చాటువు
పూర్వం కలసి ఉన్న వేదాలని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము
అధర్వణవేదము అని విభజించి కృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసునిగా కీర్తింప బడ్డాడు. అతడే పదునెనిమిది పురాణాలు,పదునెనిమిది ఉపపురాణాలు,భారత,భాగవతాది మహాగ్రంథాలు రచించి. “వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే” అని పూజలందు కొంటున్నాడు. అట్లే భారత,భాగవతాది రచనలకు ముందే “ఆదికవి వాల్మీకి ఆదికావ్యం రామాయణం రచించి” ప్రాతఃస్మరణీయుడు అయినాడు. ఈ భూమిపై నదులు,పర్వతాలు,ప్రకృతి,జీవకోటి ఉన్నంత కాలం పై సాహిత్యం రత్నాకరంలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆసముద్రంలో మునకలు వేసి సాహిత్య రత్నాలను సేకరించి, ఆనందించడమే మన కర్తవ్యం. సముద్ర తరంగాలవలె వివిధ రూపాలలో ఉన్న సాహిత్యంలోని ‘చాటు’సాహిత్యాన్ని మనం ఇప్పుడు అస్వాదిస్తున్నాము. అలంకారాలలో వ్యాజస్తుతి, వ్యాజనింద అనే అలంకారం ఉంది. పైకి నిందలా కనపడిన లోపల అంటే అంతరార్థం చూస్తే స్తుతి కనపడుతుంది. అటువంటి చాటువులని ఇప్పుడు చూద్దాం. “భ్రాత్రుహంతా పితృహంతా/ మాతృహంతా చ యః పుమాన్/ త్రయేతే చ మహాభక్తాః / ఏతేషాంచ నమామ్యహం//” భ్రాత్రుహంతా = అన్నని చంపించినవాడు. పితృ హంతా = తండ్రిని చంపించిన వాడు. మాతృ హంతాచ = తల్లిని చంపినవాడు. యః పుమాన్ = ఎవరైతే ఉన్నారో త్రయేతేచ = ఆ ముగ్గురు. మహాభక్తా: = గొప్ప భక్తులు. ఏతేషాం చ = ఆ ముగ్గురికి. నమామ్యహం = నమస్కరించుచున్నాను. అని అర్థం. “అన్నని,తండ్రిని, తల్లిని చంపినవారు మహాభక్తులు ఎలావుతారు? వారుపాపాత్ములు కదా! మరి వారికి నమస్కరించడం ఏమిటి?” ఇది పైకి కనపడేభావం. కాని అంతరార్థం పరిశీలిస్తే “అన్నని చంపిచినవాడు ‘విభీషణుడు’ రామునిచేత పాపాత్ముడైన రావణుని చంపించి లోక కల్యాణానికి కారణమైన మహాభక్తుడు.” ఇక తండ్రిని చంపించిన వాడు. ‘ ప్రహ్లాదుడు.’ లోక కంటకుడైన హిరణ్య కశిపుని నరసింహస్వామిచేత సంహరింపజేసిన పరమ భక్తుడు ప్రహ్లాదుడు. తల్లిని చంపినవాడు ‘పరశురాముడు.’ తండ్రి జమదగ్ని ఆజ్ఞను అనుసరించి తల్లి (రేణుకాదేవి)ని చంపి, తండ్రి వరం కోరుకోమనగా తల్లిని బ్రతికించమని కోరుకొని, మాతా, పితరులను భక్తితో సేవించిన గొప్ప భక్తుడు ‘పరశురాముడు’ ఆయన సాక్షాత్ నారాయణుని అవతారం. “ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనకాది” పరమ భక్తుల వరుసలో ప్రహ్లాదుడు, విభీషణుడు కూడా కీర్తించ బడ్డారు. పరశురాముడు సాక్షాత్ భగవంతుడే కనుక వారికి నమస్కరించుట పుణ్య ప్రదమే కదా!” చూశారా! పైకి తప్పుగా కనిపించినా లోపల ఎంత గొప్ప అర్థాన్నిదాచుకొని ఉందో పై చాటు శ్లోకం. |
No comments:
Post a Comment