటి మన విద్యావ్యవస్థ ఏవిధముగా ఉండేదో! మరి ఇంతటి మహార్దశకు కారణము ఏమిటి అన్నది మనము ఈ శ్లోకము ద్వారా తెలుసుకొనవచ్చును.
మాతా శత్రుః పితా వైరీ ఏన బాలో నపాఠితః l
న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకోయథాll
తల్లి, తండ్రి తమ పిల్లలకు తమ విద్యుక్త ధర్మముగా నెంచి తగిన విద్య నేర్పకపోతే ఆ శిశువు భవితకు వారే శత్రువులు. అట్టి మూర్ఖులు సభలో కూర్చున్నా హంసలనడుమ కూర్చున్న కొంగలాగా అవమానితుదౌతాడు. అందువల్ల ఎవరి బాధ్యత వారు నాడు విస్మరించక నిర్వర్తించేవారు. తల్లిదండ్రుల తరువాత గురువు యొక్క పాత్ర రంగములోనికి వచ్చేది. నేడు గురువులు లేరు. కేవలము శిక్షకులే వుండేది. ఈ శిక్షకులకు తాము చదివిన చదువులో తగిన విజ్ఞానము, సంస్కృతిపై అవగాహన, పిల్లల మనస్తత్వమును గూర్చిన పరిశోధన ఏమీ ఉండదు. ‘ఆడవాళ్ళ పెళ్ళో మగవాళ్ళ పెళ్ళో గాటి కాడ ఇంతేస్తే గతికొచ్చినాము’అన్నట్లు ఉంటుంది వారి బోధన. వారికి Fee ముఖ్యము, విద్యార్థి వికాసము కాదు. గురువునకు శిష్యుని మనోవికాసము ముఖ్యము. విద్యతో బాటు తన శిష్యుని ప్రయోజకుని జేసే బాధ్యత వుంటుంది. కానీ నేటికాలములో కూడా కొందరు, అందునా ప్రభుత్వోన్నత పాఠశాలలలో, నామీద గురుత్వము కలిగిన రమేష్, మహేష్ దంపతులు అనగా నలుగురూ విద్యార్థుల సర్వ విదొంనతికై పాటు పాడుచున్నారు. మరి నా ఎరుకలో లేనివారాలలో కూడా ఈ విధమైన బాధ్యతాయుత ఉపాధ్యాయులు ఉండవచ్చును. నాడు మహా మహా చక్రవర్తులు కూడా గురువు వద్దకు వస్తే తమ కిరీటము పాదరక్షలు ఆశ్రమము బయటవదిలి అణుకువను అందిపుచ్చుకొని అడుగు లోనికి వెయ్యవలసిందే! శ్రీరాముడు, బలరామ కృష్ణులు గురువుల ఆశ్రమములకుపోయి చదువుకొన్న వారే! వారి తండ్రులు Home Tuitions పెట్టించలేదు. అది గురువుయొక్క స్థానము.

కళలు, సంస్కృతి, విద్య ఈ మూడూ నిర్వహణ కోరుకొంటాయి, నియంత్రణ కాదు. నిర్వహణ నియంత్రణల మధ్య సురాసుర తారతమ్యమును గమనింపవచ్చును. నిర్వహణ తల్లివలె లాలించి బుజ్జగించి, లోతుపాతులను తలూపుతూ ముందుకు సాగుతుంది. ఒకవేళ తానూ చెప్పుటలో తప్పులున్నా సరిదిద్దుకొంతుంది. కానీ నియంత్రణ అట్లు కాదు. అంతా కర్ర పెత్తనమే! తాను పలికింది వేదము తాను కులికింది నాట్యము. ఇందులో తప్పులు మాత్రమే వుంటే పరవాలేదు, స్వార్థము ఉంటే ఆ కళలు, సంస్కృతి, విద్య అంతా నాశనమే! అందుకే విద్యా ప్రణాలికను ఒక విద్వద్వరేణ్య సంఘమును (connoisseurs of the faculty) ఏర్పాటుచేసి వారి కార్యాచరణను సూత్రబద్ధము చేయగల ఒక విజ్ఞుడైన అధికారి ఉంటే (Executive) అప్పుడు సక్రమమగు  నిర్వహణకు ఆస్కారముంటుంది. భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టుటకు నాడు చెన్నై లో శ్రీమతి రుక్మిణి అరండేల్ కళాక్షేత్రను ఏర్పాటు చేస్తే నేడు దానిని లీల శాంసన్ అన్న వ్యక్తి ఎంత నిస్తేజము చేసిందో గమనించండి.
 లీలా శాంసన్ సోనియా గాంధీ గారి అంతేవాసి మరియు ప్రియాంకా గారి పెళ్లి కాక మునుపు, ప్రియాంక వాద్రా గారి నాట్యాచారిణి. వారి అండదండలతో 2005 లో కళాక్షేత్ర అధ్యక్షురాలయిన తరువాత మన భరత నాట్యమునే క్రీస్తు నాట్యముగా మార్చిన వ్యక్తి. అవినీతి ఆరోపణలు,  అక్రమ నియామకాలు మరియు విచక్షణారహిత ఒప్పందాలు, ఏకపక్ష అవార్డులు,ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలతో కళాక్షేత్ర, సంగీత నాటక అకాడమీ మరియు సెన్సార్ బోర్డ్ లలో శామ్సన్  ఎన్నో అభియోగములను ఎదుర్కొన్నది. PK అన్న వివాదాస్పద మరియు హిందూమతమును కించపరచే చిత్రమునకు ఎటువంటి కత్తెరింపులు లేకుండా Clean Certificate ఇచ్చినది ఆమెయే! ఆమె చేసిన దారుణములకు, ఆమె ఆయా పదవులకు రాజీనామా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినది.

2006 లో, ఆమె భరత నాట్యము యొక్క ఆధ్యాత్మిక మూలాల తొలగింపును సమర్థించడం ద్వారా ప్రసార మాధ్యమాలను రెచ్చగొట్టింది.  శ్రీ శ్రీ రవి శంకర్ గారు దీనిని ఖండించడముతో ఆమె చేసిన సనాతన ధర్మ విరుద్ధమార్గములు దేశానికి తెలిసినాయి. ఈమె మన కళాసంస్కృతులకు చేసిన అన్యాయములను ఏకరువు పెట్టుట నా ఉద్దేశ్యము కాదు. ఇటువంటి నిరంకుశులకు మన కళలు, సంస్కృతి, విద్య లు ఆలవాలములైతే  మన భవితకు అంటే పిల్లలకు మనమందివ్వగలిగినది ఏమీ ఉండదు.
మిగిలినది మరొకసారి......
విద్యా వ్యవస్థ నాడు నేడు - 2
నాడు గర్గి మైత్రేయి మొదలగు వేదపండితులు, భర్తలకే సమయోచిత సలహాలనోసగిన, సీత, తార, ద్రౌపది మొదలైన విదుషీమణులు, ఆధునిక యుగమందున ఝాన్సీ లక్ష్మి, నీచముగా మీనా బజారులో ప్రవర్తించ బోయిన అక్బరును పడవేసి కంఠముపై కత్తి నిలిపిన రాజపుత్ర యువరాణి కిరణ్ దేవి, రాణీ రుద్రమ దేవి వంటి వీర వనితలు, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల ముద్దుఫళని, రంగాజమ్మ  వంటి విదుషీమణులు, MS సుబ్బలక్ష్మి, DK పట్టమ్మాళ్, వసంత కోకిలం, ML వసంత కుమారి వంటి సంగీత విద్వన్ మణులు కలిగిన ఈ దేశములో స్త్రీ స్వాతంత్ర్యము లేదా, స్త్రీలు విద్యావంతులు కాదా! ఒక నాటి సినిమాలలో లలిత పద్మిని రాగిణి అన్న తిరువాన్కూర్ సిస్టర్స్, వైజయంతి మాల, కమలా లక్ష్మణ్, మొదలగువారంతా శాస్త్రీయ నృత్యములో నిష్ణాతులు. మరి మన స్త్రీలను ఉద్ధరిస్తున్నట్లు కుహనా సంస్కరణ వాదుల ప్రేలాపనలు నిజముగా అర్థవంతమైనవేనా! మధ్య తరగతి కుటుంబీకులలో కూడా ఎందఱో అమ్మ గారు, అవ్వ గారు B.A, M.A. లు చదువక పోయినా ఎన్నో నీతికథలు, నియమ నిబంధనలు పిల్లలకు నేర్పించేవారు. నేదవి కనుమరుగై పోయినాయి.

విద్యా శిక్షణ నాడు: చదువుకు వర్ణ విచక్షణ లేదు. స్త్రీ పురుష భేదము గురుకులములలో లేదు. విద్యతో బాటు ఋజు ప్రవర్తన, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కట్టుబాట్లు బాధ్యత, సహనము సొశీల్యము, తమ తమ వృత్తులకు సంబంధించిన మెళకువలు నేర్పే వారు. విద్యలో  గణితము అందరూ నేర్చుకోనవాల్సిందే! ఖగోళము,  గ్రహ చారము, నక్షత్ర గమనము, జంతు వృక్ష భౌతిక శాస్త్రములు వారి వారి పరిమితులకు అనుగుణముగా నేర్పించేవారు. విద్యార్థుల మధ్య సహవాసమునకు వర్ణములు ఏనాడూ ఆటంకములు కాలేదు. బలరామ కృష్ణ సుధాముల మైత్రియే ఇందుకు తార్కాణము. ఇక పరిక్షలు, పిండి రుబ్బినట్లు విషయమును కంఠస్తము చేసి కాగితములపై కక్కే విధానము నాడు లేదు. ఆయా విభాగములకు సంబంధించిన ముఖ్య విషయములను చీటీలవంటి  కాగితములలో వ్రాసి చుట్ట చుట్టి ఘటిక (చిన్న మట్టి పాత్ర) లో ఉంచి ఆయా విద్యార్థులను అందునుండి ఒక చుట్ట తీసి అందు తెలిపిన విషయమును గూర్చి వివరణాత్మకముగా అడిగేవారు. అన్ని విభాగాములకు అదే పద్ధతి. 

ఇంకొక అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే ఈ గురుకులాలలో 300 మొదలుకొని 30,000 వేళా మంది విద్యార్థులు కూడా వుండేవారట. వెంటనే మనకు గుర్తుకొచ్చేది Section కు 20 మంది ఉండే Class Room. ఆవెంటనే మనము అనబోయేది ఇదంతా Trash అని.
కానీ నాడు ఇంత మందిని ఏవిధముగా నియంత్రించి చదువు చెప్పేవారో తెలుసుకోన్నారంటే మీరు నిర్ఘాంతపోక తప్పదు. 30 వేల విద్యార్థులున్న గురుకులములో 10 విభాగాలున్నాయనుకొందాము. అప్పుడు తరగతికి 300 మంది అవుతారు. ఆకా లములో రాజులు, ప్రముఖులైన ధనవంతులు ఎంతో వితరణతో భూదానము చేసేవారు ఆ విధముగా ఆ గురుకులమునకు ఒక 100 ఎకరముల స్థలము ఉండినదని అనుకొందాము. దానిని చాయా ఫల పుష్పములొసగు  మనోహర వనముగా తీర్చిదిద్దుట, అచ్చటి అధ్యాపక ఆచార్య గురు బృందముల పర్యవేక్షణలో, విద్యార్థుల  పని. కాబట్టి ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులు చదివేవారో గమనించండి. అసలు ఆచార్యుడు అధ్యాపకుడు గురువు అన్న మాటలకు వ్యుత్పత్తి అర్థములను ఒకసారి చూద్దాము.
నిరుక్తమునకు భాష్యకారుడగు యాస్కాచార్యులవారు 'ఆచార్య' అన్న పదమునకు అర్థమును ఈ విధముగా తెలియజేసినారు.
1. ఆచరతి ఇతి ఆచార్యః అంటే తసను ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు.
2. ఆచారం గ్రాహయతి ఇతి ఆచార్యః అంటే ఆచరించ వలసిన విధివిధానమును ఆచరింపజేయించేవాడు.
3. అచినోతి అర్ధాన్ ఇతి ఆచార్యః అంటే నిరంతరమూ తన శిష్యులకు తగు విషయ వివరములను సేకరించి     వారికి అందించేవాడు.
ఇక అధ్యాపకుడు అన్న మాటకు అర్థమేమిటో చూద్దాము. 'ఆపక' అన్న మాటకు అర్థము తీసుకు పోవువాడు అని. 'అధి' అంటే విశిష్ఠ స్థానము అని అర్థము. కావున అధ్యాపకుడు అంటే తన శిష్యులను ఒక విశిష్ఠ స్థానమునకు తీసుకుపోవువాడు అని అర్థము. అంటే నిర్ధారిత లక్ష్యమునకు తన చాత్రులను చేర్చువాడు అని అర్థము. ఆంగ్ల పదములలో ఇటువంటి వ్యుత్పత్తులకు తావు లేదు.
ఇక గురువు అన్న శబ్దమునకు అర్థమును ఒకసారి విశ్లేషించుకొందాము. గురుత్వము అన్నమాటకు సాంద్రత (Gravity) అన్న ఒక అర్థము వున్నది. సులభమయిన ఉదాహరణ ఏమిటంటే ఒక బియ్యపుగింజ సాంద్రత ఎక్కువగా కలిగి ఉంటుంది కానీ దానినుండి తయారయిన పేలము  చాలా తేలికగా ఉంటుంది. అంటే బియ్యపుగింజ లోని అణువులు ఎంతో దగ్గరగా చిక్కగా వుంటాయి అదే పెలము లో చాలా వదులుగా అవి ఉంటాయి. కావున గురువు అంటే అనేక విషయములను తనయందు కలిగిన ఒక సముద్రము వంటివాడు. విద్యార్థికి కలుగు ఏవిధమగు కష్టమును కూడా ఆతడు తీర్చే బాధ్యతను తీసుకొంటాడు. అందువల్ల ఆతను అసలు విద్యార్థికి గరిమనాభి(Centre of Gravity) అవుతాడు. శాస్త్రము గురువును ఈ క్రింది విధముగా నిర్వచించుతూ వున్నది.
గుకారస్త్వంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకః
అంధకార వినాశిత్యాత్ గురురిత్య భిదీయతే
గు’ అనగా అంధకారము, ‘ఋ’ అనగా దానిని నిలువరించేది అంటే ప్రకాశము. అంటే అజ్ఞానమును తొలగించి జ్ఞానభిక్ష నొసగేవాడు గురువు. ఆయనకు పాఠ్యాంశములతో నిమిత్తము లేదు. శిష్యునికి చేయూతనిచ్చుటకు ఎల్లవేళలా సిద్ధముగా ఉంటాడు. ఇంత అంతరార్థము కలిగిన ‘గురు’ శబ్దమునకు సమాన శబ్దమును మనము ఆంగ్లములో చూడగలమా!
పై మువ్వురికీ పురోదృష్టి పూర్వదృష్టి , అంతర్ దృష్టి (fore sight, far sight, in sight) నేటి Teachers లో కేవలము sight మాత్రము ఉంటుంది. వీరు చాత్రునియోక్క తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనముల గూర్చి యోచించుటయేగాక వానిని సాధించుటకు  తగిన వనరులపై తమ అంతః దృష్టినుంచుతారు.

ఇక తిరిగీ అసలు విషయమునకొస్తే ఆ 300 మంది విద్యార్థులున్న తరగతిలో  ఒక 15 మంది చురుకైన విద్యార్థులను ఎంచుకొనేవారు. వారి స్తోమతను బట్టి 1 నుండి 15 వరకు ఒక అనుక్రమణికను ఏర్పరచుకొనేవారు. అదేవిధముగా ఆ మిమిగిలిన 285 మందిని చదువులో వారి స్థాయిని బట్టి 15 విభాగాలు చేసేవారు. అప్పుడు ఒక్కొక్క విభాగానికి 19 విద్యార్థులు వుంటారు. అంటే ఈ కాలములో లక్షలు కట్టి చదివించే Corporate Schools లాగానే! అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థికి విలోమము (Inverse) గా, చదువులో  పూర్తి  వెనుకబడిన గుంపును (సమూహమును) ఒప్పజేప్పేవారు. అప్పుడు 15 వ వ్యక్తి మరియు ఆ 15 వ సమూహము మధ్యన ఆంతర్యము తక్కువగా వుంటుంది. అంటే మొదటివాడు తన సమూహమునకు అధ్యాపకుదౌతాడు 15వ వాడు తన గుంపునకు విమర్శకుడౌతాడు. వారు ఎక్కువగా చర్చలలో పాల్గొంటారు. వారి నాయకునికి కూడా సందిగ్ధత ఏర్పడితే తమ అధ్యాపకులు లేక ఆచార్యులవద్ద నివృత్తి చేసుకొంటారు. ఇంత సుగమమైన విధానము నేటి విద్యావిధానములో  చూడగలమా! 
మిగిలినది వేరొకసారి ........
విద్యా వ్యవస్థ నాడు నేడు -3
కాంగ్రెస్ మరియు జనతాదళ్ మంత్రివర్గములో ఉన్న ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ మన సంస్కృతిని, మన శాస్త్ర విజ్ఞానమును ఎంతగానో ప్రశంశిచుతారు. ఆయన గొప్ప వక్త. ముస్లిం అయి ఉంది కూడా మన ఇతిహాస పురాణములు చదువుట ఆయన జిజ్ఞాస. మనలో ఎంతమందికి ఆ పట్టుదల వుంది. ఆస్య గ్రంధిలో వ్రాసే అంశములనే చదివే అలవాటులేని మనము పురాణేతిహాసాలను ఏమి చదువుతాము. మనము జీవితమును Enjoyment కు అంకితము చేసిన వారము. విజ్ఞాన సముపార్జనాను Enjoyment గా తీసుకొన్నవారి విజ్ఞతకు నమస్కారము. ఈ విషయము అప్రస్తుతమేమో అన్న అనుమానము మీకు ఈపాటికే కలిగియుండవచ్చు. ఎందుకు చెప్పినానంటే మీరు కూడా శ్రీయుతులు ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ గారి లాగా అన్య మత గ్రంధములు, మన పురానేతిహాస శాస్త్రములు చదివితే మన సంస్కృతి విద్యావిధానము, సకల శాస్త్ర ప్రజ్ఞ తెలుసుకోన్నవారవుతారు. Gosip Columns చదివితే మనసు అల్లకల్లోలము చేసుకొనుట తప్ప ఆవగింజంత కూడా అవసరమైన విషయమును గ్రహించలేము. అందుకే ఈ విషయము తెలిపినాను.
తిరిగీ అసలు విషయానికి వస్తే మన పూర్వులను విద్యాపరముగా సంస్కృతి పరముగా నిర్వీర్యులను  జేసి మనలను వాజమ్మలా జేసినా మెకాలే ను గూర్చి చెప్పవలసియుంటుంది.  థామస్ బాబింగ్టన్ మెకాలే (25 అక్టోబర్ 1800 28 డిసెంబరు 1859) (లార్డ్ మెకాలేగా ప్రఖ్యాతుడు). బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనకాలంలో భారతదేశంలో ఆంగ్ల విద్యావిధానం ప్రవేశపెట్టడం వెనుక అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన తన  Minute on Education (1835) లో ఈవిధముగా చెప్పినాడు:
మనకు(బ్రిటీషర్లకు)న్న పరిమిత వనరులతో, మొత్తం ప్రజాసమూహాన్ని(భారతీయులు) విద్యావంతులను చేయడం అసాధ్యం. మనం ప్రస్తుతం, మనకు మనం పరిపాలించే లక్షలాది మంది ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పనిచేసే సమూహాన్ని, రంగులోనూ, రక్తంలోనూ భారతీయులైనా అభిరుచులు, ఆలోనలు, నీతి, మేధస్సులో ఆంగ్లేయులు అయిన సమూహాన్ని తయారుచేయడంలో అత్యుత్తమ స్థాయిలో కృషి చేయాలి.
మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ (1835).
ఆయన తన రిపోర్టులో ఇంకా ఏమి చెప్పినాడో ఆంగ్లములోనే యథాతథముగా ఉంచుతాను.
I have never found one among them who could deny that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia. The intrinsic superiority of the Western literature is indeed fully admitted by those members of the committee who support the oriental plan of education.
When we pass from works of imagination to works in which facts are recorded and general principles investigated, the superiority of the Europeans becomes absolutely immeasurable. It is, I believe, no exaggeration to say that all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the paltriest abridgments used at preparatory schools in England.
I doubt whether the Sanskrit literature be as valuable as that of our Saxon and Norman progenitors. In some departments-- in history for example-- I am certain that it is much less so.
ఈయన మనోభావమును ఆయనే చెప్పిన ఈ మాట వివరముగా తెలియజేస్తుంది.
"I am very much pleased that the nation seems to take such interest in the introduction of Christianity into India."
Thomas Babington Macaulay (1800-1859) whose life and work were interwoven with India.
భారత దేశము భారతీయులు అన్న విషయములపై ఆయన అభిప్రసయము 'Life and Letters of Lord Macaulay' అన్న పుస్తకము చదివితే అవగతము కాగలదు.
నిజానికి మెకాలే కంటే 12 సంవత్సరములకు పూర్వమే రాజా రామమోహన్ రాయ్ బ్రిటీషు ప్రభుత్వానికి, అప్పటి వరకూ వస్తూవచ్చిన సంస్కృత విద్యామాధ్యమానికి బదులుగా ఆంగ్లమాధ్యమాన్ని ప్రత్యామ్నాయ విదానముగా సూచించినాడు. ‘ఇంట్లోవాడు పెట్టేరా కంట్లో పుల్ల’ అన్న సామెతను రుజువు చేసిన మహానుభావుడు ఆయన. కాలానుక్రమముగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు  సంస్కృత గ్రంధాలను మన దేశము నుండి తరలించివారి  విద్యా విజ్ఞానములను సుసంపన్నము చేసుకొని మనకు ఆంగ్లమును అంటించినారు. ఇపుడు మన నుండి సంస్కృతము ద్వారా గ్రహించిన విజ్ఞానమును తిరిగీ ఆంగ్లమునకనువదించి వారి అద్భుత మేధా సంపత్తిగా మనకు అందించినారు. మరి రామమోహన్ రాయ్ మనకు ఆరాధ్యుడెటులైనాడు. ఆయన సతీసహగమనమును మాన్పించినట్లు చదువుతాము మన పాఠ్యాంశములలో . ఇందులోని నిజానిజాలు ఎంతో విస్తారముగా నేను వ్రాసిన ‘సరసరస’ అన్న వ్యాస సంపుటిలో తెలియజేసినాను.

ఇపుడు, అర్దాన్తరముగా అనుమానాస్పదస్థితిలో అసువులు బాసిన ఒక ఆదర్శప్రాయుడైన అమరపురుషుని గూర్చి అతి క్లుప్తముగా తెలుసుకొందాము.
రాజీవ్ దీక్షిత్ జన్మదినం 1967 నవంబర్ 30న  ఉత్తర్ ప్రదేశ్ లోని నాహ్ గ్రామము నందు  రాథేశ్యాం దీక్షిత్ , మిథిలేష్ కుమారి దంపతులకు జన్మించినాడు.
తల్లితండ్రుల సంరక్షణలో మాధ్యమిక విద్యను ముగించిన తరువాత 1994లో అలహాబాదుప్రయాగ లోని ఐ.ఐ.టి.ఇన్స్టిట్యూట్ లో బి.టెక్ చదివినారు. తరువాత ఐఐటీ కాన్పూర్ లో శాటిలైట్ కమ్యూనికేషన్‌లో యం.టెక్‌ చేసినారు. ఆపై  ఫ్రాన్స్‌లో టెలికమ్యూనికేషన్‌లో పిహెచ్‌.డి. చేసినారు. తరువాత ఒకప్పటి భారతీయ రాష్ట్రపతి అయిన ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్‌తో కలిసి సి.ఎస్‌.ఐ.ఆర్‌.లో శాస్త్రవేత్తగా కూడా కలిసి పనిచేయటం జరిగింది.
స్వామి వివేకానంద భారతదేశానికి  నూతన శక్తిని ఇచ్చిన  విధంగా తన ప్రసంగాల ద్వారా యువతలో దేశభక్తిని నింపి, నూతన శక్తిని, ప్రేరణను ఇచ్చి, భారతీయులలో ఏర్పడిన ఆత్మన్యూనతను, భావదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేసినారు. మాతృభాష పై మమకారముతో ఆంగ్లములో కాకుండా, విదేశాములలో కూడా హిందీలోనే మాట్లాడిన దేశాభిమాని. స్వదేశీ చికిత్స పేరుతో ‘చరకుడు’  'వాగ్భటుడు' మొదలైన మహర్షులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జన బహుళ్యంలో ప్రచారం చేసి, అల్లోపతిలో లక్షలు పోసినా నయం కానీ అనేక వ్యాధులకు సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు ఆయన.  రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పిణ వ్యక్తి. జీవితాంతమూ బ్రహ్మచార్యమునే అవలంబించిన శ్రేష్ఠుడు. ఆయన  జన్మించినది 30 నవంబరు అయితే, మరణించింది కూడా 30 నవంబరు కావడం విచిత్రము. 30-11-2010న ‘భారత స్వాభిమాన్‌’ ప్రచార యాత్రలో భాగముగా చత్తీస్‌ఘడ్‌ లోని బిలాయ్‌ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణించినారు.
ఈ విషయము ఈ వ్యాసములో అసంగతమని తలచేవారికి నా సమాధానము ఏమిటంటే అంత చదివి అంత హోదాలో ఉందికూడా వానిని తృణ ప్రాయముగా నెంచి దేశ యువత కోసం పాటుబడిన ఆ మహనీయుడు యువతకు ఆదర్శము కావలెనన్నది నా అభిమతము. అందుకే తేలిపినాను.


బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఏవిధముగా నాశనము చేసినారు అన్న విషయమును ఆయన భాషణమునకు తెనుగుసేత ఈ క్రింద పొందుపరచి ఈ వ్యాసమునకు భారత వాక్యము పలుకుతాను.
మిగిలినది వేరొక మారు.......
 విద్యా వ్యవస్థ నాడు నేడు - 4
ఈ విషయమై ఎంతో కృషిచేసి ఎంతగానో విషయసేకరణ గావించి అనుమానాస్పద స్థితిలో మరణించిన స్వర్గీయ రాజీవ్ దీక్షిత్(Social activist, Bharat Swabhiman Andolan) ఉపన్యాసము నుండి నాకు అవసరమైన  మేరకు అనువదించుకొని, నా అభిప్రాయములను జోడించి మీ ముందుంచుచున్నాను.
భారతీయ సంస్కృతిని నాశనము చేయుటకు థామస్ బాబింగ్టన్ మెకాలే అనే వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశానికి పంపించటము జరిగింది. మెకాలే భారతదేశమునకు వచ్చి దేశాముయోక్క పొడవెడల్పులు (బహుశ 18 సంవత్సరాలేమో!)  సంవత్సరములు తిరిగి survey చేసిన తరువాత ఒక Report తయారుచేసినాడు. దానిని British Parliament కు వినిపించినాడు. నేటికీ అది భద్రముగా వారి Records, దానిని Hansard అంటారు, లో ఉన్నది. దాని ముఖ్యమగు సారాంశము ఏమిటంటే భారతదేశ సంస్కృతి, విద్యా వ్యవస్థ ఇక్కడ ఉండే గురుకుల పాఠశాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశంలో ఉండే పాఠశాలలను అప్పుడు గురుకులములని పిలిచేవారు. 1835 లో మెకాలే ఆదేశముల మీదుగా 1500 మంది పరిశీలకులు మనదేశములోని లో విద్యా వ్యవస్థను గూర్చి క్షుణ్ణముగా తమ సర్వేక్షణమును నిర్వహించినారు. దానినుండి తెలిసినది ఏమిటంటే భారతదేశము యొక్క విద్యావిధానము గురుకులాశ్రమ పద్దతిలో నిర్వహింపబడుతూ వుంది. ఈ పాఠశాలల యందలి బోధనా విధానమును గూర్చి కూడా ఎంతో పరిశోధించినారు. ఆ మెకాలే Report లోని ఒక భాగము యొక్క సారాంశము ఈ దిగువన ఇవ్వబడినది.
Report ప్రకారము 1835 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక లక్ష 50 వేల కాలేజీలు/కళాశాలలు ఉండేవి. నేను అప్పటి British Land Revenue Records ను భారతీయ గ్రంధాలయ కార్యాలయము నుండి తీసుకుని 1853/1840 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో  మొత్తము ఎన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి అని తెలుసుకోవడానికి చూసినాను.  ఆ రికార్డుల ప్రకారము మొత్తం 1 లక్ష 57 వేల పల్లెటూళ్ళు మరియు ఒక లక్ష 50 వేల కాలేజీలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. అంటే సరాసరి చూసుకుంటే ప్రతీ ఊర్లో ఒక కాలేజీ ఉండేది. దాన్ని బ్రిటీషు పరిభాషలో చెప్పాలి అంటే Higher learning institutes అంటే చిన్న చిన్న పాఠశాలు కాదు. స్కూళ్ళ విషయానికి వస్తే ప్రతి ఊర్లో రెండు మూడు ఉండేవి. ఈ 1 లక్ష 50 వేల కాలేజీలలో (కాలేజీ అన్న పదము నేటి వ్యవహారములో ఉన్నది కాబట్టి పూర్వ నామములకు బదులుగా వాడుత జరిగినది.) ఏ ఏ విషయములను బోధిస్తున్నారు అన్న విషయమై వారు చేసిన సర్వే ప్రకారం 1500 శస్త్ర చికిత్స/సర్జరీ కాలేజీలు వుందినవట. ఇవి కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలోనివి మాత్రమే భారత దేశం మొత్తం కాదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీ కాలేజీలలో చదువుకునే వారు మంగల జాతి వారు. బ్రిటీషు వారి పుణ్యమా అంటు మన దేశంలో శూద్రులుగా వర్గీకరించిన కులాలవారలను చదువుకోనివ్వలేదు అన్న ఒక అపప్రథ మన దేశములో ఉన్నది. మరి మంగల జాతివారు  సర్జన్స్ అయినప్పుడు తక్కువ జాతి వారు చదువుకోలేదు, లేక చదువుకోనివ్వలేదు అన్నది అసంగతము కాదా! ! వారి సర్వే ప్రకారం ఆ కాలేజీలలో 70% శూద్రులు, 30% మంది బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విద్యను అభ్యసించేవారు. దీనినిబట్టి దేశములో విద్యావిధానములో ఎంత సామరస్యత ఉండినదో మనము అర్థము చేసుకొనవచ్చును.
ఇక్కడ రాజీవ్ దీక్షిత్ గారి మాటను పుష్టి చేస్తూ నేను ఒక చారిత్రిక వాస్తవమును తెలియజేస్తాను. హైదరాలీతో యుద్దముచేసి జనరల్ కూట్ పట్టుబడునపుడు అతనికి ఏమి శిక్ష విధించవలెను అన్న విషయమై సభలో, హైదరాలీ ప్రశ్నించగా చంపవలెనని సభాసదులు చెప్పగా ఆయన ముఖ్య మంత్రి ముక్కుకోయుట వధించుటకు సమానము, కావున ముక్కు కోసి పంపుదామని అంటే అట్లే చేసి పంపినారు. ఆ ఆంగ్లేయుడు తెగిన ముక్కును చేతబట్టుకొని గుర్రముపై నెమ్మదిగా వస్తూవుంటే, ఆతని స్థితిని చూసి ఒక నాగరికుడు, కూట్ చెప్పిన అవాస్తవ విషయమును నమ్మి అతనిని ఒక వైద్యుని వద్దకు పిలుచుకుపోతే ఆ శస్త్ర చికిత్సా నిపుణుడు ముక్కును యదాస్థానములో ఉంచి తెగిన నరములను సక్రమముగా అతికించి శ్వాస క్రియకు అంతరాయము లేకుండా చేసినాడట. ఆ వైద్యుడు మంగలివాడు. అసలు మగలము అంటేనే (సంస్కృతములో ‘ళ’ లేదు) శుభము అని అర్థము. ఆమాట నేడు ఉపయోగించకూడనిదైపోయింది.
ఇంకొక విషయము, మా అమ్మమ్మకు అమ్మమ్మ విధవరాలు. ఆ కాలములో మంగలివారిచె వారు గుండు గీయించుకొనేవారు. ఒకరోజు ఇంటికి మంగలి వచ్చిఉంటే ‘ఒరే! (వాత్సల్యముతో) నాకు శుక్లము వచ్చినది. నీకు తీరుబాటు ఉన్నపుడు వచ్చి తీసిపో!’ అన్నదట. అతను ఇంటికేవచ్చి ఆమె శుక్లము తీసివేస్తే ఆమె వద్ద ఆతను తీసుకొన్నది వక్క, ఆకు, ఒక పావులా(25 పైసలు). ఆ సామర్థ్యము ఆనాడు ఒక సాధారణ మంగలికి ఉండేది. ఈ రోజు అదేపనిని  Ophthalmic (Eye) Surgeon అన్న క్రొత్త నామకరణము చేసుకొని రూ.50 వేల చొప్పున ఒక్కొక్క కంటికి ఖర్చు చేయించుచున్నారు. శరీరముపై చర్మము తొలగించే శస్త్ర చికిత్స చర్మకారులు (మాదిగవారు) చేసేవారు. మనలను తప్పుదారి పట్టించి ఈ బ్రిటీషువారు ఎంతటి ద్రోహము చేసినారో గమనించండి. వర్ణములలో పెద్ద చిన్న లేదు. ఎవరి బాధ్యత వారిది. అంతే!
అసలు విషయానుకి వస్తే, రాజీవ్ దీక్షిత్ గారు ఈ విధముగా అంటూ ఉన్నారు. ‘ఆ సర్వేరిపోర్ట్ లోని ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలో ఉండే శూద్ర జాతి వారి చేతిలో గొప్ప టెక్నాలజీ/విజ్ఞానం ఉండేది. ఇది నా రిపోర్ట్ కాదు బ్రిటీషు వారి రిపోర్ట్. ఇప్పుడు కూడ మీరు మద్రాసు కు వెళ్ళి చూస్తే  "పెరియార్" అనే జాతివారు ఉంటారు. వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రిటీషు వారి సర్వే ప్రకారము మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే 2200/2300 Architect /భవన నిర్మాణ కాలేజీలలో  ఉపాధ్యాయులు/ఆచార్యులు ఆ పెరియార్ జాతి వారే. అక్కడ వాస్తు కళ, భవన నిర్మాణమును గురించి చదువుకున్నది పెరియార్ జాతి వారే. దక్షిణ భారతదేశము లో మనము చూసే ఆలయాలు  మీనాక్షిపురము, మదురై వంటివి అన్నీ పెరియార్లు కట్టించినవే. నిర్మాణ పరంగా చూసినా, డిజైన్ పరంగా చూసినా అటువంటి ఆలయాలను మనం ఉత్తర భారతదేశంలో చూడలేము. వాటన్నిటిని పెరియార్లు    కట్టించేవారు. పెరియార్లు అనబడే వారి పని మందిర నిర్మాణం. కాని 1890 తరువాత బ్రిటీషు వారు పెరియార్లను నాశనం చేయతం జరిగింది. ఎ. ఓ. హ్యూం అనే ఆఫిసర్ మద్రాస్ ప్రెసిడెన్సీ కి కలెక్టరుగా     ఉండేవాడు. ఆ అదికారంతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఒక చట్టాన్ని సృష్టించాడు. అప్పటిదాకా మందిర నిర్మాణం పెరియార్లు చేశారు కాని ఎ. ఓ. హ్యూం చట్టం ప్రకారం పెరియార్లు మందిర నిర్మాణం      చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. అలా పెరియార్లు మందిర నిర్మాణం చేయకుండా అపివేయటం జరిగింది. ఫలితంగా పెరియార్ జాతి వారు తక్కువ అవుతూ వచ్చినారు.      వృత్తి రీత్యా వర్ణ విభజన జరిగినది మనదేశములో! వృత్తి మెళుకువలు పారంపరీకముగా ఆ రోజులలో అందజేస్తూ పోయినారు. అందుకే బ్రిటీషు రానికి అగ్గిపెట్టెలో 9 గజముల చీరను ఉంచి ఇవ్వగాలిగినారు నాటి వస్త్ర శిల్పులు అనగా సాలేవారు. ఇది మనకు గర్వకారణము కాదా! నేడు అంతటి ప్రతిభ మన వారిలో వున్నదా! ఎవరు చూసినా చాతుర్వర్ణ విభజన మంచిది కాదు అనుట తప్ప ఇందులోని గొప్పదనమును గ్రహించినవారు ఎంతమంది. ఆమాటకొస్తే ఇది విద్య కాదా! మరి వీరిని నిరక్షరాస్యులుగా పరిగణించవచ్చా! బ్రిటీషు వారు ఈ విధముగా భారతీయ సమాజమును, భారతీయ విద్యావిధానమును  ఛిన్నా భిన్నము చేసినారు.  

(స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ ఉపన్యాస అనువాదము)     
మిగిలినది ఇంకొక సారి ............
విద్యా వ్యవస్థ నాడు నేడు - 5
ఇక నేటి చదువుల తీరు తెన్నులు చూస్తాము. మన దేశ విద్యావ్యవస్థను, నాటి ఆంగ్లేయ పరిపాలనా     వ్యవస్థలోని మన బలహీనతలను ఆసరా చేసుకొని  మన సమున్నత విద్యావిధాన ఆకాశ హర్మ్యమును  మెకాలే నేలమట్టము  ఎంతగా చేసినాడంటే ఈనాడు మన పిల్లలు భూతద్దము పెట్టివెదకినా   మూలములు ఏమాత్రమూ తెలుసుకోలేనంత. మరి తక్షణ కర్తవ్యము ఏమిటి అంటే విద్యా వ్యవస్థ యొక్క  పునర్నిర్మాణము. పడగొట్టుట సులభము కానీ కట్టుట ఎంతో కష్టమైనపని .  దీనికి ముఖ్యముగా ప్రభుత్వ   విద్యా యంత్రాంగమునకు కావలసినది చిత్తశుద్ధి, పరిశీలన, పట్టుదల. దానికి తోడుగా ప్రజల సహయోగము కలిసితే  మనము మన పూర్వ విద్యావిధానమునుండి ముఖ్యమయిన విషయములను అవసరమగు మార్పులతో గ్రహించవచ్చును. అసలు విద్యకే తలమానికమగు గణితము లోని మెళుకువలను నాటి గణిత శాస్త్రములో మనము ఎన్నియో చూడవచ్చును.
నేను పైన చెప్పిన విధముగా గురువు, ఉపాధ్యాయ మరియు ఆచార్యులకు ఎంతో విషయ పరిజ్ఞానము, బోధనా పటిమ, విద్యార్థుల లోని అవగాహనా సామర్థ్యమును గ్రహించగల్గుటకు తోడుగా తాము ఆచరణ యోగ్యము, అనుసరణ యోగ్యము అగు నైతిక ప్రవర్తన కలిగియుండుట మిక్కిలి అవసరము.
 దీనినిబట్టి ఆలోచించి నేటి బోధనా విదానముతో పోల్చితే, చదువులో లోపము ఉందని అనుటకంటే   చెప్పే విధానములో ఉంది అని అనిపిస్తుంది. సమాజాన్ని నాశనం చేస్తోంది విద్య కాదు, విద్యను ఏ సందర్భంలో, ఎలా అందిస్తున్నామన్నదే. విద్యార్థి బుద్ధి స్వచ్ఛమైన తెల్లగాగితము వంటిది. దానిపై వ్రాసే ప్రతి అక్షరమూ ఎంతో అందముగా ఉంటూ ప్రగతి హేతువగు  విషయానుక్రమనిక కలిగియుండుట ఎంతో అవసరము.
విద్య  మనుగడ కోసము మాత్రమే కాకూడదు. అది విద్యార్థుల ధృక్పథములను విశాలము చేయుటకు ఉపయోగపడితేనే తనకు, సంఘానికి, దేశానికి ప్రయోజనకారియౌతుంది. నేటి యువతలో విద్య ఈ ప్రపంచము  నుండి డబ్బులు పిండుటకు మాత్రమేనన్న ఒక నిశ్చితాభిప్రాయము ఏర్పడిపోయింది. మొదట, అత్యంత ప్రమాదకరమైన ఈ దృక్పథము మారవలసియుంటుంది.  అభివృద్ధిచెందే బాలునికి అత్యవసరమైన గుణములు 1. సమాజము లేక సాటి మనుషులపై ప్రేమ  మరియు విషమ పరిస్థితిని కూడా ఎదిరించి నిలువగల సాహసము. సాహసము అన్న మాటకు అర్థము మొండితనము మాత్రము కాదు. అతనిలో నరకమును కూడా స్వర్గమును చేయగల సామర్థ్యము పెంపొందాలి.
దేశంలో 67శాతం నిరక్షరాస్యులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరు తమ తమ వృత్తులలో సరైన నైపుణ్యం చూపలేకపోతున్నారు అన్నది పరిశీలకుల అభిప్రాయము. స్థానిక ప్రభుత్వములు ఆయావర్ణముల వారికి మొదట వారిలో ఒకవేళ ఏదయినా ఆత్మన్యూనతా భావము వుంటే దానిని తొలగించి, పారంపర్యముగా సంక్రమించిన విద్యలలో ప్రత్యేక శిషణ నొసగి, తోడుగా తగుమైను అక్షరాస్యత మరియు గణితమును  నేర్పించి, తగిన పనిముట్లను ఉచితముగానో, తక్కువ వడ్డీకో పొందువిధముగా ఏర్పాటుచేసి, న్యాయబద్ధమైన కంతులరూపములో పొందు విధముగానో వారి వారి సంఘముల ఒప్పుదల మేరకు, సహాయపడగలిగితే  మనదేశ హస్తకళలన్నీ కళకళలాడుతాయి.
 ఇక విద్య విద్యార్థులను గూర్చి ముచ్చటించుకొందాము. విద్యార్థి మొదటి దశలో ఆర్జించేదే ప్రాథమిక విద్య. ఈ దశ లోనే విద్యార్థికి అక్షర జ్ఞానంతో పాటు, వినయ విధేయతలు క్రమశిక్షణ, దేశభక్తి, దేశీయ వీరుల చరిత్రలు, మన ఋషి మునుల విజ్ఞాన సంపత్తి, విశ్వ మానవులకు వారు చేసిన నిస్వార్థ సేవ, ఆడర్శప్రాయులైన భారతీయ ఇతిహాస పురాణ ప్రసిద్ధులైన రాజుల చరిత్రలు, వారి గుణ గణ విశ్లేషణ, దేశమును ఏలిన మహా పురుషులై ఉండికూడా మన దేశ చరిత్రలో స్థానము నోచుకోని విక్రమార్క, భోజ, శాలివాహన, శంభాజీ,  గురు తేగ్ బహాదుర్ సింగ్ వంటి వారాలకు సంబంధించిన పాఠ్యాంశములను జేర్చి     పెద్దల పట్ల గౌరవం, వృత్తి  నైపుణ్యానికి సం బంధించిన మౌలిక విషయముల బోధన విధిగా పాఠ్యానుక్రమణికలో చేర్చాలి. కానీ ఇవ్వాళ ఈ విదానము అటు సంఘటిత విద్యా సంస్థలలో (Corporate Educational Institutions) గానీ   ప్రభుత్వ పాఠశాలల్లో గానీ ఇలాంటి బోధన జరుగుట లేదు. No root no fruit అన్న ఆంగ్ల సామెత మనకు తెలిసినదేకదా!
కాబట్టి ప్రాథమిక స్థాయి విద్యా విధానం సరిగా లేకపోతే ఉన్నత విద్యా విధానం కూడా పటిష్టంగా ఉండదు. నేడు మన దేశంలో యూనివర్సిటీలు రాజకీ యాలకు ఆలవాలమైపోయినాయి. ‘మొక్కై వగనిది మానై వంగదు కదా’.  శాంతి భద్రతలు లేకుండా కల్లోలభరితం గా ఉన్నాయంటే దీనికి ప్రధాన కారణం మన దేశంలోని స్వార్థ రాజకీయాలు, వారు సృష్టించిన కృత్రిమ సామాజిక పరిస్థితులే కారణము.

      కొన్ని రాష్ట్ర ప్రభుత్వములు ప్రాథమిక విద్యా దశ నుండియే కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రారంభించవలెనను  ఆలోచనలో ఉన్నవి. ఈ ఆలోచన అసంబద్ధమని ఈ వ్యాస రచయితనైన నా నిశ్చితాభిప్రాయము. ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలలో, ఇంచుమించు  1965 వరకు పాఠములు తెలుగు మాధ్యమములోనే చెప్పబడేవి. ఆంగ్లము ఒక భాషగా అభ్యసింప జేసేవారు. 1962 లో కళాశాల చేరిన నాటి మాజట్టు, ఒక నెల, రెండు నెలలు ఆంగ్ల మాధ్యమమునకు అలవాటు పడుటకు పట్టినా, ఆ తరువాత మాచదువు నల్లేరుపై నడచిన బండిలాగా సాగినది. అది మా గొప్పదనము కానేకాదు. అది మన మాతృ భాష మరియు దానికి తల్లియైన సంస్కృతము యొక్క గొప్పదనము. నేను చదివిన అదే కడపలో ముస్లిం ఉన్నత పాఠశాల ఉండేది. అందు వారు ఉర్దూ భాషగానూ మిగతా పాఠ్యాంశములన్నీ ఆంగ్లములో నేర్పించేవారు. కానీ వారిలో పది శాతము మంది కళాశాలలో చేరింటే ఎక్కువ. అంటే అవగాహన, అనువర్తన  అన్నది సంస్కృతాంధ్రములు ఉగ్గుపాలతో నేర్చుకొన్నవారికి అతి సులభముగా ఏభాషయైనా ఏ శాస్త్రమైనా అందుబాటులోనికి వస్తుంది. ఎటొచ్చీ ఏకాగ్రత మాత్రముఉండితీరవలసిన లక్షణము. ఈ రోజు మాకాలము వారంతా అటు తెలుగు లోనూ ఇటు ఆంగ్లము లోనూ చక్కని అభినివేశము కలిగి ఆయా భాషలలో చక్కగా మాట్లాడుటయేగాక అంతే చక్కగా వ్రాయగలుగుచునూ ఉన్నారు.
మిగిలినది ఇంకొకసారి...... 
విద్యా వ్యవస్థ నాడు నేడు - 6 (చివరి భాగము)

నేటి విద్యా విధానములో మొదట తెలుగు అక్షరమాలకు పునర్వైభవము సిద్ధింప జేయవలసి ఉంటుంది. ‘ఱ’ ను ఒకవేళ అందుబాటునకు తేలేక పోయినా ‘ఋ, ౠ’ లు ‘ళ’ ‘క్ష’ ‘శ, ష, స’ ళ సమయానుసార ఉపయోగము ఉచ్చారణ నేర్పించావలసియుంటుంది. ‘క’ కలు ‘ష’ వత్తు ఇవ్వవలసిన చోట ఏకంగా ‘క్ష’ వ్రాస్తూ వున్నారు. చంపడము తప్పించి బ్రతికిన్చాదము తెలియని హీన పరిస్థితిలో మనమున్నాము. అమరము, ఆంధ్రనామ సంగ్రహము, మన తెలుగుకు స్వంతమైన అనేక నీతి శతకములు పిల్లలకు నిత్యపారాయనము గావించవలసియుంటుంది. ఈ వయసులో పిల్లల బుర్ర ఎంతో చురుకుగా ఉంటుంది. ఇవన్నీ నేర్చుకొని తల్లిదండ్రులు పిల్లలను youtube ఎదుట కూర్చోబెట్టియైనా నేర్పించ వచ్చును. అసలు నేను మాకాలములో క్రెచ్చులు కేజీలు లేకుండా ఏకంగా 6వ తరగతిలో చేరినాను. ఈ కాలము, పిల్లల బెడద తప్పించుకొనుటకు వారి తల్లిదండ్రులు,  3సంవత్సరములకే లక్షలు కట్టి స్కూల్ లో బహుశ వేస్తున్నారేమో!
ఇక సంఘటిత విద్యా సంస్థల (Corporate Educational Institutions) ను గూర్చి మాట్లాడుకొందాము. ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రములను దృష్టిలో ఉంచుకొని ఈ విషయమును వ్రాస్తూ వున్నాను.
మన రెండు తెలుగు రాష్ట్రములలో భూమి అట్టడుగునకు వ్రేళ్ళూనిన Private Junior Colleges మరియు High Schools ఉన్నాయి. అందు ఫీజులు పేద, దిగువ మధ్యతరగతికి అందని పళ్ళు. ఇటువైపు ఈ కళాశాలలను రెండు రాష్ట్రములలో విస్తృతముగా నడుపుచూ గత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గములో ఈ కాలేజీలలోని ఒక కాలేజీ అధినేత మంత్రిగా కూడా ఉన్నాడు, మాయా బజారులోని ‘అదిస్వాహా, ఇది స్వాహా’ అన్న మాటను గుర్తుచేస్తూ. ఉత్త చేతితో మూర వేయటము మొదలుపెట్టి ఈనాడు ఊహకందని ఉన్నతమైన స్థితినిబొంది వేలకోట్లు గడించినాడు. ఆయన బహుశ ఆలోచించని విషయము ఏమిటంటే ఈ సంపదనంతా తనవెంట తీసుకుపోవుట లేదని. ఆనాడు నా ఈడువారు ఒక తరగతికి, ఒక సంవత్సరమునకు రూ.10 High School చదువుకు ఖర్చు పెట్టే వారు. మా కాలమునాటి Standard అన్నా ఉందా అంటే అదీ లేదు. తెలుగులో పూరు ఇంగ్లీషులో వీకు. తల్లిదండ్రులు ఖర్చు ఎందుకు పెట్టినారు అంటే దేవునికి తప్ప ఖర్చు పెట్టినవారికి తెలియదు.
ఇక ఈ కాలేజీలు అమాయకులను ఎట్లు దోచుకొంతూవుందో చూద్దాము. Intermediate Results వచ్చిన వెంటనే తాటికాయలంత అక్షరాలతో రెండు రాష్ట్రాలలో ఉండే మొత్తము విద్యాసంస్థలలో  కొన్ని లక్షలమంది చదువుతూ వుంటే వారిలో రాంకులు వచ్చిన ఒక 500 మంది పేర్లు రాంకులు News Papers లోadvertise చేస్తూ , TV లలో ప్రళయకాల మేఘ గర్జనలు బోలె అరుస్తూ వుంటారు. కానీ లక్షలు పోసి కూడా ఏ Rank రాని విద్యార్థులను గూర్చిగానీ,  రాక పోవుటకు గల కారణాలు కానీ తెలుపుతూ వున్నారా! అటువంటి ఏ  విద్యార్థి\విద్యార్థినుల తలిదండ్రులు ఆయా కళాశాలల యాజమాన్యమును నిలదీసి అడుగుతున్నారా! పిచ్చి పట్టిన విద్యార్థులను గూర్చి ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థులను గూర్చి మనము తెలుసుకొంటున్నామా! దశాబ్దాలుగా విద్య వ్యాపారమైపోయింది. విద్యా విలువలు దిగజారి పోయినాయి. ఆ కళాశాలలలో ఎన్నో విధములైన వివక్షలు, ఎన్నోవిధములయిన పక్షపాతములు ఎవరి చేవినయినా పడుతూ ఉన్నాయా! మరి ఈ తిని కక్కే చదువులకన్నా తినకుండానే ఉంటె మంచిది కాదా! లేక తిని అరిగించుకొనే విద్యను ఆలోచించరాదా!
కొత్తగా మోడల్ స్కూళ్లు పెట్టి కేజీ టు పీజీ విద్యా విధానం ప్రవేశపెడితే ఇప్పుడున్న ప్రాథమిక పాఠశాలలు నిర్లక్ష్యానికి గురవుతాయనే అభిప్రాయం ఉన్నది. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసినది ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పనిజేసే  ఉపాధ్యాయులకు  వేతనములు, పూర్వము వలె కాకుండా సంతృప్తికరముగా వస్తూవున్నాయి. కానీ వారిలో చెప్పవలేనన్న ఉత్సాహమును రేకెత్తించే విధముగా పాఠశాల  పర్యావరణము గానీ, తగిన  ప్రయోగశాలా సౌఖర్యములు గానీ, ఈ పరీక్షలలో తిని కక్కే విధానము కాకుండా తగు సంస్కరణలతో మన పూర్వ విద్యా విధానమును ప్రవేశ పెట్టుటగానీ, సర్వ శాస్త్ర సమన్వితమైన సంస్కృత విద్యా బోధనను  
పునః ప్రతిష్ఠించుటగానీ ఉమ్మడిగా ప్రవేశపెడితే కలిగే ఉత్తెజముతో ఉపాధ్యాయులు తప్పక తమవంతు కృషి  చేస్తారు.
ఉమ్మడి ప్రభుత్వాలు పాలనాపరంగా కానీ, బడ్జెట్ కేటాయింపు విషయాల్లో కానీ యూనివర్సిటీ,  కళాశాలల విద్యకు ఇచ్చే ఆదరణ, ప్రాముఖ్యం ప్రాథమిక, సెకండరీ విద్యలకు ఇవ్వలేకపోయినాయి. అందుకే ప్రాథమిక విద్యా రంగాన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు హస్తగతం చేసుకొని కావలసినంత సొమ్ము  చేసుకొన్నాయి, చేసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నేడు వాడ వాడలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం తెలుసుకొని ప్రభుత్వాధికారులు సరైన చర్యలు  తీసుకోవాలి. ప్రభుత్వమూ, విద్యాశాఖ సహాయ సహ కారాలు లేకుండా వీరు ఇంతగా విస్తరించడానికి అవ కాశాలు లేవు. మరో వైపు ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు, విద్యా వ్యాపారులు ప్రభుత్వ విద్యా  విధానాలనే ప్రభావితం చేసేంతగా ఎదిగిపోయారంటే అతిశయోక్తి కాదు. ప్రైమరీ స్కూల్ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి 25 వేలు మొదలు 50 లక్ష రూపాయల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఈ విద్యా సంస్థల్లో దోపిడీ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఉభయ రాష్ట్ర ప్రభుత్వములూ  ఈ విద్యావ్యాపారాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకో వలసిన అత్యంత అవసరం ఎంతైనా ఉన్నది. ప్రైమరీ, సెకండరీ స్థాయిలోని విద్యా వ్యవస్థలోని మూలాలను పెకిలించి సంస్కరించకుండా.. కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే దాని ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది.

విద్యావంతులయిన ఆరోగ్యవంతులగు దేశాభిమానము, దేశీయ శాస్త్రాభిమానము కలిగిన విశ్రాంత అధికారులు  తమ తమ గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఒక పాఠశాలను ను దత్తత తీసుకొని, అంటే సమయ పట్టిక (Time Table) ను కుదించియో లేక వారములో రెండు రోజులు అదనముగా భోజనానంతర మధ్యాహ్న సమయములో మనదేశ నిజ చరిత్ర, మన పూర్వుల శాస్త్ర వైదుష్యము, మన సంస్కృతము యొక్క గొప్పదనము, మన మహావీరులగు రాజుల చరిత్రలు, నాటి కవుల ప్రతిభావ్యుత్పత్తులు ఉత్సాహపూరిత రీతిలో పిల్లలకు తెలుపుతూవుంటే దేశ యువతకు, దేశ భవితకు ఎంతో మేలుచేసిన వారౌతారు. ప్రభుత్వము పైనే అన్నిటికీ ఆధారపడకుండా  ఈ జ్ఞానాన్విత వయోవృద్ధులు, తమ ధనమును వితరణతో కూడిన విధముగా ఖర్చుచేయ సంకల్పము కలిగినవారు,  ఆ స్కూళ్లలో ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు ప్రణాళికలు రచయించి నేరవేర్చవచ్చును. ఆవిధముగా కొంతకు కొంత దేశ ఋణమును కూడా తీర్చుకొన్నవారు కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనం విషయంలో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యంతో భోజనం పెట్టడం హర్షణీయం. విద్యార్థు లు మధ్యాహ్న భోజనం కోసమే స్కూల్‌కు వస్తున్నారం టూ ఆ మధ్య పలువురు చేసిన వ్యాఖ్యలు బీద విద్యార్థుల ను అవమానపరిచేలా ఉన్నాయి. వారినలా చిన్నచూపు చూడటం సరికాదు. నిజానికి ఇంకా మన సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నందుకు తలదించుకోవాలి.

దేశంలో ముఖ్యంగా గ్రామాల్లో, బస్తీల్లో, మురికి వాడ ల్లో నిరక్షరాస్యులు ఎక్కువున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో 67శాతం నిరక్షరాస్యులు ఉన్నట్లు లెక్క లు చెబుతున్నాయి. కాబట్టి వీరంతా ఓటు బ్యాంకు రాజ కీయాలతో మోసపోతున్నారు. ఇలాంటి స్థితి లో ప్రజా స్వామ్యం సరైన పద్ధతిలో వికాసం చెందడానికి గాను, వారికి, చిన్న చిన్న సభలను నిర్వహించి, తామేట్లు మోసపోతున్నాము అన్న విషయములు తెలియజేస్తే ఎంతో బాగుంటుంది. వారికి అవసరమైన మేరకు విద్యా బోధన చేసే ఆలోచనను కూడా చేయవలసిన అవసరము, దానిని ఆచరించవలసిన అవసరము ఎంతో ఉంది. అంతేగాక వీరు తమ తమ వృత్తులలో సరైన నైపుణ్యం చూపలేకపోతున్నారు. కాబట్టి అందుకు తగిన విధముగా నిరక్షరాస్యత శాతాన్ని గణనీయంగా తగ్గిం చేందుకు ప్రభుత్వ సహాయముతో  కృషిచేస్తూ, వారికి తగిన ఆధునిక ఉపకరణములను అందజేయుట మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును అందుబాటులోనికి తెచ్చుట అన్నవి చేయగలిగితే తప్పక దేశము పురోగమించుతుంది. దేనికయినా పట్టు వదలని పట్టుదల అవసరము. అలాగే విద్యార్థుల విషయములో కూడా ప్రాథమిక విద్యాస్థాయి నుండీ విద్యా ప్రమాణాలు ఉన్నత స్థితిలో  ఉండేలాగున చూడాలి. చదవడం, వ్రాయడం లాంటి నైపుణ్యాములతో  బాటు మన పూర్వులు నిత్యావసరముల విషయములో పరస్పర సహకారముతో ఏవిధముగా నడచుకోనేవారు అన్నది తప్పక తెలియజేయవలసియుంటుంది. ఉన్నతంగా ఉన్నప్పుడే ఉన్నత విద్యలో విద్యార్థులు రాణించగలుగుతారు.

వీలైనంత వరకు విద్యాబోధనను మాతృ భాషలో గరుపుటకు ప్రాధాన్యం ఇచ్చి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య ఇంగ్లీషులోనే విద్యాబోధన జరగాలని, అది మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరు స్తుందనే విధంగా చెప్పుకొస్తున్నారు. అది పూర్తిగా వాస్తవం కాదు. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం నేటి సమకాలీన పరిస్థితుల్లో అత్యవసరమే కానీ, అది లేని చదువు చదువే కాదన్నది మాత్రం అంగీకరించదగింది కాదు. ఏది ఏమయినా సమర్థ భారతము ఏర్పడుటకు  సమిష్టి కృషి ఎంతయినా అవసరము.

స్వస్తి.



No comments:

Post a Comment