Monday, 4 July 2016

జయ ఉగాది అనుగ్రహ భాషణ

 జయ ఉగాది అనుగ్రహ భాషణ
సద్గురు శివానంద మూర్తి గారు
జయనామ సంవత్సరం అందరికీ నిరంతరం జయకరం, శుభకరం కావాలి. పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. దేశంలో, ప్రపంచంలో పాడి పంటలు, వర్షాలు, పాలకులు, పరిపాలన గురించిన రాబోయే సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వింటాము. రాజు, మంత్రి, సేనాని ... మొత్తం పరిపాలకమండలి ఎలా ఉంటుంది? దేశపు పరిపాలకమండలిని మనం ఎన్నుకుంటాము. ప్రజా ప్రభుత్వములో మన ఎన్నికకు తగినవారు మనని పాలిస్తారు. అలాగే సృష్టిలో సృష్టి కర్తయైన ఈశ్వరుడు, అనేక దేవతలు, గ్రహాలు. వీని స్థితిగతులు పంచాంగము ఇస్తుంది. ఈశ్వరుడే కాల స్వరూపము. కాలోస్మి అని చెప్పినవాడు ఆయన. ఆయన పరివారంలోని దేవతలు పాలకులు. ప్రజలు తమ పుణ్య పాప కర్మలతో ఫలాలను వ్యక్తులుగా, సమూహంగా తామే తెచ్చుకుంటారు. దేవతలు కేవలము కర్మ ఫలాలను ఇచ్చే ఉద్యోగులు. వారి కంటే మన సమీపవర్తులు గ్రహాలు. మన సూర్యమండలంలో భూమివలెనే గ్రహాలు కూడా మనతోపాటు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. కర్మను బట్టి ఫలములను ఇవ్వడం వారి ఉద్యోగ విధి. అందుచేత శనికి శాంతి చేయించే ముందు, ఈశ్వరుని పూజించాలి. జీవుల కర్మను బట్టి ఫలములను నిర్ణయించేవాడు దైవము (విధి). నేను సత్కర్మలేచేస్తాను. ధర్మమునే సర్వకాలములలో ఆచరిస్తాను అనేవానికి శుభాలే వస్తాయి. అతడు స్వతంత్రుడు. ఈశ్వరుని ప్రత్యేకం ప్రార్థించవలసిన పనేలేదు. కాని ఈశ్వరుడు సృష్టిలో జీవులకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వివేకము, పుణ్యపాపాలు చేయడానికి స్వేచ్చ ఇచ్చాడు. పాపకర్మలమీద ఆసక్తి, చేసే స్వేచ్చ ఇవ్వడం వలన మనుష్యుడు పాపంచేస్తూనే , నాకు శిక్షలేకుండా చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. వివేకం, సద్బుద్ధి (discretion) ఉంటే పాపాలు చేయకుండా ఉంటాము. భగవంతుని పశ్చాత్తాపంతో వేడుకుంటే ఆయన కర్మ ఫలాలను నియంత్రింపగలడు. వేద పురాణ గాథలు ఇవి చెబుతాయి. మనం సామాన్యులం. మన జీవితకాలమంతా సంసారంలోనే గడచిపోతుంది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ సమస్యలు, దీనితోనే కాలమంతా గడిపిన మనం, మనకోసము, మన ఉత్తరగతుల కోసం ఏమిచేసుకుంటున్నాము? మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రమేనా? దీనిలో సారం ఏమున్నది? ఈ శుభేచ్ఛవచ్చినప్పుడు మనకు మార్గంకావాలి. పురాణాలు మనకు పెద్దమిత్రుడు. మార్గం చూపించేందుకు గురువు కావాలి. మనుష్యరూపంలో ఉండక్కరలేదు. ఆ జగద్గురువైన శ్రీకృష్ణునే గురువుగా భావించవచ్చును. ఆయన చెప్పిన భగవద్గీతవంటి ఆప్తవాక్యము మరొకటిలేదు.
ఈ సంవత్సర పంచాంగ విశేషాలు చూద్దాం. గ్రహ బలం. జ్యోతిష్కులు చెబుతారు వింటాం. మళ్ళీ అడగం కదా. verify చేసుకోము. అందుకు బ్రతికిపోతున్నాము.
ఇక్కడ కాలాన్ని గురించి ఆలోచించాలి. మంచికాలం, చెడు కాలం ఏమిటి? భీష్ముడు 49 రాత్రులు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ ఎందుకు నిరీక్షించాడు? అతడు అష్టవసువులలో ఒకడు. శాపవశాన భూమిపై జన్మించాడు. స్వచ్ఛంద మరణమనే వరం ఉన్నది. ధర్మం బాగా తెలిసినవాడు. అంటే అంపశయ్యను ప్రాయశ్చిత్త వేదిక గా మార్చుకున్నాడు. అధర్మము కొన్ని విషయాలలో చేశాడు. అధర్మం వైపు నిలచి యుద్ధంచేశాడు. ధర్మాత్ములైన పాండవుల సేనలో అధికభాగాన్ని తానే నాశనం చేశాడు. 180 సంవత్సరాల వృద్ధుడు. ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తే తన క్షాత్రధర్మం నిర్వర్తించలేదు. దుర్యోధనుని కొలువులో ఉన్నామనేది కుంటి సాకే. అలాగే ద్రోణుడు. ఉత్తమ బ్రాహ్మణుడే. తపశ్శాలి. దుర్మార్గుడైన పుత్రుడు అశ్వత్థామ ఉండడం అతని దౌర్భాగ్యం. నిద్రిస్తున్నవారిని హత్య చేశాడు. సామాన్యుడి పాపపు శిక్ష వాడికే పడుతుంది. పెద్దలు, పాలకులు, ఉన్నత వర్గాల వారి పాపాలు సంఘాన్ని నాశనం చేస్తాయి. దేశానికి అరిష్టం. ఈ కాలంలోనే కలియుగం ప్రారంభమైనది.
ఈ వివేకం, విచక్షణ ఉన్నవాడే భారతీయుడు. భారత కాలం నుండి సంప్రాప్తించిన పాప ఫలమే దేశాన్ని ఇక్కడకు తీసుకొనివచ్చినది. ఈ సంవత్సరము మన దేశం ఏలా ఉంటుంది? అనే దానికి జ్యోతిష్కుల వచనాలు విందాం. ఇక్క డ చూసేది వ్యక్తి జాతకము కాదు. మరి కాల నిర్ణయం ఎలా చేస్తారు? చైత్ర శుద్ధ పాడ్యమి రాత్రి 1230 కి వచ్చిందనుకోండి. అది నూతన సంవత్సరానికి జన్మ సమయం. లగ్నం ధనుర్లగ్నం. పంచమంలో కేతువు. ప్రజలు పుణ్య కార్యాలు చేస్తారు. బృహస్పతి లగ్నాన్ని చూస్తున్నాడు. దేవతల గురువు ఆయన. గురు గ్రహానికి అధిపతి. దేవతలుకూడా పొరపాట్లు చేస్తారు. వారికి అందుకే గురువు అవసరమైనాడు. బృహస్పతి స్థితి ఇంద్రునికంటే ఉన్నతమైనది. ఆయన ఆనందపు స్థాయి దేవేంద్రుని ఆనందపు స్థాయి కంటె ఎన్నోరెట్లు అధికము. బృహస్పతి స్థానము వలన సనాతన ధర్మానికి మంచిరోజులు కనబడుతున్నాయి. దేశంలో సనాతన ధర్మము తిరిగి నిలబడ గలుగుతుంది. ఇది అందరికీ క్షేమకరం. రాహు శనిల స్థానం వలన దేశానికి అపారమైన ధనం వస్తుంది. Deficit budget లో ఇదేమిటని ఆశ్చర్యపడకండి. మనదేశానికి అపారమైన ధనం ఉన్నది. ప్రస్తుతం బురఖాలో ఉన్నది. స్విట్జర్లాండ్ వంటి దేశాలలో ఉన్నది. అది వెలుపలికి ప్రవహించే సూచనలున్నాయి. మనుష్యులకు బుద్ధిఉంటే ఇవి జరుగుతాయి. పాడి పంటలు బాగుంటాయి. వర్షాలు ఎక్కువగానే ఉంటాయి.
యుగం అనే పదం అనేక అర్థాలలో వాడుతాం. ఒక సంవత్సరాన్ని యుగం అనుకుంటే ఇది యుగాది. 5 సంవత్సరాల యుగము కూడా ఉంది. ఆలెక్కన ఇది ఒకయుగంలో మూడవ సంవత్సరం. ఈ యుగానికి అధిదేవత అహిర్బుధ్న్యుడు. ఎవరీ అహిర్బుధ్న్యుడు? రుద్రుని అష్టమూర్తులలో ఒకడు. అహిర్బుధ్న్య సంహిత పాంచరాత్ర ఆగమానికి సంబంధించినది. అహి అంటే పాము. బుధ్న్య అంటే మోసేది. ఒక మహాసర్పం, ఒక సర్పరూపంలోని మహాశక్తి భూమిని మోస్తూంది. అనంత విశ్వంలో ఆధార రహితంగా కనబడే భూమిని నిలబెట్టే శక్తి అహిర్బుధ్న్యుడనే రుద్రాంశ. ఈ 5 సంవత్సరాలు భూమికి ఎన్నో ఆపదలు వచ్చేకాలం గనుక పరిపాలకత్వం ఆయనయే తీసుకున్నాడు.
ఈ సంవత్సరానికి ముఖ్య గ్రహాలు చంద్రుడు, బృహస్పతి, దేవత - అహిర్బుధ్న్యుడు, నక్షత్రం పూర్వాభాద్ర. భూమిపైన సూర్యకాంతి వ్యాపించినంతవరకు ఉన్నది ద్యులోకము. దానినుండి స్వర్గలోకము వరకు ఉన్నది అంతరిక్షం. పంచ భూతాలలో ఒకటి ఐన జలతత్త్వం ఇంతవరకు వ్యాపించినది. జలానికి, అలాగే ఇతర పంచ భూతాలకు ఉగ్ర తత్త్వం, సౌమ్యతత్త్వం రెండూ ఉంటాయి. నిరుడు కేదారనాథ్ లో చూచినది ఉగ్రతత్త్వం. పదివేలమంది యాత్రికులు నశించారు. ఇది జలపు ఉగ్ర స్వరూపం. పృథ్వి, సముద్రం,నదులు, వాపీకూప తటాకాదులనుండి జలంగ్రహించి దానిని మాకు సురక్షితముగా శుభకరమైన జలంగా ఇవ్వండి అని సూర్యుని తత్సంబంధ వరుణాది దేవతల్నీ వేడుకోవాలి. మే నెలాఖరుకు బృహస్పతి కర్కాటకంలోనూ, శని వృశ్చికంలోనూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం జలములోని ఉగ్రత్వాన్ని చూపించ గలదు. అధిక వర్షాల సూచన. రాహు కేతువులు కూడా ఉగ్ర స్థానాలలోనే ఉన్నాయి. దేశాల మధ్య శత్రు భావం ఉంటుంది. ప్రపంచం లో యుద్ధమేఘాలు కమ్ముతాయి.దేశంలో ధనం ఎక్కువ అవడం వలన అశాంతి పెరుగుతుంది.
ఇక రాష్ట్ర పరిస్థితి. ఒకటి రెండయ్యాయి. జూన్ 2కు రెండు ఏర్పడనున్నాయి. ఇది వృద్ధి సూచనగానే భావిద్దాము. జూన్ 1,2 తేదీలలో గ్రహ స్థితి బాగున్నది. రాష్ట్రాలు మెల్లగా తప్పటడుగులు వేస్తాయి నూతన రాష్ట్రాలు. నదీ జలాల పంపకం పై సంఘర్షణలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) భవిష్యత్తులో కొన్ని దశాబ్దాలకు (తిరిగి వచ్చే జయ అనుకోండి ) సర్వాంగ సుందరమైన రాష్ట్రంగా పరిణామం చెందుతుంది. మన పిల్లలు, మనుమలు చూస్తారు. శుక్రుని స్థితి వలన లలితకళలు అభివృద్ధిచెందుతాయి. శుభం భూయాత్! శివో రక్షతు!

No comments:

Post a Comment