Wednesday 17 February 2016

మాననీయ మహా యోగులు—2

మాననీయ మహా యోగులు2
ఇట్టి జ్ఞానుల మహా నిలయమయిన మహిమాలయమే మన హిమాలయము. ఒకే ఒక శ్లోకములో ఈ హిమవన్నగము గొప్పదనమును వర్ణించుట ఒక్క కాళీ దాసు మహాశయునికే తగు. అటువంటి మహనీయుని Shakespeare of India అని పాశ్చాత్యులు అంటే ఆహా ఓహో అని మనము వారికి , సిగ్గు, లజ్జ, అన్నది మరచి వంత పాడుచున్నాము. కాళిదాసు క్రీస్తుకు పూర్వము దేశము నేలిన ప్రమర రాజయిన విక్రముని కాలము వాడు.   Shakespeare క్రీస్తు వెనుక 16, 17 వ శతాబ్దము వాడు. అంతగా వారు, వారి భారతీయ అనుచరులు పోల్చదలచుకొంటే Shakespeare ను Kalidasa of the west అని అనుకొమ్మని మనము ఉదారముగా చెప్పవచ్చు. ఇక విషయమునకు వస్తే    అనంత కాల్పనిక విరాజమానుడగు నా కవిరాజు  హిమాలయము మహాత్తునకే ఒక కొలదండమా అన్నట్లు  ఈ శ్లోకమును తన కుమార సంభవ కావ్యములోని మొదటి శ్లోకముగా అస్తు అన్న ఆశీర్వచనముతో ఈ వాస్తవాన్ని నుడివినారు. అందుకేనేమో ఆ పర్వతము స్వరూపమునే  గాక స్వభావమున గూడా దేవతాత్మయై విలసిల్లు చున్నది. ఇప్పుడు ఆ మహనీయుని మహిమాన్వితమైన ఆ శ్లోకమును విందాము.
అస్త్యుత్తరాణాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిదీ విగాహ్య స్థితః  పృథివ్యా ఇవ మాన దండః

ఉత్తర దిక్కున ఒక పేరు మోసిన పర్వత రాజమున్నది.  తూర్పు పడమరలకు విస్తరించి సముద్రాలలో చొచ్చుకునిపోయి నట్టి దేవతాత్మ గా భాసిల్లే ఈ మహా పర్వతము కొలదండముగా భాసిల్లుచున్నది. ఈ ఉత్తర దిశ దేవతల నిలయము. ఆ దేవతలా ఆత్మ ఈ పర్వతము. అంటే ఒక విధముగా ఇది అటు దేవతలకు ఇటు జ్ఞానులకు,ముముక్షువులకు, మహిమాన్వితులకు, మహాత్ములకు, మాననీయులకు ఆటపట్టు.
విశ్వ శ్రేయస్సే తమ ధ్యేయముగా హిమాలయ గుహలలో వుండి కుడా భగవంతుని ధ్యానిస్తున్న ఆ ముముక్షువులకు మన ఋణము ఎంత తీర్చుకున్నా తీరేది కాదు. వారిని గూర్చి వారితోనే తిరిగి ,స్వతహాగా తాను కూడా మహాయోగి యై తన అనుభవాలు చెప్పిన స్వామీ రామ వ్రాసిన Living With The Himalayan Masters ఆధారముగా చేసుకొని ఆ మహనీయులను గూర్చి మీకు తెలుప ప్రయత్నిస్తాను. ఇందులో నేను స్వామీ రామా ను గూర్చి కూడా నాకు తెలిసిన మేరకు వివరించుతాను. ఈ పుస్తకమును డాక్టర్ V.V. బాల కృష్ణ గారు కూడా తెనిగించినారు. విబుధ వరుల చేత విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేట పరచుటకు మీ ముందుకు వచ్చు చున్నాను.
మన కళ్ళ ముందు ప్రవహించే గంగను వదలి దాని ఒడ్డున ఉన్న గడ్డి మేస్తున్నాము మనము నిజానికి. అమృతోపమానమగు ఆ నీటిని మనసారా త్రావితే మన ఆర్తి తీరుతుంది. పావనమగు అలకనందను అందుబాటులో పెట్టుకొని పానకము కొరకు ప్రాకులాడనేల! అందుకే మనము స్వామీ రామా తో కలిసి హిమాలయములలో పయనించుదాము.
ఆయన అనుభవాలను ఆస్వాదించుటయే  గాక అవి మనవిగా చేసుకొని మన భవిష్యద్ పరంపర తో పంచుకొందాము. దివ్య భారత కీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపింపజేద్దాము. సకల సంపదలకు, విశ్వ శ్రేయోభిలాషులైన మహనీయులకు, కళలకు, మహర్షులకు, గణిత, ఖగోళ, జ్యోతిష, ఖనిజ, వాస్తు, రసాయన, భౌతిక, పరమాణు శాస్త్ర విజ్ఞాన సంపదకు ఆది  పునాది ఈ దేశమేనని సహేతుకముగా చాటుదాము. రేపు
స్వామి రామాను గూర్చి తెలుసుకుందాము
********************
స్వామి రామ జననం బ్రిజ్ , బ్రిజ్ కిషోర్ ధస్మానా లేక బ్రిజ్ కిషోర్ కుమార్ అన్న పేరుతో  గర్హ్వాల్  హిమాలయాలలో టోలీ అనే  ఒక చిన్న పట్టణంలో ఒక ఉత్తర భారత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. వారు గొప్ప భూస్వాములు. పిల్లలే లేరని తల్లడిల్లే  స్వామీ రామా తండ్రి  ఒకసారి హరిద్వార్ లోని మానస దేవి వద్ద ఒక గురువు గారిని దర్శించటము జరిగింది. భర్తను గానక రామా తల్లి ఉపవాస దీక్షను చేబట్టింది. స్వామి రామా తండ్రి తో గురువు, సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతూ అది సాధ్యపడుట అతని భార్యకు 43 , అతనికి 60   సంవత్సరాల వయసులో కొడుకు కలుగుతాడని చెప్పినా డాయన. చెప్పిన తరువాత రెండు సంవత్సరములకు ఆయన ఆ దంపతుల ఇంటికి వచ్చి. మీ కుమారుని నాకు ఇవ్వ వలసి యుంటుం దన్నాడు. నేను  కోరినపుడు మీరు ఇవ్వవలెనని చెప్పినాడు.  వారు కూడా సరే అన్నారు. రామా యొక్క తండ్రి మాకు పిల్లలే లేరే అని అంటూ మీరు చెప్పిన ప్రకారము పుడితే మీరు కోరిన విధముగానే ఇస్తామని అన్నాడు. సద్గురువు మాట రిత్త పోలేదు. ఆయన వచ్చి వెళ్ళిన 11/2 సంవత్సరమునకు ఆ దంపతులకు రామా కలిగినాడు. గురువు గారు ధ్యానములో అది గ్రహించి హిమాలయములనుండి వచ్చి బాలుని చూసి ఇప్పటికి బాలుని మీ వద్దనే వుంచి పోషించండి. తీసుకు పోవలసిన సమయము వచ్చినపుడు తీసుకు పోతాను అన్నాడు. ఆ గురువు గారిని బెంగాలీ బాబా అనీ బాబాజీ అని పిలిచే వారు . కానీ రామ మాత్రము గురుదేవా అని మాత్రమె సంబోధించేవారు. అసలు రామా కు తలిదండ్రులకన్న గురుదేవులే మిన్న. తల్లి ‘నీవు ఎప్పుడో ఒకరోజు మమ్ము వదలి వెళ్ళుతావు’ అని విలపించేది . వయసులో పెద్దవారైన  రామ  తలిదండ్రులు ఎక్కువ కాలము బ్రతుకలేదు. రామా ను గురువు తనతో తీసుకొని పోయినాడు. అప్పటి నుండి హిమాలయమే ఆయనకు నిలయము.




No comments:

Post a Comment