వన శోభ
పద్యము
సుందర కందరంబులను సొంపును నింపు రహింప కేకికా
బృంద మమంద నాదమున నెల్గిడ నల్గడ బూచి కాచి యా
నందము కందళింపగ ఘనంబులు భూమి రుహంబు లొప్పగా
డెందము నందన మ్మిదని డిందుపడెన్ వన శోభ గాంచుచున్
పాట
సాకి : శుకపిక సుమధుర రవపు మేళమున
ఝరి తరగల గలగలల గానమున
కోమల కిసలయ శోభల నలరే
వసంత మయమౌ ఈ నందనమున
పల్లవి : ఎద నిండిన భావముతో మది నిండిన రాగములో
పదిలముగా పాట జేసి పరవశించి పాడనా
పురి విప్పిన నెమలినై తనువు మరచి యాడనా ||ఎద నిండిన ||
చరణము 1: చిరుగాలికి చిగురుటాకు సిగ్గు తోడ తల వంచగ
గిలిగింతలు కలిగించెను తుంటరి తెమ్మెర చివురుకు
పులకరించె పల్లవము పరవశించె నా హృదయము ||ఎద నిండిన||
చరణము 2 : గున్న మావి కొమ్మ మీద గూటి చెంత చిలుక భామ
అలుక లోన కులుకు దోపి గోరువంక కై వెదకెను
చూసి చూసి నా కన్నుల నీరు వంక యై కదలెను ||ఎద నిండిన ||
గీతిక
సంధ్యారుణ ప్రభలు సాగి పోవంగ
రమణీయ పుష్ప వని రమ్య దీధితుల
కమనీయముగ జేయ కల్హార విభుడు
తోయజాక్షుల మగడు తొగల చెలికాడు
ౘనుదెంచె తారకా ౘదలమ్ము తోటి
విరుల కొమ్మలు మిగుల మరులు గొల్పంగ
తావి తెమ్మెర గూడి తనియించుచుండ
సుమ సుగంధము సోమ సుధలతో నిండ
మధుప యూధమ్ముల మంద్రమౌ శృతిలో
జల తరంగిణు లెల్ల జల తరంగిణులై
సెలయేటి తరగ లటు జేసేటి యలల
వనమంత వినిపింప వంశీరవమ్ము
భవ్య స్వనంబుతో బ్రవహించుచున్న
ఝరిణి ఝంకారాల ఝషల నాట్యాల
మైమరపు గలిగించు మధువనము జూడ
నాక లోకములోని నర్తకీ మణులు
తనరగా కంఠాల తార హారాలు
తళుకు బెళుకుల తోడ తాము చూపరులై
విను వీధిలో నిలిచి వింత దీధితుల
ఆ వినోదము జూడ నాకసము నుండి
No comments:
Post a Comment