Wednesday 31 October 2018

ఛత్రపతి సంబాజీ మహారాజ్


ఆరనివ్వను  జారనివ్వను భరత  భూమి  స్వరాజ్య జ్వాల
మ్లేచ్ఛ పాలన మాడిపోవును చూడుమిదె శలభముల లీల
సంబాజి
చరిత్ర అన్న పేరుతోభారతీయులమైన మనతో చెత్త చదివించి అయోమయము లోనికి నెట్టిన కుహనా చరిత్ర కారులు వ్రాసిన కట్టుకతలనే చరిత్ర అనుకొంటున్నాము. తన పేరుతోనే ఒక శకమునేర్పరచిన విక్రమార్కుని గూర్చి చదవము. ప్రశాస్తికేక్కిన భోజరాజును గూర్చి చదవము. అసలు ఆ మహనీయుడు తన కాలములోని రెండవ కాళిదాసు సహాయముతో 'రామాయణ చంపుఅన్న కావ్యమును వ్రాసినాడు. దానికి తోడు 'సమరాంగణ సూత్రధారఅన్న యుద్ధతంత్రయంత్రశస్త్రాస్త్ర సందోహమును వివరించు గ్రంధమును వ్రాసినాడు. 
పరమ పురుషులగు రాముడు కృష్ణుడు భూమిపై అవతరించి తాము దైవావతారులమని తెలియజెప్పిన ప్రభుత్వము వారి దైవత్వమునువారు ఈభూమిని పునీతము చేసిరన్న సత్యమునకు మద్దతుగా కనీసము మన రూపాయల కాగితములపై వారి ఊహా చిత్రములనైనా ముద్రించదు. మహా వీరాధివీరులయిన రాణా ప్రతాప్శివాజీటేగ్ బహాదుర్సంబాజి వంటి మహావీరుల చరిత్రను మనకు సవివరముగా తెలుపదు. 
పోనీ ఎవరైనా నాలాంటి వెర్రివారు చేతనయిన మేరకు ఆ మహనీయుల గూర్చి గానీ మన సాహిత్యమును గూర్చిగానీమన సంస్కృతి సంస్కారములను గూర్చిగానీ చదువరు.
ప్రజలను ధర్మమార్గామువైపునకు నడిపించవలసిన నేటి పురాణ ప్రాసంగికులకు రాముడు మధ్యము త్రాగినాడామాంసము తిన్నాడా అన్న విషయమును గూర్చి చెప్పుట ముఖ్యము. ఏ రామాయణమును చదివి ఈ మాటలన్తున్నారో ఆ రామాయనములోనే 'రామో విగ్రహవాన్ ధర్మఃఅని రాముని శత్రువాగు మరీచునిచే చెప్పబదినదని వ్రాయబడి వుంది. రాముని గోప్పదనమునస్కు అది చాలదా! మరికొందరు అన్య మతావలంబులు 'కృష్ణుడు పేడి కదా అంతమంది భార్యలెందుకు.
ఇటువంటి విషయములపై చర్చ అనవసరము. అట్టి విశాపూర్త వ్యాఖ్యలను అరికట్టవలేనంటే యువకులు మన ఇతిహాసములు (యదార్థ చరిత్రలు) చదివితే అపుడు సమర్థవంతముగా చర్చించగలరు.
సంబాజి ని గూర్చి తక్కువ మందికి తెలుసునని నా ఉద్దేశ్యము. అందుకే నాకు తెలిసిన మేరకు ఆయనను గూర్చి వ్రాయుచున్నాను. తప్పక చదివేది.

 ఛత్రపతి సంబాజీ మహారాజ్
శస్త్ర నిపుణుడు శాస్త్ర నిష్ణాతుడు అగు సంబాజి లేక శంభాజీ, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు మరియు వీరుడుమేరునగ ధీరుడువైరిజన విదారుడుసంస్కృత గ్రంధకారుడుఈయన ఆత్మగౌరవము దేశభక్తి నిజమునకసమానము, అనుపమానము, అనితర సాధ్యము.  
శివాజీ మొఘలులతో తలమునకలుగా యుద్ధము చేస్తున్న సమయములో, 16 సంవత్సరముల వయసులో 7 కిలోల బరువు కలిగిన కత్తితో రామనగర్ యుద్ధము న శత్రువులను జయించిన వీరుడితడు.
శివాజీ కి ముగ్గురు భార్యలు కాగా శంభాజీరెండవ భార్యయగు సాయీ బాయి పుత్రుడు. శంభాజీ జననము మే 14, 1657 న పురంధర్ కోటలో జరిగింది.
శివాజీ భార్య సోయరా బాయికి రాజారాం అనే కుమారుడు ఉండేవాడు. అతడు సంభాజీకన్నా 13 సంవత్సరములు చిన్నవాడు. అయినా సోయరాబాయికి తనకుమారుని ఛత్రపతి గావించవలెనను ఆశ అతిశయించి ఉండెడిది. దానికి తోడుగా అతి పిన్న వయసు, అంటే తన 2సం. వయసులోనే శంభాజీ తన తల్లిని పోగొట్టుకొనుటచే తన నాన్నమ్మయగు జిజాబాయి వద్దనే పెరగవలసి వచ్చింది.  స్వార్థమతియగు సోయరాబాయి శివాజీకి అవాకులు చవాకులు చెప్పి సంబాజీని తండ్రికి అన్నివిధములా దూరము చేసిందితన కుమారునికి పట్టము కట్టించవలెనను కృతనిశ్చయముతో! దానితో తండ్రీకొడుకుల నడుమ ఆంతర్యము పెరిగిపోయి సంబాజీకి కారగార శిక్ష విధించవలసివచ్చింది శివాజీకి.
రాజ్యాధికారము విషయమై తండ్రితో వచ్చిన ఈ తగాదా ఎంతగా ముదిరి పోయిందంటే, కారాగారమునుంది తప్పించుకొని సంబాజీ మొఘలులతో కలియుటయేగాక  ఇస్లాం మతములోనికి మారినాడు శంభాజీ.   
మిగిలినది వేరొక రోజు......
కానీ వారి దౌర్జన్యాలు, అత్యాచారాలు చూసి తానుచేసిన తప్పును గ్రహించి ఆచటినుండి తప్పించుకొని బయటపడినాడు. ఎంతయినా భారత భాగవతములను ఉగ్గుపాలతో తన కుమారుడు శివాజీ ని పెంచిన తల్లియే కదా శంభాజీ ని కూడా పెంచినది. స్వపరివారములోనే కలిగిన ఈర్ష్యాద్వేషాలు, పదవీ మొహాలు, క్షణికావేశాలు ఎంత విపరీత విపత్కర పరిణామములకు దారి తీస్తాయో చూడండి. జరగకూడనిది జరిగినా చివరకు దానివల్ల  ఇటు శివాజీ కి అటు శంభాజీ కి మేలే జరిగింది. కొడుకు ఔన్నత్యమును గుర్తించినాడు తండ్రి. తండ్రి ఆదర్శమును గ్రహించినాడు కుమారుడు. వారి అనుబంధము అటుపిమ్మట విడరాని బంధమై నిలచింది.
1666లో ఔరంగజేబు  తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా పంపిన ఆహ్వానమును మన్నించి ఆతనిని కలియుటకు,8,9 సంవత్సరముల వయసుగల  సంబాజి కూడా తండ్రి కోరికపై 125౦ కిలోమీటర్ల దూరము లోనున్న ఆగ్రా కు తండ్రి వెనకాల కూర్చుని పయనించిన ధృఢమనస్కుడు మన సంబాజి.
రాజ దర్బారులో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరచినాడు. ఇది సహించలేని శివాజి బయటికి కుమారునితో కూడా వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేసినారు.
ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నాదానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించినాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగినాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకుగుడులకుఫకీర్లకు పంపించే విధముగా ఔరంగజేబు నుండి అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీశంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన. సంబాజి తండ్రిని తప్పించి తానూ తప్పుకొన్నాడని కూడా అంటారు. ఒక మాట మాత్రము నిజము. సంబాజి బాల్యము నుండియే ఎంతో చురుకైనవాడు.
శివాజీ రాజధానిని చేరుకొన్నాడు కానీ శంభాజీ మొఘలుల బారిన పడకుండా, ఉజ్జయినికి దగ్గరగా, శివాజీ బంధువయిన రఘునాథ్ కోర్డే అను మంత్రి కి దూరపు బంధువు ఇంటిలో దాదాపు ఒకటిన్నర సంవత్సరము ఉండవలసి వచ్చింది.
రఘునాథ్ కోర్డే వాళ్ళు బ్రాహ్మలు.  ముస్లిములకు అనుమానము రాకుండా సంబాజీకి ఉపనయనము మధురలో చేయించి తమ ఇంటి బాలునివలె చూసుకోదొడగినారు.
ఏది ఎట్లయితేనేమి ఔరంగజేబుకు సంబాజి ఆ బ్రాహ్మణ అగ్రహారములో అజ్ఞాతవాసము చేయుచున్నట్లు తెలియవచ్చింది. వెంటనే తన దళపతికి కొంత సైన్యము నిచ్చి నిజము తెలుసుకొని సంబాజీని బంధించి డిల్లీ తేవలసినదిగా చెప్పి పంపినాడు. ఆతను ఆ అగ్రహారమునకు వచ్చి  ఆయింటి పెద్దను గద్దించి ఆయింటవున్న అనుమానాస్పదుడైన ఆ బాలుని గూర్చి అడిగినాడు. ఆ బాపడు కూడా ఎంతో నిబ్బరముతో ఆ బాలుడు తన కూతురి కొదుఇక్లని నమ్మబలికినాడు. బ్రాహ్మణుడు వేరొకరి ఎంగిలి, అది ఒకవేళ భార్యయే గానీ గాక, తిన కూడదు. అందునా అబ్రాహ్మణుని ఎంగిలి తినుట మహా పాతకముగా భావించుతాడు. ఆ విషయము తెలిసిన ఆ దళపతి ఒకే కంచములో భోజనము వడ్డింపజేసి ఆతను ఆ బాలుని కూడి భోజనము చేస్తే అప్పుడు నమ్ముతానన్నాడు. ఆ బ్రాహ్మణుడు తన నిష్ఠకన్నా రాజభక్తి గొప్పదని త్రికరణ శుద్ధిగా నమ్మి అట్లే కలిసి సంబాజి తో ఆరగించినాడు. బ్రాహ్మణులు అంత రాజ భక్తి గలిగినవారు. వారు ఏరోజూ తాము రాజు కావలెనని కోరుకోలేదు. తమ రాజు బాగుండవలెనని కోరుకోన్నవారే! చాణక్యునిలో కూడా మనము ఈ విషయమును గమనించవచ్చు. వచ్చిన దళపతి, సంబాజి వారి ఇంటి సభ్యుడేయని నమ్మి వెనుదిరిగినాడు.

మిగిలినది వేరొకసారి........
                              ఛత్రపతి సంబాజీ మహారాజ్- 3వ భాగము
ఉపనయనమయినందువల్ల సంస్కృతము, వేదవిద్య నేర్చుకొన్నాడు. ఆ అగ్రహారములో సంబాజి కి కవి కలశ్ తో పరిచయమైనది. ఆ పరిచయము ‘ఇంతింతై వటుడంతయై...’ అన్నట్లు ఆమరణాంతము పందిరికి అల్లుకొన్న తీగె వలె ఉండిపోయింది. సంబాజి 9 భాషలయందు పాండిత్యము సంపాదించి కవనముజేయు సామర్థ్యము కలిగియుండినాడని చరిత్రకారులు చెబుతారు. ఆయన సంస్కృతములో తన తండ్రిని గూర్చి ‘బుధా చరిత్ర’ అన్న గ్రంధమునే గాకుండా ‘శృంగారిక’ అన్న కావ్యమును కూడా వ్రాసినాడు. అదే విధముగా తన మాతృభాష మరాఠీ లోకూడా గ్రంధములను వ్రాసినాడు. అందుకే నేను ఆయనను గూర్చి చెబుతూ ఆయనకు శస్త్ర విద్యయేగాక శాస్త్రవిద్య కూడా కరతలామలకమని చెప్పినాను.
27 ఏళ్ళపాటు యుద్ధములలో గడిపి హిందూ రాజులకు ఆదర్శముగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యమును  నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 31680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించినాడు. అప్పటికి సంబాజికి 23 సంవత్సరముల వయసు. పట్టాభిషిక్తుడయిన వెంటనేతండ్రి పోయినాడని ఉదాసీనుడై ఉండిపోకఔరంగాబాదు పై దండెత్తినాడు. ఔరంగా జేబు సంపద ఎక్కువగా అందు దాచబడి ఉండినది. తన తక్కువ బలగాముతోఎక్కువ బుద్ధిబలముతో ఆ దండయాత్ర చేసినాడు. రాజ్యము నిలుపుకొనుటకు సంపదయే కదా ముఖ్యము. అది తెలిసిన ఔరంగజేబు తనకు ముఖ్యుడగు హుసేన్ అలీ ఖాన్ అను పేరుగల సేనాపతికి 20 వెల ఏనుగులు అంతకు మించిన గుర్రములుదానికన్నా ఎక్కువగా కాల్బలమునిచ్చి 2 దినములలో సంబాజిని పట్టి తెమ్మన్నాడు. చిటికే వేసి,అలాగే తెస్తానన్నాడు హుసేన్ అలీ. కానీ యుద్ధము ఒక సంవత్సర కాలము జరిగినా ఫలితము లేకపోయినది. హుసేన్ అలీ వెనుదిరిగినాడు. సంబాజి సంవత్సరముల కాలములో 12౦ యుద్ధములు చేసి ఒక్కటి కూడా ఓడిపోలేదని మరాఠా దేశములో చెప్పుకొంటారు. సంబాజి ప్రాణ సమానుడగు కవి కళశ్ ను తన ప్రధానమంత్రిగా చేసుకొన్నాడు. అతను మరాఠా కానందువల్ల తక్కిన మంత్రులు అసంతృప్తులయి వుండినారు. కుటిలుడయిన ఔరంగజేబు దన రాజ్యమును విస్తరించదలచి గోవా లోని పోర్చుగీసు వారితో ఒప్పందమునొకదానిని కుదుర్చుకొని తన నావలను దక్షిణమునకు మరలించి దానిని సంపూర్ణముగా వశము చేసుకోనవలేననుకొన్నాడు కానీ కుశాగ్రబుద్ధియైన సంబాజి అది తెలుసుకొని వారిని  జయించి ఔరంగజేబుకు అవకాశము లేకుండా చేసినాడు. 9 సంవత్సరములు, సంబాజి తిరుగలికి క్రింది రాయిగా తానుంటూ ఔరంగజేబును పైరాయిని త్రిప్పినట్లు త్రిప్పినాడు.
8లక్షల సైన్యము తో దక్కను ప్రాంతమునకు యుద్ధమునకు వచ్చిన ఔరంగజేబును అతి తక్కువ అనగా ఇంచుమించు  20 వేల  సైన్యముతో అమేయ బుద్ధిబలమును జోడించి ప్రతిఘటించి ఎన్నో యుద్ధములు గెలిచిన మహావీరుడు ఆయన. మరాఠాలో యుద్ధము జరుగుతూవుంటే ఉత్తరాభారతమునకు తనవేగులను పంపి అక్కడి రాజులను స్వతంత్రింపజేసిన అపర చాణక్యుడు. ప్రత్యేక విభాగమును ఏర్పరచి బలవంతముగా ఇస్లామును జేరిన వారిని తితిగి హిందువులుగా మార్చిన ఘనుడాయన. ఈ పని తన తండ్రి ప్రారంభించినా తాను చక్కటి పథకముతో ఆ కార్యమును నిర్వహించినాడు.

ఆయన తెలివితేటలకు ఇప్పుడు నేను చెప్పబోవు ఉదంతము ఒక గీటురాయి. 
అది తదుపరి భాగములో.....
     ఛత్రపతి సంబాజీ మహారాజ్- చివరి భాగము
ఆయన తన రాజ్యములోని ప్రముఖులయిన వడ్రంగులను, సాలె\దర్జీ వారిని సంఘటితము చేసి రబ్బరు కొయ్య, రబ్బరు పాలనుండి వస్త్రము తయారుచేయించినాడు. రబ్బరు వస్త్రము చాలా నెమ్మదిగా కాలుతుంది. కొయ్యతో బాణములు తయారు చేయించి. దానికి ఈ రబ్బరు గుడ్డను చుట్టించినాడు. బాణము ములికికి నూనెలో అద్ది విస్పోటక రసాయనమును అందులో ఉంచిన బట్టనుచుట్టి విల్లుకు సంధించి వదలితే అది కోటగోడలకు తగిలి విధ్వసమును కలిగించి శత్రువులకు ఊపిరి సలుపనీకుండా చేసేది. ఈ విధముగా సంబాజి ఎంతో చురుకైన బుద్ధితో వ్యవహరించేవాడు శత్రువులతో!
1689 వరకు మొఘలులతో జరిగిన ప్రతి యుద్ధములోనూ సంబాజి గెలిచినాడుకానీ తన ఆస్థానములోని చిక్కాదేవ్ రాయ్ అను ఒక సామంతుడు మొదటినుండి కూడా కవి కలశ్ ను ప్రధానిగా చేయుట అరిగించుకోలేక యుండినాడు. దానికి తోడు సంబాజి అతని మాటకు విలువనిచ్చేవాడుకాడు, కారణము అది మరాఠాల ఉద్యమమునకు వ్యతిరేకమై ఉండటమే! అదిగాక తన భార్య యొక్క ఇరువురు సోదరులు అధికార మదముతో వ్యవహరించినందుకు వారికి మాసిక వెతనమును నిలిపినాడు సంబాజి. వారి అనుయాయి గనోజీ శిల్కే  తో, సంబాజి మరియు కవికలశ్ సంగామేశార్కు పోతున్నారని వారిని గూర్చిన రహస్య సమాచారమును ఔరంగజేబు సేనానాయకునికి అందజేసినారు. ‘ఇంటిలోనివాడు పెట్టిన కంటిలో పుల్ల’ తో  సంబాజి మరియు కవి కలశ్ లు  బంధింపబడినారు.
సంబాజి కవి కలశ్ ల  సహవాసమునకు చక్కగా సరిపోవు నీతి శాస్త్ర నిర్వచనము చూడండి.
ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే రాష్ట్రవిప్లవే |
రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః ||
అది ఉత్సవమే కానీవ్యసనమే కానీదేశములో ఏర్ర్పడిన విప్లవమే కానీఅది ర్సాజసత్కారమేకానీస్మశానమే కానీ కలిసి వచ్చువాడే స్నేహితుడు అన్న మాటకు కట్టుబడిన మహనీయుడు కవి కలశ్. సంబాజి తో తానూ బందీ అయినాడు ఔరంగజేబుకు.
వారిరువురినీ ఒంటెలకు కట్టించి భయపెట్టి పౌరులచే వారి పై మలమూత్ర విసర్జన చేయించిన నీచుడు ఔరంగజేబు. చేతనయితే కట్లు విప్పి కలబడమి, లేకుంటే బందీగానే తల నరికి వేయమని గర్జించినాడు సంబాజి. ఈ సందర్భమున నాకు జ్ఞాపకము వచ్చుచున్న భర్తృహరి సుభాషితము యొక్క ఏనుగు లక్ష్మణ కవి తెనుగు సేత మీముందుంచుట భావ్యమని భావించి ఈ దిగువ తెలుపుచున్నాను. పరిస్థితుల ప్రభావము వల్లనే కానీ గాక ‘సింహము ఎన్ని కష్టనష్టాలు కల్గినా ఏనుగు కుంభస్థలముపైకెగిరి  దాని యొక్క మదముతో నిండిన మెదడు తినవలెనని మాత్రమే తలచుతుంది’ అన్నది ఈ పద్య సారము.
గ్రాసము లేక స్రుక్కిన జరాకృశమైన విశీర్ణమైన నా
యాసము నైన నష్టరుచి యైనను బ్రాణభయార్తమైన ని
స్త్రాస మదేభ కుంభ పిశిత గ్రహ లాలస కీలసాగ్ర హా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే?
సంబాజి, కవి కలశ్ విషయములో కూడా అదే జరిగింది. చిత్ర హింసలకు గురియైనాడు కానీ వానితో సంధికి ఒప్పుకొనలేదు. వాడు కోరిన మూడుకోరికలూ నిర్ద్వంద్వముగా నిర్లక్ష్యముగా త్రుణీకరించినాడు. ఆమూడు కోరికలూ 1. తాను ఓడినట్లు ఒప్పుకోవటం 2. తమ కోటలనుండి కొల్లగొట్టిన సంపద తిరిగీ ఇవ్వడము,  3. మిత్రులిరువురూ ఇస్లాం స్వీకరించటం.
ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతుl
 అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్ర తారకమ్ll అన్న భారత జాతీయ సంప్రదాయానికి కట్టుబడి ప్రాణములను సమర్పించుకొన్న మహనీయులు వారు.
ఆ మరణము ఎవరూ తమ పగవారికి కూడా కోరుకొనరు. ఆ దుష్టుడు వారి తోలు ఒలిపించి ఉప్పుకారము చల్లిమ్పజేసినాడు. గోర్లు మొదలంటా తీసివేయిన్చినాడు. వెంట్రుకలు ఒక్కొక్కటి పీకించినాడు. కళ్ళు పొడిపించినాడు. చివరకు వ్రేళ్ళు చేతులు ఖండింపజేసినాడు. ఇంతజరుగుతూవున్నా పంచాక్షరీ జపము మానలేదు వారిరువురూ! చివరకు విసిగి వేసారి చిరుతపులి గొర్లను తెప్పించి వానితో వారిని చీల్చి , గొడ్డలి తో సంబాజీ తల నరికించి పూణే వద్ద ప్రవహించే భీమానది ఒడ్డున విసరివేయించినాడు.
అసలు ఔరంగజేబు ఎంతటి దుర్మార్గుడంటే తన తండ్రికే  అంటే షాజహానుకు పెద్ద భార్య ద్వారా పుట్టిన దారా షికోవ్ తల నరికి, అప్పటికే కారాగారములో వున్న తండ్రి
అన్నము తినబోయే సమయములో తండ్రి పుట్టిన రోజు కానుకగా పంపినాడట. ఇప్పటికయినా నా కుమారునికి నాపై ప్రేమ కలిగినది అని భ్రమించి ఆ పెట్టె తెరచి తలనుచూసి తలక్రిందులై మూర్చపోయినాడట షాజహాన్.
అట్టి దురాత్ముని ప్రతిఘటించి ప్రాణము కోల్పోయిన మహనీయుడు సంబాజిని గూర్చి ఎంతమందికి తెలుసు. ఎంతమంది తమతమ తరగతులలో పాఠ్యాంశములుగా చదివినారు. అసలు ఇపుడు నేను వ్రాసి మీముందుంచినది  ఎంతమంది చదువుతారు. చరిత్ర అన్నది మన భవితకు కరదీపిక. చరిత్ర పాలవంటిది, దానిని పెరుగుచేసి మధించితే వచ్చేవెన్న మన భవిష్యత్తుకు నేతిని అందిస్తుంది. మరి నేయి కావలెనంటే పాలు వుండవలసినదే!

స్వస్తి.



6 comments:

  1. మనం చరిత్ర అందరికి తెలియచెప్పాలనే మీ తపన శ్లాఘనీయం చదివి ఒక like కొట్టి వూరకుండకుండ మా సదభిప్రాయం తెలిపితే ఎంతో సబబు అనిపిస్తుంది చదివిన అందరూ అలాగే వారి అభిప్రాయం తెలిపితే రచనకు సార్థకత వుంటుందని నా అభిప్రాయం PL write your comments

    ReplyDelete
    Replies
    1. చక్కటి మాట. అటువంటి ఒక చక్కటి ఆలోచనతో చదివితే నా కష్టము, తపన ఫలించినవని సంతసిస్తాను.

      Delete
  2. Nenu garwanga cheppukuney vyakthullo ithanu okarayyaru.
    Nijamga ituvanti mahaneeyula charitra memu chaduvukuntunna chaduvulo paatyamsamuga lekapovadam mana deshanikey avamanam guruvugaru.
    Ikapy ina ilantivi ippatikaina pusthakaalalo paatyamsamuluga cheristhey baaguntundani anipisthondi.

    ReplyDelete
  3. ఓం గొప్ప వీరుని జీవితం అద్భుతం..
    మీరు ఎంతో ఉపయోగకరమైన వాస్తవాన్ని అందించి నందుకు ధన్యవాదాలు...

    ReplyDelete