Tuesday, 26 July 2016

శంబళ నగరము- కల్కి అవతారము

   శంబళ నగరము- కల్కి అవతారము

అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా - హిమాలయో నామ నగాధిరాజః.
పూర్వాపరౌ వారి నిధీమ్ విగాహ్య - స్థితః పృథివ్యాం ఇవ మానదండః.
ఉత్తర దిక్కు నందు తూర్పు పడమర సముద్రములలో జొచ్చుకుపోయిన కొనలు గలిగిన నగాధిరాజగు హిమవత్పర్వతము భూమికి కొలకర్రయా అన్నట్లు నిలిచి యున్నదని కుమారసంభవము నందు కాళీదాసు వారు చెప్పిన మాట.

సాక్షాత్తు ఆ పరమ శివుని ధామమయిన కైలాసము  కొలువైన ప్రాంతం. అడుగు పెడితే చాలు మనస్సు ఆహ్లాద భరితమవుతుంది. ఆ పర్వతము నందు దాగిన రహస్యములను  కనుగొనుట సాధారణ మానవులమైన మన ఊహ కు కూడా అందని విషయము. NASA కే అంతుబట్టని విషయాలు నేటికీ ఎన్నో ఎన్నెన్నో! బాహ్య ప్రపంచానికి తెలియని, మన పురాణాలలోనూ, బౌద్ధ గ్రంథాలలోనూ  ఉన్న ఎన్నో వింతలు  ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి. అటువంటి వింతలకు చెందిన ఒక ప్రాంతమే  శంబళ. శంబళ అన్న సంస్కృత పదానికి, శాంతి స్థావరము అన్న అర్థము ఉన్నదని పెద్దలు చెబుతారు. ఇది మానస సరోవరము మరియు కైలాస పర్వత మధ్య ప్రాంతములో ఉన్నట్లు పురాణాలు చెబుతూ వున్నాయి. విష్ణు పురాణములో ఇది ఒక గ్రామముగా పేర్కొనబడింది. దీనిని సిద్ధాశ్రమముగా ఆ రోజులలో పిలిచేవారు.

దీనిని శంబళ అని మన దేశములోనూ, హిడెన్‌ సిటీ  అని పాశ్చాత్య దేశాలలోనూ అంటారు. బుద్ధుడు వ్రాసిన కాలచక్ర అన్న గ్రంథములో కూడా  దీని ప్రస్తావన ఉంది. మనదేశము కాక ఈ ప్రదేశముతో సంబంధమున్న దేశములు ముఖ్యముగా టిబెట్, చైనాలు. టిబెట్ దేశ వాసులు దీనిని షాంగ్రిలా అని పిలుస్తారు. ఇక్కడ టిబెట్టును గూర్చి ఒకమాట చెబుతాను. అమరకోశము స్వర్గమునకు ఈ క్రింది పేర్లు కలవని చెబుతూ వుంది.
స్వరవ్యయం స్వర్గనాక త్రిదివత్రిదశాలయఃl
సురలోకో ద్యోదివౌద్వే(స్త్రియాం క్లీబే)త్రివిష్టపంll
దీనిని బట్టి త్రివిష్టపము అంటే స్వర్గము అని మనకు తెలియవస్తూ వున్నది. భూలోక స్వర్గము కావున
టిబెట్ ప్రాంతమును పూర్వము త్రివిష్టపము, అంటే ఇక్కడ భూతల స్వర్గము అని అర్థము, అన్న పేరుతో పిలిచేవారు. ఇంత మంచిపేరు పలుకలేక ఏ పాశాత్య్ల ఎలుబడిలోనో ఇది టిబెట్ గా
మారింది. హిందీలో దీనిని తిబ్బత్ అంటారు. 1875 కు పూర్వము ఆశియాలోనే ఉన్న పామిర్ పీటభూమిని మాత్రమే ప్రపంచ పైకప్పు (Roof of the World) గా చెప్పేవారు పాశ్చాత్యులు. అటు పిమ్మట వారి పరిశోధనలో అది విస్తరించి హిమాలయాలు టిబెట్టును కూడా కలుపుకొని  .
ప్రపంచ పైకప్పు అన దొడగినారు.


శంబళ దట్టమైన అరణ్యమధ్యముననున్న  ప్రాంతము మహనీయులకు తప్ప  అందరికీ కనిపించదు. అది అతి పవిత్రమైన ప్రదేశము. చర్మ చక్షువులకు కనిపించని రీతిగా దీనిని ఒక మాయ ఆవరించియుంటుందని చెబుతారు.  మన పురాణాలు మరియు టిబెట్ బౌద్ధ గ్రంధాలు ఈ శంబళ చుట్టూ 8 కొండలు పద్మము యొక్క అష్ట దళములవలె వుండగా మధ్యలోనున్న దిమ్మె భాగము శంబళ గా చెబుతారు. దీని చుట్టూ స్ఫటిక శ్రీచక్రము ఉంటుందట. ఈ శ్రీచక్రములో యజ్ఞ వాటికవలె అంటే తిరగబడ్డ పిరమిడ్ వలె ఉంటూ క్రిందికి వెళ్ళుటకు మెట్లు ఉంటాయట. క్రిందికి వెళితే కోటిసూర్య సంకాశముతో వెలుగొందే, కోరిన కోర్కెలను తీర్చగల, పనస కాయను బోలి ఆకుపచ్చని రంగులోవున్న చింతామణి అన్న మణిరాజము ఉంటుందట. ఆమణిని నిత్యమూ సిద్ధపురుషులు అనేక విధములుగా ఆరాధించి అర్చిస్తారట. కల్కి భూమిపై ప్రావిర్భావించినపుడు ఈ మణిని ధరిస్తాడట. ఇంకొక ఆశ్చర్యకర విషయము ఏమిటంటే ఈ నగరములో భద్రపరుపబడని వేద శాస్త్ర పురాణ వ్రాత ప్రతులు లేవట. బౌద్ధులు శంబళను ఓం మణి పద్మ హూం అని మనము గాయత్రీ మంత్రమును జపించినట్లు జపించుతారట. హేతువాదులను కూడా అబ్బురపరచే ఒక వాస్తవాన్ని తెలియజేస్తాను. చైనాలో యూయాంగ్ అనే పట్టణములో పట్టపగలు అనేక లక్షలమంది ప్రజలు చూస్తూ వుండగా  ఆకాశములో కొన్ని నిముసములపాటు ఒక నగరము ప్రత్యక్షమైనది.(Express articles available in Web) ఆ తరువాత అది అంతర్దానమైపోయింది. అది శంబళ నగరమా అన్నది శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని ఆశ్చర్యార్థకము.

పూర్వ పుణ్య ఫలము, భగవంతునకు కైంకర్యము చేసిన మనస్సు, అకుంఠిత తపఃఫలము మరియు అతిశయించిన పట్టుదల కలిగినవారికి తప్ప నాలాంటి వారికి శంబళ నగరము కనిపించదు. అక్కడ దేవతలు సంచరిస్తుంటారని చెబుతారు. సాక్షాత్తు శివుడు కొలువుండే కైలాస పర్వతము, మానస సరోవరము  ప్రాంతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉండవచ్చునని పెద్దల మాట. ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకుని ఉంటుంది అని తెలియబడుతూవుంది. బౌద్ధ గ్రంథాలను బట్టి పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబళ దర్శనమే భాగవతుని తపఃఫల నిదర్శనము. ఇక్కడ నివసించే వారు నిరంతరము సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారనియంటారు. ఈ ప్రాంతములో మార్కండేయ, వశిష్ట, జాబాలి జమదగ్ని, అగస్త్యాది మహర్షులు తపస్సు చేసినారని పురాణముల ద్వారా మనకు తెలియవస్తూ వుంది. నికోలస్ రోరిచ్ అనే రష్యన్ పరిశోధకుడు మరియు చిత్రకారుడు  ఈ శిఖరం మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఈయన  విశ్లేషణలలో దోషరహితులైన మానవులు మాత్రమే చూడగలిగిన శంబల నగరం కైలాసశిఖరానికి దాపులనో లోపలనో ఉన్నది అని తెలియవచ్చుచున్నది.
మహావతార్ బాబా, దేవరహ బాబా లాంటివారు ఈ ప్రాంతాలలో తపమాచారించినట్లు చెబుతారు.
   ఈ శంబళ ప్రాంతవాసులకు ఎటువంటి అనారోగ్యబాధలు కలుగవు. . వీరి ఆయుర్దాయము  ఎంత అన్నది మనము లెక్క కట్టలేము. ఎందుకంటే మనము వారిని చూడగలిగితేనే కదా!
ఈ శంబళ నగరము యొక్క ప్రస్తాపన మనకు పురాణాలే కాకుండా వాల్మీకి రామాయణములో కూడా లభించుతుంది. బాలకాండలో విశ్వామిత్రుడు యాగరక్షణార్థము తన వాటికకు ఈ దారినే పిలుచుకు పోతాడు. సిద్ధాశ్రమునకు అనగా శంబళ కు తీసుకొనిపోయి తాను తపమాచరించిన ప్రదేశమును చూపించి ఆ ప్రదేశము యొక్క విశిష్ఠతను తెలుపుతాడు. విష్ణు పురాణ నవమాధ్యాయములో కల్కి ప్రస్తాపన కనిపిస్తుంది. కృష్ణావతార సమాప్తము కలియుగావతరణము ఒకసారిగా జరుగుతాయి. ఈ కలి అన్నవాడు క్రోధ హింస అన్న అన్నా చెల్లెళ్ళ పెళ్ళికి నిదర్శనముగా కలుగుతాడు. అందుకే, కలి మనము తెలిసీతెలియక చిన్నతప్పుచేసినా మనలో ప్రవేశించి కావలసినంత మానసిక విధ్వంసమును మనలకు కలిగించుతూ వున్నాడు. జూదము, విచక్షణ లేని స్త్రీ లోలత, సురాపానము, నయవంచన, కోపము, అహంకారము మొదలగు అన్ని దుర్లక్షణాలతో ప్రభవిల్లుతుంది ఈ కలియుగము. కలియుగాంతములో విష్ణువు కల్కి పేరుతో భూమికి అవతరించుతాడు. ఆయన   బ్రాహ్మణ దంపతులగు విష్ణుయశస్సు మరియు సుమతి అన్న దంపతుల పుత్రునిగా భూమిపైకి వస్తాడు. ఆ శిశువునకు మార్కండేయ మహర్షి పురోహితుడై కల్కి అని నామకరణము చేస్తాడు. ఉపనయనానంతరము విద్యార్జనకు బయలుదేరిన కల్కికి పరశురాముడు కనిపించి తన నెలవగు మహేంద్ర గిరికి తోడుకోనిపోయి సకల వేద, ఉపవేద శాస్త్ర విద్యా పారంగతుని చేస్తాడు, ధనుర్విద్య, అస్త్ర విద్య, యుద్ధవిద్యలతో సహా.  అసలు కల్కి అన్న పదము కళంక ములను తొలగించేవాడని పెద్దలు వ్యుత్పత్తి చెబుతారు. మరి కాలమునకు పట్టిన కళంకమును తొలగించి తిరిగీ సత్యయుగ ప్రతిష్ఠాపన చేయుచున్నాడు కదా!  కల్క అన్న పదమునకు తెల్లని గుఱ్ఱము అన్న ఒక అర్థము సంస్కృతములో ఉన్నదని పెద్దలు చెబుతారు. తెల్లని గుఱ్ఱము తన వాహనమగటతచేత కూడా ఆయన కల్కి గా పిలువబడుతాడు. దీనిని గరుడాశ్వముగా తెలుపుతారు పెద్దలు. ఇది భూమిపైనను ఆకాశాములోనూ సంచరించగలదు.
స్వచ్ఛ మైన పాలవలె ఇది తెల్లగా వుంటుంది. దీనిని బిల్వోదక క్షేత్రములో కల్కి, శివుని గూర్చి తపమాచరించుటచేత పొందుతాడట. కల్కి, శివునిచే విద్యుత్కాంతి సన్నిభమైన కరవాలమును కూడా పొండుతాడట. శ్రీ మహాలక్ష్మీ అంశ సంభూతురాలయిన సింహళ కన్యక పద్మాతిని పాణిగ్రహణము చేస్తాడట. ఈ అవతార ప్రస్తాపన అగ్ని పురాణము, విష్ణు పురాణము, పద్మ పురాణము,. భాగవత పురాణము, కల్కి పురాణములలో కనిపిస్తుంది.
ఆయన అవతరణ ఎందుకు అంటే:
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే
అని పరమాత్మ గీతలో చెప్పినట్లు, వ్యాసులవారు విష్ణు పురాణము (4.24) భవిష్య పురాణములలో చెప్పినట్లు కలియుగాంతానికి పూనుకొన్నపుడు భగవానుడు కలిపురుషుని అవతారమును  ఇచ్చటనే దాలుస్తాడు. సత్యయుగ స్థాపన చేసి, దేవతల ప్రార్థనపై తిరిగీ వైకుంఠము చేరుకొంటాడట.
హిందూ బౌద్ధ పురాణాలననుసరించి ఈ నగరము వయసు దాదాపు 60 లక్షల సంవత్సరములు. ఇక్కడి ప్రజలు 12 అడుగులనుండి 14 అడుగుల పొడవైన వారు. కొందరు 20 అడుగులు కూడా ఉంటారని అంటారు. నిజము దేవుడెరుగు. వీరు మిక్కిలి బలవంతులు, శాంతి స్వభావులు. అయితే అన్యాయం జరిగితే మాత్రం ఊరికే ఉండరు. కల్కి పుట్టిన తరువాత శంబళకు వస్తే అది ఎంతగానో పెరిగియుండుట జూచి దానిని శంబళ నగరమనుటచే అది తరువాత కాలములో శంబళ నగరముగా స్థిరపడి పోయిందట.
హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం మానవాతీత మహనీయులకే సాధ్యము. ఈ నగరమును గూర్చి పురాణముల ద్వారా గానీ బౌద్ధ గ్రంధాల ద్వారాగానీ తెలుసుకొనవలసినదే తప్ప చూచి వచ్చిన వారి ద్వారా కూడా తెలుసుకొనే అవకాశము ఉండదు.
అయినాకూడా ఆధునికులలో కొందరు తాము శంబళను చూసినట్లు చెబుతారు. వారిలో 1896 లో జన్మించిన ఆనందమయీ సాధ్వి హిమాలయాలలో సుమారుగ 20 నుండి 25 అడుగుల ఎత్తుగల ద్వాపరయుగ ప్రాణులను (మనుష్యులా కాదా తెలియదు) చూసినట్లు పేర్కొన్నారు. రష్యా దేశస్తురాలు, థియొసోఫికల్ సొసైటీ (అడయార్-మద్రాసు) వ్యవస్థాపకురాలు హెలీన బ్లావట్ స్కీ అన్న అతీంద్రియ యోగ సాధకురాలు తాను హిమాలయాలలో చేసిన అన్వేషణలో, ద్వాపరయుగామునాటి మానవులను చూసినట్లు తమ Isis Unveiled(1877) The Secret Doctrine (1888) అన్న పుస్తకములలో వేల్లడించినారు. అసలామే ఒక బహు పురాతన వ్యక్తి తో తీయించుకొన్న చాయాచిత్రము మనకు పై పుస్తకములలో దొరకుతుంది. కుర్తాళ మఠమునకు చెంది మౌనస్వామిగా ప్రసిద్ధిగాంచిన శివచిదానంద స్వాములవారు హిమాలయాలలో దత్తాత్రేయ సాంప్రదాయమునకు చెంది సిద్దేశ్వరీ ఉపాసకుడైన అచ్యుతానంద సరస్వతీ స్వాములవారి వద్ద శుశ్రూష చేసి  శివచిదానంద సరస్వతిగా యోగాపట్టా పుచ్చుకొన్నారు. ఇప్పడు నేను తెలియజేసినవారు మహనీయులే కానీ నాకు ఇదమిద్ధముగా వారు శంబళ చూచినారా లేదా అర్థము కాలేదు కానీ వారు అలనాటి విభిన్నమైన, విలక్షణమైన మానవులను చూసినట్లు తెలియుచున్నది. ఆవిధము యోగి పుంగవుడగు స్వామి రామా వ్రాసిన హిమాలయ యోగులు చదివితే మనకు మన మేధకు అంతుచిక్కని ఎంతటి మహానీయులున్నారో తెలియవస్తుంది.
శంబళ రహస్యాన్ని తెలుసుకొన దలచి  1920లో రష్యా తన సైన్య సమూహమును  పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబళ చేరుకోలేకున్నా హిమాలయా యోగుల ద్వారా  వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. అక్కడ ఉండే యోగులు వారికి దాని పవిత్రత గురించి తెలిపినారు అని అంటారు. ఈ విషయాన్ని తెలుసుకుని నాజీ పార్టీ నాయకుడు హిట్లర్‌ కూడా 1930లో శంబళ అన్వేషణకు ప్రత్యేక బృందాలను పంపించినాడు. ఆ బృందము పేరు Ultima Thule. Ultima Thule అంటే భూమిపై ఉంటూకూడా సాధారణ మానవ దృష్టికి కనబడని ప్రాంతములు అని అర్థమట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్‌ హిమ్లర్‌ అక్కడ గొప్పదనం హిమాలయములలోని ఋషి మునులద్వారా తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి, భువిపైన ఏర్పడిన స్వర్గమని హిట్లర్‌ నకు తెలియజేసినాడని అంటారు. అంతే కాక హిట్లరు Ministry of Ancestral Memories అన్న ఒక Order ను ఏర్పాటు చేసుకొన్నాడు. ఇందులో వేదమూర్తులు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారి వంటి సంస్కృత మహాపండితులను హిందూదేశము నుండి కూడా తెప్పించుకొని మన వేదములపై, అతీంద్రియ శక్తులపైన ఎన్నో పరిశోధనలు చేయించినాడు.

హేన్రిచ్‌ హిమ్లర్‌ శంబళ ను గూర్చిన మరెన్నో వింతలు, విశేషాలు తెలుసుకున్నాడని కూడా అంటారు కానీ అవి మనకు తెలియ వచ్చినది లేదు. హిట్లర్ ఈ మన ప్రభుత్వములు ఈ దిశగా ప్రయత్నములు చేసినట్లు నేను చదివిన గుర్తు లేదు. మన బోంట్లు ఒంటరిగా ఈ ప్రయత్నమూ చేయుట భగీరథ ప్రయత్నమౌతుంది. వంద సంవత్సరముల వయసు చాలదు భగవంతుని కరుణ లేకుంటే! శంబళ గురించి ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, అధ్యాత్మిక వేత్త, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్‌ నీల్‌ కొన్ని గ్రంథాలు రచించింది. ఆమె ఫ్రాన్స్‌ నుంచి టిబెట్‌ వచ్చి లామాలను కలుసుకుని శంబళ గురించి సమాచారం సేకరించింది. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్‌లో కాలుమోపిన తొలి యూరప్‌ వనిత ఆమె. ఇంకా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు శంబళ ఉనికి కోసం ప్రయత్నించినారు. షాంఘై నగరమునకు చెందిన డాక్టర్‌ లాయోసిన్‌ శంబళ ను గూర్చి చాలా పరిశోధనలు చేసినాడు. ఆయన ఏకంగా శంబళ అన్నది భూమి నుండి స్వర్గమునకు వేసిన వంతెన అని పేర్కొన్నాడు. అక్కడి వారు దివ్యదృష్టి తో 
(Telepathy) ప్రపంచంలోని ఎక్కడివారితో నైనా చూసి సంభాషించగలరు. ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది. మన విజ్ఞానపు ఆది అంతు చిక్కనిది. నేటి Science 600ల సంవత్సరముల
వయసు మాత్రమే కలిగి యున్నది. పైపెచ్చు ఈ రోజు ఒక 5 వేల సంవత్సరముల శిలాజము దొరికితే మన నాగరికత 5 వేల సంవత్సరములదని నిర్దారించుతారు నేటి పరిశోధకులు. రేపు 10 వేల సంవత్సరముల నాటిది దొరికితే మన నాగరికత  10 వేల సంవత్సరముల నాటిది అంటారు. వారి మాటపై భరోసాకన్నా మన దేశ చరిత్ర కాలమునకు అందనిది అన్న వాస్తవమును అర్థము చేసుకొంటూ మన పురాణములను శ్రద్ధగా చదువుతూ పోయినామంటే మనకు అన్ని విషయములూ అవలీలగా అవగాహనకు వస్తాయి.
ఈ వ్యాసాన్ని శ్రీ శార్వరి గారు వ్రాసిన ఈ కవితతో ముగిస్తున్నాను.
టిబెట్ బౌద్ధానికి గుండెకాయ శంబల!
అది ధ్యానుల లోకం. ఆత్మల ఆవాసం.
మృత్యువును జయించిన మహాఋషుల నెలవు.
విశ్వవిజ్ఞానం వారి అధీనంలో ఉంటుంది.
ఎన్నటికి అజ్ఞాతంగా ఉండిపోదు.
అర్హులకు అందుబాటులో ఉంటుంది.
శంబల గురించి తెలుసుకోవటమే ఒక యోగం.
ఆలోచించటం ఒక ప్రయోగం.
అర్హులు కావటం పురాసుకృతం.
వ్రాయవలసినది చాలా వున్నది కానీ వ్రాయలేక ఈ మాత్రము తెలుపుచున్నాను.

స్వస్తి. 

Monday, 11 July 2016

అనుపమాన అనర్ఘ రత్నం అబ్దుల్ కలాం

అనుపమాన అనర్ఘ రత్నం అబ్దుల్ కలాం
https://cherukuramamohan.blogspot.com/2016/07/blog-post_11.html
మతములన్నవి మొన్నమొన్న వచ్చినవి. ముందు నుండి ఉన్నది ఈ సనాతన ధర్మమే. ఎవరన్నది చూడకుండా మంచిని మెచ్చుకొనుటే మన సంస్ కృతి. అందుకే నేను తెలుపబోయే ఈ మహనీయుడు ఈ ధర్మములోని విశిష్టతను తన అక్కున చేర్చుకున్నాడు.
మనం మన జీవితం లో ఇంకో కలాం ను చూడలేము ... 'పి ఎం నాయర్’
కలాం గారి సెక్రెటరీ పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ పొదిగై వారు చేసిన ఇంటర్వ్యూ లో తెలిపిన వారిని గూర్చిన కొన్ని వాస్తవాలను గమనించండి. నాయర్ గారి ఆంగ్లమునకిది తెలుగు సేత.
1. డాక్టర్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయన కు ఆ యా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారు అని అది మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని తీసుకునే వారు. ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు. ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలో నుండి తనతో తీసుకు వెళ్ళలేదు.
2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలల మధ్య కాలములో వచ్చియుండవచ్చు. రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం మన దేశంలో. ఒక రోజు కలాం గారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగినారు. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పినాను .బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం ఇవ్వడం కోసం కేటాయించమని అనాధాశ్రమాలకు ఇవ్వమని చెప్పినారు. నిజమైన సేవా సంస్థలను పరిశీలించే పనిని కొందరికి అప్పచెప్పి తాను అందులో ఏమాత్రపు జోక్యమూ చేసుకొనకుండా ఉండిపోయినారు . ఆ విధముగా నిజమైన యోగ్యతగల సంస్థలను ఎన్నుకొన్న తరువాత నన్ను తన గదిలోనికి పిలిచి లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి అన్నారు. నేను మీ ఔదార్యము పదుగురికీ చెబుతాను అంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు. తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరు లేరు . ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి అబ్దుల్ కలాం !
3. ఆయనకు తన మాటలకు అందరూఎస్ సర్అనవలెనన్న నైజం లేదు. ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగినారు.నో సర్!” అన్నాను. ఆయన మౌనంగా ఉండిపోయినారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయ మూర్తి గారు నన్ను పిలిచి అలా అన్నారేమిటండి అన్నారు. ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్! విని అవసరం అయితే తన అభిప్రాయం మార్చుకుంటారు సర్" అన్నాను. ఆయన ఆశ్చర్య పోయినారు .
4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు 50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించినారు. దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టిఇచ్చినారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది. ఆ రెండు లక్షలూ ఆయనే చెల్లించినారు. ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే ఉంచుకొన్నారు. ఆయన ఉన్న రోజులకు అద్దె చేల్లిస్తానన్నారు కలాం గారు. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు ఉంచుకోన్నందుకు తన నివాసానికే తానూ అద్దె చెల్లించుతాననే నిజాయతీని మేము భరించలేము అని ముక్త కంఠముతో ఆయన కార్యాలయ పరివారమంతా వినయముతో తిరస్కరించినారు.
5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్లేముందు అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్లి కలిసినాము. అందరినీ పేరు పేరునా పలకరించినారు. ఆయన నా భార్య ఎందుకు రాలేదు అని అడిగినారు. తన కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది అని చెప్పినాను నేను.
మరుసటి దినము మా ఇంటి ముందు పోలీసులు వచ్చి దిగినారు. ఏమిటి హడావుడి అని నేను అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని వారు తెలిపినారు.
ఇంత వరకూ ప్రపంచం లో దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని అతడి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం చరిత్రలో ఎక్కడా జరగలేదు .
చివరిగా ఒక టి వి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :
1) 3 పేంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు
4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు
6) Bangalore Flat handed over to scientists’ community long time ago
7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.
ఈ విషయాలు తెలియని వారికి అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే ! ఒక గొప్ప మహానుభావుడిని మనం కళ్ళతో చూసినాము అనీ, ఆయన నివసించిన కాలం లో మనమూ నివసించినామనీ గర్వంగా పది మందికీ చాటుదాము.
మహనీయుల చరిత్రలే మనకు ఆదర్శప్రాయములు. కొన్నింటినైనను వారినుండి నేర్చుకొందాము.
మంచిని గౌరవించే సనాతన ధర్మము మనది.
వారి సుగుణములను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. వారిని గూర్చి ఈ అల్పుడు వ్రాసిన పద్యము కేవలము చంద్రునికి నూలుపోగు వంటిదే!
కోహినూరు బోలు కోలారు గని బోలు
మలల రాజు మంచు మలను బోలు
అన్యుడతడు కాదు అబ్దుల్ కలామిది
రామ మొహనుక్తి రమ్య సూక్తి