Sunday 20 May 2018

కలసి వుంటే కలదు సుఖం (తాబేలు కుందేలు)


కలసి వుంటే కలదు సుఖం (అహంభావము అనర్థ హేతువు)
తాబేలు కుందేలు కథ

https://cherukuramamohan.blogspot.com/2018/05/blog-post_20.html
ఇదేదో పాత సినిమా కథ వ్రాస్తున్నానని పొరబాటు పడవద్దు. ఇపుడు నేను చెప్పబోయే కథ పాతదే కానీ దానికి ఇంకా మూడు కోణములు చేర్చి మీకందిస్తున్నాను.  నేను ఉద్యోగములో వుండేకాలములో వ్రాసుకొన్న కథ ఈరోజు వేరు దేనికో వెదుకుతుంటే ఇది కనిపించింది. కష్టమయిన ముద్రించి మీకు పంచుచున్నాను.
ఇది తాబేలు కుందేలు కథ. ఒకసారి పునశ్చరణ చేసుకొందాము. తాబేలు కుందేలు పరుగు పందెము ఏర్పాటుచేసుకొని పరుగేడుతే, కుందేలు తన అహంభావము( EGO) వల్లనో తన పోటీదారుని నిర్లక్ష్యము చేయుటవలననో, లేక అలసట వలననో చెట్టుక్రింద కునుకు తీసింది. తాబేలు లక్ష్యము చేరువరకూ విశ్రమించలేదు. మనము సాధారణముగా ఈ కథ యోక్క నీతిని 'నిదానము ప్రధానము' గా చెప్పుకొంటాము. ఆంగ్లములో  'Slow and Study Wins the Race' అని చెప్పుకొంటాము. మరియిక్కడ Slow and Study మాత్రమే పనిచేసిందా! గెలుచుటకు. లేదు ప్రత్యర్థి బలహీనత కూడా ఇందుకు కారణము. ప్రత్యర్థి బలహీనత ఏమిటి? తనను సైఁ అన్నవానిని తక్కువగా అంచనా వేయటం, తనను గూర్చి ఎక్కువగా తలపోయటం. మరి రెండూ తప్పులే కదా! కావున నీతిని తిరిగి వ్రాస్తే నిదానము ప్రధానమయినా 'అహంకారము అధోలోకమునకు చేరుస్తుంది.’ ఈ కథ ఇక్కడ ఆగలేదు.
ఈసారి మళ్ళీ పందెము వేసుకొందామనింది కుందేలు తాబేలుతో! సరేనని సన్నద్ధమైయింది తాబేలు. ఈసారి కునకకుండా లక్ష్యమే ధ్యేయముగా కుందేలు ఎంతో ముందే గమ్యము చేరిపోయింది. అంటే ఇక్కడ నీతి ఏమి అంటే ‘పట్టువిడకు నీ సాధన ఫలియించును శుభ కామన.’ ఇక్కడ కుందేలుకు తన సామర్థ్యము తన బలహీనత తెలిసిపోయింది. అవి బేరీజు వేసుకొన్న పిదప పందెమునకు రమ్మన్నది. మరి యిక్కడ నీతి ఏమి? ముందు ‘అహాన్ని త్యజించు.’ తరువాత, ఒకపని చేయుటకు ముందు చేసి తీరవలెనను పట్టుదల ఎంతో అవసరము అన్న వాస్తవమును గమనించు. అది కలిగిన తరువాత తన శక్తి, బలహీనత, అవకాశములు, ఆటంకములు పరిగణించి పరిశీలించు ( ఆంగ్లములో దీనిని SWAT అంటారు. SWAT అంటే Strength, weakness, Opportunities, Threats అని).  రాబోవు స్పర్ధలో తన ప్రత్యర్థి బలమును, బలగమును అంచనా వేసి, తరువాత పోటీకి సైఁ అను. అప్పుడు ‘జయమ్ము నిశ్చయమ్మురా...’ అని నమ్మి విజయాన్ని సాధించవచ్చు.
ఈ కథ ఇక్కడికి కూడా అయిపోలేదు. ఈసారి తాబేలు పందెపు బాట మార్చి కుందేలును పందెమునకు కవ్వించింది. కుందేలు గెలిచిందికదా అందువల్ల ఏర్పడిన పరాకు చేత ముందు వెనుక ఆలోచించకుండా సరే అన్నది. పందెము మొదలైనది. స్వతహాగానే వేగముగా పరుగెత్తే కుందేలు తాబెలుకన్నా ఎంతో ముందు పోయింది కానీ దారిలో వచ్చిన  నదీ ప్రవాహము దానిని అడ్డగించింది. ఆలస్యమయినా తాబేలు అచటికి చేరుకొని నిశ్చింతగా నీటిలో ఈదుకొంటూ ఆవలి ఒద్దు చేరి గెలిచింది. మరి ఇక్కడ నీతి ఏమి? ‘అహంకారము అనర్థదాయకము. ’‘దేహబలము కన్నా బుద్ధి బలము గొప్పది’ ‘ నిలుపు నిదానముగా, ఒలుపూ వైనముగా చేసే పని ఎప్పుడూ అలుపూ ఆయాసము లేకుండా వుంటుంది’ . కావున అన్నిపనులకూ ‘అప్రమత్తత’ ఎంతో అవసరము.
ఈ కథకు ఇంకొక మలుపు వుంది. ఈ సారి ప్రత్యర్థులు ఇరువురూ ఒకటైనారు. లక్ష్య సాధన అన్నది కలిసి పనిచేస్తే సాధించుట సులభము, శ్రేయోదాయకము అని గ్రహించినారు. అందుచే తిరిగీ పరుగిడినారు కానీ నేలపై పరుగిడినంతసేపూ తాబేలు కుందేలు వీపును కరుచుకొనింది. ఏరు వస్తూనే కుందేలు తాబేలు వీపుపైనేక్కింది. ఇరువురూ గమ్యము చేరుటయే కాదు త్వరగా కూడా చేరినారు. ఎటువంటి వుడుదుడుకులూ లేవు. గమ్యము అవలీలగా ఇద్దరూ చేరుకొన్నారు. మరి ఇక్కడ నీతి ఏమి? మొదటిది ‘అహంభావము వదిలిపెట్టు.’ రెండవది ’బలగము పెరిగితే బలము పెరుగుతుంది.’ ‘చక్కనైన పథకానికి సాటిరాదు ఏదయినా!’ ‘పనిలోనే పరమాత్ముడు, పట్టుదలయె పరమావధి.’
కార్యదక్షతకు, ఇపుడు మీరు చదివిన ఈ వ్యాసము, ఆకళింపు చేసుకొంటే సులభమయిన సోపానము.
స్వస్తి.
చెరుకు రామ మోహన్ రావు

No comments:

Post a Comment