Monday, 4 July 2016

వ్యాకరణము- పాణిని - కంప్యూటర్లు

వ్యాకరణము- పాణిని - కంప్యూటర్లు
ప్రపంచ భాషలలొ సంస్కృతమునకు గల ప్రత్యేక స్థానమునకు కారకుడు పాణిని. పంచతంత్రం ఆయనను ముని అంటుంది. ఆయన లేకపొతె నాటికీ నేటికీ భాషాశాస్త్రమే లేదు. ఆయన కాలం మూడు వేల సంవత్సరాలకు ముందే. పుట్టిన స్థలము గాంధారదేశము (నేటి వాయువ్య- పాకిస్తాన్). ఆయన వ్యాకరణ గ్రంధం 3959 సూత్రాల అష్టాధ్యాయి.
భారతీయ తత్త్వ శాస్త్రములొ శబ్దమునకు, భాషకు ఉన్నతమైన స్థానము ఉంది. శబ్దాన్ని వాగ్దేవిగా, దేవతా స్వరూపముగా మనవాళ్ళు భావించారు. వ్యాకరణమే అన్ని శాస్త్రాలకు మూలం. వ్యాకరణము అనేపదమే “శబ్దోత్పత్తి, శబ్ద లక్షణములను తెలిపే ఉపకరణము” అనే నిర్వచనాన్ని ఇస్తుంది. వ్యాకరణముతో బాటుగా శిక్ష, నిరుక్తము, ఛందస్సులను వేదాధ్యయనానికి ఉపయోగించే భాషా శాస్త్రములోని భాగాలుగా, వేదాంగాలుగా గుర్తించారు. న్యాయాది ఆస్తిక దర్శనములలొ ఒకటిగా కూడా పరిగణించారు. పూర్వ మీమాంసను వాక్యశాస్త్రమని అంటారు. ఈవిధముగా భాషాశాస్త్రము తత్త్వ శాస్త్రములొ ముఖ్యమైన అంతర్భాగమయింది. భారతీయుల భావనలో భాష అంటే ఎదుటి వ్యక్తితొ సంభాషణకు ఉపయోగించే మాధ్యమం. భాషలో అనేక భాగాలున్నాయి. శబ్దోత్పత్తి, శబ్దములనుండి వర్ణములు, వీనినుండి పదములు, పదార్థములు, పదములనుండి వాక్యములు, వీటినుండి నిర్మింపబడిన భాష స్వరూపము - ఇవి భాషా శాస్త్రము పరిధి లోనివి. తరువాత వచ్చినవి అక్షరములు, లిఖిత భాష.
కంప్యూటర్ భాషలు - అష్టాధ్యాయి
కంప్యూటర్లో అనేక స్థాయిలలొ అనేక ప్రత్యేక కృతక భాషలు వాడుతారు. అట్టడుగున (0,1) లతో కూడిన యాంత్రిక భాష, అన్నిటిపైన మనకు అర్థమయ్యే ఉన్నత స్థాయి భాషలుంటాయి. వాటిలోని వాక్యాలను ఒక క్రమంలొ ఆచరిస్తే ఆశించిన ఫలితం వస్తుంది. ప్రతి భాషకూ ఒక వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణము నుండి వచ్చిన వాక్యముల సమూహమే కంప్యూటర్ ప్రోగ్రాం. (BNF) బాక్కస్ నౌర్ పద్ధతిలొ ఒక కంప్యూటర్ ప్రోగ్రాం వ్రాసే విధానం ఇలాఉంటుంది. ఈ విధానం 1960 ప్రాంతాలలొ బాకస్, నౌర్ అనే కంప్యూటర్ సైంటిస్టులు ప్రవేశపెట్టారు. కాని ఇది 3000 సం. పూర్వం పాణిని అష్టాధ్యాయిలొ వాడినదే. నిజముగా దీనిని పాణిని-బాకస్ పద్ధతి అని పిలవాలి. కొంత చర్చ జరిగినది కాని పాశ్చాత్య్ల ఆభిజాత్యం పేరు మార్చడానికి అడ్డం వచ్చింది.
<ప్రోగ్రాం> ::= ప్రోగ్రాం [అంటే కంప్యూటర్ భాషలొ ఒక విధానం]
<డిక్లరేషన్ సీక్వెన్స్> [దత్తాంశములు]
<బిగిన్> [ఆరంభించు]
<స్టేట్ మెంట్ సీక్వెన్స్> [విధి వాక్యములు]
<ఎండ్> [సంపూర్ణం]
తెలుగు వారికి బాగా తెలిసిన సంస్కృత సంధి యణాదేశ సంధి. తెలుగులొ దీని సూత్రము - (ఇ,ఉ,ఋ,ఌ)లకు అచ్చు పరమైనప్పుడు వరుసగా (య,వ,ర, ల)లు వచ్చును. ఉదా: అతి+ఆశ = అత్యాశ. దీనికి అతిక్లుప్తమైన పాణిని సూత్రం - "ఇకో యణచి". 26 అక్షరాల తెలుగు సూత్రము నకు సంస్కృతములొ పాణిని వాడినవి కేవలము 5 అక్షరాలు.
మొదటి ఆరు మహేశ్వర సూత్రాలు: (అ,ఇ,ఉ,ణ్)(ఋ,ఌ,క్)(ఏ,ఓ,ఙ్)(ఐ,ఔ,చ్)(హ,య,వ,ర,ట్)(ల,ణ్) వీనినుండి ఇతర అక్షరమాలలు గుర్తింపవచ్చును.
(అ,ఇ,ఉ,ఋ,ఌ,ఏ,ఓ,ఐ,ఔ,చ్) = అచ్ = అచ్చులు
(ఇ,ఉ,ఋ,ఌ,క్) = ఇక్ ; (య,వ,ర,ల,ణ్)= యణ్
ఇక్, యణ్, అచ్ - దత్తాంశాలు. ఇక్ + అచ్ = యణ్ + అచ్
ఇదే “ఇకో యణచి” సూత్రం. ప్రోగ్రాంలొ విధివాక్యం. ఈ విధముగా ప్రతి పాణిని సూత్రమూ ఒక కంప్యూటర్ ప్రోగ్రాం. దీనితో నూతన వాక్యాలు కూడా కల్పించవచ్చు.
పాణిని క్షురి
క్షురి అంటే క్షౌరముచేసే కత్తి (రేజర్). తెలుగులో 26 అక్షరాల సూత్రాన్ని సంస్కృతములొ అనువదిస్తే సుమారు అన్నే అక్షరాలు రావచ్చును. కాని పాణిని వాడిన క్షురి, సంధి సూత్రాన్ని కంప్యూటర్ భాషలో 5 అక్షరాలకు తగ్గించింది. ఆయన వాక్యం "అర్థమాత్ర లాఘవేన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాః" ఈ వాక్యాన్ని స్టాన్ ఫోర్డ్ ఆచార్యుడు, పాల్ కిపార్ స్కీ 2011 పారిస్ లో జరిగిన భాషాశాస్త్ర సదస్సులో చెప్పారు.
ఇప్పుడు ఇంగ్లీషు భాషాశాస్త్రములొ బహువ్రీహి, ద్వంద్వసమాసాల పేర్లు యథాతథం గా వాడుతున్నారు. Bahuvrihi – red-head, white-collar; Dvandva -- student-teacher, father-mother
పతంజలి, భర్తృహరి పాణిని తరువాత వ్యాకరణాన్నీ, శబ్ద శాస్త్రాన్నీ అభివృద్ధి పరచినవారు. పతంజలి అష్టాధ్యాయికి మహాభాష్యం అనె భాష్య గ్రంధాన్ని రచించారు. మహాభాష్యం పాణిని రచనకు భాష్యమేకాక, వ్యాకరణాన్ని తత్త్వ శాస్త్ర స్థాయికి తీసుకొని వెళ్ళింది. పతంజలి యోగదర్శనానికి ఆద్యుడు. భర్తృహరి రచన వాక్యపదీయము. మొదటి శ్లోక ము చూదాము.
అనాది నిధనం బ్రహ్మ శబ్ద తత్త్వం యదక్షరం (శబ్ద బ్రహ్మము అనాది,అక్షరము (శాశ్వతము))
వివర్తతే అర్థభావేన ప్రక్రియా జగతో యథా (అర్థము జగత్తు వలె ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతుంది.)
భర్తృహరి శబ్దార్థాలను బ్రహ్మము జగత్తులతో పోలుస్తాడు. ఇది వేదాంతమునూ వ్యాకరణమునూ సమన్వయము చేస్తుంది. నేటి కంప్యూటర్ సైన్స్ లొ ఒక ముఖ్యభాగం సహజ భాషల అధ్యయనం (NLP, Natural Language Processing).పదివేల పదాల ఒక పెద్ద వ్యాసమును నూరు పదములలొ వివరించాలనుకోండి. ఇది కంప్యూటర్ చేయగలదా? వాక్యాలను అది అర్థం చేసుకోవాలి, సారాంశాన్ని నూరు పదాల్లొ చెప్పాలి. దీనికి కావలసిన విజ్ఞానం శబ్దార్థాల తత్త్వాన్ని తెలుసుకొవడమే. దీనిని ప్రాచీనులు "శాబ్దబోధ మీమాంస " అన్నారు. భర్తృహరి వాక్యపదీయము దీనికి తోడ్పడుతుంది. "అర్థ ప్రవృత్తి తత్త్వానాం శబ్ద ఏవ నిబంధనం" అంటాడు భర్తృహరి. మానవభాషలతో కంప్యూటర్లకూ మానవులకూ మధ్య సమాచార వినిమయం సాధ్యపడుతుంది. ఇది యాంత్రిక మేధస్సులొ ఒక భాగం. పాశ్చాత్యులు ఉపయోగించే ఇంగ్లీషు బదులు భారతీయ భాషలను కంప్యూటర్లో వాడాలంటే ఇదేమార్గం. ఈరోజు తెలుగులో మనం వాడుతున్న భాషకు వ్యాకరణంలేదు. నన్నయ నుండి చిన్నయ వరకూగల వ్యాకరణ వారసత్త్వాన్ని మనం నిలుపుకోలేదు. ఇది భాష ప్రగతికి తోడుపడదు.
LikeLike ·  · 
    • జాజి శర్మ వ్యాసం అద్భుతంగా ఉన్నది. కానీ" తెలుగులో మనం వాడుతున్న భాషకు వ్యాకరణంలేదు" అంటే ఏమిటీ ! వ్యావహారిక భాషకు అని అర్ధమా ? అసలు వ్యాకరణం లేకుండా భాష ఉంటుందా ?
    • Ravi Sudhakar Musunuri చాలా మంచి విషయం చక్కని వివరణతో వ్రాసారు. ధన్యవాదములు.
    • Vvs Sarma వ్యవహార భాషలకు సమగ్ర వ్యాకరణము ఉండదు. భాషలో ఒక స్థాయి అభివృద్ధి వచ్చాక దానికి సరిపడిన, అవసరమైన ప్రామాణిక వ్యాకరణము రచింపబడుతుంది. అప్పుడు ప్రతిరంగానికి అవసరమైన ప్రామాణిక భాషాప్రయోగాలు నిర్దేశింపబడతాయి. మహాభారతమును తెలుగులో అనువదించడానికి తెలుగుకు నిబద్ధత ఏర్పరచవలసినచ్చింది. అందుకు మొదట ఆంధ్ర శబ్ద చింతామణి రచించి నన్నయ వాగనుశాసనుడైనాడు. 1000 సంవత్సరాల తరువాత చిన్నయ సూరి బాల వ్యాకరణాన్ని రచించాడు. వ్యావహారిక భాషా వాదంలో ప్రజలవాడుకలోని భాష అన్నారుగాని ఏ ప్రజలో చెప్పలేదు. సినిమాలలో పామరజన రంజకమైన భాష ఉండాలి. సాహిత్యములో మన పుస్తకము ఏ తరగతి పాఠకులకు ఉపయోగపడుతుందో వారి వాడుకలోని శిష్టవ్యవహారిక భాష ఉండాలి. దొంగోడు,రుణమాఫీ, క్రిష్ణుడు, క్రియదస్తావేజు,కెవ్వు..కేక,వంటి పదజాలానికి వ్యాకరణమెక్కడిది? శాస్త్రపరిభాష వేరుగా ఉండాలి. తెలుగులో సెలవుచీటీకి కూడా సరియైన నమూనా లేదని నా అనుమానం.
    • Lakshminarayana Murthy Ganti వ్యాకరణం లేకుండా భాష ఎందుకు ఉండదు.లిపి కూడా లేకుండా ఉంటుంది కాని దానిని భాషగా పరిగణించరు.
    • కొల్లూరు విజయా శర్మ పండితుల చర్చలో నావంటి పామరురాలు మాట్లాడకూడదని తెలుసు.పరిమి రామనరసింహం అని University of Hyderabad linguistic professor ఆధునిక భాషకి వ్యాకరణం ఉండదు విస్పష్టమైన నిర్మాణం ఉంటుంది అని చెప్పేవారు.నా specialization కాదుగానీ structure of modern telugu అనే కోర్సు కూడా ఉండేది.నా సాహసాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను.
    • Vvs Sarma ఖొల్లూరు విజయా శర్మ - విజయగారూ - నేనుభాషా శాస్త్రజ్ఞుడినీకాదు, వైయ్యాకరణుడినీ కాదు. సంస్కృత 
    • పండితుడినీకాదు. నాభావాలు కేవలం ఒక ప్రేక్షకుని సామాన్య అభిప్రాయాలు. 1984 జనవరినుండి రెండున్నర సంవత్సరాలు నేను అమెరికాలో 
    • విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు Artificial Intelligence (AI) అనే కోర్స్ బోధింపవలసి 
    • వచ్చినది. ఈ కోర్సులో లాజిక్ (మన పరిభాషలో న్యాయ తర్కాలు) కు ప్రముఖ స్థానం ఉంది. లైబ్రరీలో Encyclopedia of Logic అనే 
    • పుస్తకంలో ఇండియన్ లాజిక్ అని ఒక అధ్యాయం ఉంది. అది చదివితే ఇది మనం కంప్యూటర్ సైన్సులో వాడే అరిస్టాటిల్ లాజిక్ కంటి 
    • ఉపయోగకరమైనదని అనిపించింది. ఇండియా తిరిగి వచ్చాక న్యాయ దర్శనం అనేక దర్శనాలలో ఒకటని తెలుసుకుని చార్వాక దర్శనం నుండి 
    • శంకరాద్వైతం వరకూ ఉన్న 16 దర్శనాలను పరిశీలిస్తే మన తత్త్వ శాస్త్రంగురించి కొంత పరిచయం ఏర్పడినది. AIలో యంత్ర అనువాదం లో 
    • అవసరమైనంతవరకే భాషా శాస్త్ర విషయాలను స్థాలీపులాక న్యాయంగా చూచాను. ఇంగ్లీషు నుండి భారతీయ భాషలలోనికి యంత్రానువాదం 
    • చేసేటప్పుడు పాణిని వ్యాకరణం common basis గా తీసుకుంటారు. ఇక భాష, వ్యాకరణం విషయాలు. ఏ భాషకూ ఎంతోకాలం వరకు 
    • వ్యాకరణము ఉండదు. లింగ్విస్టిక్సు లో Langue, Parole అని రెండు పదాలున్నాయి. పెరోల్ అంటే ఆ భాష మాట్లాడే ఒకరి వాక్యాలు. ఒకొకరు 
    • ఒకోరకంగా మాట్లాడవచ్చు. దీనినుండి ఆ భాష వాక్యనిర్మాణక్రమం గుర్తించ వచ్చు (generative grammar). ఇదే రామనరసింహంగారుచెప్పిన 
    • నిర్మాణం. దీనినుండి ఎప్పటికో ఒక వ్యాకరణము నిర్మాణం కావచ్చు. పాణిని 4000 కంటె తక్కువ సూత్రాలలో అప్పటివరకు ఉన్న పద వాక్య 
    • ప్రయోగాలకు అష్టధ్యాయి అనే complete generative grammar గా రూపొందింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తెలుగుకు వ్యాకరణం 
    • తయారుచేయడానికి ఒక పాణిని, ఒక పతంజలి సరిపోరనిపిస్తుంది. ఇది భాషా శాస్త్రజ్ఞులేతేల్చాలి.
    • జాజి శర్మ కొంపెల్ల రామకృష్ణమూర్తి ; పై విషయముల పై , చర్చ పై తమరి అమూల్యమైన అబిప్రాయము తెలియపరచ గలరు.

    • కొల్లూరు విజయా శర్మ VVS Sarma బాబాయి గారూ!మాకు మీరు శాస్త్రవేత్త,సాహితీవేత్త,భాషావేత్తా ఇంకా ఆధ్యాత్మిక వేత్త 
    •               కూడా.ఒకొక్కసారి మీ వ్యాసాలు మా స్థాయికి అందని ఎత్తులో ఉంటాయి.

No comments:

Post a Comment