Tuesday, 9 January 2018

ఇడ్లీ దండకము

ఇడ్లీ దండకము
ఇడ్లీ మహా దేవతా నేను నీపైన ప్రేముముంచుతా నిన్ను వాంఛించుతా
భక్తి పూజించుతా భుక్తిగా నెంచుతా చట్నితో దంచుతా నిన్ను సాంబారు
లో ముంచుతా  పొట్టలో దించుతా కుక్షిలో ఉంచుతా బలములో మించు
తా, నాకు నీవున్నచో కేల ఆహారమింకేల  నిన్వీడ నే జాల లేదింక ఏ దూల
ఆపేసి ఈ గోల నె నిల్చి నీ మ్రోల వర్ణింతు నీ లీల ఏమందు నీ హేల ,
నేనొక్క పర్యాయమున్నీవు స్త్రీ లింగమా లేక పుంలింగమా యంచు
యోచించగా నీవు పుంలింగమే యంచు తోచింది ఏలన్నచో బ్రూస్లి పుంలింగ
మే, బ్రెట్ లి పుంలింగమే డడ్లి పుంలింగమే హాడ్లి పుంలింగమే బ్రాడ్లి పుంలింగ
మే, హిందు దేశంపు క్రిక్కెట్టు  కాప్టన్ను కోహ్లీది పుంలింగమే, కాంబ్లి పుంలింగ
మే, కుంబ్లె పుంలింగమే  వేరు ఇంకేమి కావాలి ఏ ప్రూఫు తేవాలి నన్ చేసి
నా, గేలి నీవేను నా మాలి నేనైతి నీ కూలి చూపించితే జాలి నే పోదులే తేలి
నీ మత్తులో తూలి నీవెంట నన్నుంచి నా ఆకలిన్ దీర్చి ఆరోగ్యమున్ గూర్చి
నన్ తీర్చి దిద్దేటి భారమ్ము నీదేకదా నేను నీ పుట్టుకన్ గూర్చి ఎంతెంత
యోచించినా నాకు నీ మూలముల్  గాన రావయ్యెగా నేను ఏరీతిగా నీదు
జన్మంపు మూలాలు కన్గొందు కాసింత కారుణ్యమున్ జూపి విన్పింపుమా నీది
ఏపాండ్యమో చోళమో ఆంధ్రమో లేక కర్నాటమో తెల్పుమా నిన్ను అర్థించె
దన్, నిన్ సమర్థించెదన్ నిన్ను గుర్తించెదన్ నాకు స్వప్నాన కన్పించి విన్పింప
గా, నిన్ను ప్రార్థింప నాసుప్తి లోస్వప్న మైవచ్చి నాతో రహస్యంబుగా నీవు
శ్రీ విష్ణు చక్రాంశ వై దక్షిణాదంతయున్ బ్రాకి మా చూపులో నీవు
స్మూతెస్టువై మాకు బ్రేక్ ఫాస్టువై వెర్వెరీ ఫాస్టువై డైలి లేటెస్టువై ఫర్రెవర్ బెస్టు
వై, డేటుడే  గెస్టువై, ఇంటి మస్టౌచు భాసింతు వీవంచెరింగించుచున్ నిన్ను
పొందంగ బాయిల్డు రైసున్ మరిన్ వుద్ది పప్పుల్ను త్రీ ఇష్టు వన్ రీతి నానేసి తెల్లారి రుబ్బేసి మూతెట్టి యుంచేసి రాత్రింబవళ్ళెప్పుడైనా తినే వీలు
గా, నుంచుచున్ నారి కేళంపు చెట్నీతొ తక్కాళితో వుల్లితో చేయు సాంబారు
తో, నల్లపున్ చెట్నితో మిరప చూర్ణంబుతో నెయ్యితో తిన్న నాకమ్ము తాకేసి రావచ్చు నిన్ గారెతో జేర్చి సాంబారుతో తిన్నచో మేరువెక్కేసినట్లేకదా నీదు 
గొప్పల్ని నేచెప్పగాలేను చూడంగ నేడేమొ నీరూపముల్ మారి కప్పిడ్లి కోనిడ్లి గ్లాసిడ్లి, స్వీటిడ్లి రవ్విడ్లి ఫ్లెక్సిడ్లి ఒట్సిడ్లి రాగిడ్లి కంచిడ్లి పన్సిడ్లి బెండిడ్లి చాక్లెట్టు ఇడ్లీగ వేర్వేరు ప్రాంతాల వేర్వేరు హోటళ్ళ వేర్వేరు వంటిళ్ళలో, నీవు వెల్గొందు చున్నావులే  రోగి  పత్యమ్ముగా ఇంటి నిత్యమ్ముగా లోక సత్యమ్ము ,గా పేద భత్యమ్ముగా  దైవ నైవేద్య మైయొప్పు నీకీర్తి కీర్తింప నేనెంతవాడన్, ఫ లాహార రాజాధిరాజా సదారోగ్య తేజా మదిన్నెప్డు తాజా హృదిన్ మ్రోగు 
బాజా జగత్ మే తు ఛాజా మెరే పాసు ఆజా మెరే దిల్ మే సోజా కరూఁ తేరి పూజా యటంచున్ మదిన్ నీకు మ్రొక్కేన్ సదా నిల్వ యారీ సుస్వాదిష్టకారీ మహారోగ్య ధారీ, సు పథ్యాల దారీ సు ధర్మానుసారీ నమస్తే నమస్తే నమః
చెరుకు రామ మోహన్ రావు

1 comment: